షికారీలకు విద్య ఆవశ్యకతను వివరిస్తున్న ఇందిరాగాంధి
ఈమె అసలు పేరు లక్ష్మి. తన చిన్నతనంలో ఇందిరాగాంధీ ప్రసంగాన్ని రేడియోలో విన్నాక తన పేరును ఇందిరాగాంధీగా మార్చుకున్నారు. ఈమె నేడు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుగాలీల జీవితాల్లో వెలుగుకోసం పోరాడుతున్నారు. ఇప్పటి వరకు 12,632 మందిని పాఠశాలల్లో చేర్పించారు. వారిలో 86 మంది కళాశాల విద్య పూర్తిచేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు
చేస్తున్నారు.
అమ్మా నేనూ బడికి వెళ్తానంటూ మారాం చేసింది ఆ చిన్నారి.. రెండు పూసలల్లితే నాలుగు కాసులు వస్తాయ్.. బడి వద్దు మనకు అంత స్థోమత లేదంటూ బడి వైపు వెళ్లొద్దని షరతు పెట్టింది ఆమె తల్లి. అయితే తన కూతురే తమిళనాడులోని పది లక్షల మంది సుగాలీలకు ఓ ఇందిరాగాంధీలా మారుతుందని ఆ అమ్మకు తెలియదు. ఒకవైపు ప్రభుత్వ ఉద్యోగం.. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుగాలీల జీవితాల్లోవెలుగు కోసం పోరాడుతున్న ఇందిరాగాంధీ ఈ వారం మహిళామణి శీర్షికకు చెప్పిన వివరాలు ఆమె మాటల్లోనే.
తిరువళ్లూరు: తమిళనాడు రాష్ట్రం, తిరువళ్లూరు జిల్లా రెడ్‌హిల్స్‌లోని గువ్వళోళ్ల కాలనీ. ఉదయం ఏడు గంటల సమయం. 20 మంది చిన్నారులకు తలదువ్వడం, జడలు అల్లడం చేస్తోంది పోలీసు డ్రస్‌లో ఉన్న 53 ఏళ్ల మహిళ. ఎవరామె అని ఆరా తీయడానికి యత్నించేలోపే.. ఆమె స్పందిస్తూ ఈ కాలంలో చదువుకుంటేనే బతకగలం.. అందుకే గువ్వళోళ్ల కాలనీలోని పిల్లలందరిని బడికి పంపిస్తున్నా. ఓ పది నిమిషాలు ఆగండి అంటూ ఆ పిల్లలను తన పిల్లల్లా బడికి పంపించే పనిలో లీనమయ్యింది. అనంతరం తన స్వీయ చరిత్రను చెప్పడం ప్రారంభించారు ఇందిరాగాంధీ.
సుగాలీల పిల్లలను బడికి తీసుకెళ్తున్న ఇందిరాగాంధీ
నేను పుట్టింది..
తమిళనాడు రాష్ట్రం, ఓరక్కాడు గ్రామంలో నేను పుట్టా. అక్కడే ఉన్న బస్టాండే నా శాశ్వత నివాసం. మూడేళ్ల వయస్సు రాగానే తల్లిదండ్రులు మమ్మల్ని ఇంటివద్దే వది లిపెట్టి పూసలు అమ్మడానికి బయ ట ప్రాంతాలకు వెళ్లేవారు. వారు వచ్చే వరకు బస్టాండులో బిచ్చమెత్తుకోవడం నా దినచర్య. ఒక రోజు బస్టాండులో బిచ్చమెత్తుకుంటుండగా కానిస్టేబుల్ పిలిచి బడిలో చేర్పిస్తా చదువుకుంటావా అన్నా రు. నేను పట్టించుకోలేదు. మరుసటి రోజు పాఠశాల ఆవరణలో నిలబడిన సమయంలో తమిళ ఉపాధ్యాయుడు(కర్కై నండ్రే కర్కై నండ్రే పిచ్చై పుగినుం కర్కై నండ్రే) అంటూ బోధిస్తున్నాడు. చదువుకుంటున్న వారిని ఎందుకు అడుక్కోవాలని బోధిస్తున్నాడో అనుకుని టీచర్‌నే అడిగేసా. ఆయన బిచ్చమెత్తయినా చదువు కోవాల ని చెప్పారు. ఆ మాటలతో నాలో చదువుకోవాలన్న ఆసక్తి పెరిగింది. అమ్మానాన్నలకు చెప్పా. బడి వద్దూ పూసలు అమ్ముకోమన్నారు. అయినా ఆసక్తితో ఉపాధ్యాయుడిని కలవడంతో ఆయన మా అమ్మానాన్నతో మాట్లాడి పాఠశాలలో చేర్పించారని వివరించారు.
పదేళ్లకే పెళ్లి నిర్ణయం..
ఆమ్మనాన్న నాకు పదేళ్లకే పెళ్లి చేయాలనుకున్నారు. నెల్లూరు నుంచి నాకన్నా 15 ఏళ్ల పెద్దవాడైన వ్యక్తితో వివాహం చేయాలని నిర్ణయిం చారు. పెళ్లికొడుకు చూడడానికి వచ్చాడని బం ధువులు ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఇదే సమయంలోనే అక్కడ జరుగుతున్న శవయాత్రలో పాల్గొని తప్పించుకున్నా. మా ఉపాధ్యాయుడికి చదువుకోవాలన్న నా కోరికను తెలిపా. టీచర్ గ్రామపెద్దను ఆశ్రయించమన్నారు. పంచాయతీ పెద్ద ఒరక్కాడు నాయుడును కలిసి నా బాధను చెప్పా. ఆయన సైకిల్‌పై ఎక్కించుకుని పొలం వద్దకు తీసుకెళ్లి లైంగికంగా వేధించాడు. ఎలాగో అతని నుంచి తప్పించుని సాయం చేస్తానన్న పోలీసును ఆశ్రయించా. ఆయన అ మ్మానాన్నలకు హెచ్చరించడంతో వారు నన్ను ఎనిమిదో తరగతి వరకు చదువుకోమన్నారు.
ఆసలు పేరు లక్ష్మి..
నా అసలు పేరు లక్ష్మి. ఒక రోజు టీచర్ ఇంటికి వెళ్లా. అప్పడు బంగ్లాదేశ్‌పై జరిగిన యుద్ధంలో భారత్ విజయం సాధించిందని, ఇందిరాగాంధీ ప్రసంగాన్ని రేడియోలో వింటూనే ఆమె పాలనాదక్షతనూ వివరించారు. ఆ మాటలు విన్నాక నా పేరును ఇందిరాగాంధీగా మార్చుకున్నా. అప్పుడే సుగాలీలకు ఏదైనా చేయాలని నిర్ణయించుకున్నా. ఎంఏ వరకు చదివి అటవీశాఖలో గార్డు ఉద్యోగాన్ని సంపాదించి ప్రేమ వివాహం చేసుకున్నా. ఒక కొడుకు, ఇద్దరు కుమార్తెలు. నేను తక్కువ కులం అమ్మాయినని హేళన చేయడంతో ఆయన విడాకులు తీసుకున్నాడని(కంటతడి పెడుతూ) వివరించారామె.
వారికి చదువుచెప్పించాలని..
సుగాలీల పిల్లలకు చదువుచెప్పించాలని 25 ఏళ్ల క్రితం నిర్ణయించా. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకు వెళ్లి సుగాలీల పిల్లలను బడికి పంపించడం, వారి తల్లిదండ్రులకు విద్యపై అవగాహన కల్పించా. పిల్లల తల్లిదండ్రుల నుంచి మద్దతు లభించేది కాదు. అయినా నా ప్రయత్నంలో వెనుకడుగు వేయలేదు. అప్పటికే దాదాపు 16 వేల మంది సుగాలీల పిల్లలు విద్యకు దూరంగా ఉన్నారని గుర్తించా. కనీసం ఐదు వేల మందిని బడికి పంపాలని నిర్ణయించి మొదటి ఏడాది 25 మందిని పాఠశాలలో చేర్పించా. ఇప్పటి వరకు 12,632 మందిని పాఠశాలల్లో చేర్పించగా, వారిలో 86 మంది కళాశాల విద్య పూర్తి చేసి వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి జిల్లాకు వారంలో ఒక రోజు వెళ్లి విద్య ఆవశ్యకతను వివరిస్తున్నానన్నారు. ప్రభుత్వం ఒరక్కాడు ప్రాంతంలో 50 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. అయితే మాకు సాయం చేస్తానని రఘుపతి అనే వ్యక్తి మా భూములను ఆక్రమించుకున్నాడు. దీనిపై పది ఏళ్లుగా పోరాటం చేస్తున్నా. భూములను వదలిపెట్టి వెళ్లాలని కొందరు బెదిరించారు. చివరికి నా ఒక్కగానొక్క కొడుకును(కన్నీటిని తుడుచుకుంటూ) చంపేసారని బోరున విలపించారు. రాష్ట్ర వ్యాప్తంగా దేశదిమ్మరులుగా తిరుగుతున్న సుగాలీల జీవితాల్లో వెలుగును నింపాలి. వారిని ఆర్థికంగా బలో పేతం చేయాలి. సమాజంలో మాకు ఒక గుర్తింపు ఉండాలన్నదే తన అంతియ లక్ష్యమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment