బుట్టాయగూడెం: గిరిజన విద్యకు పెద్దపీట వేస్తున్నామంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు ఉత్తిదే అని తేలిపోతోంది. గిరిజన అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్నామంటూ అధికారులు చెప్పే మాటలు నీటి మీద రాతలని రుజువవుతోంది. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో 23 పాఠశాలలు మూతపడడమే దీనికి నిదర్శనం. ఫలితంగా 300మందికి పైగా విద్యార్థులు బడిబయట తిరుగుతున్నారు. ఏటా బడిబాట కార్యక్రమం చేపడుతున్నా.. వీరు పాఠశాలల్లో చేరడం లేదు. దీనిని బట్టి బడిబాట కార్యక్రమం ఎంత తూతూమంత్రంగా జరుగుతోందో అర్థమవుతోంది.
విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో..
పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లోని గిరిజన సంక్షేమశాఖ, మండల పరిషత్ పాఠశాలల్లో విద్యార్థుల శాతం తక్కువగా ఉందనే నెపంతో సుమారు 23 పాఠశాలలను మూసివేశారు. బుట్టాయగూడెం మండలంలో కోర్సవారిగూడెం, కొమరవరం, గంగవరం, లక్షు్మడుగూడెం, కుమ్మరికుంట, లంకపాకల, పాతరాజానగరం, కన్నారప్పాడు, బుద్దులవారిగూడెం పాఠశాలలను విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో మూసి వేశారు.
అయితే పునరావాస గ్రామమైన లక్ష్మీపురంలో అసలు పాఠశాలే లేదు. అలాగే పోలవరం మండలంలో సిరివాక, ఎర్రవరం, సరుగుడు, తానాలకుంట, బక్కబండార్లగూడెం, రామన్నపాలెం, గడ్డపల్లి, చింతపల్లి గ్రామాల్లో ఉన్న పాఠశాలలనూ మూసివేసినట్లు సమాచారం. అలాగే కుక్కునూరు మండలంలోని దాచారం, అమరవరం, గుంపెనపల్లి, వేలేరుపాడు మండలంలో కొర్రాజులగూడెం, చెరవుగొల్లగూడెం, గుళ్ళవాయి గ్రామాల్లో పాఠశాలలు కూడా మూతపడ్డాయి. అయితే బుట్టాయగూడెం మండలంలో లంకపాకల, కామవరం, కంగాలవారిగూడెం పాఠశాలల్లో అత్యధికంగా విద్యార్థులు చదువుకునేవారు. ఈ పాఠశాలలకు జిల్లాస్థాయిలో కూడా మంచిపేరు ఉండేది. ప్రస్తుతం ఇక్కడ ఒకటి, రెండు తరగతుల వారికి మాత్రమే పాఠాలు బోధిస్తున్నారు.
ఆదివాసీ అడవి బిడ్డల భవిత ప్రశ్నార్థకం
బడులు మూతపడడం వల్ల ఆదివాసీ అడవి బిడ్డలు చదువులకు దూరమవుతున్నారు. సొంత గ్రామాల్లో పాఠశాలలు అందుబాటులో ఉంటేనే ఇక్కడి పిల్లలు బడికెళ్లేందుకు ఇష్టపడుతున్నారు. దూరప్రాంతం వెళ్లాలంటే ఆసక్తి చూపడం లేదు. సుదూర ప్రాంతం పిల్లలను పంపడానికి తల్లిదండ్రులూ విముఖత చూపిస్తున్నారు. ఫలితంగా ఎంతోమంది పిల్లలు బడికి దూరంగా ఉండిపోతున్నారు. తానిగూడెం, మోతుగూడెం, అలివేరు, లంకపాకల, గడ్డపల్లి, చింతపల్లి గ్రామాలతో పాటు వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం మండలాల్లో సుమారు 300 మంది వరకూ డ్రాప్‌అవుట్లు ఉన్నట్లు ఇటీవల చేసిన సర్వేలో వెల్లడైంది.
ఆ సర్వే చేసిన స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి పి.మూర్తి మాట్లాడుతూ.. డ్రాప్‌అవుట్ పిల్లలను బడిలో చేర్చాలనే యత్నం చేసినప్పటికీ వారు అక్కడ ఉండలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం బడికి, గ్రామానికి దూరం ఎక్కువగా ఉండడమే. కోర్సవారిగూడెం గ్రామంలో పాఠశాల మూసివేయడం వల్ల దాదాపు 15 మంది చిన్నపిల్లలు 3 కిలోమీటర్లు అటవీ ప్రాంతంలో నడిచి గురుగుమిల్లి పాఠశాల, గవరంపేట అంగన్‌వాడీ కేంద్రంలో చదువుకునేందుకు వెళ్తున్నారు. మధ్యలో వాగులు, అధ్వానంగా ఉన్న రోడ్డుపై పిల్లలు నడచి వెళ్లడం చూసి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
భవనాలు నిరుపయోగం
లంకపాకల, కె.బొత్తప్పగూడెం, కంగాలవారిగూడెం, కామవరం, చింతపల్లి, గడ్డపల్లి, గ్రామాల్లో కోట్లాది రూపాయలతో పెద్దపెద్ద పాఠశాల భవనాలు విద్యార్థుల చదువుల కోసం నిర్మించారు. ప్రస్తుతం అవన్నీ మూతపడ్డాయి. దీంతో భవనాలన్నీ నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి. ఒకనాడు పిల్లల పాఠ్యాంశ బోధన, ఆటపాటలు, అల్లర్లతో, ఆవరణలో అందమైన పూలమొక్కలు, గార్డెన్లతో ఆహ్లాదకరంగా కనిపించే భవనాలు నిరుపయోగంగా వెలవెలబోతూ కనిపిస్తున్నాయి. ఆయా పాఠశాలల్లో చదివే విద్యార్థులు ప్రస్తుతం పశువుల కాపరులుగా కొందరు మారారు. మరికొందరు కూలి పనులు చేసుకుంటున్నారు. ఇంకొందరు ఇంటి దగ్గరే ఉంటూ డ్రాప్ అవుట్లుగా మిగిలిపోయారు.
గిరిజన విద్యపై చిత్తశుద్ధి లేదు
పాఠశాలలను మూసివేయడం వల్ల ఆదివాసీ గిరిజన పిల్లలు చదువులకు దూరమయ్యారు. విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నామంటూ అధికారులు, పాలకులు ప్రకటనలు చేయడమే తప్ప గిరిజన విద్యపై చిత్తశుద్ధి లేదు. ఈ ప్రాంతంలో 23 పాఠశాలలు మూతపడడం వల్ల వందల సంఖ్యలో గిరిజన విద్యార్థులు డ్రాప్‌అవుట్లుగా మిగిలిపోయారు.
– సరియం రామ్మోహన్, పీడీఎస్‌యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, బుట్టాయగూడెం
పిల్లలు విద్యకు దూరమయ్యారు
మా కొండరెడ్డి ప్రాంతాల్లోని పాఠశాలలు ఎక్కువగా మూతపడ్డాయి. దీనివల్ల అనేక మంది విద్యకు దూరమయ్యారు. విద్యతోనే అభివృద్ధి చెందుతారని అధికారులు, ప్రభుత్వం చెబుతున్నారే తప్ప ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. బడులు మూతపడడం వల్ల మా పిల్లలు అడవుల్లోనే చెట్టు, పుట్టవైపు తిరుగుతూ పనులు చేసుకుంటూ ఉన్నారు.
– నడపల సోమరాజు, కొండరెడ్ల సంఘం రాష్ట్ర నాయకులు, అలివేరు
Comments
Please login to add a commentAdd a comment