గిరిజనశాఖలో త్వరలో ఖాళీల భర్తీ
- గిరిజన విద్యాసంస్థల్లో జనవరి 1 నుంచి సన్నబియ్యం
- మంత్రి చందూలాల్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యాసంస్థలు, గిరిజన కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ వెల్లడించారు. గిరిజన విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం జనవరి 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు.
తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లోని గిరిజనసంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ, కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, శాఖ అధికారులు బాబూ భూక్యా, దశరథ్ నాయక్, సీతారాం నాయక్, వివిధ ఐటీడీఏల పీడీలు, డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజనసంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రతీ తండాకు బస్సు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజనులకు వరప్రసాదంగా ఉన్న కల్యాణలక్ష్మీ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి నివారణకు ఇప్పట్నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు.