ajmira Chandulal
-
బీజేపీలోకి అజ్మీరా చందూలాల్ కుమారుడు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, దివంగత అజ్మీరా చందూలాల్ కుమారుడు, బీఆర్ఎస్ నాయకుడు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు గరికపాటి మోహన్‌రావుల సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈటల రాజేందర్, ప్రహ్లాద్‌కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీజేపీ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు. కేంద్ర కేబినెట్లోని 75 మంది మంత్రుల్లో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది గిరిజనులు ఉన్నారని, బీజేపీ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అలాగే ఆదివాసీ మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా బీజేపీనేనన్నారు. పార్టీ మారితే పెన్షన్ తీసేస్తామని బెదిరించడం సరికాదని, పెన్షన్ డబ్బులు ప్రజలవే తప్ప సీఎం కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చిందని, కేసీఆర్ డబ్బు సంచులు, మందు సీసాలకు ప్రజలు లొంగకుండా తనను గెలిపించారని అన్నారు. -
ట్రైకార్ ద్వారా డ్రైవర్ ఎంపవర్మెంట్
సాక్షి, హైదరాబాద్: గిరిజన నిరుద్యోగ యువతకు ఉపాధి కోసం డ్రైవర్ ఎంపవర్మెంట్ కార్యక్రమాన్ని ట్రైకార్ (తెలంగాణ ట్రైబల్ ఫైనాన్స్ కార్పొరేషన్) అందుబాటులోకి తెచ్చింది. దీనిలో భాగంగా డ్రైవింగ్‌లో నిష్ణాతులైన ఎస్టీ యువతకు రాయితీ పద్ధతిలో వాహనాలు ఇచ్చేం దుకు ఉపక్రమించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరంలో 500 మందికి దీని ద్వారా ఉపాధి కల్పించాలని నిర్ణయించింది. బుధవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఈ పథకాన్ని ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రస్తు తం ఈ పథకాన్ని పట్టణ ప్రాంతాల్లోని ఎస్టీలకే వర్తింపజేస్తున్నప్పటికీ.. త్వరలో గ్రామీణ ప్రాం తాల్లోని యువతకు వర్తింపజేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రభుత్వం ఇచ్చే వాహనాల ద్వారా క్యాబ్, ట్రాన్స్పోర్ట్ రంగంతో అనుసంధానమై ఉపాధి పొందాలని పిలుపునిచ్చారు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను వేగిరం చేయాలని, వచ్చే నెలాఖరులోగా లబ్ధిదారులందరికీ పూర్తిస్థాయిలో వాహనాలు పంపిణీ చేసేలా చర్య లు తీసుకోవాలని ట్రైకార్ యంత్రాంగాన్ని ఆదేశించారు. కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి మహేశ్‌దత్ ఎక్కా, కమిషనర్ క్రిస్టినా జెడ్ చోంగ్తు తదితరులు పాల్గొన్నారు. -
వ్యవసాయం పండుగలా చేసుకోవాలి
ములుగు రూరల్ : రాష్ట్ర ప్రభుత్వం రైతు శ్రేయస్సే ధ్యేయంగా పనిచేస్తోందని రాష్ట్ర గిరిజన , పర్యాటక, సాంస్కతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ అన్నారు. మండలంలోని అబ్బాపురంలో రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు అజ్మీరా సీతారాం నాయక్‌తో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంతో రైతు భరోసాగా వ్యవసాయం చేసుకునేలా ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటుందన్నారు. రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సూచనల మేరకు పంటలను సాగు చేసి అధిక దిగుబడులను సాధించాలన్నారు. వ్యవసాయం పండుగలా చేసుకోవాలి : ఎంపీ సీతారాంనాయక్ రాష్ట్రంలో రైతులు వ్యవసాయాన్ని పండుగలా చేసుకోవాలని మహబూబాబాద్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ అన్నారు. ప్రభుత్వం రైతులకు పెట్టుబడి సాయంగా ఎకరానికి నాలుగు వేల చొప్పున సాయం చేయడం దేశంలోనే ఎక్కడే లేదన్నారు. కార్యక్రమంలో ఆర్డీఓ రమాదేవి, తహసీల్దార్ ముల్కనూరి శ్రీనివాస్, వ్యవసాయశాఖ అధికారి మునుకుంట్ల సంతోష్, అబ్బాపురం, జాకారం సర్పంచ్‌లు తప్పెట్ల మొగిలి, గండ్రత్ సాగర్, జెడ్పీ ఫ్లోర్‌లీడర్ సకినాల శోభన్, ఎంపీపీ భూక్య మంజూల, ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్, రైతులు, నాయకులు పాల్గొన్నారు. -
నెల రోజుల్లో పెండింగ్ కేసుల పరిష్కారం
సాక్షి, హైదరాబాద్: అటవీ భూముల హక్కులకు సంబంధించిన కేసులను నెలరోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని గిరిజన సలహా మండలి (టీఏసీ) నిర్ణయించింది. అటవీభూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలిచ్చే అంశంపై మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఇక్కడ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన టీఏసీ సమావేశం జరిగింది. ఇందులో ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అటవీ భూముల హక్కులకు సంబంధించి పెండింగ్ కేసులపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండటంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. రైతు బంధు పథకం వర్తింపజేయాలంటే కేసులు పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా స్పందిస్తూ రైతు బంధు పథకం అమల్లోపే కేసులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో తిరస్కరించిన దరఖాస్తులతో పాటు కొత్తవారి నుంచి కూడా అర్జీలు స్వీకరించే అంశాన్ని పరిశీలించాలని, ఈ మేరకు ప్రభుత్వానికి సూచించాలని టీఏసీ తీర్మా నించింది. బ్యాక్లాగ్ పోస్టుల భర్తీ.. ప్రభుత్వ శాఖల్లో ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజన సలహా మండలి తీర్మానించింది. దాదాపు 1,000 బ్యాక్లాగ్ పోస్టులున్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు సూచించారు. నెలరోజుల్లోగా ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో 108 వాహ నాలను అందుబాటులో ఉంచాలని, పారామెడికల్, మెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవరకొండ ప్రాంతంలో నర్సింగ్ శిక్షణ కళాశాల ఏర్పాటు చేయాలని టీఏసీ తీర్మానించింది. భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏలకు మూడు స్వధార్ గృహాలను మంజూరు చేసి నిర్మించాలని సలహా మండలి తీర్మానం చేసింది. భద్రాచలం, సార పాక, ఉట్నూరు, ఆసిఫాబాద్‌లను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయాలని తీర్మానించింది. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులనే నియమించాలని సభ్యులు సున్నం రాజయ్య టీఏసీకి సూచించగా.. ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు. -
తెలంగాణ చారిత్రక నేపథ్యంపై సదస్సు
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 19, 20 తేదీ ల్లో తెలంగాణ చారి త్రక నేపథ్యం, నాగరి కత సంబంధిత విష యాలపై ఎంసీఆర్హెచ్ఆర్డీలో అంతర్జా తీయ సదస్సు నిర్వహిసున్నట్లు సాంస్కృ తిక, పర్యాటక మంత్రి అజ్మీరా చందూ లాల్ తెలిపారు. తెలంగాణ ప్రాచీన వారసత్వ సంపద, పాలించిన రాజులు, చారిత్రక కట్టడాలు, వాటి ఆధారాలను ప్రపంచానికి తెలపడమే ఈ సదస్సు ఉద్దేశమని వెల్లడించారు. గురువారం సచివాలయంలో చందూలాల్ మాట్లా డుతూ.. వివిధ రాష్ట్రాలకు చెందిన వారితో పాటు అమెరికా, రష్యా, ఇటలీ, గ్రీస్ దేశాలకు చెందిన విశ్లేషకులు సదస్సులో పాల్గొంటారని చెప్పారు. ఆర్కియాలజీ డిపార్టుమెంట్‌ను హెరిటేజ్ తెలంగాణగా మారుస్తున్నామని తెలిపారు. రెండ్రోజుల పాటు జరిగే ఈ సదస్సులో మొత్తం 6 ప్యానెళ్లు ఉంటాయని, ఇందులో 35 మంది పాల్గొంటారన్నారు. ప్రతి ప్యానె ల్లో అంశంపై ప్రదర్శనతోపాటు చర్చా గోష్టి ఉంటుందన్నారు. -
‘త్వరలో గిరిజన సంక్షేమశాఖ ఖాళీలు భర్తీ’
సాక్షి, హైదరాబాద్: గిరిజన సంక్షేమశాఖలో ఖాళీగా ఉన్న పోస్టులు త్వరలోనే భర్తీ చేస్తామని గిరిజన సంక్షేమశాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ ప్రకటించారు. గిరిజన సంక్షేమశాఖ పనితీరును అధికారులతో తన ఛాంబరులో గురువారం సమీక్షించారు. గిరిజన పాఠశాలలను అప్‌గ్రేడ్ చేస్తామని, గిరిజన విద్యావంతులు అన్ని పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యేలా శిక్షణ ఇప్పిస్తామన్నారు. బాలికల వసతి గృహాల లోపాలు సవరించడానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని, అన్ని హాస్టళ్లకు ప్రహరిగోడలు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్టు మంత్రి వెల్లడించారు. -
గిరిజనశాఖలో త్వరలో ఖాళీల భర్తీ
గిరిజన విద్యాసంస్థల్లో జనవరి 1 నుంచి సన్నబియ్యం మంత్రి చందూలాల్ వెల్లడి సాక్షి, హైదరాబాద్: గిరిజన విద్యాసంస్థలు, గిరిజన కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను త్వరలోనే భర్తీ చేయాలని నిర్ణయించినట్లు రాష్ట్ర గిరిజన సంక్షేమ, పర్యాటక శాఖ మంత్రి ఆజ్మీరా చందూలాల్ వెల్లడించారు. గిరిజన విద్యాసంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల కోసం జనవరి 1 నుంచి నాణ్యమైన సన్న బియ్యాన్ని సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. గిరిజన ప్రాంతాల్లో వైద్య సదుపాయాలను మెరుగుపరిచేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సూచించారు. తండాలను గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దే ప్రక్రియను వేగవంతం చేయాలన్నారు. శుక్రవారం దామోదరం సంజీవయ్య సంక్షేమ భవన్‌లోని గిరిజనసంక్షేమ శాఖ కార్యాలయాన్ని మంత్రి సందర్శించారు. అనంతరం ఆ శాఖ ముఖ్య కార్యదర్శి టి.రాధ, కమిషనర్ బి.మహేశ్‌దత్ ఎక్కా, శాఖ అధికారులు బాబూ భూక్యా, దశరథ్ నాయక్, సీతారాం నాయక్, వివిధ ఐటీడీఏల పీడీలు, డిప్యూటీ డెరైక్టర్లు, జిల్లా గిరిజనసంక్షేమ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతీ తండాకు బస్సు సౌకర్యం కల్పించేందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. గిరిజనులకు వరప్రసాదంగా ఉన్న కల్యాణలక్ష్మీ పథకానికి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు. రాబోయే వేసవిని దృష్టిలో పెట్టుకుని నీటి ఎద్దడి నివారణకు ఇప్పట్నుంచే చర్యలు చేపట్టాలని సూచించారు.