సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి, దివంగత అజ్మీరా చందూలాల్ కుమారుడు, బీఆర్‌ఎస్ నాయకుడు అజ్మీరా ప్రహ్లాద్ బీజేపీలో చేరారు. మంగళవారం పార్టీ కార్యాలయంలో బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గసభ్యుడు గరికపాటి మోహన్‌రావుల సమక్షంలో ఈ చేరిక కార్యక్రమం జరిగింది. ఈటల రాజేందర్, ప్రహ్లాద్‌కు కాషాయకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ బీజేపీ అన్ని వర్గాలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు.
కేంద్ర కేబినెట్‌లోని 75 మంది మంత్రుల్లో 27 మంది బీసీలు, 12 మంది ఎస్సీలు, 8 మంది గిరిజనులు ఉన్నారని, బీజేపీ ప్రభుత్వంతోనే ఇది సాధ్యమైందని చెప్పారు. అలాగే ఆదివాసీ మహిళకు అత్యున్నత రాష్ట్రపతి పదవి ఇచ్చింది కూడా బీజేపీనేనన్నారు. పార్టీ మారితే పెన్షన్ తీసేస్తామని బెదిరించడం సరికాదని, పెన్షన్ డబ్బులు ప్రజలవే తప్ప సీఎం కేసీఆర్ ఇంట్లో నుంచి ఇవ్వడం లేదని ఈటల మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇచ్చిందని, కేసీఆర్ డబ్బు సంచులు, మందు సీసాలకు ప్రజలు లొంగకుండా తనను గెలిపించారని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment