గిరిజన సలహా మండలి సమావేశంలో మంత్రి చందూలాల్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: అటవీ భూముల హక్కులకు సంబంధించిన కేసులను నెలరోజుల్లో పూర్తిస్థాయిలో పరిష్కరించాలని గిరిజన సలహా మండలి (టీఏసీ) నిర్ణయించింది. అటవీభూముల్లో సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలిచ్చే అంశంపై మరోసారి దరఖాస్తులు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరింది. బుధవారం ఇక్కడ దామోదరం సంజీవయ్య సంక్షేమ భవనంలో రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అజ్మీరా చందూలాల్ అధ్యక్షతన టీఏసీ సమావేశం జరిగింది. ఇందులో ఎస్టీ ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
అటవీ భూముల హక్కులకు సంబంధించి పెండింగ్ కేసులపై పలువురు సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏళ్ల తరబడి కేసులు పెండింగ్‌లో ఉండటంతో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగట్లేదని మండిపడ్డారు. రైతు బంధు పథకం వర్తింపజేయాలంటే కేసులు పరిష్కరించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌మిశ్రా స్పందిస్తూ రైతు బంధు పథకం అమల్లోపే కేసులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గతంలో తిరస్కరించిన దరఖాస్తులతో పాటు కొత్తవారి నుంచి కూడా అర్జీలు స్వీకరించే అంశాన్ని పరిశీలించాలని, ఈ మేరకు ప్రభుత్వానికి సూచించాలని టీఏసీ తీర్మా నించింది.
బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీ..
ప్రభుత్వ శాఖల్లో ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీకి తక్షణ చర్యలు తీసుకోవాలని గిరిజన సలహా మండలి తీర్మానించింది. దాదాపు 1,000 బ్యాక్‌లాగ్ పోస్టులున్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని సభ్యులు సూచించారు. నెలరోజుల్లోగా ఈ మేరకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అన్ని గిరిజన ప్రాంతాల్లో 108 వాహ నాలను అందుబాటులో ఉంచాలని, పారామెడికల్, మెడికల్ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోవాలని సూచించారు. దేవరకొండ ప్రాంతంలో నర్సింగ్ శిక్షణ కళాశాల ఏర్పాటు చేయాలని టీఏసీ తీర్మానించింది.
భద్రాచలం, ఏటూరునాగారం, ఉట్నూరు ఐటీడీఏలకు మూడు స్వధార్ గృహాలను మంజూరు చేసి నిర్మించాలని సలహా మండలి తీర్మానం చేసింది. భద్రాచలం, సార పాక, ఉట్నూరు, ఆసిఫాబాద్‌లను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేయాలని తీర్మానించింది. ఐటీడీఏ ప్రాజెక్టు ఆఫీసర్లుగా ఐఏఎస్ అధికారులనే నియమించాలని సభ్యులు సున్నం రాజయ్య టీఏసీకి సూచించగా.. ప్రభుత్వానికి నివేదిస్తామని పేర్కొన్నారు. గిరిజన సలహా మండలి సమావేశానికి మీడియాను అనుమతించకపోవడంపై పలువురు సభ్యులు అసహనం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment