గ్రామంలో కొనసాగుతున్న వైద్య శిబిరం
కారంపూడి మండలం మిరియాల గ్రామంలో గురువారం మరో నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. దారెడ్డి కరుణాకరరెడ్డి అనే బాలుడి పరిస్థితి విషమంగా ఉండడంతో నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలిం చారు. ఇప్పటి వరకు గ్రామంలో 57 మందికి డయేరియా సోకింది.
మిరియాల (కారంపూడి): మండలంలోని మిరియాల గ్రామంలో గురువారం మరో నాలుగు డయేరియా కేసులు నమోదయ్యాయి. వీరికి డాక్టర్లు ఆంజనేయులు నాయక్, లక్ష్మీశ్రావణి వైద్య సేవలు అందిస్తున్నారు. కొత్తగా వ్యాధి సోకిన వారిలో దారెడ్డి కరుణాకరరెడ్డి అనే బాలుని పరిస్థితి విషమంగా ఉండడంతో నరసరావుపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరితో కలిపి ఇప్పటి వరకు గ్రామంలో మొత్తం 57 మందికి డయేరియా సోకింది.
వ్యాధి వచ్చిన వారిలో 30 మందికి పూర్తిగా తగ్గిపోయిందని, మిగిలిన వారి ఆరోగ్యం కూడా మెరుగవుతోందని, కొత్త కేసులు నమోదు కాకుంటే పరిస్థితి పూర్తిగా అదుపులోకి వస్తుందని వైద్యులు తెలిపారు. డీఎల్‌పీవో కృష్ణమోహన్ గురువారం గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య చర్యలను పరిశీలించారు. గ్రామంలో వారం రోజులుగా కొనసాగుతున్న వైద్య శిబిరంలో సీహెచ్‌వో వి.రామాంజనేయులు, సూపర్ వైజర్ పట్టాభి, కారంపూడి పీహెచ్‌సీ సిబ్బంది దానమ్మ, రమణ, హెచ్‌వీ సరిత తదితరులు సేలందిస్తున్నారు. ఆర్డీవో, జిల్లా వైద్యారోగ్యశాఖాధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.
పరిస్థితి అదుపులోనే ఉంది
ఒక బాలుని పరిస్థితి విషమంగా ఉంటే అంబులెన్స్‌లో నరసరావుపేట ఆస్పత్రికి తరలించారని, మిగిలిన వారు కోలుకుంటున్నారని తహసీల్దార్ సాయిప్రసాద్ తెలిపారు. డ్రైనేజిలో మురుగు పూడిక తీత పనులు పూర్తయ్యాయని, వాటిలో బ్లీచింగ్ చల్లుతున్నారని చెప్పారు. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఓవర్‌హెడ్ ట్యాంకులను శుభ్రం చేయిస్తున్నారని, ట్యాంకుల ద్వారా నీటి సరఫరా కొనసాగుతోందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment