ఉత్తుత్తి ‘టెస్టులు’!
రూ.200లకే అన్ని రకాల వైద్య పరీక్షలంటూ మోసం
♦ పల్లెల్లో సరికొత్త దోపిడీకి తెరలేపిన ముఠా
♦ స్వచ్ఛంద సంస్థ పేరిట వైద్య శిబిరాల ఏర్పాటు
♦ కేవలం వేలిముద్రలు తీసుకుని రోగాల నిర్ధారణ
♦ లేని రోగాలు ఉన్నట్టు చూపుతూ రిపోర్టులు
♦ నకిలీ మందులు ఇస్తూ డబ్బులు గుంజుతున్న వైనం
‘రూ. 200 చెల్లిస్తే చాలు.. సకల రోగాలను పసిగడతాం.. వాటి నివారణకు కారుచౌకగా మందులిస్తాం’ అంటూ ఊళ్లు తిరుగుతోంది ఓ ముఠా. స్వచ్ఛంద సంస్థ ముసుగులో పల్లె పల్లెకూ తిరుగుతోంది. గ్రామ పంచాయతీ కార్యాలయాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ఒక్క స్పర్శతో అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తామంటూ.. బొటన వేలు ముద్ర తీసుకుని ఫలానా రోగం ఉందంటూ ఖాయం చేసేస్తోంది. అంతటితో ఆగకుండా.. మీకున్న జబ్జుకు ఈ మందులేసుకోవాలంటూ నకిలీ మందులను అంటగట్టి.. అందినకాడికి గుంజేసి జారుకుంటోంది.
సాక్షి, రంగారెడ్డి జిల్లా : గ్రామీణ ప్రజల అమాయకత్వాన్ని సొమ్ము చేసుకుంటున్నారు కొందరు మాయగాళ్లు. కంప్యూటర్లు, కొత్త కొత్త పరికరాలను చూపించి వారిని మోసపుచ్చుతున్నారు. తక్కువ రుసుముతో వైద్య పరీక్షలు చేసి వ్యాధులను నిర్ధారిస్తామని చెబుతున్నారు. గత పక్షం రోజుల్లో జిల్లాలో పలుచోట్ల ఇలాంటి వైద్య పరీక్ష శిబిరాలు కొనసాగాయి. కొన్నిచోట్ల రెండు, మూడు రోజులపాటు ఈ శిబిరాల్లో జన ం కిక్కిరిసిపోవడం గమనార్హం.
ఈ క్యాంపునకు వచ్చిన ప్రజలకు ఒక పరికరంతో అన్నిరోగాలను గుర్తించొచ్చని చెబుతూ వారికి లేనిపోని రోగాలున్నట్లు రిపోర్టులిస్తున్నారు. కనీసం రక్త నమూనాలు, మూత్ర నమూనాలు తీసుకోకుండా కేవలం వేలిముద్రల సాయంతో అన్ని రకాల పరీక్షలు చేయడం విశేషం. ఆదివారం కందుకూరు మండలం దెబ్బడగూడలో వెలిసిన ఈ క్యాంపు.. గుట్టు రట్టవుతుందనుకున్న సమయంలో క్షణాల్లో బిచానా ఎత్తేశారు. ఈ క్రమంలో పలు గ్రామాల్లోనూ ఇలాంటి వైద్యశిబిరాలు వెలసినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
గ్రామ పంచాయతీ సాక్షిగా..
గ్రామాల్లో వెలుస్తున్న నకిలీ వైద్య శిబిరాలన్నీ ఏకంగా గ్రామ పంచాయతీ కార్యాలయాల్లోనే వెలుస్తున్నాయి. గ్రామ పెద్దతో పరీక్షలు ప్రారంభించి తక్కిన వారందరికీ క్షణాల్లో పరీక్షలు నిర్వహించి ఫలితాల్ని ప్రింటెడ్ కాపీల రూపంలో అందిస్తున్నారు. కందుకూరు మండలం దెబ్బడగూడలో దయా ఫౌండేషన్ ఆధ్వర్యంలో దాదాపు వందమందికి పైగా పరీక్షలు నిర్వహించి ఫలితాలను ఇచ్చారు. గతవారం మంచాల మండలం ఆరుట్ల, మంచాల గ్రామాల్లోనూ న్యూట్రివెల్త్ అనే సంస్థ ఆధ్వర్యంలో రెండొందల మందికిపైగా పరీక్షలు నిర్వహించారు. అంతేకాకుండా పలువురికి వ్యాధులున్నాయని చెబుతూ వాటిని నయం చేసేందుకుగాను ఒక్కో వ్యక్తి నుంచి రూ.300, 500, 1000 చొప్పున వసూలు చేశారు. ఇబ్రహీంపట్నం మండలంలోని కొంగరకలాన్, ఎలిమినేడు గ్రామాల్లోనూ ఇదేతరహాలో మూడురోజులపాటు క్యాంపులు నిర్వహించి ప్రజలనుంచి భారీగా దండుకున్నారు.
ఆ మందులు ఫేక్!
వైద్య శిబిరాల పేరుతో వచ్చి మందులు పంపిణీ చేసిన వాటిలో చాలావరకు నకిలీ మందులున్నట్లు వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు అభిప్రాయపడుతున్నారు.
దండోరా వేయించి దండుకున్నారు..
వైద్య శిబిరం ఏర్పాట్లు చేస్తున్నట్లు ఊర్లో దండోరా వేశారు. దీంతో పంచాయతీ కార్యాలయం వద్దకు వెళ్లా. పరీక్షలు నిర్వహించి మూత్ర పిండాలకు సంబంధించిన వ్యాదులున్నట్లు చెప్పారు. కొంత ఆందోళనకు గురయ్యా. అంతలోనే మందులిస్తాం.. తగ్గిపోతుందని చెప్పడంతో రూ.300 ఇస్తే ఈ మాత్రలిచ్చారు. ఇవి నకిలీ మందులని మందుల దుకాణాదారుడు చెప్పడంతో వాటిని వాడకుండా వదిలేశా.
- భద్రారెడ్డి, మంచాల
అనుమతి లేదు..
వైద్య శిబిరం నిర్వహించాలంటే మండల అధికారులనుంచి అనుమతి తీసుకోవాలి. వైద్య, ఆరోగ్య శాఖకు సమాచారం ఇవ్వాలి. కానీ మంచాల, ఆరుట్ల గ్రామాల్లో నిర్వహించిన వైద్య శిబిరాలకు సంబంధించి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. నకిలీ వైద్య శిబిరాలతో ప్రజలు అప్రమత్తమై ఉండాలి. - విజయలలిత, మెడికల్ ఆఫీసర్, మంచాల