యశవంతపుర: వైద్య పీజీ సీట్లపై విద్యార్థులు, తల్లిదండ్రుల్లో ఉన్న మక్కువను కొందరు మోసగాళ్లు సొమ్ము చేసుకుంటున్నారు. మాయమాటలతో లక్షల రూపాయలు దోచేస్తున్నారు. ఇలా పీజీ మెడికల్ సీట్లను ఇప్పిస్తామని నమ్మించి ఎంతోమందికి కుచ్చుటోపీ పెట్టిన ఇద్దరు ఘరానా మోసగాళ్లను బెంగళూరు మైకో లేఔట్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉడుపి జిల్లా కుందాపురకు చెందిన రజిత్‌శెట్టి (31), జార్కండ్ ధన్‌బాద్‌కు చెందిన జయప్రకాశ్ సింగ్ (38)లను బెంగళూరు మైకో లేఔట్ పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి రూ.91.45 లక్షలు నగదు, రూ.కోటి విలువ చేసే స్టాక్‌మార్కెట్ షేర్లు, రెండు ఖరీదైన కార్లు, ఐదు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు.
వివరాలు.. వీరిద్దరూ బీటీఎం లేఔట్‌లో లర్నింగ్ అండ్ ఎజుకేషన్ కన్సల్టెన్స్ పేరుతో అఫీసు పెట్టి సుదర్శన్, సందీప్, రాహుల్‌కుమార్ అని నకిలీ పేర్లతో చెలామణి అయ్యారు. ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీలలో పీజీ సీట్లను ఇప్పిస్తామంటూ ప్రచారం చేసుకునేవారు. ఆంధ్ర, తమిళనాడు, తెలంగాణ, మహరాష్ట్రలకు చెందిన విద్యార్థులకు మెడికల్ సీట్లను ఇప్పిస్తామని నమ్మించి వారి వద్ద నుండి అధిక మొత్తం డబ్బులను అడ్వాన్స్‌గా తీసుకొంటారు. సీట్లు అడిగితే మొదట మాట్లాడుకున్న దానికంటే అధికంగా కాలేజీవారు డిమాండ్ చేశారని ముఖం చాటేసేవారు. గట్టిగా అడిగిన వారికి అడ్వాన్స్‌లో 10 శాతం చొప్పున చెల్లించేవారు. మొత్తం తిరిగివ్వాలని అడిగితే, నకిలీ కాలేజీ నిర్వాహకుల వద్దకు తీసుకెళ్లి మరింతగా ముట్టజెబితే సీటు మీకు దక్కుతుంది, లేదంటే ఇచ్చిన డబ్బులు కూడా వాపస్ రాదు అని చెప్పించేవారు. రజిత్ శెట్టి ఎలక్ట్రానిక్ సిటీలోని డ్వాడీస్ ఎలిక్టర్ అపార్టుమెంట్‌లోను, జయప్రకాశ్ సింగ్ కోడిగేహళ్లి బాలాజీ లేఔట్ మల్టి డైమెండ్ అపార్టమెంట్‌లో వ్యవహారం నడిపేవారని పోలీసుల విచారణలో బయట పడింది. వసూలు చేసిన డబ్బులతో విదేశాల్లో విహార యాత్రలను చేస్తూ విలాసవంతంగా రోజులు గడుపుతూ జీవనం సాగిస్తున్నారు.
ఫిర్యాదుతో కదిలిన డొంక
మోసపోయిన కొందరు విద్యార్థులు, తల్లిదండ్రులు మైకో లేఔట్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. జయప్రకాశ్ సింగ్ బ్యాంకుల్లో రూ. 62 లక్షలు డిపాజిట్ చేసినట్లు తేలింది. రజిత్ శెట్టి వద్ద 20 లక్షల నగదు, ఐదు ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నారు. రజిత్‌శెట్టి ఇంజినీరింగ్ చేసి రెండేళ్లపాటు ఐటీ కంపెనీలో పని చేసి సులభంగా డబ్బు సంపాదించాలనే దుర్బుద్ధితో మెడికల్ సీట్ల దందాకు తెరతీశాడు. 2013లోనే మెడికల్ సీట్లు ఇప్పిస్తానని మణిపాల్ విద్యార్థులకు నమ్మించి లక్షలు వసూలు చేసి మోసం చేశాడనే అరోపణపై ఇప్పుటీకే 8 కేసులు కోర్టులో కేసులు నడుస్తున్నాయి. జయప్రకాశ్ సింగ్‌పై కూడ బెంగళూరు నగరంలోని సంజయ్‌నగర, కోడిగేహళ్లి పోలీసుస్టేషన్లు పరిధిలో రెండు కేసులున్నాయి. వివిధ రాష్ట్రాలకు చెందిన మోసపోయిన విద్యార్థుల నుండి ఫిర్యాదు వస్తున్న పోలీసు వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment