రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా | Hyderabad CCS Police File Cheating Case Of Rs 3 Crores | Sakshi
Sakshi News home page

రూ.579 కోట్ల కాంట్రాక్టులంటూ..రూ.3 కోట్లు స్వాహా

Published Thu, Jan 27 2022 9:55 AM | Last Updated on Thu, Jan 27 2022 10:03 AM

Hyderabad CCS Police File Cheating Case Of Rs 3 Crores - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రభుత్వం కడుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లతో పాటు మరో లిమిటెడ్‌ సంస్థకు చెందిన పనులు ఇప్పిస్తామంటూ నగరానికి చెందిన వ్యక్తిని మోసం చేసిన ముఠాపై హైదరాబాద్‌ నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు కేసు నమోదు చేశారు. రూ.579 కోట్ల పనులు సబ్‌–కాంట్రాక్ట్‌కు ఇస్తామంటూ రూ.3 కోట్లు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయని అధికారులు తెలిపారు. బంజారాహిల్స్‌ ప్రాంతానికి చెందిన సివిల్‌ ఇంజినీర్‌ కె.జగదీశ్వర్‌ దాదాపు పదహారేళ్లుగా సాయిడక్స్‌ ఇంజినీర్స్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో సంస్థ నిర్వహిస్తున్నారు. శివప్రసాద్‌ అనే దళారి ద్వారా ఈయనకు గతేడాది సెప్టెంబర్‌ 21న డీఎన్‌సీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ డి.నరేష్‌ చౌదరి కలిశారు.

ఆ సందర్భంలో మహానంది కోల్‌ఫీల్డ్స్‌ లిమిటెడ్‌ సంస్థకు చెందిన రూ.539 కోట్ల కాంట్రాక్టుకు సంబంధించిన లెటర్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌ చూపించారు. ఆ కాంట్రాక్టు తనకే వచ్చిందంటూ నమ్మబలికాడు. దీంతో పాటు తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు సంబంధించిన రూ.40 కోట్ల కాంట్రాక్టునూ సబ్‌–కాంట్రాక్టుకు ఇస్తానంటూ చెప్పాడు. బేరసారాల తర్వాత జగదీశ్వర్, నరేష్‌లు ఒప్పందం చేసుకున్నారు. ఆ తర్వాత నరేష్‌ నుంచి జగదీశ్వర్‌కు ఆ రెంటితో సంబంధం లేని పనులకు సంబంధించిన వర్క్‌ ఆర్డర్లు ఇచ్చారు. అదేమని ప్రశ్నిస్తే జీఎస్టీ ఇబ్బందుల నేపథ్యంలో అలా ఇవ్వాల్సి వచ్చిందంటూ చెప్పాడు.
చదవండి: యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?

గరిష్టంగా వారం రోజుల్లో అసలు పనులు ప్రారంభిద్దామంటూ అందుకు అవసరమైన ఖర్చుల నిమిత్తం కావాలంటూ రూ.1.4 కోట్లు తీసుకున్నాడు. ఈ నగదు తీసుకునే సమయంలో నరేష్‌తో పాటు అతడి భార్య లావణ్య, బంధువు రాకేష్‌లతో పాటు చైతన్య అనే వ్యక్తి కూడా వచ్చారు. ఆపై సరుకు సరఫరా పేరుతో ఉమా ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ కంపెనీ, ఏకదంత రిటైలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లకు రూ.50 లక్షలు, రూ.1.1 కోట్లు చొప్పున నగదు, పర్చేజ్‌ ఆర్డర్లు ఇప్పించాడు. ఈ చెల్లింపుల తర్వాత జగదీశ్వర్‌కు ఎలాంటి సరుకు సరఫరా కాలేదు. కొన్నాళ్లు ఎదురు చూసిన ఈయన తన సబ్‌–కాంట్రాక్టులు, నగదు విషయంపై నరేష్‌ను సంప్రదించారు.

అయితే అతడి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తాను మోసపోయానని గుర్తించారు. దీంతో ఆరా తీయగా... నరేష్‌ నేతృత్వంలోని ముఠా అనేక మందిని ఇదే పంథాలో మోసం చేసిందని, దాదాపు ప్రతి సందర్భంలోనూ నకిలీ లెటర్‌ ఆఫ్‌ ఇంట్రెస్ట్‌లు చూపించినట్లు తేలింది. దీంతో ఆయన సీసీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో నరేష్, లావణ్య, రాకేష్, స్వాతి, చైతన్య, శివప్రసాద్‌లతో పాటు ఉమా ఇంటర్నేషనల్‌ ట్రేడింగ్‌ కంపెనీ, ఏకదంత రిటైలర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లపై కేసు నమోదు చేసిన అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
 
Advertisement