అరకు లోయ : వైద్య శాఖలో ఉద్యోగాలంటూ ఓ మహిళ నిరుద్యోగుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బు వసూలు చేసిన ఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. సదరు మహిళపై బాధితులు సోమవారం విశాఖపట్నం జిల్లాలోని అరకు లోయ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కృష్ణవేణి అనే మహిళ విశాఖలోని డాబాగార్డెన్ కేంద్రంగా కార్యాలయం తెరచి వైద్య శాఖలో ఏఎన్‌ఎం, ల్యాబ్ టెక్నీషియన్ తదితర ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నిరుద్యోగులను ఆకర్షించింది. వారి నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసింది. ఎంతకీ ఉద్యోగాలు ఇప్పించకపోవడంతో 10 మంది బాధితులు సోమవారం అరకులోయలో స్థానిక గిరిజన సంఘం నాయకుడి ఆధ్వర్యంలో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సింహాద్రినాయుడుకి ఫిర్యాదు చేశారు.
సుమారు 42 మంది నుంచి రూ.33.75 లక్షలు వసూలు చేసినట్టు ప్రాథమికంగా తెలుస్తోంది. అయితే బాధితుల సంఖ్య ఇంకా ఎక్కువే ఉన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా గతంలో అరకులో వైద్యుడిగా పనిచేసి, ప్రస్తుతం అనంతగిరి మండలంలో ప్రభుత్వ వైద్యుడిగా పనిచేస్తున్న డాక్టర్ చక్రవర్తి చెబితేనే తాను నిరుద్యోగుల నుంచి నగదు వసూలు చేశానంటూ కృష్ణవేణి కూడా పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం.
వైద్య శాఖలో ఉద్యోగాలంటూ టోకరా
Published Mon, Jun 22 2015 4:50 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement