సాక్షి, హిందూపురం: ప్రేమించి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి సర్వమూ దోచేసిన యువకుడు.. పెళ్లి మాట ఎత్తగానే ముఖం చాటేశాడంటూ ఓ యువతి నడిరోడ్డుపై ధర్నాకు దిగింది. బాధితురాలు తెలిపిన మేరకు.. హిందూపురం మండలానికి చెందిన ఓ యువతి అనంతపురం జిల్లా గుత్తిలోని ఓ కళాశాలలో ఎంబీఏ పూర్తి చేసింది. కళాశాలలో చదువుకుంటున్న సమయంలోనే కర్నూలు జిల్లా పెద్దకడుబూరు ప్రాంతానికి చెందిన గణేష్ పరిచయమయ్యాడు. ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. మూడేళ్ల పాటు తనతో పాటు తిప్పుకున్నాడు.
ప్రస్తుతం దళితురాలిననే కారణం చూపి పెళ్లికి అంగీకరించడం లేదు. గణేష్ చేసిన మోసంపై ఇప్పటికే పోలీసు స్పందన కార్యక్రమంలో ఎస్పీని కలసి ఫిర్యాదు చేసింది. దీనిపై 20 రోజుల క్రితం హిందూపురం రూరల్ పోలీసులు పిలిపించుకుని విచారణ చేశారు. అయినా తనకు న్యాయం చేకూరలేదంటూ శనివారం అంబేడ్కర్ సర్కిల్ వద్ద కేవీపీఎస్ నాయకులతో కలసి భైఠాయించి నిరసన వ్యక్తంచేసింది.
తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని పేర్కొంది. కార్యక్రమంలో బాధితురాలితో పాటు తల్లి, కేవీపీఎస్ నాయకులు అన్నమయ్య, రమణ, రాము, జ్యోతమ్మ, మధు తదితరులు పాల్గొన్నారు. హిందూపురం రూరల్ సీఐ కృష్ణారెడ్డి మాట్లాడుతూ.. అబ్బాయిని పిలిపించి విచారిస్తే అతను ఒప్పుకోవడం లేదన్నారు. బాధితురాలు రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామని పేర్కొన్నారు.
(చదవండి: అప్పు కట్టకుంటే.. జైలుశిక్ష )
Comments
Please login to add a commentAdd a comment