హోమియో కౌన్సెలింగ్
మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. గత ఆర్నెల్లుగా పరధ్యానంగా ఉంటోంది. ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి.
- సరళ, చెన్నై
మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మతగా పేర్కొనవచ్చు. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు సహజంగా మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్‌లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి పరిపూర్ణ చికిత్స ఉంది.
డిప్రెషన్‌ను 1950-60లలో రెండు రకాలుగా విభజించారు. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు :
మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిస్థిమిక్ డిజార్డర్: రోగి తక్కువస్థాయి డిప్రెషన్‌లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సైకియాటిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. పోస్ట్ నేటల్ డిప్రెషన్: మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది. బైపోలార్ డిజార్డర్: ఈ డిప్రెషన్‌లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. హోమియో వైద్యవిధానంలో నేట్రమ్‌మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి.
డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి
ఎండీ (హోమియో),
స్టార్ హోమియోపతి,
హైదరాబాద్
వాస్క్యులర్ కౌన్సెలింగ్
నా వయసు 46 ఏళ్లు. వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల నేను నడిచేటప్పుడు పాదాలలో, పిక్కల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. నడుస్తుంటే కండరాలు పట్టేసినట్లుగా ఉండి, నడకలో ఇబ్బంది అనిపిస్తోంది. కొంతదూరం నడవగానే కొద్దిసేపు ఆగాల్సి వస్తోంది. ‘అదే తగ్గిపోతుందిలే’ అని వేచిచూశాను. కానీ మూడు నెలలుగా ఆ నొప్పి తగ్గకపోగా రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. దయచేసిన నా సమస్యకు కారణమేమిటో తెలిపి, సరైన పరిష్కారం చూపించగలరు.
- డి. నాగేశ్వరరావు, కర్నూలు
మీరు తెలిపిన వివరాలను బట్టి కాలిలోని రక్తనాళాలలో పూడిక ఉన్నట్లు తెలుస్తోంది. పూడిక ఏర్పడటం వల్ల వచ్చే నొప్పిని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పీవీడీ) అంటారు. మీకు మొదటిసారి ఈ సమస్య వచ్చిందా లేక ఇది వరకు ఉన్న సమస్య మళ్లీ కనిపిస్తోందా అనే వివరాలు మీరు తెలపలేదు. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో పాటు సిగరెట్ తాగడం వంటి అలవాటు ఉంటే త్వరగా ఈ సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేనివారిలో ఈ తరహా సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది.
సాధారణంగా కాళ్లకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఈ నొప్పి వస్తుంది. రక్తనాళాల్లో పూడికలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాళ్లలో రక్తప్రవాహాన్ని తెలుసుకోవడం ద్వారా పీవీడీని అంచనా వేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మీరు తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ వాకింగ్ చేయడం మంచిది. అలాగే దూరప్రయాణాలు చేసే సమయంలో కాలి వ్యాయామాలు చేయడం మంచిది. ఇలా చేయడం రక్తనాళాల్లో పూడిక ఏర్పడకుండా ఉండటానికి దోహదపడుతుంది. సిగరెట్, గుట్కా, పాన్ వంటి పొగాకును నమిలే అలవాటు ఉండే వెంటనే మానేయండి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంది. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, తగిన చికిత్స తీసుకుంటే మీ సమస్యను సులువుగా అధిగమించవచ్చు.
డాక్టర్ దేవేందర్ సింగ్
సీనియర్ వాస్క్యులర్ సర్జన్,
యశోద హాస్పిటల్స్,
సోమాజిగూడ,
హైదరాబాద్
గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్
మా నాన్నగారికి హెచ్‌సీవీ వచ్చింది. ముందు కామెర్లు వచ్చాయి. వైద్యపరీక్షలు, స్కానింగ్ తర్వాత హెచ్‌సీవీ జీనోటైప్ 3 అని చెప్పారు. ఇటీవలే నెల క్రితం మళ్లీ పరీక్షలు చేయిస్తే లివర్ సిర్రోసిస్, కాలేయం కుడితమ్మె కుంచించుకుపోయిందనీ (రైట్‌లోబ్ ష్రంకెన్), లెఫ్ట్ లోబ్ ఎన్‌లార్జ్ అయిందనీ చెప్పారు. కామెర్లు తగ్గాయి కదా అని మా నాన్నగారికి ఫ్యాటీ ఫుడ్ పెట్టాం. దాంతో ఈ సమస్య వచ్చిందా? గత 20 రోజులుగా ఫ్యాటీ ఫుడ్ మానేసి, అంతా ఉడికించిన ఆహారమే (ఉప్పు లేకుండా) ఇస్తున్నాం. ఆయనకు హెచ్‌సీవీ, లివర్ సిర్రోసిస్ మందులతో తగ్గుతుందా?
- మాతాశ్రీ, ఈ-మెయిల్
మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ నాన్నగారికి హెపటైటిస్-సి వ్యాధి వల్ల సిర్రోసిస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా లివర్ సిర్రోసిస్ వల్ల వచ్చే కామెర్లు చాలావరకు నయం కావు. ఇప్పుడు మీరు లివర్ సిర్రోసిస్ ఏ దశలో ఉందో తెలుసుకోవడం అవసరం. అందుకోసం తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి, హెపటైటిస్-సి కి సంబంధించిన పరీక్షలు చేయించుకొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే, హెపటైటిస్-సి వ్యాధిని అదుపులో పెట్టవచ్చు.
నా వయసు 65 ఏళ్లు. డయాబెటిస్‌తో బాధపడుతున్నాను. కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదు. గత ఆర్నెల్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటే ఎండోస్కోపీ చేశారు. గ్యాస్ట్రయిటిస్ ఉందని చెప్పారు. ఈ వ్యాధి తగ్గడానికి మందులు వాడవచ్చా? వాటి వల్ల కిడ్నీలు ఇంకా దెబ్బతినే అవకాశం ఉందా?
- సిహెచ్. సుబ్బారావు, ఒంగోలు
మీరు డయాబెటిస్ నెఫ్రోపతీ, గ్యాస్ట్రయిటిస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన దశలో ఉన్నారు. అంటే మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. మీకు గ్యాస్ట్రయిటిస్ వల్ల వస్తున్న కడుపులో నొప్పి తగ్గాలంటే ఇప్పుడు వాడుతున్న అల్సర్ మందులు వాడండి. వీటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. ఈ మాత్రలు కిడ్నీ ఫెయిల్ అయిన వారికి కూడా ఇవ్వవచ్చు. అవి చాలా సురక్షితం. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన లేకుండా డాక్టర్ ఇచ్చిన మందులు వాడండి.
డాక్టర్ భవానీరాజు,
సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్,
కేర్ హాస్పిటల్స్,
బంజారాహిల్స్,
హైదరాబాద్
హెపటైటిస్-సి మందులతో తగ్గుతుందా?
Published Mon, Sep 21 2015 11:46 PM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM
Advertisement
Advertisement