Depression disease
-
ఇక ఆ బాధలు నావల్ల కాదు : చిన్న వయసులోనే కఠిన నిర్ణయం
అనారోగ్య సమస్యల్ని, తీవ్రమైన బాధల్ని అనుభవించే సమయంలో ఈ బాధ భరించేకంటే చచ్చిపోవడం మేలు అని అనిపిస్తుంది. కానీ నిజంగానే చట్టబద్ధంగా మరణించేందుకు కొన్ని దేశాల్లో అనుమతి ఉంది. చికిత్స లేదు అనుకున్న సమయంలో, వైద్యులు, చట్టాలు పరిశీలించిన తరువాత చట్ట రీత్యా చనిపోవడానికి అనుమతి ఉంది. దాన్నే "కారుణ్య మరణం" (Euthanasia) అంటారు. అంటే సులభంగా నొప్పిలేకుండా, ఆ రోగికి శాశ్వతంగా విముక్తి కల్పించడం అన్నమాట. సరిగ్గా ఇలాగే చికిత్స లేని మానసిక వ్యాధులతో సతమతమవుతున్న నెదర్ల్యాండ్స్ యువతి జొరాయా టెర్ బీక్ (28) కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. ది ఫ్రీ ప్రెస్ రిపోర్ట్ ప్రకారం టెర్ బీక్ చాలా కాలంగా ఆమె డిప్రెషన్, ఆటిజమ్, బోర్డర్‌లైన్ పర్సనాలిటీ డిజార్డర్ వంటి సమస్యలతో బాధపడుతోంది. ఎన్ని చికిత్సలు చేసినా విముక్తి లభించలేదు. అంతేకాదు ఇక ఎలాంటి ఇతర చికిత్సలూ లేవని వైద్యులు కూడా తేల్చి చెప్పారు. దీంతో, బాధల నుంచి తప్పించుకునేందుకు ఆమె కారుణ్య మరణాన్ని ఎంచుకుంది. (తైవాన్ను కుదిపేసిన భూకంపం : మెట్రోట్రైన్, స్విమ్మింగ్ పూల్‌లో దృశ్యాలు) ప్రేమించే స్నేహితుడు, పెంపుడు జంతువులున్నప్పటికీ, ఆమె కూడా తన మానసిక వ్యాధి చికిత్సకు లొంగదని భావిస్తుంది. నెదర్లాండ్స్‌లో ఎక్కువ మంది ప్రజలు మానసిక ఆరోగ్య సమస్యలను భరించే బదులు వాటి బాధలను అంతం చేసుకోవాలని ఎంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మే నెలలో ఆమె కూడా కారుణ్యమరణానికి రంగం సిద్దం కావడం విషాదం. ఈ ప్రక్రియలో భాగంగా దీనికి ప్రకారం టెర్ బీక్ ఇంటి వద్దే వైద్యులు ఆమెకు తొలుత మత్తు మందు ఇస్తారు. ఆ తరువాత గుండె కొట్టుకోవడాన్ని ఆపే మరో మందును ఇస్తారు. జోరాయా ఇంట్లో ఆమె ప్రియుడు, ఇతర కుటుంబసభ్యుల సమక్షంలో అచేతన స్థితిలో ఆమె లోకానికి శాశ్వతంగా ఈ లోకాన్ని వీడనుంది. నెదర్లాండ్స్‌లోని థియోలాజికల్ యూనివర్శిటీ కాంపెన్‌లోని హెల్త్‌కేర్ ఎథిసిస్ట్ స్టెఫ్ గ్రోన్వౌడ్ మాట్లాడుతూ గతంకంటే ఈ ధోరణి బాగా పెరిగిందని ఆందోళన వ్యక్తం చేశారు. 2001లోనే నెదర్లాండ్స్ కారుణ్యమరణానికి చట్టబద్ధత కల్పించింది. 2022 నాటి లెక్కల ప్రకారం, నెదర్లాండ్స్ మొత్తం మరణాల్లో 5 శాతం కారుణ్య మరణాలే కావడం గమనార్హం. దీంతో ఆత్మహత్యలను ప్రోత్సహిస్తోందంటూ ప్రభుత్వంపై చాలా విమర్శలున్నాయి. -
Empty nest syndrome: పిల్లలు ఎగిరెళ్లాక ఒకరికి ఒకరై
చదువుల కోసమో.. ఉద్యోగాల కోసమో పెళ్లయ్యాక వేరొక చోట ఉండేందుకో పిల్లలు తల్లిదండ్రులను విడిచి వెళతారు. ఆ సమయంలో ఇల్లు ఖాళీ అవుతుంది.. బోసి పోతుంది. తల్లిదండ్రుల జీవితంలో నైరాశ్యం వచ్చే అవకాశం ఉంటుంది. దీనినే ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటారు. ఈ సమయంలో భార్యను భర్త, భర్తను భార్య పట్టించుకోకపోతే, కొత్త జీవితం మొదలుపెట్టకపోతే అనేక సమస్యలు వస్తాయంటున్నారు నిపుణులు. తల్లిదండ్రులు ఏం చేయాలి? కేస్ స్టడీ 1: దీపావళి పండగ వచ్చింది. అపార్ట్మెంట్లో అందరూ టపాకాయలు కాలుస్తున్నారు. కాని మూర్తి గారు, ఆయన భార్య సరళ గారు మాత్రం కిందకు రాలేదు. సరదాకైనా నిలబడలేదు. మామూలుగా ప్రతి సంవత్సరం వాళ్లు బోలెడన్ని టపాకాయలు కాలుస్తారు. సందడి చేస్తారు. ఈసారి అస్సలు తలుపులే తీయలేదు. కారణం? ఆరు నెలల క్రితమే వాళ్ల ఒక్కగానొక్క కొడుకు ఎం.ఎస్. చేయడానికి యు.ఎస్. వెళ్లాడు. అప్పటి నుంచి వారిలో ఒక రకమైన నిర్లిప్తతను అపార్ట్మెంట్ వాసులు గమనిస్తున్నారు. చివరకు ఆ నిర్లిప్తత పండగల మీద కూడా ఆసక్తిని కోల్పోయేలా చేసింది. కేస్ స్టడీ 2: యాభై ఏళ్ల సీతాదేవికి విపరీతంగా కాలు నొప్పి వస్తోంది. భర్త జానకిరామ్ ఆమెను అన్ని హాస్పిటళ్లకు తిప్పాడు. కాల్లో ఏ సమస్యా లేదు. ఏదైనా ఆందోళన వల్ల వస్తున్న సైకలాజికల్ నొప్పేమోనని డాక్టర్లు అంటున్నారు. సీతాదేవి, జానకిరామ్‌లకు కూతురు, కొడుకు. మొదట కూతురు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్లింది. కొడుకు చదువుకుంటానని స్వీడన్ వెళ్లాడు. అప్పటి నుంచి ఆమెకు తెలియని ఆందోళన. ఒంటరితనం. దిగులు. భర్త ఏదైనా కాలక్షేపం కోసం బయటకు వెళ్లినా ఆమెకు దిగులు ముంచుకొస్తోంది. పిల్లలు లేని ఇల్లు ఆమెకు ఎంతకాలానికీ అలవాటు కావడం లేదు. ‘నెస్ట్’ అంటే గూడు. పిల్లలు లేని గూడు ఎంత లేదన్నా బోసి పోతుంది. తల్లిదండ్రులు... వారు లేని వెలితితో ఇంట్లో మిగులుతారు. ఆ సమయంలో వారిలో అనేక రకాలైన మానసిక సంచలనాలు వస్తాయి. అటువంటి సందర్భాన్ని మానసిక నిపుణులు ‘ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్’ అంటున్నారు. పాశ్చాత్య దేశాలలో పిల్లలను విడి గదుల్లో ఉంచి పెంచడం అలవాటు. 18 ఏళ్లు రాగానే వారు దూరమవుతారనే మానసిక సంసిద్ధతతో ఉంటారు. భారతీయులు మాత్రం పిల్లలను తమ వద్దే పడుకోబెట్టుకుంటారు. వారికి ఎంత వయసొచ్చినా వారు తమతో లేదా వారి వెంట తాము ఉండాలనుకుంటారు. అలాంటిది చదువు, ఉద్యోగాలు, పెళ్లి చేసుకొని విడి కాపురం పెట్టడాలు లేదా వేరే చోట స్థిరపడటాలు జరిగినప్పుడు ఒక ఖాళీతనం వారిని ఇబ్బంది పెడుతుంది. దానికి అడ్జస్ట్ కావడానికి టైమ్ పడుతుంది. అలాంటి సందర్భంలో తల్లిదండ్రులు కాస్తా భార్యాభర్తలుగా మారి ఒకరికి ఒకరై కనిపెట్టుకోవాలని నిపుణులు అంటున్నారు. ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ ప్రతికూలతలు: ⇒ పిల్లల గురించి ఆందోళన... వారితో మానసిక ఎడబాటు వస్తుందేమోనన్న భయం ⇒ ఒంటరితనం ఫీల్ కావడం ⇒ సంతోషంగా ఉండలేకపోవడం ⇒ కలత నిద్ర ⇒ జీవితానికి అర్థమేమిటి అనే సందేహం ఎంప్టీ నెస్ట్ సిండ్రోమ్ అనుకూలతలు: ⇒ బోలెడంత ఖాళీ టైమ్ రావడం ⇒ బాధ్యతలు లేని స్వేచ్ఛ ⇒ స్వీయ ఇష్టాలు నెరవేర్చుకునే వీలు ⇒ కొత్తగా ఏదైనా చేద్దాం అనే ఉత్సాహం అయితే తమ మానసిక సామర్థ్యాన్ని బట్టి అనుకూలతలను తీసుకోవాలా ప్రతికూలతలతో కుంగిపోవాలా అనేది తేల్చుకుని ప్రతికూలతలను జయించి ముందుకు సాగాలి. కొత్త జీవితం: అన్నింటి కంటే మించి అంతవరకూ తల్లిదండ్రులుగా ఎక్కువ మసలినవారు పిల్లలు స్థిరపడ్డాక మళ్లీ భార్యాభర్తలుగా మారతారు. ఆ సమయంలో ఇద్దరూ ఇంట్లో ఎక్కువ సేపు గడిపే వీలు చిక్కుతుంది. దాంతో ఒకరితో ఒకరు అనుబంధం పెంచుకోవచ్చు. కాని సాధారణంగా ఒకరిని మరొకరు భూతద్ధంలో చూస్తూ పాత నష్టాలనూ, తొక్కిపెట్టిన పాత ఫిర్యాదులనూ బయటకు తీస్తే జీవితం దారుణంగా మారుతుందని హెచ్చరిస్తున్నారు నిపుణులు. ఈ సమయంలోనే భార్యను భర్త, భర్తను భార్య ఎక్కువగా అర్థం చేసుకోవాలి... స్నేహంగా ఉండాలి... పరస్పరం కలిసి యాత్రలు, విహారాలు, బంధుమిత్రులను కలవడం, ఏదైనా హాబీని అలవర్చుకోవడం, వాకింగ్ గ్రూపుల్లో చేరడం, ఇష్టమైన సినిమాలు చూడటం, జీవితంలో గడిచిన మంచి విషయాలు గుర్తుకు చేసుకోవడం, ఒకప్పుడు ఇవ్వలేని సమయాన్ని ఇప్పుడు ఇవ్వడం చేయాలి. ఈ సమయంలో పరస్పర భద్రత కూడా ముఖ్యమే కాబట్టి దానికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఆర్థికపరమైన సౌలభ్యం ఉంటే అందాక తీరని ముచ్చట్లను తీర్చుకోవడం కూడా మంచి వ్యాపకమే. జీవితంలో పిల్ల లకు ఇవ్వదగ్గ ప్రేమంతా ఇచ్చాం... ఇప్పుడు పరస్పరం ప్రేమను పంచుకుందాం అనే భావన అత్యంత ముఖ్యమైనది ఈ ‘ఎంప్టీ నెస్ట్’ కాలంలో. ఈ జాగ్రత్తలు తీసుకుంటే బెంగ ఉండదు. పిల్లలు ఫోన్ చేసినప్పుడు అలాంటి తల్లిదండ్రుల గొంతులో తప్పక సంతోషాన్ని వింటారు. ఆ సంతోషమే పిల్లలకు గొప్ప కానుక. -
విపరీతమైన మూడ్ స్వింగ్స్.. బైపోలార్ డిజార్డర్‌కి కారణం అదేనా?
గోపీనాథ్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ప్రాజెక్ట్ మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతని భార్య సునీత కూడా అదే కంపెనీలో పనిచేస్తోంది. ఇద్దరు పిల్లలు. హైదరాబాద్ శివార్లలోని గేటెడ్ కమ్యూనిటీలో ప్రశాతంగా ఉంటున్నారు. అయితే ఇటీవలి కాలంలో గోపీనాథ్ ప్రవర్తనలో విపరీతమైన మార్పు కనిపిస్తోంది. తాను చేస్తున్న జాబ్ తన సామర్థ్యానికి ఏమాత్రం సరిపోనిదని, త్వరలోనే తాను సొంత కంపెనీ మొదలుపెట్టి బిల్ గేట్స్‌తో పోటీ పడతానని చెప్తున్నాడు. మొదట్లో సునీత.. సరదాగా అంటున్నాడనుకుంది. కానీ ఒకరోజు హఠాత్తుగా ఉద్యోగానికి రాజీనామా చేసేశాడు. అదేంటని అడిగితే కంపెనీ మొదలు పెడుతున్నానని చెప్పాడు. స్నేహితులు కొందరిని కూడగట్టుకుని కంపెనీ మొదలుపెట్టాడు. దానికోసం పలుమార్లు అమెరికా, ఇంగ్లండ్, కెనడా, ఆస్ట్రేలియా తిరిగి వచ్చాడు. ఆ క్రమంలో సేవింగ్స్ అన్నీ ఖర్చుపెట్టేశాడు. కూడగట్టుకున్న ఆస్తులు కూడా అమ్మేశాడు. స్నేహితులతో పెట్టుబడులు పెట్టించాడు. అతనూ భారీగా అప్పులు చేశాడు. సునీత వారిస్తున్నా, గొడవపడినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఆర్నెల్ల తర్వాత గోపీనాథ్ ప్రవర్తన అకస్మాత్తుగా మారిపోయింది. కంపెనీ ఆలోచన పక్కకు పడేశాడు. ఎక్కడికీ వెళ్లడంలేదు, ఎవ్వరితోనూ కలవడం లేదు. తన గదిలో కూర్చుని దిగులు పడుతున్నాడు. సమస్య ఏమిటని సునీత అడిగినా సమాధానం లేదు. ఈ దశలో ఫ్రెండ్స్ సలహా మేరకు అతన్ని కౌన్సెలింగ్‌కి తీసుకువచ్చింది సునీత. విపరీతమైన మూడ్ స్వింగ్స్.. గోపీనాథ్ బైపోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని మొదటి సెషన్లోనే అర్థమైంది. సైకో డయాగ్నసిస్ అనంతరం అది నిర్ధారణైంది. వెంటనే సైకో ఎడ్యుకేషన్, సైకోథెరపీ ప్రారంభించి, మందులకోసం సైకియాట్రిస్ట్‌కి రిఫర్ చేశాను. విపరీతమైన మూడ్ స్వింగ్స్ ఈ వ్యాధి లక్షణం. మేనియా ఎపిసోడ్లో ప్రపంచాన్ని జయిస్తాం, కొండలనైనా పిండి చేస్తామనే ఉత్సాహం చూపిస్తారు. డిప్రెసివ్ ఎపిసోడ్లో అంతా కోల్పోయినట్లు, ఇక జీవితమే లేనట్లు బాధపడుతుంటారు. ఈ స్వింగ్స్ అరుదుగా జరగొచ్చు లేదా తరచుగా జరగవచ్చు. వాటి తీవ్రత కూడా వ్యక్తికీ వ్యక్తికీ మారుతుంటుంది. సాధారణంగా టీనేజ్‌లో ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఏ వయసులోనైనా రావచ్చు. బైపోలార్ డిజార్డర్‌కి కచ్చితమైన కారణం తెలియదు. కానీ ఈ డిజార్డర్ ఉన్నవారి మెదడులో మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే ఈ డిజార్డర్‌తో ఉన్న తల్లిదండ్రులు, తోబుట్టువులు, సన్నిహిత బంధువులు గలవారిలో ఈ రుగ్మత కనిపిస్తోంది. అందుకు కారణమయ్యే జీన్స్‌ని కనుగొనడానికి పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. బైపోలార్ లక్షణాలు బైపోలార్ డిజార్డర్‌లో రెండు దశలుంటాయి. మేనియా, డిప్రెషన్. మేనియా దశలో మేనియా, హైపోమేనియా అనే రెండు విభిన్నమైన ఎపిసోడ్స్ ఉంటాయి. మేనిక్ ఎపిసోడ్ లక్షణాలు.. ► అసాధారణ ఉల్లాసం ► పెరిగిన కార్యాచరణ లేదా ఆందోళన ► విపరీతమైన ఆత్మవిశ్వాసం, ఆనందాతిరేకం (యుఫోరియా) ► నిద్ర అవసరం తగ్గిపోవడం ► అసాధారణమైన మాటకారితనం ► రేసుగుర్రాల్లా పరుగెత్తే ఆలోచనలు ► పేలవమైన నిర్ణయాధికారం మేజర్ డిప్రెసివ్ ఎపిసోడ్ లక్షణాలు.. విచారంగా, ఖాళీగా, నిస్సహాయంగా ఉండటం కారణం లేకుండానే ఏడవడం ఏ విషయంలోనూ ఆసక్తి లేకపోవడం డైటింగ్ చేయనప్పటికీ గణనీయంగా బరువు తగ్గడం లేదా పెరగడం, ఆకలి తగ్గడం లేదా పెరగడం నిద్రలేమి లేదా ఎక్కువగా నిద్రపోవడం చంచలత్వం లేదా మందగించిన ప్రవర్తన అలసట లేదా నీరసం విలువ లేని ఫీలింగ్ లేదా తగని అపరాధ భావన. ఆలోచించే సామర్థ్యం లేదా ఏకాగ్రత తగ్గడం ఆత్మహత్య గురించి ఆలోచించడం, ప్లాన్ చేయడం లేదా ప్రయత్నించడం జీవితకాల చికిత్స అవసరం.. ►బైపోలార్ డిజార్డర్ అనేది జీవితకాల పరిస్థితి. ప్రాథమిక చికిత్సలలో లక్షణాలను నియంత్రించడానికి మందులు, సైకోథెరపీ, సైకోఎడ్యుకేషన్, ఫ్యామిలీ కౌన్సెలింగ్, సపోర్ట్ గ్రూప్‌లు ఉంటాయి. ► బైపోలార్ ట్రీట్మెంట్లో మందులు ప్రధానపాత్ర పోషిస్తాయి. సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో క్రమం తప్పకుండా మందులు వాడాల్సి ఉంటుంది. ► బైపోలార్ ఎపిసోడ్లను ప్రేరేపించే ట్రిగ్గర్స్‌ని గుర్తించడంలో కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (ఇఆఖీ) సహాయపడుతుంది. అనారోగ్యకరమైన, ప్రతికూల నమ్మకాలు, ప్రవర్తనలను గుర్తించి, వాటి స్థానంలో ఆరోగ్యకరమైన, సానుకూలమైన వాటితో భర్తీ చేస్తుంది. ► బైపోలార్ గురించి తెలుసుకోవడం, నేర్చుకోవడం, పరిస్థితిని అర్థం చేసుకోవడంలో, బాధితుడికి సపోర్ట్ ఇవ్వడంలో సైకో ఎడ్యుకేషన్ సహాయపడుతుంది. ► ట్రీట్మెంట్ ప్లాన్‌ని పాటించడంలో కుటుంబ సభ్యుల మద్దతు అవసరం. అందుకు ఫ్యామిలీ ఫోకస్డ్ థెరపీ సహాయపడుతుంది. ► నిద్ర, ఆహారం, వ్యాయామం కోసం రోజువారీ దినచర్యను ఇంటర్ పర్సనల్, సోషల్ రిథమ్ థెరపీ (ఐ్క ఖఖీ) ఏర్పాటు చేస్తుంది. మూడ్ మేనేజ్మెంట్కి ఇది సహాయపడుతుంది. -
దేశంలోనే తొలిసారిగా కుంగుబాటుకు శస్త్రచికిత్స!
ముంబై: ముంబై వైద్యులు తొలిసారిగా కుంగుబాటుకు శస్త్రచికిత్స నిర్వహించారు. 2017లో మానసిక ఆరోగ్యచట్టం అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో జరిగిన తొలి డిప్రెషన్ సర్జరీ ఇదేకావడం విశేషం. ఆ్రస్టేలియాకు చెందిన ఓ మహిళ గత 26 ఏళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతోంది. మహారాష్ట్ర మెంటల్ హెల్త్ బోర్డు అనుమతితో జస్లోక్ ఆస్పత్రిలో న్యూరోసర్జన్ డాక్టర్ పరేఖ్ దోషి నేతృత్వంలోని వైద్య బృందం ఆమెకు శస్త్రచికిత్స నిర్వహించింది. దీనిని డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ (డీబీఎస్) సర్జరీ అని అంటారు. పార్కిన్సన్స్ దగ్గర్నుంచి నరాల వ్యవస్థలో లోపాల కారణంగా తలెత్తే వివిధ రకాల వ్యాధులకి డీబీఎస్ శస్త్రచికిత్స ద్వారా నయం చేస్తారు. -
బయటపెట్టండి.. బయటపడండి!
శ్రుతిహాసన్‌లో ఏదో కోల్పోయిన భావన ఇలియానా వారం రోజులు బయటకు రాలేదు దీపికా పదుకోన్ అంతకు ముందులా చలాకీగా లేదు పరిణీతీ చోప్రా వారాల తరబడి బయటకు రాలేదు పాయల్ ఘోష్ పరిస్థితీ ఇంతే సీనియర్ నటి ఖుష్బూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. కారణం... డిప్రెషన్ మన తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నది డిప్రెషన్ వల్లే... నాలుగు రోజుల క్రితం హిందీ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్శ్రుతీహాసన్ ఆత్మహత్యకు కారణం ఇదే.. ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒకటే మాట.. మనసులో బాధ ఉంటే ఆ బాధను బయటపెట్టండి.. డిప్రెషన్ నుంచి బయటపడండి.. శ్రుతీహాసన్, ఇలియానా, దీపికా, పరిణీతి, పాయల్, ఖుష్బూ డిప్రెషన్‌ను తరిమికొట్టారు. ఇప్పుడు హాయిగా ఉన్నారు. ఈ ఆరుగురు నాయికలూ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం. వాళ్లకంటే బలమైనదాన్ని ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు ఖుష్బూ. కథానాయికగా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఓ వెలుగు వెలిగారు. డబ్బు, పేరు రెండూ ఉన్నాయి. కానీ ఖుష్బూని ఏదో సమస్య డిప్రెషన్లోకి నెట్టేసింది. ఆమెకు ఇక జీవితం ఆగిపోయిందనిపించింది. ‘‘జీవితం చాలా చీకటిగా అనిపించింది. సమస్యలను చూడ్డానికి భయపడి నా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా నాకనిపించింది. అన్ని బాధలూ మరచిపోయి నిద్రపోవాలనుకుంటే నా మానసిక స్థితి నన్ను నిద్రపోనివ్వలేదు’’ అని గతాన్ని తలుచుకున్నారు ఖుష్బూ. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట. అయితే తను పడిపోతే చూడాలనుకునేవారిని జయించాలనే పట్టుదల ఆమెను బతికించింది. ‘‘నా మనసుని బాధపెట్టి, నన్ను భయపెట్టి, నన్ను చీకట్లోకి నెట్టాలనుకున్నవాళ్ల కోసం నా అమూల్యమైన జీవితాన్ని ఎందుకు వదలుకోవాలి అనుకున్నాను. వాళ్లకంటే బలమైనదాన్ని అని నిరూపించుకోవాలనుకున్నాను. నా స్నేహితుల సహాయంతో డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’’ అన్నారు ఖుష్బూ. ‘‘ఎవరి జీవితమూ సాఫీగా సాగదు, సమస్యలకు పారిపోకూడదు. మనల్ని ఏ సమస్యా ఏమీ చేయలేనంత బలంగా తయారవ్వాలి’’ అని సలహా ఇచ్చారు ఖుష్బూ. ప్రతి సెకనూ నరకమే ‘ఓం శాంతి ఓం’ అంటూ బాలీవుడ్లో తన కెరీర్‌ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు దీపికా పదుకోన్. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయ్యారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో కూడా పడ్డారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చోవడమే ఆలస్యం అనే సమయంలో ఇద్దరూ విడిపోయారు. తన డిప్రెషన్‌కి ఇదే కారణం అని చెప్పలేదు కానీ ఆ తర్వాత దీపికా మానసికంగా కుంగిపోయారు. ‘‘ఆ సమయంలో ప్రతి సెకను నాకు నరకంలా అనిపించేది. దేని మీదా ఆసక్తి ఉండేది కాదు. కొన్ని రోజులు ఇదే పరిస్థితి. వన్ ఫైన్ డే బతకడం అంటే ఇలా కాదు అనిపించింది. మా అమ్మానాన్నతో మనసు విప్పి మాట్లాడాను. డాక్టర్ని సంప్రదించాను. నా మానసిక ఒత్తిడినంతా పోగొట్టేసుకున్నాను. మన బాధను బయటకు చెప్పాలి. అప్పుడే దాన్ని దూరం చేయగలుగుతాం’’ అన్నారు దీపికా. అంతే కాదు.. ఇలా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారి కోసం ఓ సంస్థ కూడా నడుపుతున్నారామె. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీపికా తన ట్వీటర్లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆత్మహత్య పరిష్కారం కాదు. మెంటల్ హెల్త్ గురించి ఇవాళ చాలామంది బయటకు వచ్చి మాట్లాడటం అభినందనీయం. డిప్రెషన్లో ఉన్నవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు. మీతో పాటు అందరూ ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం నమ్మకం’’ అన్నారు. ఐదేళ్లుగా మానసిక ఒత్తిడి ‘‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’’ అని ఇటీవల పాయల్ ఘోష్ తన ట్వీటర్లో పేర్కొన్నారు. తెలుగు చిత్రాలు ‘ప్రయాణం’, ‘ఊసరవెళ్లి’, ‘మిస్టర్ రాస్కెల్’లో నటించిన ఆమె తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. కెరీర్‌పరమైన కారణాలే పాయల్ మానసిక ఒత్తిడికి కారణం అని తెలుస్తోంది. ‘‘నేను ఐదేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నా. ఒక్కోరోజు బాగా బాధపడేదాన్ని. ఆ సమయంలో ఆత్మహత్య బెటర్ అనిపించేది. మందులు తీసుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారు. డిప్రెషన్లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడితే మంచిది’’ అన్నారు పాయల్. అయితే ఏంటి? గోవా బ్యూటీ ఇలియానా నాలుగైదేళ్ల క్రితం వరకూ టాలీవుడ్లో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ కాలింగ్ అంటూ అక్కడికెళ్లారు. అయితే ఇక్కడ చేసినన్ని సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ ఇలియానాకి అదేం పెద్ద సమస్య కాదు. తన శరీరాకృతిని విమర్శించారు. అది ఇలియానాని మానసికంగా కుంగదీసింది. ఓ వారం అంతా ఇంట్లోనే ఉండిపోయారు. ఆత్మహత్య చేసుకుంటే? అనే ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన ప్రమాదం అని గ్రహించి, తన స్థితి గురించి ఎవరో ఒకరికి చెప్పుకోవాలనుకున్నారు. ఆ టైమ్‌లోనే డాక్టర్ని కలిశారు. ‘ఇలా జరిగిపోతుందేమో’ అని భయపడేకంటే ‘అయితే ఏంటి?’ అనే భావన పెంచుకోవాలని ఆ డాక్టర్ చెప్పిన సలహా ఇలియానాకి బాగా నచ్చింది. ‘‘ఈ ప్రపంచంలో ఏ ఒక్కరినీ మన లుక్స్‌తో కానీ ప్రవర్తనతో కానీ సంతృప్తిపరచలేం. అందుకే మనం మనలా ఉండటం అలవాటు చేసుకోవాలి. నేను నా కోసం బతుకుతున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఎవరో ఏదో అన్నారని మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు’’ అంటున్నారు ఇలియానా. మూడేళ్ల మానసిక ఒత్తిడి చిన్నప్పుడు, సినిమాల్లోకి వచ్చాక శ్రుతీహాసన్ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యారట. అయితే గడచిన మూడేళ్లల్లో ఆమె మానసికంగా చాలా కుంగిపోయారు. ‘‘నా ఒత్తిడి గురించి బయటకు చెప్పడానికి సిగ్గు అనిపించింది. కానీ చెప్పకపోతే ఇవాళ ఇంత హాయిగా ఉండగలిగేదాన్ని కాదు. నా సమస్య చెప్పుకుని మానసిక చికిత్స పొందుతున్నాను. అలా ఒత్తిడి నుంచి దూరం కాగలిగాను. ధ్యానం, యోగా వంటి వాటితో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ‘మెంటల్ ఇల్నెస్’ అనేది బయటకు చెప్పకూడనిది కాదు. చెబితేనే దూరం అవుతుంది’’ అన్నారు శ్రుతీహాసన్. రోజుకి పదిసార్లు ఏడ్చాను మరో భామ పరిణీతీ చోప్రా గురించి చెప్పాలంటే.. 2014–2015 మధ్యకాలంలో పరిణీతి కెరీర్ ఏం బాగాలేదు. ‘దావత్–ఎ–ఇష్క్’, ‘కిల్ దిల్’.. ఇలా వరుసగా ఆమె నటించిన సినిమాలు పరాజయంపాలయ్యాయి. సక్సెస్‌లో ఉన్నవారి డోర్ ముందుకు డేట్స్ లేవన్నా అవకాశాలు వస్తాయి. ఫ్లాప్‌లో ఉన్నవారికి ఆ చాన్స్ ఉండదు. అలా పరిణీతికి అవకాశాలు తగ్గాయి. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద సంస్థలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం, ఇల్లు కొనడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కాదు. ‘‘అప్పుడు వారాల తరబడి ఇంటి నుంచి బయటకు రాలేదు. రోజుకి కనీసం పదిసార్లయినా ఏడ్చేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు’’ అన్నారు పరిణీతి చోప్రా. అయితే తన సోదరుడు, స్టయిలిస్ట్ సహాయంతో ఆమె డిప్రెషన్ నుంచి బయటపడగలిగారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని దగ్గరివాళ్లతో పంచుకోవాలంటున్నారు పరిణీతి. -
బతికించేవారే.. బతకలేక..
జనాలచేత దేవుడిలా పిలిపించుకునే ఆ వృత్తి పట్ల విపరీతమైన మక్కువ.. చిన్నప్పుడే ఎవరైనా నువ్వు ఏం అవుతావని అడిగితే డాక్టర్ అని చెప్పేవారే ఎక్కువ.. అలాంటిది ఇప్పుడు ఎంబీబీఎస్ చదివినవారు దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. లక్షలు పోసి ఎంబీబీఎస్ చదివినా.. పీజీ సీటు రాకపోవడంతో నిరుద్యోగులుగా మిగిలిపోతున్నారు. ఫలితంగా పెళ్లి కూడా కాకపోవడం.. మరోవైపు కన్నవాళ్లకు భారమయ్యామనే ఆవేదనలో కూరుకుపోతున్నారు. దీంతో ఎంతోమందికి ప్రాణాలు పోయాల్సినవారు.. చేజేతులా ప్రాణాలు తీసుకుంటున్నారు. సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌కు చెందిన హర్షకుమార్.. 2017లో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తండ్రి ప్రభుత్వ ఉపాధ్యా యుడు కావడంతో ఎలాగైనా తన కొడుకును డాక్టర్‌గా చూడాలనుకొని హర్షకుమార్‌ను అప్పట్లో రూ.40 లక్షలు అప్పు చేసి మేనేజ్మెంట్ కోటా కింద ఓ ప్రైవేటు మెడికల్ కాలేజీలో చేర్పించాడు. ఎంబీబీఎస్ పూర్తయిన తర్వాత పీజీ సీటు రావడం గగనంగా మారింది. దీంతో అప్పులు, వడ్డీలు పెరుగుతూ వచ్చాయి. పైసా సంపాదన లేదు. దీంతో తండ్రికి భారంగా మారాననే భావనతో హర్షకుమార్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లాకు చెందిన రామచంద్రయ్యకు మెడికల్ షాపు ఉంది. కొడుకు సంజయ్‌కుమార్‌ను డాక్టర్‌గా చూడాలనుకుని మేనేజ్మెంట్ కోటా కింద రూ.50 లక్షలతో ఓ ప్రముఖ ప్రైవేటు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేయించాడు. 2016లో ఎంబీబీఎస్ పూర్తయింది. ఆ తర్వాత సంజయ్‌కుమార్ పీజీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ క్లినికల్ సబ్జెక్టులో సీటు రాలేదు. పైగా తండ్రి అప్పు చేసి చదివించడం, 30 ఏళ్లు దగ్గరవుతున్నా పెళ్లి కాకపోవడంతో గతేడాది ఆ యువ వైద్యుడు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రమేశ్‌బాబు వరంగల్ జిల్లాలో వ్యవసాయం చేస్తాడు. మధ్య తరగతి కుటుంబం. కొడుకు అరవింద్ తెలివైన విద్యార్థి. ఎంసెట్‌లో మంచి ర్యాంకు రావడంతో కన్వీనర్ కోటా కింద సీటు వచ్చింది. ఫీజు తక్కువే కావడంతో కుటుంబం మొత్తం ఎంతో ఆనందపడింది. ఎంతో ఉత్సాహంగా అరవింద్ ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. తర్వాత మెడికల్ పీజీ కోసం రెండేళ్లు కష్టపడ్డాడు. కానీ సీటు రాలేదు. పెళ్లి కూడా కాలేదు. దీంతో అవమాన భారం భరించలేక తీవ్ర డిప్రెషన్‌కు వెళ్లిన అరవింద్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పీజీ సీట్లు చాలా తక్కువ.. రాష్ట్రంలో 23 ప్రభుత్వ, ప్రైవేటు, మైనారిటీ మెడికల్ కాలేజీల్లో 4,900 వరకు ఎంబీబీఎస్ సీట్లున్నాయి. కానీ పీజీ సీట్లు 1,600 మాత్రమే ఉన్నాయి. వాటిల్లో క్లినికల్ సీట్లు వెయ్యి వరకే ఉన్నాయి. మిగిలినవి నాన్ క్లినికల్ సీట్లు. వీటిల్లో ఎవరూ చేరరు. దీంతో వాటిల్లోని అనేక సీట్లు మిగిలిపోతాయి. విదేశాల్లో ఎంబీబీఎస్ పూర్తి చేసి రాష్ట్రానికి వచ్చే విద్యార్థులు మరో వెయ్యికి పైగా ఉంటారు. అంటే ఏడాదికి రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేసే వారు 6 వేల మంది ఉంటారు. ఎంబీబీఎస్ సీట్లతో పోలిస్తే పీజీ సీట్లు మాత్రం ఆరో వంతే ఉన్నాయి. దీంతో ఏటా ఎంబీబీఎస్ చదివిన వారికి పీజీలో సీటు వచ్చే పరిస్థితి లేకుండా పోతోంది. ఎంబీబీఎస్‌తో ప్రైవేటు, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సరైన జీతం లభించట్లేదు. వైద్య నిరుద్యోగులు రాష్టంలో పేరుకుపోతున్నారు. వైద్య ఆరోగ్య శాఖ లెక్కల ప్రకారం దాదాపు 40 వేల మంది ఎంబీబీఎస్ పూర్తి చేసిన విద్యార్థులు రాష్ట్రంలో ఖాళీగా ఉన్నారని అంచనా. దేశవ్యాప్తంగా 32 వేల పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి. వాటి కోసం ఈ ఏడాది నీట్ పరీక్షకు ఏకంగా 1.4 లక్షల మంది ఎంబీబీఎస్ విద్యార్థులు హాజరయ్యారు. పీజీ స్పెషలైజేషన్ లేకపోతే సొంత క్లినిక్ పెట్టుకోవడానికి, కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో పనిచేసేందుకు అవకాశం ఉండదు. పైగా ప్రైవేటు ఆసుపత్రుల్లో ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.15 నుంచి రూ.20 వేల జీతమే ఇస్తారు. డిప్రెషన్లోకి.. పీజీ సీటు రాకపోవడం, ఎంబీబీఎస్ చదువు దేనికీ పనికిరాకపోవడంతో యువ వైద్యులు డిప్రెషన్లోకి వెళ్తున్నారు. దేశవ్యాప్తంగా ప్రతీ రెండు ఎంబీబీఎస్ సీట్లకు ఒక పీజీ సీటు ఉండాలన్న కేంద్ర నిర్ణయం ఆచరణ రూపం దాల్చట్లేదు. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. విదేశాల్లో ఎంబీబీఎస్ చదివిన విద్యార్థుల పరిస్థితి మరీ ఘోరంగా మారింది. వారు అక్కడ ఎంబీబీఎస్ పూర్తి చేసుకుని మన దేశంలో ఎగ్జిట్ అర్హత పరీక్ష పాస్ కావడమే గగనంగా మారింది. 2015–2018 మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 61,500 మంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ పరీక్ష రాశారు. వీరిలో 8,700 మంది మాత్రమే పాసయ్యారు. అంటే కేవలం 14.14 శాతం ఉత్తీర్ణత నమోదైంది. ఎగ్జిట్ పరీక్ష పాసైన వారిలో పీజీ సీటు పొందేవారు 5 శాతం కూడా ఉండట్లేదని కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వర్గాలు అంటున్నాయి. స్తోమత లేకున్నా చదివిస్తున్నారు.. కొందరు తల్లిదండ్రులు తమ ఆర్థిక స్తోమత సహకరించకున్నా వైద్య విద్యపై పిచ్చితో పిల్లలను ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. మేనేజ్మెంట్ సీటుకు రూ.కోటి వరకు పెట్టి చదివించే పరిస్థితి నెలకొంది. భూమి అమ్మడం లేదా అప్పులు చేయడం ద్వారా తమ పిల్లలను చదివిస్తున్నారు. గతంలో ఫీజు మొత్తం ఒకేసారి చెల్లించాలన్న నిబంధన ఉండేది. ఇప్పుడు ఏడాది వాయిదా ఉండటంతో మొదటి ఏడాది ఎలాగోలా చెల్లించి.. రెండో ఏడాది చూద్దాంలే అని చదివిస్తున్నారు. కానీ రెండో సంవత్సరం వచ్చే సరికి ఫీజు చెల్లింపు తలకు మించిన భారం అవుతోంది. తెచ్చిన అప్పుల భారం పెరిగిపోతోంది. కొందరైతే చివరి రెండు వాయిదాలు చెల్లించలేక మధ్యలోనే చదువు మాన్పించేస్తున్నారు. పీజీ కోసం రెండు మూడేళ్లుగా కోచింగ్ తీసుకునే వారెందరో ఉన్నారు. కోచింగ్ ఫీజులు, ఖర్చులు భారంగా మారుతున్నాయి. చివరకు ఫలితం అనుకూలంగా రాకపోవడంతో డిప్రెషన్‌కు లోనవుతున్నారు. కలలు కల్లలవుతున్నాయి: డాక్టర్ కరుణాకర్‌రెడ్డి, వీసీ కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఎంబీబీఎస్ చదివిన విద్యార్థులకు పీజీ సీట్లు రాకపోవడంతో డిప్రెషన్లోకి వెళ్తున్నారు. తల్లిదండ్రులు స్తోమతకు మించి అప్పులు చేసి మేనేజ్మెంట్ సీట్లలో చేర్పించడంతో ఈ పరిస్థితి నెలకొంటోంది. ఎంబీబీఎస్ మేనేజ్మెంట్లో చేశాక, పీజీ మేనేజ్మెంట్ కోటాలో సీటు కొనడం అంటే సాధారణ మధ్య తరగతి వారికి అసాధ్యం. కాబట్టి తల్లిదండ్రులు పిల్లల సామర్థ్యాన్ని గమనించాలి. అప్పులు చేయడం సరికాదు. పీజీ రాకుంటే డిప్రెషన్లోకి: డాక్టర్ విజయేందర్, జూడాల నేత వేలాది మంది అప్పులు చేసి ఎంబీబీఎస్ చదివిన వారు తర్వాత పీజీ రాక డిప్రెషన్లోకి వెళ్తున్నారు. కార్పొరేట్ ప్రైవేటు ఆసుపత్రుల్లో సరైన జీతాలు ఇవ్వట్లేదు. బయట క్లినిక్ పెట్టుకునే అవకాశాల్లేవు. 30 ఏళ్లు దాటుతున్నా పెళ్లి కావట్లేదు. ఇవన్నీ కలిపి యువ వైద్యులను తీవ్ర డిప్రెషన్లోకి నెట్టేస్తున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల్లోని ఖాళీలనూ నింపట్లేదు. -
వెలుగు కచ్చితంగా వస్తుంది
స్క్రీన్‌పై కనిపించినట్టే హీరో హీరోయిన్లు ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించుకుంటారు. అసలు సమస్యలనేవి వస్తే కదా వాళ్లకు అని ఊహించుకోవచ్చు. కానీ కెమెరాను వదిలి బయటకు వస్తే మేమూ సాధారణ మనుషులమే అంటున్నారు దీపికా పదుకోన్. కొంత కాలం క్రితం ఆమె డిప్రెషన్‌కు గురైన సంగతి తెలిసిందే. వెంటనే డాక్టర్లు, కౌన్సిలింగ్ సహాయంతో అందులోనుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఇలా మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లకు సహాయపడాలనే ఉద్దేశంతో ‘లివ్, లవ్, లాఫ్’ అనే సంస్థను ఏర్పాటు చేశారామె. ఈ విషయం మీద మరింత అవగాహన కోసం తన పెళ్లికి కొన్ని రోజుల ముందు ఓ లేఖను ప్రముఖ మేగజీన్ కోసం రాశారు దీపిక. ఆ లేఖలోని సారాంశం ఈ విధంగా... ‘‘2014 వేసవి కాలంలో నేను యాంగై్జటీ (ఆందోళన), క్లినికల్ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు డాక్టర్స్ నిర్ధారించారు. మంచి మంచి డాక్టర్స్ వల్ల వెంటనే కోలుకోగలిగాను. నేను మానసిక ఆందోళనకు గురయ్యాక నాలా బాధపడేవారు లక్షల్లో ఉన్నారని తెలుసుకున్నాను. మానసిక వ్యాధితో ఇబ్బంది పడేవాళ్లు సహాయం తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీడియా ముందు కూడా చెప్పాలనుకున్నాను. ఒత్తిడి, ఆందోళనకు సంబంధించిన వాటి మీద అవగాహన కోసం జూన్ 2015లో ‘లివ్, లవ్, లాఫ్’అనే సంస్థను ఏర్పాటు చేశాను. మానసిక వ్యాధి చుట్టూ ఉన్న అపోహలను తొలగించాలనుకున్నాను. మానసిక ఇబ్బందుల నుంచి బయటపడిన వాళ్ల ద్వారా ‘నాట్ షేమ్డ్’ అనే క్యాంపైన్ నడిపిస్తున్నాం. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఎవ్వరికైనా కనుచూపు మేరలో చీకటి మాత్రమే కనిపిస్తుందంటే వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే... మీరు ఒంటరిగా లేరు. సహాయం అనేది కచ్చితంగా లభిస్తుంది. స్టీఫెన్ ఫ్రై మాటల్లో చెప్పాలంటే... వెలుగు అనేది కచ్చితంగా వస్తుంది’’ అంటాను.లివ్, లవ్, లాఫ్ దీపికా పదుకోన్. -
డిప్రెషన్ గుట్టు తెలిసింది!
లండన్: డిప్రెషన్‌తో సంబంధముండే దాదాపు 80 కొత్త జన్యువులను బ్రిటన్‌లోని ఎడిన్బర్గ్ విశ్వవిద్యాలయ పరిశోధకులు గుర్తించారు. ఈ జన్యువుల స్వభావం పూర్తిగా అర్థం చేసుకోవడం ద్వారా మానసిక రోగాలకు కొత్త ఔషధాలను కనుగొనేందుకు వీలు కల్గుతుందని పరిశోధకులు చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా సామర్థ్యలేమి పెరగడానికి ప్రధానకారణం మనోవేదన అని ప్రఖ్యాత ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమైన ఓ అధ్యయనం పేర్కొంది. -
హెపటైటిస్-సి మందులతో తగ్గుతుందా?
హోమియో కౌన్సెలింగ్ మా అమ్మాయి వయసు 24 ఏళ్లు. గత ఆర్నెల్లుగా పరధ్యానంగా ఉంటోంది. ఎవరితోనూ సరిగా మాట్లాడటం లేదు. ఒంటరిగా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటోంది. ఆమెకు సరైన హోమియో మందు సూచించండి. - సరళ, చెన్నై మీరు చెబుతున్న లక్షణాలు డిప్రెషన్ వ్యాధిని సూచిస్తున్నాయి. డిప్రెషన్‌ను మనసుకు సంబంధించిన ఒక రకమైన రుగ్మతగా పేర్కొనవచ్చు. దీనికి గురైన వారు విచారం, నిస్సహాయత, అపరాధభావం, నిరాశలలో ఉంటారు. భావోద్వేగాలు సహజంగా మారుతుంటాయి. శారీరకంగానూ కొన్ని మార్పులు కనిపిస్తాయి. ఒక వ్యక్తి అకస్మాత్తుగా బరువు కోల్పోవడం లేదా పెరగడం, చికాకు పడుతుండటం వంటి లక్షణాలు కనిపిస్తాయి. కొందరు నిర్దిష్టంగా కొన్ని కాలాలలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశం ఉంది. ఈ వ్యాధితో బాధపడేవారు పూర్తి డిప్రెషన్లోకి కూరుకుపోయేలోపే చికిత్స అందించడం మంచిది. హోమియో విధానంలో దీనికి పరిపూర్ణ చికిత్స ఉంది. డిప్రెషన్‌ను 1950-60లలో రెండు రకాలుగా విభజించారు. ఒకటి వంశపారంపర్యంగా వచ్చేది. రెండోది న్యూరోటిక్ డిప్రెషన్. ఇవి... మన చుట్టూ ఉండే వాతావరణం, సంఘంలో అసమానతలు, ఉద్యోగం కోల్పోవడం, ఎవరైనా దగ్గరివాళ్లు దూరం కావడం లేదా చనిపోవడం, తీవ్రస్థాయి మానసిక వేదన... వంటి ఎన్నో అంశాల వల్ల రావచ్చు. వివిధ పరిశోధనల ద్వారా ఈ ఆధునిక కాలంలో దీన్ని డిప్రెసివ్ డిజార్డర్‌గా పేర్కొన్నారు. దీనిలో రకాలు : మేజర్ డిప్రెషన్ : ఇందులో డిప్రెషన్ లక్షణాలు తీవ్రస్థాయిలో ఉంటాయి. ఆకలి లేకపోవడం, నిద్రలేకపోవడం, పనిలో శ్రద్ధ లేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. డిస్థిమిక్ డిజార్డర్: రోగి తక్కువస్థాయి డిప్రెషన్లో దీర్ఘకాలం పాటు ఉంటాడు. అయితే కొన్నిసార్లు రోగి నార్మల్‌గా ఉన్నట్లుగా అనిపించి, తిరిగి డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తాయి. సైకియాటిక్ డిప్రెషన్ : డిప్రెషన్‌తో పాటు భ్రాంతులు కూడా కనిపిస్తుంటాయి. పోస్ట్ నేటల్ డిప్రెషన్: మహిళల్లో ప్రసవం తర్వాత దీని లక్షణాలు కనిపిస్తుంటాయి. సీజనల్ ఎఫెక్టివ్ డిప్రెషన్ : సూర్యరశ్మి తగ్గడం వల్ల కొంతమందిలో సీజనల్‌గా డిప్రెషన్ లక్షణాలు కనిపిస్తుంటుంది. బైపోలార్ డిజార్డర్: ఈ డిప్రెషన్లో కొంతమంది పిచ్చిగా, కోపంగా, విపరీతమైన ప్రవర్తనను కనబరుస్తుంటారు. కొంత ఉద్రేకం తర్వాత నార్మల్ అయిపోతారు. హోమియో వైద్యవిధానంలో నేట్రమ్మూర్, ఆరమ్‌మెట్, సెపియా, ఆర్సినిక్ ఆల్బ్, సిమిసిఫ్యూగో వంటి మందులు డిప్రెషన్ తగ్గించడానికి బాగా పనిచేస్తాయి. డాక్టర్ మురళి కె. అంకిరెడ్డి ఎండీ (హోమియో), స్టార్ హోమియోపతి, హైదరాబాద్ వాస్క్యులర్ కౌన్సెలింగ్ నా వయసు 46 ఏళ్లు. వృత్తిరీత్యా ఎక్కువగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ఇటీవల నేను నడిచేటప్పుడు పాదాలలో, పిక్కల్లో నొప్పి ఎక్కువగా వస్తోంది. నడుస్తుంటే కండరాలు పట్టేసినట్లుగా ఉండి, నడకలో ఇబ్బంది అనిపిస్తోంది. కొంతదూరం నడవగానే కొద్దిసేపు ఆగాల్సి వస్తోంది. ‘అదే తగ్గిపోతుందిలే’ అని వేచిచూశాను. కానీ మూడు నెలలుగా ఆ నొప్పి తగ్గకపోగా రోజురోజుకూ క్రమంగా పెరుగుతోంది. దయచేసిన నా సమస్యకు కారణమేమిటో తెలిపి, సరైన పరిష్కారం చూపించగలరు. - డి. నాగేశ్వరరావు, కర్నూలు మీరు తెలిపిన వివరాలను బట్టి కాలిలోని రక్తనాళాలలో పూడిక ఉన్నట్లు తెలుస్తోంది. పూడిక ఏర్పడటం వల్ల వచ్చే నొప్పిని పెరిఫెరల్ వాస్క్యులర్ డిసీజ్ (పీవీడీ) అంటారు. మీకు మొదటిసారి ఈ సమస్య వచ్చిందా లేక ఇది వరకు ఉన్న సమస్య మళ్లీ కనిపిస్తోందా అనే వివరాలు మీరు తెలపలేదు. మీరు ఎక్కువగా ప్రయాణాలు చేయడంతో పాటు సిగరెట్ తాగడం వంటి అలవాటు ఉంటే త్వరగా ఈ సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉంటుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు, అధిక బరువు ఉన్నవారు, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లు లేనివారిలో ఈ తరహా సమస్యలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సాధారణంగా కాళ్లకు రక్తసరఫరా తగ్గడం వల్ల ఈ నొప్పి వస్తుంది. రక్తనాళాల్లో పూడికలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసుకునేందుకు కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. కాళ్లలో రక్తప్రవాహాన్ని తెలుసుకోవడం ద్వారా పీవీడీని అంచనా వేయవచ్చు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఆధారపడి ఉంటుంది. మీరు తాజా కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకోవడంతో పాటు ప్రతి రోజూ వాకింగ్ చేయడం మంచిది. అలాగే దూరప్రయాణాలు చేసే సమయంలో కాలి వ్యాయామాలు చేయడం మంచిది. ఇలా చేయడం రక్తనాళాల్లో పూడిక ఏర్పడకుండా ఉండటానికి దోహదపడుతుంది. సిగరెట్, గుట్కా, పాన్ వంటి పొగాకును నమిలే అలవాటు ఉండే వెంటనే మానేయండి. వీలైనంత త్వరగా వైద్యులను సంప్రదించి సరైన పరీక్షలు చేయించుకోండి. నిర్లక్ష్యం చేస్తే వ్యాధి మరింత పెరిగే అవకాశం ఉంది. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ, తగిన చికిత్స తీసుకుంటే మీ సమస్యను సులువుగా అధిగమించవచ్చు. డాక్టర్ దేవేందర్ సింగ్ సీనియర్ వాస్క్యులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్, సోమాజిగూడ, హైదరాబాద్ గ్యాస్ట్రోఎంటరాలజీ కౌన్సెలింగ్ మా నాన్నగారికి హెచ్‌సీవీ వచ్చింది. ముందు కామెర్లు వచ్చాయి. వైద్యపరీక్షలు, స్కానింగ్ తర్వాత హెచ్‌సీవీ జీనోటైప్ 3 అని చెప్పారు. ఇటీవలే నెల క్రితం మళ్లీ పరీక్షలు చేయిస్తే లివర్ సిర్రోసిస్, కాలేయం కుడితమ్మె కుంచించుకుపోయిందనీ (రైట్లోబ్ ష్రంకెన్), లెఫ్ట్ లోబ్ ఎన్లార్జ్ అయిందనీ చెప్పారు. కామెర్లు తగ్గాయి కదా అని మా నాన్నగారికి ఫ్యాటీ ఫుడ్ పెట్టాం. దాంతో ఈ సమస్య వచ్చిందా? గత 20 రోజులుగా ఫ్యాటీ ఫుడ్ మానేసి, అంతా ఉడికించిన ఆహారమే (ఉప్పు లేకుండా) ఇస్తున్నాం. ఆయనకు హెచ్‌సీవీ, లివర్ సిర్రోసిస్ మందులతో తగ్గుతుందా? - మాతాశ్రీ, ఈ-మెయిల్ మీరు తెలిపిన వివరాలను బట్టి చూస్తే మీ నాన్నగారికి హెపటైటిస్-సి వ్యాధి వల్ల సిర్రోసిస్ వచ్చినట్లుగా తెలుస్తోంది. సాధారణంగా లివర్ సిర్రోసిస్ వల్ల వచ్చే కామెర్లు చాలావరకు నయం కావు. ఇప్పుడు మీరు లివర్ సిర్రోసిస్ ఏ దశలో ఉందో తెలుసుకోవడం అవసరం. అందుకోసం తప్పనిసరిగా డాక్టర్‌ను కలిసి, హెపటైటిస్-సి కి సంబంధించిన పరీక్షలు చేయించుకొని, తగిన మందులు వాడాల్సి ఉంటుంది. డాక్టర్ల పర్యవేక్షణలో మందులు వాడితే, హెపటైటిస్-సి వ్యాధిని అదుపులో పెట్టవచ్చు. నా వయసు 65 ఏళ్లు. డయాబెటిస్తో బాధపడుతున్నాను. కిడ్నీలు కూడా సరిగా పనిచేయడం లేదు. గత ఆర్నెల్లుగా డయాలసిస్ చేయించుకుంటున్నాను. కడుపులో నొప్పి, వాంతులు అవుతుంటే ఎండోస్కోపీ చేశారు. గ్యాస్ట్రయిటిస్ ఉందని చెప్పారు. ఈ వ్యాధి తగ్గడానికి మందులు వాడవచ్చా? వాటి వల్ల కిడ్నీలు ఇంకా దెబ్బతినే అవకాశం ఉందా? - సిహెచ్. సుబ్బారావు, ఒంగోలు మీరు డయాబెటిస్ నెఫ్రోపతీ, గ్యాస్ట్రయిటిస్ సమస్యలతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం క్రమం తప్పకుండా డయాలసిస్ చేయించుకోవాల్సిన దశలో ఉన్నారు. అంటే మూత్రపిండాలు పూర్తిగా చెడిపోయి ఉన్నాయి. మీకు గ్యాస్ట్రయిటిస్ వల్ల వస్తున్న కడుపులో నొప్పి తగ్గాలంటే ఇప్పుడు వాడుతున్న అల్సర్ మందులు వాడండి. వీటిని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అంటారు. ఈ మాత్రలు కిడ్నీ ఫెయిల్ అయిన వారికి కూడా ఇవ్వవచ్చు. అవి చాలా సురక్షితం. కాబట్టి మీరు ఎలాంటి ఆందోళన లేకుండా డాక్టర్ ఇచ్చిన మందులు వాడండి. డాక్టర్ భవానీరాజు, సీనియర్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్