శ్రుతిహాసన్‌లో ఏదో కోల్పోయిన భావన
ఇలియానా వారం రోజులు బయటకు రాలేదు
దీపికా పదుకోన్ అంతకు ముందులా చలాకీగా లేదు
పరిణీతీ చోప్రా వారాల తరబడి బయటకు రాలేదు
పాయల్ ఘోష్ పరిస్థితీ ఇంతే
సీనియర్ నటి ఖుష్బూ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు.
కారణం... డిప్రెషన్
మన తెలుగు హీరో ఉదయ్ కిరణ్ ఆత్మహత్య చేసుకున్నది డిప్రెషన్ వల్లే...
నాలుగు రోజుల క్రితం హిందీ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌శ్రుతీహాసన్ ఆత్మహత్యకు కారణం ఇదే..
ఇప్పుడు అన్ని ఫిల్మ్ ఇండస్ట్రీల్లో ఒకటే మాట..
మనసులో బాధ ఉంటే ఆ బాధను బయటపెట్టండి..
డిప్రెషన్ నుంచి బయటపడండి..
శ్రుతీహాసన్, ఇలియానా, దీపికా, పరిణీతి, పాయల్, ఖుష్బూ డిప్రెషన్‌ను తరిమికొట్టారు.
ఇప్పుడు హాయిగా ఉన్నారు.
ఈ ఆరుగురు నాయికలూ డిప్రెషన్ నుంచి ఎలా బయటపడ్డారో తెలుసుకుందాం.
వాళ్లకంటే బలమైనదాన్ని
ఉత్తరాది నుంచి దక్షిణాదికి వచ్చారు ఖుష్బూ. కథానాయికగా తెలుగు, తమిళ్, ఇతర భాషల్లో ఓ వెలుగు వెలిగారు. డబ్బు, పేరు రెండూ ఉన్నాయి. కానీ ఖుష్బూని ఏదో సమస్య డిప్రెషన్‌లోకి నెట్టేసింది. ఆమెకు ఇక జీవితం ఆగిపోయిందనిపించింది. ‘‘జీవితం చాలా చీకటిగా అనిపించింది. సమస్యలను చూడ్డానికి భయపడి నా కళ్లకు గంతలు కట్టుకున్నట్లుగా నాకనిపించింది. అన్ని బాధలూ మరచిపోయి నిద్రపోవాలనుకుంటే నా మానసిక స్థితి నన్ను నిద్రపోనివ్వలేదు’’ అని గతాన్ని తలుచుకున్నారు ఖుష్బూ. అప్పుడు ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారట.
అయితే తను పడిపోతే చూడాలనుకునేవారిని జయించాలనే పట్టుదల ఆమెను బతికించింది. ‘‘నా మనసుని బాధపెట్టి, నన్ను భయపెట్టి, నన్ను చీకట్లోకి నెట్టాలనుకున్నవాళ్ల కోసం నా అమూల్యమైన జీవితాన్ని ఎందుకు వదలుకోవాలి అనుకున్నాను. వాళ్లకంటే బలమైనదాన్ని అని నిరూపించుకోవాలనుకున్నాను. నా స్నేహితుల సహాయంతో డిప్రెషన్ నుంచి బయటపడ్డాను’’ అన్నారు ఖుష్బూ. ‘‘ఎవరి జీవితమూ సాఫీగా సాగదు, సమస్యలకు పారిపోకూడదు. మనల్ని ఏ సమస్యా ఏమీ చేయలేనంత బలంగా తయారవ్వాలి’’ అని సలహా ఇచ్చారు ఖుష్బూ.
ప్రతి సెకనూ నరకమే
‘ఓం శాంతి ఓం’ అంటూ బాలీవుడ్‌లో తన కెరీర్‌ని చాలా ప్రశాంతంగా మొదలుపెట్టారు దీపికా పదుకోన్. తక్కువ సమయంలో స్టార్ హీరోయిన్ అయ్యారు. బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్‌తో ప్రేమలో కూడా పడ్డారు. ఇక పెళ్లి పీటల మీద కూర్చోవడమే ఆలస్యం అనే సమయంలో ఇద్దరూ విడిపోయారు. తన డిప్రెషన్‌కి ఇదే కారణం అని చెప్పలేదు కానీ ఆ తర్వాత దీపికా మానసికంగా కుంగిపోయారు.
‘‘ఆ సమయంలో ప్రతి సెకను నాకు నరకంలా అనిపించేది. దేని మీదా ఆసక్తి ఉండేది కాదు. కొన్ని రోజులు ఇదే పరిస్థితి. వన్ ఫైన్ డే బతకడం అంటే ఇలా కాదు అనిపించింది. మా అమ్మానాన్నతో మనసు విప్పి మాట్లాడాను.
డాక్టర్‌ని సంప్రదించాను. నా మానసిక ఒత్తిడినంతా పోగొట్టేసుకున్నాను. మన బాధను బయటకు చెప్పాలి. అప్పుడే దాన్ని దూరం చేయగలుగుతాం’’ అన్నారు దీపికా. అంతే కాదు.. ఇలా డిప్రెషన్‌తో బాధపడుతున్నవారి కోసం ఓ సంస్థ కూడా నడుపుతున్నారామె. సుశాంత్ సింగ్ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో దీపికా తన ట్వీటర్‌లో ఓ పోస్ట్ పెట్టారు. ‘‘ఆత్మహత్య పరిష్కారం కాదు. మెంటల్ హెల్త్ గురించి ఇవాళ చాలామంది బయటకు వచ్చి మాట్లాడటం అభినందనీయం. డిప్రెషన్‌లో ఉన్నవాళ్లు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఒంటరి కాదు. మీతో పాటు అందరూ ఉన్నారు. అన్నింటికన్నా ముఖ్యం నమ్మకం’’ అన్నారు.
ఐదేళ్లుగా మానసిక ఒత్తిడి
‘‘నేను ఐదేళ్లుగా మానసిక వేదనతో బాధపడుతున్నా’’ అని ఇటీవల పాయల్ ఘోష్ తన ట్వీటర్‌లో పేర్కొన్నారు. తెలుగు చిత్రాలు ‘ప్రయాణం’, ‘ఊసరవెళ్లి’, ‘మిస్టర్ రాస్కెల్’లో నటించిన ఆమె తమిళ్, కన్నడ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాల్లో నటించారు. ఇప్పుడు ఓ హిందీ సినిమా చేస్తున్నారు. కెరీర్‌పరమైన కారణాలే పాయల్ మానసిక ఒత్తిడికి కారణం అని తెలుస్తోంది. ‘‘నేను ఐదేళ్లుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నా. ఒక్కోరోజు బాగా బాధపడేదాన్ని. ఆ సమయంలో ఆత్మహత్య బెటర్ అనిపించేది. మందులు తీసుకుంటున్నా. నా కుటుంబ సభ్యులు, స్నేహితులు అండగా నిలబడుతున్నారు. డిప్రెషన్‌లో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడితే మంచిది’’ అన్నారు పాయల్.
అయితే ఏంటి?
గోవా బ్యూటీ ఇలియానా నాలుగైదేళ్ల క్రితం వరకూ టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. బాలీవుడ్ కాలింగ్ అంటూ అక్కడికెళ్లారు. అయితే ఇక్కడ చేసినన్ని సినిమాలు చేయలేకపోతున్నారు. కానీ ఇలియానాకి అదేం పెద్ద సమస్య కాదు. తన శరీరాకృతిని విమర్శించారు. అది ఇలియానాని మానసికంగా కుంగదీసింది. ఓ వారం అంతా ఇంట్లోనే ఉండిపోయారు. ఆత్మహత్య చేసుకుంటే? అనే ఆలోచన మొదలైంది. ఈ ఆలోచన ప్రమాదం అని గ్రహించి, తన స్థితి గురించి ఎవరో ఒకరికి చెప్పుకోవాలనుకున్నారు.
ఆ టైమ్‌లోనే డాక్టర్‌ని కలిశారు. ‘ఇలా జరిగిపోతుందేమో’ అని భయపడేకంటే ‘అయితే ఏంటి?’ అనే భావన పెంచుకోవాలని ఆ డాక్టర్ చెప్పిన సలహా ఇలియానాకి బాగా నచ్చింది. ‘‘ఈ ప్రపంచంలో ఏ ఒక్కరినీ మన లుక్స్‌తో కానీ ప్రవర్తనతో కానీ సంతృప్తిపరచలేం. అందుకే మనం మనలా ఉండటం అలవాటు చేసుకోవాలి. నేను నా కోసం బతుకుతున్నాను. నన్ను నేను ఇష్టపడుతున్నాను. ఎవరో ఏదో అన్నారని మన జీవితాన్ని పాడు చేసుకోకూడదు’’ అంటున్నారు ఇలియానా.
మూడేళ్ల మానసిక ఒత్తిడి
చిన్నప్పుడు, సినిమాల్లోకి వచ్చాక శ్రుతీహాసన్ కొన్ని సందర్భాల్లో ఒత్తిడికి గురయ్యారట. అయితే గడచిన మూడేళ్లల్లో ఆమె మానసికంగా చాలా కుంగిపోయారు. ‘‘నా ఒత్తిడి గురించి బయటకు చెప్పడానికి సిగ్గు అనిపించింది. కానీ చెప్పకపోతే ఇవాళ ఇంత హాయిగా ఉండగలిగేదాన్ని కాదు. నా సమస్య చెప్పుకుని మానసిక చికిత్స పొందుతున్నాను. అలా ఒత్తిడి నుంచి దూరం కాగలిగాను. ధ్యానం, యోగా వంటి వాటితో మానసిక ప్రశాంతత లభిస్తోంది. ‘మెంటల్ ఇల్‌నెస్’ అనేది బయటకు చెప్పకూడనిది కాదు. చెబితేనే దూరం అవుతుంది’’ అన్నారు శ్రుతీహాసన్.
రోజుకి పదిసార్లు ఏడ్చాను
మరో భామ పరిణీతీ చోప్రా గురించి చెప్పాలంటే.. 2014–2015 మధ్యకాలంలో పరిణీతి కెరీర్ ఏం బాగాలేదు. ‘దావత్–ఎ–ఇష్క్’, ‘కిల్ దిల్’.. ఇలా వరుసగా ఆమె నటించిన సినిమాలు పరాజయంపాలయ్యాయి. సక్సెస్‌లో ఉన్నవారి డోర్ ముందుకు డేట్స్ లేవన్నా అవకాశాలు వస్తాయి. ఫ్లాప్‌లో ఉన్నవారికి ఆ చాన్స్ ఉండదు. అలా పరిణీతికి అవకాశాలు తగ్గాయి. సరిగ్గా అప్పుడే ఓ పెద్ద సంస్థలో డబ్బులు పెట్టుబడిగా పెట్టడం, ఇల్లు కొనడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయారు. ఖర్చులకు కూడా డబ్బులు ఉండేవి కాదు. ‘‘అప్పుడు వారాల తరబడి ఇంటి నుంచి బయటకు రాలేదు. రోజుకి కనీసం పదిసార్లయినా ఏడ్చేదాన్ని. ఎవరితోనూ మాట్లాడేదాన్ని కాదు’’ అన్నారు పరిణీతి చోప్రా. అయితే తన సోదరుడు, స్టయిలిస్ట్ సహాయంతో ఆమె డిప్రెషన్ నుంచి బయటపడగలిగారు. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు దాన్ని దగ్గరివాళ్లతో పంచుకోవాలంటున్నారు పరిణీతి.
Comments
Please login to add a commentAdd a comment