ప్రతిదానికీ విపరీతమైన భయం... ఆందోళన..! | Extreme fear of everything, advice prevention | Sakshi
Sakshi News home page

ప్రతిదానికీ విపరీతమైన భయం... ఆందోళన..!

Published Fri, Aug 23 2013 11:42 PM | Last Updated on Sat, Oct 20 2018 7:38 PM

ప్రతిదానికీ విపరీతమైన భయం... ఆందోళన..! - Sakshi

ప్రతిదానికీ విపరీతమైన భయం... ఆందోళన..!

నా వయసు 33. నాదో చిత్రమైన సమస్య. నాకు విపరీతమైన భయం, ఆందోళన. ఎప్పుడూ ఏదో అనర్థమో, వైపరీత్యమో సంభవించబోతోందన్న భావనతో ఇంటిలోనుంచి కాలు బయటకు పెట్టాలంటే భయం. కొత్తవారితో కలవాలంటే బెరుకు. దీంతో నేను వ్యాపారం కూడా మానుకుని ఇంటిలో కూర్చుంటున్నాను. నావల్ల నా కుటుంబసభ్యులంతా బాధపడుతున్నారు. దయచేసి తగిన సలహా చెప్పగలరు.
 - ఒక సోదరుడు, అనంతపురం

 
 మీదొక మానసిక సమస్య. మెదడు నరాలలో చోటు చేసుకునే కొన్ని అసాధారణ రసాయన మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. శరీరంలోని ఇతర అవయవాలకు వచ్చేటట్లే... మెదడుకు వచ్చే సమస్య ఇది. మెదడు సరిగా పని చేయకపోవడం వల్ల తెలియకుండానే సహజశైలికి, ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తూ, చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అది చూసేవారికి అసాధారణంగా అనిపిస్తుంది. మానసిక సమస్యలకు మన ప్రవర్తనలోని లోపాలే నిదర్శనంగా నిలుస్తాయి తప్పించి, దానిని నిర్థారించడానికి ప్రత్యేకమైన పరీక్షలేవీ ఉండవు. అందువల్ల ఎవరైనా చెప్పేంతవరకు లేదా తమ ప్రవర్తనలోని లోపాలను తమంతట తామే గుర్తించినప్పటికీ మానసికవైద్యుని సంప్రదిస్తే తమను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని జాప్యం చేయడం వల్ల సమస్య మరింత ముదురుతుంది.
 
 మీది యాంగ్జైటీ, ఫోబియా కలగలిసిన పరిస్థితి. దీనినే తెలుగులో భయాందోళనలకు లోనవడం అంటారు. దీనిని నిర్లక్ష్యం చేసినకొద్దీ పరిస్థితి మరింత తీవ్రమై, దైనందిన జీవితం దుర్భరమవుతుంది. చాలా సందర్భాలలో కొందరు రోగులలో ఇది డిప్రెషన్‌తోపాటుగా ఉండటం వల్ల ఇతరులు చాలా సులువుగా చేయగలిగినది, ఇతరుల దృష్టిలో అసలు సమస్యే కానిది వీరికి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి. దీనివల్ల రోగితోపాటు కుటుంబసభ్యులందరూ బాధపడలసి వస్తుంది.

 

ఇది ఒకే నాణానికి ఉండే బొమ్మబొరుసులా ఉంటుంది. విపరీతంగా చెమటలు పట్టడం, గుండెదడ, చేతులు వణకడం, గొంతు తడారిపోవటం, కడుపులో తీవ్రమైన నొప్పి, ఊపిరి అందనట్లు అనిపించడం వంటి సమస్యలు ... మరోవైపు అసలు పనికి ఉపక్రమించకమునుపే అందులో వైఫల్యం చెందుతున్నట్టు, ప్రతి ఒక్కరూ తమనే గమనిస్తున్నట్టు, ఇతరులు తమకేదో హాని తలపెడుతున్నట్టు...ఇలా తీవ్రమైన ప్రతికూల భావనలతో బాధపడతారు. ఇక మూడవదశలో ఇటువంటి  సమస్య తమకొక్కరికే ఉందని, ఇక దానికి పరిష్కారమే లేదని భావిస్తూ, తమ సమస్యలను లేదా భావనలను ఇతరులకు చెప్పుకుంటే నవ్వుతారేమోనన్న భయంతో అసలు బయటికి చెప్పరు.
 
 మీరు వెంటనే  సైకియాట్రిస్ట్‌ను కలవడం మంచిది. ఆందోళనకు మంచి మందులున్నాయి. మీ సమస్య మందులతో తప్పకుండా నయమవుతుంది. దీనికితోడు సైకాలజిస్టులు చేసే కౌన్సెలింగ్ వల్ల మీలో రోజురోజుకీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ కుటుంబంలోని అత్యంత సన్నిహితులైన వ్యక్తి అంటే భార్య లేదా తల్లిదండ్రుల సాయం తీసుకోండి.
 
 సైకియాట్రిస్ట్ మీకిచ్చే మందులు ముందు తక్కువ డోసులో ఇస్తారు. అవి మీమీద చూపే ప్రభావాన్ని బట్టి డోసును మెల్లగా పెంచటం లేదా తగ్గించడం చే స్తారు. వీటికితోడు మీ జీవనశైలిలో కూడా తగిన మార్పులు చేసుకుంటే మరింత గుణం కనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు అంతే మంచే జరుగుతుంది.
 
 డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి
 సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement