Dr. Kalyancakravarti
-
పురుషులందు ఈ పురుషులు వేరయా..!
పుత్రోత్సాహమో లేక పుత్రికోత్సాహమో ఏదో ఒకటి ఉంటే తల్లిదండ్రులు హాయిగా ఉంటారు. కానీ కొడుకై పుట్టినవాడు... ఎదిగే వయసులో చక్కగా మగాడిలా ఉండాల్సినవాడు కాస్తా ఆడంగిరేకుల వాడంటూ ఎగతాళికి గురవుతుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఎంతో క్షోభిస్తుంది. వాడు కాస్తా అమ్మాయిగా పుట్టినా బాగుండు అనిపిస్తుంది. పురుషుడు స్త్రీలాగ వ్యవహరించే లక్షణానికి మన సమాజంలో ‘హిజ్రా’ అనే మాటతో పాటు మరికొన్ని న్యూనత పరిచే పదాలు ఉన్నా ప్రస్తుతం ఈ రుగ్మతను ‘జెండర్ ఐడెంటిటీ డిజార్డర్’ (జీఐడీ) అని పిలుస్తున్నారు. ఈ జీఐడీలలో అసలు పుట్టుకకు అబ్బాయిలా పుట్టినా ఇలా ఆపోజిట్ సెక్స్ లక్షణాలు ఎందుకు వస్తాయి; ఆడవాళ్లుగా ఉండటానికి వాళ్లెందుకు ఇష్టపడతారు; ఈ సమస్యకు పరిష్కారం ఏ మేరకు సాధ్యం... వంటి అనేక అంశాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం. పురుషులందు పుణ్యపురుషులు వేరు కావచ్చు. అలాగే పురుషులందు వి‘భిన్న’మైన పురుషులూ కొందరుంటారు. ఆ సమస్య వారితోపాటు ఆ పిల్లాడి తల్లిదండ్రులనూ, పొరుగువాళ్లనూ, సమాజాన్నీ బాధిస్తుంటుంది. అసలిలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోడానికి కొన్ని అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. అవే... పురుషలైంగికత (జెండర్): అబ్బాయిగా పుట్టిన అతడికి లైంగిక అవయవాలైన పురుషాంగం ఉండవచ్చు. కానీ అది పనిచేసేందుకు దేహం స్రవించాల్సిన హార్మోన్లు స్రవిస్తున్నాయా? ఒకవేళ అలాగే జరిగితే వాటి ఫలితంగా వచ్చే తదనంతర లైంగిక మార్పులు (సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్) అయిన మీసం, గడ్డం రావడం జరుగుతున్నాయా అని చూడాలి. లైంగిక భావనలు (సెక్సువల్ పర్సెప్షన్) అతడు తనను తాను ఎలా గుర్తించాలని కోరుకుంటున్నాడు? అంటే... ఒక పురుషుడిలాగానా లేక మహిళలా ఉండాలనా? తన పట్ల ఎదుటివారి నుంచి ఎలాంటి స్పందనలు కోరుతున్నాడు/ఎవరిపట్ల ఆకర్షితుడవుతున్నాడు: అంటే లైంగికంగా తాను ఒక స్త్రీని కోరుతున్నాడా లేక సాటి పురుషుడి పట్ల ఆకర్షితుడవుతున్నాడా? పైన పేర్కొన్న మూడు అంశాల్లోనూ రెండోదాన్ని పరిగణనలోకి తీసుకుని తనను తాను ఎలా గుర్తిస్తున్నాడన్న అంశం ఆధారంగా... ఒకవేళ అతడు తనను తాను స్త్రీగా ఉండాలని కోరుకుంటే దాన్ని ‘జెండర్ ఐడెంటిటీ డిజార్డర్’ అనుకోవచ్చు. గతంలో హిజ్రాలనీ లేదా ఇతరత్రా కించపరిచేలాంటి కొన్నిపేర్లు ఇబ్బందిగా ఉన్నాయనే భావనతో ఇలా ఒక పురుషుడు తనను తాను సెక్సువల్‌గా స్త్రీగా భావించడాన్ని ఇప్పుడు కాస్తంత హుందాగా ‘జెండర్ డిస్ఫోరియా’ అంటున్నారు. ఒక వ్యక్తి... ఆడైనా, మగైనా ఒక సెక్స్‌తో పుడతారు. కొన్నాళ్ల తర్వాత తన సెక్సువాలిటీ తనకే నచ్చకపోతే అది వారిని ‘ఉద్వేగభరితంగా’ (ఎమోషనల్‌గా) ఎంతో ఒత్తిడికి గురిచేస్తుంది. ఇలా తన సెక్సువాలిటీ తనకే నచ్చకపోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. అవి... 1) స్వాభావికమైనవి (బయొలాజికల్) 2)సామాజిక-సాంస్కృతికమైనవి (సోషియో-కల్చరల్) స్వాభావిక (బయొలాజికల్) కారణాలు: పుట్టుకతో జన్యుపరమైన మార్పులు, హార్మోన్ల స్రావాలలో తేడాలు, మెదడు నిర్వర్తించే విధుల్లో మార్పుల కారణంగా పురుషుడిగా పుట్టినా ఒక వ్యక్తి తనను తాను అమ్మాయిగా భావిస్తుంటారు. సాధారణంగా ఇలాంటివారిలో 62 శాతం ఈ తరహా స్వాభావిక అంశాలే జెండర్ ఐడెంటిటీ డిజార్డర్‌కు కారణమవుతాయి. సామాజిక-సాంస్కృతిక (సోషియో-కల్చరల్) కారణాలు: సాధారణంగా మనలోని కొన్ని సమాజాలలో ఆడపిల్లలు లేకపోవడంతో మగపిల్లవాడినే అమ్మాయిలా అలంకరించడం, అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు తీర్చుకోవాలనుకునే కొన్ని ముద్దుముచ్చట్లన్నీ అబ్బాయితోనే జరిపించేయడం, అమ్మాయిలు ఆడుకునే బొమ్మలనే వారికి ఇవ్వడం, వాటితో అతడు ఆడుతుంటే చూసి సంబరపడటం వంటి కారణాలతో ఆ అబ్బాయిలోనూ క్రమంగా తన స్వాభావికమైన సెక్స్ పట్ల విముఖత కలిగి అమ్మాయిగా ఉండటం వల్ల పలువురి మన్ననకు గురవుతాననే భావన పెరగడం కూడా జెండర్ ఐడెంటిటీ డిజార్డర్‌కు కారణమవుతుంది. అయితే ఒక దశ తర్వాత తనలోని సెక్సువాలిటీ సాటి మగవాడిలా ఉన్నా... తన ప్రవర్తన కారణంగా తోటిమగవాళ్లు తనను లైంగికంగా వేరుగా చూడటం (అంటే మగవాడైనా అతడిని అమ్మాయిలాగే చూస్తూ, పలకరిస్తూ, కొన్నిసార్లు లైంగిక దాడులకు/అబ్యూజ్‌కు గురికావడం) అతడిని తీవ్ర అయోమయానికి గురిచేస్తుంది. జీఐడీ ఉన్నవారి లక్షణాలు చిన్నవయసు పిల్లలైతే... తమ శారీరక అవయవాల పట్ల తాము అసహ్యం పెంచుకుంటారు. తమ సెక్స్‌కు చెందిన తోటి స్నేహితుల పట్ల వైముఖ్యతతో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒక్కోసారి ఉద్వేగాలకూ, డిప్రెషన్‌కు గురవుతారు. ఇలాంటివారు ఇతర పిల్లల నుంచి అవమానాలకు, హింసకు తేలిగ్గా గురవుతుంటారు. కాస్త పెద్ద వయసు లేదా యుక్తవయసు వారైతే... తమ సెక్సువాలిటీ పట్ల తీవ్ర అయోమయంతో ఒత్తిడికి గురై, ఒంటరితనానికి అలవాటు పడతారు. ఆత్మన్యూనత భావం పెరుగుతుంది. మహిళల విషయంలోనైతే... కొందరు అమ్మాయిలుగా పుట్టి తన సెక్సువాలిటీపై అసహ్యం ఉన్నవారు కూడా ఉంటారు. వారు పురుషులను అనుకరించడానికి, తమలోని స్త్రీత్వ భావనలను అణచివేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తేలికగా సాధ్యమయ్యే పనులు/వ్యసనాలైన... సిగరెట్లు కాల్చడం, మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతుంటారు. హోమో సెక్సువాలిటీ: కొంతమంది తమ సొంత సెక్సువాలిటీ ఉన్న వ్యక్తుల పట్లనే లైంగిక ఆకర్షణ పెంచుకుంటారు. జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ (జీఐడీ) ఉన్నవారికి తాము స్త్రీ అయితే బాగుండనే భౌతికభావన మాత్రం ఉంటుంది. అదే హోమోసెక్సువాలిటీలో మాత్రం సొంత సెక్స్ వారి పట్ల లైంగిక భావన/లైంగిక ఆకర్షణ/లైంగిక ఉద్దీపనలు ఉంటాయి. అంటే పురుషులు, తోటి పురుషుల పట్ల లైంగికంగా ఆకర్షితులవుతారన్నమాట. కారణాలు: ఈ విషయంలో శాస్త్రజ్ఞుల మధ్య ఇంకా ఏకాభిప్రాయం లేదు. దీని విషయంలో అనేక భిన్నవాదనలు వినిపిస్తుంటాయి. బయొలాజికల్ థియరీలు, సెక్సువల్ ఓరియంటేషన్ థియరీలు అంటూ దీనికి జీవ/స్వాభావిక అంశాలు, జన్యుపరమైన అంశాలు, పుట్టిపెరిగిన వాతావరణం, సామాజిక అంశాలను కారణాలుగా చెబుతుంటారు. అయితే వీటన్నింటి సంయుక్త ప్రభావాల వల్ల కొందరు మగవాళ్లలో ఈ తరహా ఆలోచన దృక్పథం పెంపొందుతుందని అనుకోవచ్చు. ఈ విషయంలో పురుషులు పురుషుల పట్ల లైంగికంగా ఆకర్షితులు కావడాన్ని ‘గే’ అని, అమ్మాయిలు, అమ్మాయిల పట్లనే ఆకర్షితులు కావడాన్ని ‘లెస్బియనిజమ్’ అని వ్యవహరిస్తుంటారు. ఇలా పురుషులు పురుషుల పట్ల, స్త్రీలు సాటి స్త్రీల పట్ల లైంగికంగా ఎందుకు ఉద్దీపనలు చెందుతుంటారన్న అంశంపై స్పష్టత లేదు. దీనిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే తమ చిన్నప్పటి అనేక అంశాలు/తొలినాళ్లలో వారిలో కలిగే సెక్స్భావనల సమయంలో వారిలో చిగురించే ఊహల వంటివి ఈ భావనకు తోడ్పడతాయని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. అయితే ఈ భావనలన్నీ యుక్తవయసులోకి ప్రవేశించే దశలోనే వస్తుంటాయన్నది సుస్పష్టం. అందుకే ఆ సమయంలో అతడి భావనల్లో తనకు వ్యతిరేక సెక్స్‌పై (ఆపోజిట్ సెక్స్ పట్ల) ఆకర్షణ కలుగుతుంటే స్వాభావికంగానే (హెటెరో సెక్సువల్‌గా) పెరుగుతాడు. అదే సొంత సెక్స్ పట్ల కూడా ఆకర్షితమవుతుంటే అటు కొంతమేర స్త్రీల పట్ల ఆకర్షణతో పాటు, ఇటు పురుషుల పట్ల కూడా ఆకర్షణ కలుగుతూ బెసైక్సువల్గా మారే అవకాశం ఉంది. ఇక కొందరు మహిళల పట్ల పూర్తిగా ఆకర్షణ లేకుండా ఉండి, కేవలం తోటిపురుషుల పట్ల మాత్రమే ఆకర్షితులవుతుంటారు. వీరు హోమోసెక్సువల్‌గా మారిపోతారు. అదే ధోరణి వారి జీవితకాలం కొనసాగుతుంటుంది. జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్నవారికి చికిత్స/నిర్వహణ (మేనేజ్మెంట్) జీఐడీ భావనలు ఉన్నవారికి చాలావరకు చికిత్స సాధ్యమే. అయితే హోమోసెక్సువాలిటీ భావనలు ఉన్నవారికి మాత్రం కొద్దిమేరకు మాత్రమే చికిత్స చేయవచ్చు. జీఐడి రుగ్మత ఉన్నవారికి తొలుత తాము ఏ పుట్టుక పుట్టారో దాన్ని అనుసరించేలా చేసే ప్రయత్నం చేయవచ్చు. అంటే అబ్బాయిగా పుట్టిన వ్యక్తికి... తాను అబ్బాయినే అనే భావన కలిగించడం మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా వారికి వరుసగా ఒక క్రమపద్ధతిలో సైకలాజికల్ కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహిస్తారు. వారి జీవనశైలిలో అనుసరించాల్సిన మార్పులను వారికి బోధిస్తూ... ఒక పురుషుడిలాగే ప్రవర్తించేలా ప్రోత్సహిస్తారు. వారిలో స్వాభావికమైన మార్పులు ఏవైనా ఉంటే... అంటే సెక్సువాలిటీకి కారణమయ్యే హార్మోన్ల స్రావాల్లో ఏవైనా తేడాలు ఉంటే వాటిని భర్తీ చేయడానికి బయట నుంచి హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తూ హార్మోన్ థెరపీ ఇస్తారు. ఇక వీరి విషయంలో కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ తో పాటు కొన్నిరకాల యాంటీ డిప్రెసెంట్స్తోనూ చికిత్స చేస్తారు. ఇక కొందరు పై తరహా చికిత్సకు అస్సలు అంగీకరించరు. దాంతో వారు కోరుకున్న సెక్సువాలిటీకి తగినట్లుగా వారి శరీరంలో మార్పులు చేయడం కూడా ఒక ప్రయత్నం. అందులో భాగంగా వారు కోరుకున్న శారీరక అవయవాలను కృత్రిమంగా అమర్చడం, కాస్మటిక్ సర్జరీ చేయడం వంటివి చేస్తారు. ఇది కూడా వారిలోని న్యూనతను తగ్గించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తారు. ఇది తమ పుట్టుకతో వచ్చిన లైంగికతను ఇక ఎంతకూ అంగీకరించని వారి విషయంలో చేసే చివరి ప్రయత్నం. అటువంటి లక్షణాలున్నవారు దానిని తమకు తాముగా గుర్తించి, దాని నుంచి బయటపడాలనుకుంటే మాత్రం కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీ వంటివాటి ద్వారా సత్ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది. - నిర్వహణ: యాసీన్ హోమోఫోబియా/ ఇంటర్నలైజ్డ్ హోమోఫోబియా ఈ పదం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. కొందరు స్వాభావికంగా అంతా బాగానే ఉంటారు. మగవాళ్లకు సాటి ఆడవాళ్ల పట్లనే లైంగిక ఆకర్షణ ఉంటుంది. అలాగే ఆడవాళ్లకు కూడా మగవారి పట్లనే లైంగిక ఆకర్షణ ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి హోమోసెక్సువల్ వ్యక్తులను చూడటం, వారి పట్ల అసహ్యం పెంచుకోవడం, తామూ ఏదైనా పరిస్థితుల్లో అలా అయిపోతామేమోనన్న భయాలు వారి మనసు లోతుల్లో పుట్టి, వారిని సతమతం చేస్తుంటాయి. తాము ఒకవేళ ‘గే’ లేదా ‘లెస్బియన్’గా మారతామేమో అనే ఆందోళనతో అవే ఆలోచనలు మాటిమాటికీ వస్తుండటంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. యుక్తవయసులో కొందరికి కలిగే ఈ భావనలు వారిని స్థిమితంగా ఉండనివ్వవు. తీవ్ర ఆందోళనకు, ఉద్వేగానికి గురిచేస్తుంటాయి. కొందరు తమ ఆలోచనల పట్ల ‘అపరాధభావన’ (గిల్టీ ఫీలింగ్) పెంచుకుంటారు. ఈ సమయంలో వారికి కౌన్సెలింగ్ అవసరం. అది కేవలం వారి మనసులోని భయం మాత్రమేనని, దాన్ని అధిగమిస్తే వారూ అందరిలా స్వాభావికంగా/ నార్మల్‌గా ఉండగలమనే స్థైర్యం పెంపొందుతుంది. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
అతని గురించిన ఆలోచనలు వెంటాడుతున్నాయి..?
నా వయసు 39. మంచి భర్త, బుద్ధిమంతుడైన కొడుకు. నా భర్త ఆఫీసుకు, మా అబ్బాయి కాలేజీకి వెళ్లాక నేను ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు నన్ను గతం వెంటాడుతోంది. నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒకతన్ని మూగగా ఆరాధించేదాన్ని. అది వన్‌సైడ్ లవ్ మాత్రమే! అయినా ఇప్పటికీ అతను నా ఊహల్లో ఉండిపోయాడు. మా వారు, బాబు నా పక్కనే ఉన్నప్పుడు కూడా అతని ఆలోచనలే. అతన్ని చూసి ఇరవై ఏళ్లయింది. అయినా అతన్ని మరచిపోలేకపోతున్నాను. ఏదైనా యాక్సిడెంట్ అయి గతాన్ని మరచిపోతే బాగుండనిపిస్తోంది. నా సమస్యకు తగిన పరిష్కారం సూచించగలరు. - ఒక సోదరి, హైదరాబాద్ గత జ్ఞాపకాలను మరచిపోలేక మీరు పడుతున్న అవస్థను నేను అర్థం చేసుకోగలను. అయితే, దురదృష్టవశాత్తూ చాలామంది కోరుకుంటున్నట్లుగా గతాన్ని మరచిపోయేందుకు మందులంటూ ఏమీ ఉండవు. యాక్సిడెంట్ అయ్యి గతాన్ని మరచిపోవడం అనేది టీవీల్లోనూ, సినిమాల్లోనూ చూసేదే కానీ, వాస్తవంగా జరిగేది కాదు. పరిస్థితులు, పరిసరాలు మారడం వల్ల కొన్ని స్మృతులను మరచిపోవడం సహజం. కాని, ఇరవై ఏళ్లయినా అతన్ని మరచిపోలేకపోతున్నానంటున్నారు. అది పూర్తిగా మీ తప్పు కాదు. మెదడులోని కొన్ని రసాయనాలలో చోటుచేసుకునే అసమతుల్యతల కారణంగా కూడా అలా జరుగుతుంది. మీ జీవితంలోని ఒంటరితనం వల్ల, మీరు లైఫ్‌ని సరిగా ఎంజాయ్ చేయలేకపోవడం వల్ల, ఇతరత్రా పనేమీ లేకపోవడం వల్ల కూడా మీకు తెలియకుండానే మీ మెదడు పొరలలో నిక్షిప్తమై ఉన్న సంఘటనలనే గుర్తు తెచ్చుకుంటూ, అదే పనిగా అతన్నే తలచుకుంటూ ఉంటున్నారు. దాని ఫలితమే ఇది. మీరు దీనిని ఇలాగే వదిలేస్తే క్రమేపీ డిప్రెషన్లోకి జారిపోయే పరిస్థితి కూడా ఏర్పడవచ్చు. ఆ జ్ఞాపకాల నుంచి మీరు బయటకు రావాలంటే, తీరిక లేకుండా ఉండేలా ఏదో ఒక వ్యాపకం కల్పించుకుంటూ క్రమేపీ మరచిపోయేందుకు ప్రయత్నించాలి. దానితోపాటు మీ కుటుంబసభ్యులను ఎవరినైనా వెంటబెట్టుకుని సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి వారి సాయంతో మీ పరిస్థితినంతటినీ వివరించి, కొంతకాలంపాటు తక్కువ మోతాదులో ఉండే యాంటీ డిప్రెసెంట్స్ వాడటం, కాన్సెలింగ్ తీసుకోవడం, ఫ్యామిలీతోనూ, స్నేహితులతోనూ వీలైనంత ఎక్కువసేపు గడుపుతుండటం వల్ల మీరు మీ పాత జ్ఞాపకాల నుంచి వీలైనంత త్వరగా బయటపడగలుగుతారు. ప్రయత్నించి చూడండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
గత చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి..?
నా వయసు 33. పదేళ్ల క్రితం నాకు పెళ్లయింది. నా భర్త చాలా క్రూరుడు, శాడిస్టు. అనుమానం మనిషి. ఆయన పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక మా పుట్టింటికి చేరాను. అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ నా కాళ్లమీద నేను నిలబడ్డాక మళ్లీ పెళ్లి చేసుకున్నాను. ఈయన చాలా మంచివారు. ఇప్పుడు నాకు నాలుగేళ్ల బాబు. జీవితం హాయిగా గడిచిపోతోంది అనుకుంటుంటే... నన్ను గత జీవితం తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. సరిగా నిద్రపట్టదు... ఎలాగో నిద్రపోతే పీడకలలు రావటం, సడన్‌గా మూడ్స్ మారటం, అందరినీ విసుక్కోవడం... ఇంట్లోవాళ్లు చాలా బాధపడుతున్నారు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, విశాఖపట్నం శాడిస్టు అయిన భర్తతో దుర్భరజీవితాన్ని అనుభవించారు. ఎలాగో తప్పించుకుని మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని అనుభవిద్దామనుకునేంతలో మిమ్మల్ని గత ం తాలూకు చేదు జ్ఞాపకాలు వెంటాడటం బాధాకరం. ప్రస్తుతం మీరనుభవించే స్థితిని పీటీఎస్డీ లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఈ వ్యాధి ... దాని పేరుకు తగ్గట్టుగానే, మెదడుపొరల్లో నిక్షిప్తమై ఉన్న గతం మిమ్మల్ని వెంటాడుతూ ఉండటం వల్ల మీరు ప్రస్తుతం ఎంతటి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ వాటి ప్రభావం మీమీద పడి మీ మూడ్స్ మారిపోతుంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీని ప్రభావం మీ దైనందిన జీవితంపై పడి ప్రస్తుత జీవితం భారంగా అనిపిస్తుంది. అయితే మీ గతం ఎంత విషాదకరమైనదైనప్పటికీ అది గడిచిపోయింది, తిరిగి మీరు మంచి జీవితాన్ని గడపగలుగుతున్నారు కాబట్టి, దానిని మరచిపోయేందుకు గట్టిప్రయత్నం చేయండి. అది గతమే కదా, తిరిగి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను కదా అన్న భావనతో మీ మెదడుకు మీరు సజెషన్స్ ఇచ్చుకోండి. అందులో భాగంగా మీ గతాన్నంతటినీ పేపర్ మీద రాసి, దాన్ని ఒకసారి చదువుకుని, కాల్చేయండి. దీనివల్ల కొంత మెరుగైన ఫలితం కలుగుతుంది. అయితే మీరు గతం తాలూకు పీడకలలతో సరిగా నిద్రపోలేకపోతున్నానంటున్నారు కాబట్టి అయితే డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే మాత్రం సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, మీ పరిస్థితినంతటినీ వివరించండి. అవసరాన్ని బట్టి మందులు కూడా వాడవలసి ఉంటుంది. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్ ద్వారా, మందుల ద్వారా మీలోని మానసిక ఒత్తిడిని, టెన్షన్‌ను తగ్గించి, వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిస్తూ, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగేలా చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం కలిగిస్తూ, మందులద్వారా హాయిగా నిద్రపట్టేలా చేస్తారు. మీరు క్రమేణా మామూలు స్థితికి వస్తారు. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్ -
ప్రతిదానికీ విపరీతమైన భయం... ఆందోళన..!
నా వయసు 33. నాదో చిత్రమైన సమస్య. నాకు విపరీతమైన భయం, ఆందోళన. ఎప్పుడూ ఏదో అనర్థమో, వైపరీత్యమో సంభవించబోతోందన్న భావనతో ఇంటిలోనుంచి కాలు బయటకు పెట్టాలంటే భయం. కొత్తవారితో కలవాలంటే బెరుకు. దీంతో నేను వ్యాపారం కూడా మానుకుని ఇంటిలో కూర్చుంటున్నాను. నావల్ల నా కుటుంబసభ్యులంతా బాధపడుతున్నారు. దయచేసి తగిన సలహా చెప్పగలరు. - ఒక సోదరుడు, అనంతపురం మీదొక మానసిక సమస్య. మెదడు నరాలలో చోటు చేసుకునే కొన్ని అసాధారణ రసాయన మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. శరీరంలోని ఇతర అవయవాలకు వచ్చేటట్లే... మెదడుకు వచ్చే సమస్య ఇది. మెదడు సరిగా పని చేయకపోవడం వల్ల తెలియకుండానే సహజశైలికి, ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తూ, చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అది చూసేవారికి అసాధారణంగా అనిపిస్తుంది. మానసిక సమస్యలకు మన ప్రవర్తనలోని లోపాలే నిదర్శనంగా నిలుస్తాయి తప్పించి, దానిని నిర్థారించడానికి ప్రత్యేకమైన పరీక్షలేవీ ఉండవు. అందువల్ల ఎవరైనా చెప్పేంతవరకు లేదా తమ ప్రవర్తనలోని లోపాలను తమంతట తామే గుర్తించినప్పటికీ మానసికవైద్యుని సంప్రదిస్తే తమను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని జాప్యం చేయడం వల్ల సమస్య మరింత ముదురుతుంది. మీది యాంగ్జైటీ, ఫోబియా కలగలిసిన పరిస్థితి. దీనినే తెలుగులో భయాందోళనలకు లోనవడం అంటారు. దీనిని నిర్లక్ష్యం చేసినకొద్దీ పరిస్థితి మరింత తీవ్రమై, దైనందిన జీవితం దుర్భరమవుతుంది. చాలా సందర్భాలలో కొందరు రోగులలో ఇది డిప్రెషన్తోపాటుగా ఉండటం వల్ల ఇతరులు చాలా సులువుగా చేయగలిగినది, ఇతరుల దృష్టిలో అసలు సమస్యే కానిది వీరికి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి. దీనివల్ల రోగితోపాటు కుటుంబసభ్యులందరూ బాధపడలసి వస్తుంది. ఇది ఒకే నాణానికి ఉండే బొమ్మబొరుసులా ఉంటుంది. విపరీతంగా చెమటలు పట్టడం, గుండెదడ, చేతులు వణకడం, గొంతు తడారిపోవటం, కడుపులో తీవ్రమైన నొప్పి, ఊపిరి అందనట్లు అనిపించడం వంటి సమస్యలు ... మరోవైపు అసలు పనికి ఉపక్రమించకమునుపే అందులో వైఫల్యం చెందుతున్నట్టు, ప్రతి ఒక్కరూ తమనే గమనిస్తున్నట్టు, ఇతరులు తమకేదో హాని తలపెడుతున్నట్టు...ఇలా తీవ్రమైన ప్రతికూల భావనలతో బాధపడతారు. ఇక మూడవదశలో ఇటువంటి సమస్య తమకొక్కరికే ఉందని, ఇక దానికి పరిష్కారమే లేదని భావిస్తూ, తమ సమస్యలను లేదా భావనలను ఇతరులకు చెప్పుకుంటే నవ్వుతారేమోనన్న భయంతో అసలు బయటికి చెప్పరు. మీరు వెంటనే సైకియాట్రిస్ట్‌ను కలవడం మంచిది. ఆందోళనకు మంచి మందులున్నాయి. మీ సమస్య మందులతో తప్పకుండా నయమవుతుంది. దీనికితోడు సైకాలజిస్టులు చేసే కౌన్సెలింగ్ వల్ల మీలో రోజురోజుకీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ కుటుంబంలోని అత్యంత సన్నిహితులైన వ్యక్తి అంటే భార్య లేదా తల్లిదండ్రుల సాయం తీసుకోండి. సైకియాట్రిస్ట్ మీకిచ్చే మందులు ముందు తక్కువ డోసులో ఇస్తారు. అవి మీమీద చూపే ప్రభావాన్ని బట్టి డోసును మెల్లగా పెంచటం లేదా తగ్గించడం చే స్తారు. వీటికితోడు మీ జీవనశైలిలో కూడా తగిన మార్పులు చేసుకుంటే మరింత గుణం కనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు అంతే మంచే జరుగుతుంది. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్ -
మా అబ్బాయికి ఆటిజమ్... ఏ విధమైన ఆహారం ఇవ్వాలి?
మా అబ్బాయికి ఆటిజమ్ ఉంది. మేము ఇంతవరకూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లలేదు. అయినప్పటికీ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి రకరకాల విధానాల ద్వారా వాడిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఆటిజమ్ ఉన్న పిల్లలకు కెసీన్, గ్లూటెన్ లేని ఆహారాన్ని ఇవ్వాలని స్పీచ్ థెరపిస్ట్ చెప్పడంతో... పాలు, గోధుమ ఉత్పత్తులు ఇవ్వడం పూర్తిగా తగ్గించేశాము. అయితే అప్పటినుంచి వాడు బరువు తగ్గిపోతున్నాడు. మాకు ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. - కె. విశాల, వరంగల్ ఇటీ వలికాలంలో ఎక్కడ చూసినా తరచు వినిపిస్తున్న పదం ఆటిజం. ప్రత్యేకమైన కారణాలేమీ లేనప్పటికీ పిల్లల్లో అతి చిన్న వయస్సు నుంచే ఈ లక్షణాలు కనపడుతున్నాయి. దీనికి కారణాలు, చికిత్స పద్ధతుల గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలాకాలంగా ఆటిజమ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు వైద్యుల సలహా సిఎఫ్జిఎఫ్ డైట్ ఇస్తున్నారు. అది సంపూర్ణమైన చికిత్సాపద్ధతి కానప్పటికీ, కొందరు పిల్లల్లో అసలు పని చేయనప్పటికీ, మొత్తం మీద దానిద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలను బట్టి ఆహారంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. దీనిని మంచి అనుభవజ్ఞులైన పిల్లల వైద్యనిపుణులు, పిల్లల మానసిక చికిత్సావేత్తలు మాత్రమే గుర్తించగలరు. మీరు కనుక మీ పిల్లవాడికి సిఎఫ్జిఎఫ్ డైట్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం దాని మూలంగా విటమిన్లు, ఇతర పోషకాల లోపం ఉండబోదని నిర్థారించుకున్న తర్వాతనే ఆ విధమైన డైట్ ఇవ్వడం ప్రారంభించాలి లేకుంటే పిల్లల్లో విటమిన్లు, ధాతువుల లోపంతో ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చాలామంది తల్లిదండ్రులలో తలెత్తే సందేహం ఏమిటంటే... ఈ విధమైన తమ పిల్లలకు ఎంతకాలం పాటు ఇవ్వాలని. సాధారణంగా ఈ విధమైన డైట్ ఇవ్వడం మొదలు పెట్టిన నాలుగు వారాల నుంచి మూడు నెలల్లోగానే పిల్లల ప్రవర్తన, సామాజిక బాధ్యత వంటి అంశాలలో మార్పు కనిపించడం మొదలవుతుంది. పిల్లల భావోద్వేగాలు, మాటతీరు, ఇతరుల కళ్లల్లో కళ్లుపెట్టి సూటిగా చూడటం, పిలిచినప్పుడు స్పందించే విధానం, తోటివారితో మెలిగే తీరు వంటి వాటిలో మార్పును గుర్తించవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏవిధమైన మార్పునూ కనిపెట్టలేకపోతే చైల్డ్ సైకియాట్రిస్ట్ వాటిని సులువుగా గుర్తిస్తారు. అయితే అదొక్కటే సరిపోదు. ఆహారంలో మార్పులతోబాటు వారి అవసరాలకు అనుగుణంగా బయో మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఆటిజమ్ ఉన్న పిల్లలందరికీ ఒకేవిధమైన చికిత్సా పద్ధతి ఉండదు. వారి ప్రవర్తన, శారీరక స్థితిగతులు, తదితర లక్షణాల ఆధారంగానే చికిత్స చేయాలి. మీరు మీ అబ్బాయిని వెంటనే సుశిక్షితులు, అనుభవజ్ఞులైన చైల్డ్ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి, వారి సలహా మేరకు తగిన చికిత్స ఇప్పించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్ -
మా అమ్మాయి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో అర్థం కావట్లేదు..?
మాకు ఒక్కగానొక్క కూతురు. ఇటీవలే ఆమెకు పెళ్లి చేశాం. మా అల్లుడు అందగాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, దురలవాట్లేమీ లేవని నిర్థారించుకున్న తర్వాతనే సంబంధం కుదుర్చుకున్నాం. అయితే మా అమ్మాయి ఒక భయంకరమైన విషయం చెప్పింది. భర్త తనతో ఇంతవరకు శారీరకంగా కలవలేదట. ఎప్పుడూ ఫోన్లో మెసేజెస్ చూసుకుంటూ తన ఫోన్‌ని చాలా జాగ్రత్తగా దాచిపెడతాడట. నిలదీస్తే తనకు స్వలింగసంపర్కం అలవాటుందని (గే), ఆ అలవాటు నుంచి బయట పడాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ పెళ్లి చేసుకున్నాడని, అయితే ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతున్నానని, తనని క్షమించమని అడిగాడని చెప్పింది. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి తగిన సలహా చెప్పగలరు. - ఒక తండ్రి, హైదరాబాద్ ఈ విషయంలో మీరేమీ ఆందోళన పడవద్దు. ఇటీవల కాలంలో పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల ఇటువంటి అలవాట్లు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఇటువంటి వారికి బాల్యంలో జరిగే కొన్ని సంఘటనలు, అనుభవాల వల్ల వారు ఈ విధంగా తయారవుతున్నారు. కొందరి విషయంలో కొన్ని జన్యు సమస్యల వల్ల ఇలా జరుగుతుంటుంది. నా దగ్గరకు ఇలాంటి కేసులు చాలా వ స్తున్నాయి. అయితే మీ విషయంలో కొంతలో కొంత మెరుగు ఏమిటంటే... మీ అల్లుడికి తను చేసేది తప్పని తెలుసు, పైగా చేస్తున్న పనికి పశ్చాత్తాపపడటం, దాని నుంచి బయటకు రావాలని ప్రయత్నించటం. ఇటువంటి అలవాట్లు ఉన్నవారు చాలామంది ముందు అసలు బయటపడరు.ఒకవేళ బయటపడినా తమ జీవితభాగస్వామి మీదనే ఏవో ఒక నిందలు మోపి, అటు తమ జీవితాన్ని, ఇటు భాగస్వామి జీవితాన్ని కూడా దుర్భరం చేస్తారు. మీరు ఈ విషయాన్ని అందరికీ చెప్పి, పదిమంది చేత అతనికి హితబోధలు, నీతులు చెప్పించి, సమస్యను మరింత జటిలం చేసుకోవద్దు. మీ అమ్మాయికి కూడా ఇదే విషయం చెప్పండి. ముందు అతనికి ఆపోజిట్ సెక్స్ అంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోండి. ఏదోవిధంగా అతని ఫోన్ కాంటాక్ట్స్ కట్ చేయండి. మీ అమ్మాయి భర్తతో బాగా ప్రేమగా ఉంటూ, మంచిగా దారిలోకి తెచ్చుకోవాలి. మీ అల్లుడికి బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఆందోళన పడకుండా, సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్