పుత్రోత్సాహమో లేక పుత్రికోత్సాహమో ఏదో ఒకటి ఉంటే తల్లిదండ్రులు హాయిగా ఉంటారు. కానీ కొడుకై పుట్టినవాడు... ఎదిగే వయసులో చక్కగా మగాడిలా ఉండాల్సినవాడు కాస్తా ఆడంగిరేకుల వాడంటూ ఎగతాళికి గురవుతుంటే ఆ తల్లిదండ్రుల మనసు ఎంతో క్షోభిస్తుంది. వాడు కాస్తా అమ్మాయిగా పుట్టినా బాగుండు అనిపిస్తుంది. పురుషుడు స్త్రీలాగ వ్యవహరించే లక్షణానికి మన సమాజంలో ‘హిజ్రా’ అనే మాటతో పాటు మరికొన్ని న్యూనత పరిచే పదాలు ఉన్నా ప్రస్తుతం ఈ రుగ్మతను ‘జెండర్ ఐడెంటిటీ డిజార్డర్’ (జీఐడీ) అని పిలుస్తున్నారు. ఈ జీఐడీలలో అసలు పుట్టుకకు అబ్బాయిలా పుట్టినా ఇలా ఆపోజిట్ సెక్స్ లక్షణాలు ఎందుకు వస్తాయి; ఆడవాళ్లుగా ఉండటానికి వాళ్లెందుకు ఇష్టపడతారు; ఈ సమస్యకు పరిష్కారం ఏ మేరకు సాధ్యం... వంటి అనేక అంశాలను తెలుసుకోవడం కోసమే ఈ కథనం.
పురుషులందు పుణ్యపురుషులు వేరు కావచ్చు. అలాగే పురుషులందు వి‘భిన్న’మైన పురుషులూ కొందరుంటారు. ఆ సమస్య వారితోపాటు ఆ పిల్లాడి తల్లిదండ్రులనూ, పొరుగువాళ్లనూ, సమాజాన్నీ బాధిస్తుంటుంది. అసలిలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోడానికి కొన్ని అంశాలను లోతుగా పరిశీలించాల్సి ఉంటుంది. అవే...
పురుషలైంగికత (జెండర్): అబ్బాయిగా పుట్టిన అతడికి లైంగిక అవయవాలైన పురుషాంగం ఉండవచ్చు. కానీ అది పనిచేసేందుకు దేహం స్రవించాల్సిన హార్మోన్లు స్రవిస్తున్నాయా? ఒకవేళ అలాగే జరిగితే వాటి ఫలితంగా వచ్చే తదనంతర లైంగిక మార్పులు (సెకండరీ సెక్సువల్ కారెక్టర్స్) అయిన మీసం, గడ్డం రావడం జరుగుతున్నాయా అని చూడాలి.
లైంగిక భావనలు (సెక్సువల్ పర్‌సెప్షన్) అతడు తనను తాను ఎలా గుర్తించాలని కోరుకుంటున్నాడు? అంటే... ఒక పురుషుడిలాగానా లేక మహిళలా ఉండాలనా?
తన పట్ల ఎదుటివారి నుంచి ఎలాంటి స్పందనలు కోరుతున్నాడు/ఎవరిపట్ల ఆకర్షితుడవుతున్నాడు: అంటే లైంగికంగా తాను ఒక స్త్రీని కోరుతున్నాడా లేక సాటి పురుషుడి పట్ల ఆకర్షితుడవుతున్నాడా?
పైన పేర్కొన్న మూడు అంశాల్లోనూ రెండోదాన్ని పరిగణనలోకి తీసుకుని తనను తాను ఎలా గుర్తిస్తున్నాడన్న అంశం ఆధారంగా... ఒకవేళ అతడు తనను తాను స్త్రీగా ఉండాలని కోరుకుంటే దాన్ని ‘జెండర్ ఐడెంటిటీ డిజార్డర్’ అనుకోవచ్చు. గతంలో హిజ్రాలనీ లేదా ఇతరత్రా కించపరిచేలాంటి కొన్నిపేర్లు ఇబ్బందిగా ఉన్నాయనే భావనతో ఇలా ఒక పురుషుడు తనను తాను సెక్సువల్‌గా స్త్రీగా భావించడాన్ని ఇప్పుడు కాస్తంత హుందాగా ‘జెండర్ డిస్ఫోరియా’ అంటున్నారు.
ఒక వ్యక్తి... ఆడైనా, మగైనా ఒక సెక్స్‌తో పుడతారు. కొన్నాళ్ల తర్వాత తన సెక్సువాలిటీ తనకే నచ్చకపోతే అది వారిని ‘ఉద్వేగభరితంగా’ (ఎమోషనల్‌గా) ఎంతో ఒత్తిడికి గురిచేస్తుంది. ఇలా తన సెక్సువాలిటీ తనకే నచ్చకపోవడానికి రెండు ప్రధాన కారణాలున్నాయి. అవి...
1) స్వాభావికమైనవి (బయొలాజికల్) 2)సామాజిక-సాంస్కృతికమైనవి (సోషియో-కల్చరల్)
స్వాభావిక (బయొలాజికల్) కారణాలు: పుట్టుకతో జన్యుపరమైన మార్పులు, హార్మోన్ల స్రావాలలో తేడాలు, మెదడు నిర్వర్తించే విధుల్లో మార్పుల కారణంగా పురుషుడిగా పుట్టినా ఒక వ్యక్తి తనను తాను అమ్మాయిగా భావిస్తుంటారు. సాధారణంగా ఇలాంటివారిలో 62 శాతం ఈ తరహా స్వాభావిక అంశాలే జెండర్ ఐడెంటిటీ డిజార్డర్‌కు కారణమవుతాయి.
సామాజిక-సాంస్కృతిక (సోషియో-కల్చరల్) కారణాలు: సాధారణంగా మనలోని కొన్ని సమాజాలలో ఆడపిల్లలు లేకపోవడంతో మగపిల్లవాడినే అమ్మాయిలా అలంకరించడం, అమ్మాయి విషయంలో తల్లిదండ్రులు తీర్చుకోవాలనుకునే కొన్ని ముద్దుముచ్చట్లన్నీ అబ్బాయితోనే జరిపించేయడం, అమ్మాయిలు ఆడుకునే బొమ్మలనే వారికి ఇవ్వడం, వాటితో అతడు ఆడుతుంటే చూసి సంబరపడటం వంటి కారణాలతో ఆ అబ్బాయిలోనూ క్రమంగా తన స్వాభావికమైన సెక్స్ పట్ల విముఖత కలిగి అమ్మాయిగా ఉండటం వల్ల పలువురి మన్ననకు గురవుతాననే భావన పెరగడం కూడా జెండర్ ఐడెంటిటీ డిజార్డర్‌కు కారణమవుతుంది. అయితే ఒక దశ తర్వాత తనలోని సెక్సువాలిటీ సాటి మగవాడిలా ఉన్నా... తన ప్రవర్తన కారణంగా తోటిమగవాళ్లు తనను లైంగికంగా వేరుగా చూడటం (అంటే మగవాడైనా అతడిని అమ్మాయిలాగే చూస్తూ, పలకరిస్తూ, కొన్నిసార్లు లైంగిక దాడులకు/అబ్యూజ్‌కు గురికావడం) అతడిని తీవ్ర అయోమయానికి గురిచేస్తుంది.
జీఐడీ ఉన్నవారి లక్షణాలు
చిన్నవయసు పిల్లలైతే... తమ శారీరక అవయవాల పట్ల తాము అసహ్యం పెంచుకుంటారు.
తమ సెక్స్‌కు చెందిన తోటి స్నేహితుల పట్ల వైముఖ్యతతో ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. ఒక్కోసారి ఉద్వేగాలకూ, డిప్రెషన్‌కు గురవుతారు.
ఇలాంటివారు ఇతర పిల్లల నుంచి అవమానాలకు, హింసకు తేలిగ్గా గురవుతుంటారు.
కాస్త పెద్ద వయసు లేదా యుక్తవయసు వారైతే...
తమ సెక్సువాలిటీ పట్ల తీవ్ర అయోమయంతో ఒత్తిడికి గురై, ఒంటరితనానికి అలవాటు పడతారు. ఆత్మన్యూనత భావం పెరుగుతుంది.
మహిళల విషయంలోనైతే...
కొందరు అమ్మాయిలుగా పుట్టి తన సెక్సువాలిటీపై అసహ్యం ఉన్నవారు కూడా ఉంటారు. వారు పురుషులను అనుకరించడానికి, తమలోని స్త్రీత్వ భావనలను అణచివేయడానికి చేసే ప్రయత్నాల్లో భాగంగా తేలికగా సాధ్యమయ్యే పనులు/వ్యసనాలైన... సిగరెట్లు కాల్చడం, మద్యం తాగడం, డ్రగ్స్ తీసుకోవడం లాంటి చర్యలకు పాల్పడుతుంటారు.
హోమో సెక్సువాలిటీ: కొంతమంది తమ సొంత సెక్సువాలిటీ ఉన్న వ్యక్తుల పట్లనే లైంగిక ఆకర్షణ పెంచుకుంటారు. జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ (జీఐడీ) ఉన్నవారికి తాము స్త్రీ అయితే బాగుండనే భౌతికభావన మాత్రం ఉంటుంది. అదే హోమోసెక్సువాలిటీలో మాత్రం సొంత సెక్స్ వారి పట్ల లైంగిక భావన/లైంగిక ఆకర్షణ/లైంగిక ఉద్దీపనలు ఉంటాయి. అంటే పురుషులు, తోటి పురుషుల పట్ల లైంగికంగా ఆకర్షితులవుతారన్నమాట.
కారణాలు: ఈ విషయంలో శాస్త్రజ్ఞుల మధ్య ఇంకా ఏకాభిప్రాయం లేదు. దీని విషయంలో అనేక భిన్నవాదనలు వినిపిస్తుంటాయి. బయొలాజికల్ థియరీలు, సెక్సువల్ ఓరియంటేషన్ థియరీలు అంటూ దీనికి జీవ/స్వాభావిక అంశాలు, జన్యుపరమైన అంశాలు, పుట్టిపెరిగిన వాతావరణం, సామాజిక అంశాలను కారణాలుగా చెబుతుంటారు. అయితే వీటన్నింటి సంయుక్త ప్రభావాల వల్ల కొందరు మగవాళ్లలో ఈ తరహా ఆలోచన దృక్పథం పెంపొందుతుందని అనుకోవచ్చు. ఈ విషయంలో పురుషులు పురుషుల పట్ల లైంగికంగా ఆకర్షితులు కావడాన్ని ‘గే’ అని, అమ్మాయిలు, అమ్మాయిల పట్లనే ఆకర్షితులు కావడాన్ని ‘లెస్బియనిజమ్’ అని వ్యవహరిస్తుంటారు. ఇలా పురుషులు పురుషుల పట్ల, స్త్రీలు సాటి స్త్రీల పట్ల లైంగికంగా ఎందుకు ఉద్దీపనలు చెందుతుంటారన్న అంశంపై స్పష్టత లేదు. దీనిపై ఇంకా అధ్యయనాలు జరుగుతున్నాయి. అయితే తమ చిన్నప్పటి అనేక అంశాలు/తొలినాళ్లలో వారిలో కలిగే సెక్స్‌భావనల సమయంలో వారిలో చిగురించే ఊహల వంటివి ఈ భావనకు తోడ్పడతాయని శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. అయితే ఈ భావనలన్నీ యుక్తవయసులోకి ప్రవేశించే దశలోనే వస్తుంటాయన్నది సుస్పష్టం. అందుకే ఆ సమయంలో అతడి భావనల్లో తనకు వ్యతిరేక సెక్స్‌పై (ఆపోజిట్ సెక్స్ పట్ల) ఆకర్షణ కలుగుతుంటే స్వాభావికంగానే (హెటెరో సెక్సువల్‌గా) పెరుగుతాడు. అదే సొంత సెక్స్ పట్ల కూడా ఆకర్షితమవుతుంటే అటు కొంతమేర స్త్రీల పట్ల ఆకర్షణతో పాటు, ఇటు పురుషుల పట్ల కూడా ఆకర్షణ కలుగుతూ బెసైక్సువల్‌గా మారే అవకాశం ఉంది. ఇక కొందరు మహిళల పట్ల పూర్తిగా ఆకర్షణ లేకుండా ఉండి, కేవలం తోటిపురుషుల పట్ల మాత్రమే ఆకర్షితులవుతుంటారు. వీరు హోమోసెక్సువల్‌గా మారిపోతారు. అదే ధోరణి వారి జీవితకాలం కొనసాగుతుంటుంది.
జెండర్ ఐడెంటిటీ డిజార్డర్ ఉన్నవారికి చికిత్స/నిర్వహణ (మేనేజ్‌మెంట్)
జీఐడీ భావనలు ఉన్నవారికి చాలావరకు చికిత్స సాధ్యమే. అయితే హోమోసెక్సువాలిటీ భావనలు ఉన్నవారికి మాత్రం కొద్దిమేరకు మాత్రమే చికిత్స చేయవచ్చు. జీఐడి రుగ్మత ఉన్నవారికి తొలుత తాము ఏ పుట్టుక పుట్టారో దాన్ని అనుసరించేలా చేసే ప్రయత్నం చేయవచ్చు. అంటే అబ్బాయిగా పుట్టిన వ్యక్తికి... తాను అబ్బాయినే అనే భావన కలిగించడం మొదటి ప్రయత్నం. ఈ ప్రయత్నంలో భాగంగా వారికి వరుసగా ఒక క్రమపద్ధతిలో సైకలాజికల్ కౌన్సెలింగ్ సెషన్స్ నిర్వహిస్తారు. వారి జీవనశైలిలో అనుసరించాల్సిన మార్పులను వారికి బోధిస్తూ... ఒక పురుషుడిలాగే ప్రవర్తించేలా ప్రోత్సహిస్తారు. వారిలో స్వాభావికమైన మార్పులు ఏవైనా ఉంటే... అంటే సెక్సువాలిటీకి కారణమయ్యే హార్మోన్ల స్రావాల్లో ఏవైనా తేడాలు ఉంటే వాటిని భర్తీ చేయడానికి బయట నుంచి హార్మోన్ ఇంజెక్షన్స్ చేస్తూ హార్మోన్ థెరపీ ఇస్తారు. ఇక వీరి విషయంలో కాగ్నెటివ్ బిహేవియర్ థెరపీ తో పాటు కొన్నిరకాల యాంటీ డిప్రెసెంట్స్‌తోనూ చికిత్స చేస్తారు.
ఇక కొందరు పై తరహా చికిత్సకు అస్సలు అంగీకరించరు. దాంతో వారు కోరుకున్న సెక్సువాలిటీకి తగినట్లుగా వారి శరీరంలో మార్పులు చేయడం కూడా ఒక ప్రయత్నం. అందులో భాగంగా వారు కోరుకున్న శారీరక అవయవాలను కృత్రిమంగా అమర్చడం, కాస్మటిక్ సర్జరీ చేయడం వంటివి చేస్తారు. ఇది కూడా వారిలోని న్యూనతను తగ్గించడానికి చేసే ప్రయత్నంలో భాగంగా చేస్తారు. ఇది తమ పుట్టుకతో వచ్చిన లైంగికతను ఇక ఎంతకూ అంగీకరించని వారి విషయంలో చేసే చివరి ప్రయత్నం.
అటువంటి లక్షణాలున్నవారు దానిని తమకు తాముగా గుర్తించి, దాని నుంచి బయటపడాలనుకుంటే మాత్రం కౌన్సెలింగ్, బిహేవియర్ థెరపీ వంటివాటి ద్వారా సత్ఫలితాలు లభించే అవకాశం ఉంటుంది.
- నిర్వహణ: యాసీన్
హోమోఫోబియా/ ఇంటర్నలైజ్‌డ్ హోమోఫోబియా
ఈ పదం ఇటీవల బాగా ప్రాచుర్యంలోకి వస్తోంది. కొందరు స్వాభావికంగా అంతా బాగానే ఉంటారు. మగవాళ్లకు సాటి ఆడవాళ్ల పట్లనే లైంగిక ఆకర్షణ ఉంటుంది. అలాగే ఆడవాళ్లకు కూడా మగవారి పట్లనే లైంగిక ఆకర్షణ ఉంటుంది. కానీ చిన్నప్పటి నుంచి హోమోసెక్సువల్ వ్యక్తులను చూడటం, వారి పట్ల అసహ్యం పెంచుకోవడం, తామూ ఏదైనా పరిస్థితుల్లో అలా అయిపోతామేమోనన్న భయాలు వారి మనసు లోతుల్లో పుట్టి, వారిని సతమతం చేస్తుంటాయి. తాము ఒకవేళ ‘గే’ లేదా ‘లెస్బియన్’గా మారతామేమో అనే ఆందోళనతో అవే ఆలోచనలు మాటిమాటికీ వస్తుండటంతో తీవ్రమైన ఒత్తిడికి గురవుతుంటారు. యుక్తవయసులో కొందరికి కలిగే ఈ భావనలు వారిని స్థిమితంగా ఉండనివ్వవు. తీవ్ర ఆందోళనకు, ఉద్వేగానికి గురిచేస్తుంటాయి. కొందరు తమ ఆలోచనల పట్ల ‘అపరాధభావన’ (గిల్టీ ఫీలింగ్) పెంచుకుంటారు. ఈ సమయంలో వారికి కౌన్సెలింగ్ అవసరం. అది కేవలం వారి మనసులోని భయం మాత్రమేనని, దాన్ని అధిగమిస్తే వారూ అందరిలా స్వాభావికంగా/ నార్మల్‌గా ఉండగలమనే స్థైర్యం పెంపొందుతుంది.
డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్