మా అబ్బాయికి ఆటిజమ్... ఏ విధమైన ఆహారం ఇవ్వాలి?
మా అబ్బాయికి ఆటిజమ్ ఉంది. మేము ఇంతవరకూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లలేదు. అయినప్పటికీ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి రకరకాల విధానాల ద్వారా వాడిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఆటిజమ్ ఉన్న పిల్లలకు కెసీన్, గ్లూటెన్ లేని ఆహారాన్ని ఇవ్వాలని స్పీచ్ థెరపిస్ట్ చెప్పడంతో... పాలు, గోధుమ ఉత్పత్తులు ఇవ్వడం పూర్తిగా తగ్గించేశాము. అయితే అప్పటినుంచి వాడు బరువు తగ్గిపోతున్నాడు. మాకు ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు.
- కె. విశాల, వరంగల్
ఇటీ వలికాలంలో ఎక్కడ చూసినా తరచు వినిపిస్తున్న పదం ఆటిజం. ప్రత్యేకమైన కారణాలేమీ లేనప్పటికీ పిల్లల్లో అతి చిన్న వయస్సు నుంచే ఈ లక్షణాలు కనపడుతున్నాయి. దీనికి కారణాలు, చికిత్స పద్ధతుల గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలాకాలంగా ఆటిజమ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు వైద్యుల సలహా సిఎఫ్‌జిఎఫ్ డైట్ ఇస్తున్నారు. అది సంపూర్ణమైన చికిత్సాపద్ధతి కానప్పటికీ, కొందరు పిల్లల్లో అసలు పని చేయనప్పటికీ, మొత్తం మీద దానిద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలను బట్టి ఆహారంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. దీనిని మంచి అనుభవజ్ఞులైన పిల్లల వైద్యనిపుణులు, పిల్లల మానసిక చికిత్సావేత్తలు మాత్రమే గుర్తించగలరు. మీరు కనుక మీ పిల్లవాడికి సిఎఫ్‌జిఎఫ్ డైట్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం దాని మూలంగా విటమిన్లు, ఇతర పోషకాల లోపం ఉండబోదని నిర్థారించుకున్న తర్వాతనే ఆ విధమైన డైట్ ఇవ్వడం ప్రారంభించాలి లేకుంటే పిల్లల్లో విటమిన్లు, ధాతువుల లోపంతో ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది.
చాలామంది తల్లిదండ్రులలో తలెత్తే సందేహం ఏమిటంటే... ఈ విధమైన తమ పిల్లలకు ఎంతకాలం పాటు ఇవ్వాలని. సాధారణంగా ఈ విధమైన డైట్ ఇవ్వడం మొదలు పెట్టిన నాలుగు వారాల నుంచి మూడు నెలల్లోగానే పిల్లల ప్రవర్తన, సామాజిక బాధ్యత వంటి అంశాలలో మార్పు కనిపించడం మొదలవుతుంది. పిల్లల భావోద్వేగాలు, మాటతీరు, ఇతరుల కళ్లల్లో కళ్లుపెట్టి సూటిగా చూడటం, పిలిచినప్పుడు స్పందించే విధానం, తోటివారితో మెలిగే తీరు వంటి వాటిలో మార్పును గుర్తించవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏవిధమైన మార్పునూ కనిపెట్టలేకపోతే చైల్డ్ సైకియాట్రిస్ట్ వాటిని సులువుగా గుర్తిస్తారు.
అయితే అదొక్కటే సరిపోదు. ఆహారంలో మార్పులతోబాటు వారి అవసరాలకు అనుగుణంగా బయో మెడికల్ ట్రీట్‌మెంట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఆటిజమ్ ఉన్న పిల్లలందరికీ ఒకేవిధమైన చికిత్సా పద్ధతి ఉండదు. వారి ప్రవర్తన, శారీరక స్థితిగతులు, తదితర లక్షణాల ఆధారంగానే చికిత్స చేయాలి. మీరు మీ అబ్బాయిని వెంటనే సుశిక్షితులు, అనుభవజ్ఞులైన చైల్డ్ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి, వారి సలహా మేరకు తగిన చికిత్స ఇప్పించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.
డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి
సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్,
హైదరాబాద్