Psychiatric
-
ఆకలికి తాళలేక పిల్లిని తినేశాడు..చివరికి మానసిక వైద్యశాలలో..
ఓ వ్యక్తి ఆకలికి తాళ్లలేక చనిపోయిన పిల్లిని తినేశాడు. ఈ దిగ్బ్రాంతికర ఘటన కేరళలో చోటు చేసుకుంది. ప్రస్తుతం అతను సైక్రియాట్రిక్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎందువల్ల ఈ జుగుప్సా కరమైన చర్యకు దిగాడు?. ఇలా పచ్చిమాంసం తినడం ఎంతవరకు మంచిది అంటే.. ఈ భయానక ఘటన కేరళలోని కుట్టిపురంలో చోటు చేసుకుది. 27 ఏళ్ల వ్యక్తి కుట్టిపురంలోని బస్టాండ్‌లో చనిపోయిన పిల్లి మాంసాన్ని తింటూ కనిపించాడు. దీంతో షాక్‌కి గురయ్యిన స్థానికలు పోలీసులుకు సమాచారం అందించారు. వెంటనే అతడిని సమీపంలోని ఆస్పత్రిలోకి తీసుకువెళ్లి పలు పరీక్షలు చేయించారు. ప్రాథమిక పరీక్షల్లో అతడు మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు తేలడంతో పోలీసులు అతడిని మానసిక వైద్యశాలలో అడ్మిట్ చేశారు. అతడు గత ఐదు రోజుల నుంచి భోజనం చేయకపోవడంతో ఈ దుశ్చర్యకు పాల్పడ్డాడని విచారణలో తేలింది. ఏదీఏమైనా వండకుండా ఇలా పచ్చి మాంసం తినడం మంచిదేనా? ఏవైనా సమస్యలు వస్తాయా? అంటే.. చాలా దేశాల్లో పచ్చిగా మాంసాన్ని తినేసే సంప్రదాయం ఉంది. ముఖ్యంగా చైనా వంటి దేశాల గురించి చెప్పనక్కర్లేదు. వాళ్లు చాలా వరకు పచ్చిగా తినేందుకే ఇష్టపడతారు. ఐతే ఇలా తినడం ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మొదటగా ఫుడ్ పాయిజన్ అయ్యి ఆరోగ్యం చెడిపోతుందని అన్నారు. పచ్చి మాంసంలో బ్యాక్టీరియా, వైరస్లు, పరాన్న జీవులు లేదా టాక్సిన్లతో చాలా విషపూరితంగా ఉంటుంది. వాటి ప్రేగులు కత్తిరించబడితే మరింత ప్రమాదం అని చెబుతున్నారు. ఒక వేళ ఆ మాంసానికి హానికరమైన వ్యాధికారకాలు వ్యాపిస్తే వధ సమయంలో ఆహార కాలుష్యం ఏర్పడుతుంది. అదీగాక సాల్మోనెల్లా, క్లోస్ట్రిడియా పెర్ఫ్రింజెన్స్, ఇ కోలి లిస్టేరియా మోనోసైటోజెన్‌లు క్యాంపిలోబాక్టర్ వంటి వ్యాధి కారకాలు పచ్చి మాంసలో ఉంటాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఇవన్నీ మానవ ఆరోగ్యానికి అత్యంత ప్రమాదకరమైనవి. ఇలా తింటే వచ్చే సమస్యలు.. వికారంతో వాంతులు అవ్వడం అతిసారం తీవ్రమైన కడుపు నొప్పి, తిమ్మిరి తీవ్రమైన జ్వరం తీవ్రమైన తలనొప్పి ఈ లక్షణాలు తిన్న 24 గంటల్లో కనిపిస్తాయి. వ్యాధికారకాన్ని బట్టి ఒక వారం లేదా అంతకంటే ఎక్కువ రోజులు ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒక్కోసారి ఫుడ్ పాయిజనింగ్‌కి చికిత్స చేయగలిగనప్పటికీ పలు సందర్భాల్లో ప్రాణాంతకం అయ్యే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు. అందువల ఉడికించి తింటే వ్యాదికారక క్రిములు నాశనంమయ్యి తినేందుకు సురక్షితంగా ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. అలాగే ఈ పచ్చి మాంసంలో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు ఉండవని చెప్పారు. కొన్ని దేశాల్లో పచ్చిగా తినే సంప్రదాయం ఉంది. ఇలా తినడం ఎంత మాత్ర సురక్షితం కానప్పటికీ అనారోగ్య ప్రమాదాన్ని తగ్గించే మార్గాలు కొన్ని ఉన్నాయన్నారు. అవి అనుసరిస్తే ప్రమాదం ఉండదని సూచించారు. పచ్చిగా తినాలనుకుంటే తాజా మాంసాన్ని, అదికూడా ముక్కలుగా ఉన్నదాన్ని ఎంచుకోమని చెబుతున్నారు. (చదవండి: ఆయుష్షు పెంచే డ్రగ్ ట్రయల్!..ఏకంగా వెయ్యి కుక్కలపై..) -
రోసాలిన్ కార్టర్ కన్నుమూత
అట్లాంటా(అమెరికా): మానసిక వైద్య సంస్కరణల కోసం అహరి్నశలు కృషిచేసిన మాజీ అమెరికా అధ్యక్షుడి భార్య, మానవతావాది రోసాలిన్ కార్టర్ కన్నుమూశారు. కొన్ని నెలలుగా తీవ్ర అనారోగ్యం, మతిమరుపు సమస్యలతో బాధపడుతున్న 96 ఏళ్ల రోసాలిన్ ఆదివారం జార్జియా రాష్ట్రంలోని ప్లేన్స్ నగరంలో స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ‘నాకు అత్యవసరమైన ప్రతిసారీ సరైన సలహాలిచి్చంది. చక్కని మార్గదర్శిగా ఉంటూ జీవితాంతం తోడుగా నిలిచింది’ అని 99 ఏళ్ల భర్త జిమ్మీ కార్టర్ పేర్కొన్నారు. -
ఈ సినిమా నాకు చాలా స్పెషల్: శ్రద్ధా దాస్
బ్యూటిఫుల్ హీరోయిన్ శ్రద్దాదాస్ తాజాగా నటించిన చిత్రం 'అర్థం'. 'మాయ' అనే సైకియాట్రిస్ట్ (మానసిక వైద్య నిపుణురాలు) చుట్టూ తిరిగే కథతో రూపొందించారు. మినర్వా పిక్చర్స్ బ్యానర్‌పై శ్రద్దాదాస్ ప్రధాన పాత్రలో 'దేవి', 'పెదరాయుడు' చిత్రాలతో బాలనటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మాస్టర్ మహేంద్రన్, అమని, అజయ్, ఈటీవీ ప్రభాకర్, జబర్దస్త్ రోషిణి, లోబో, నందా దురైరాజ్, సాహితి నటించారు. ఇంతకు ముందు అనేక చిత్రాలకు ఎడిటర్‌గా, వీఎఫ్ఎక్స్ నిపుణుడిగా పని చేసి గుర్తింపు తెచ్చుకున్న మణికాంత్ తెల్లగూటి దర్శకత్వంలో డిఫరెంట్ సైకలాజికల్ థ్రిల్లర్‌గా ఈ మూవీని తెరకెక్కించారు. ఈ సినిమాను తమిళం, తెలుగు భాషల్లో రాధిక శ్రీనివాస్ నిర్మిస్తున్నారు. అలాగే మళయాళ, కన్నడ భాషల్లోకి డబ్ చేసి విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ చివరి వారంలో విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఈ సందర్భంగా శ్రద్దా దాస్ మాట్లాడుతూ.. 'ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలన్నిటికంటే ఈ సినిమా నాకు స్పెషల్. ఇలాంటి హార్రర్ మూవీలకు వీఎఫ్ఎక్స్ ఇంపార్టెంట్. డీవోపీ పవన్ గారు నన్ను చాలా అందంగా చూపించారు. దర్శకుడు మణికాంత్ గారు, నిర్మాతలు చక్కని కథను సెలెక్ట్ చేసుకొని ఈ సినిమాను చాలా చక్కగా తెరకేక్కించారు.ఈ మూవీలో గ్లామర్ రోల్లో సైకియాట్రిస్ట్‌గా నటించాను. ఇందులోని నా పాత్ర చాలా కు స్పెషల్ గా ఉంటుంది.. ఇలాంటి మంచి కాన్సెప్ట్ ఉన్న సినిమాలో, మంచి టీంతో నటించడం చాలా హ్యాపీగా ఉంది' అని పేర్కొంది. ''మా నాన్న ఒక సినిమా ఆపరేటర్. నేను ఈ రోజు ఈ స్టేజ్ పై ఉండడానికి మా నాన్నే ఇన్స్పిరేషన్. 'అర్థం' అంటే ఏమిటి అనుకుంటున్నారు . కుటుంబ విలువలను కాపాడే, మహిళా సాధికారతను పెంపొందించే సరికొత్త కథాంశంతో రూపొందుతున్న ఈ సినిమాలో మానవ సంబంధాలు గురించి ప్రతి ఒక్కరి రిలేషన్ గురించి ఇందులో చూపించాం. నిర్మాతకు సినిమా అంటే ఎంతో పిచ్చి. అర్జున్ రెడ్డికి బ్యాగ్రౌండ్ స్కోర్ ఇచ్చిన హర్షవర్ధన్ రామేశ్ గారు ఈ సినిమాకు మంచి మ్యూజిక్ ఇచ్చాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలన్నిటికంటే శ్రద్దా దాస్ కు ఈ సినిమా మంచి టర్నింగ్ అవుతుంది'' అని డైరెక్టర్ మణికాంత్ తెల్లగూటి తెలిపారు. -
కరోనా సోకిన రెండేళ్ల వరకు మానసిక సమస్యలు
లండన్: కోవిడ్ రోగుల్లో రెండేళ్ల తర్వాత కూడా మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని లాన్సెట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ వర్సిటీ 12.5 లక్షల మంది కరోనా రోగులపై నిర్వహించిన అధ్యయనం వివరాలను లాన్సెట్ సైక్రియాట్రి జనరల్ తన తాజా సంచికలో ప్రచురించింది. కరోనా సోకినప్పుడు శ్వాసకోశ సంబంధింత వ్యాధులతో పాటుగా రెండేళ్ల వరకు సైకోసిస్, డిమెన్షియా, బ్రెయిన్ ఫాగ్ వంటి కొనసాగుతున్నాయని అధ్యయనం తేల్చింది. చిన్నారుల్లో కంటే పెద్దవారిలోనే ఈ సమస్యలు ఎక్కువగా వస్తున్నట్టు పేర్కొంది. మానసిక, నరాలకు సంబంధించిన వ్యాధులు కోవిడ్ సోకిన మొదటి ఆరు నెలల్లోనే వచ్చి రెండేళ్ల వరకు ఉంటున్నాయని అధ్యయనంలో పాల్గొన్న ప్రొఫెసర్ పాల్ హరిసన్ వివరించారు. -
Covid-19: దిమాక్ ఖరాబ్ చేస్తున్న కరోనా
లండన్: కరోనా వచ్చి పోయింది, మానసికంగా ఒడిదుడుకులకు గురైనా పర్వాలేదుగానీ ఓ గండం దాటేశాం అనుకుంటున్న వాళ్లకు.. కొత్త కొత్తగా వస్తున్న నివేదికలు మరింత ఆందోళన రేకెత్తిస్తున్నాయి. శ్వాస కోశ వ్యవస్థ.. అంతర్గత అవయవాల పని తీరును డ్యామేజ్ చేయడం వరకే వైరస్ ప్రభావం ఆగిపోలేదు. పోస్ట్ కొవిడ్ ఎఫెక్ట్.. మెదడుపైనా దీర్ఘకాలం ప్రభావం చూపెడుతోందని తాజా అధ్యయనాల ఫలితాలు వెల్లడిస్తున్నాయి. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వివిధ దేశాల నుంచి సుమారు పన్నెండున్నర లక్షల మంది పేషెంట్ల ఆరోగ్య నివేదికల ఆధారంగా.. లాన్సెట్ సైకియాట్రీ జర్నల్ తాజాగా ఓ కథనాన్ని ప్రచురించింది. ఇంత భారీ సంఖ్యలో ఫీడ్ బ్యాక్ తీసుకోవడం ఇదే మొదటిది. వీళ్లలో శ్వాస కోశ, హృదయ, ఎముకల సంబంధిత సమస్యల కంటే.. మెదడు మీదే కరోనా తీవ్ర ప్రభావం చూపుతోందని గుర్తించారు. COVID-19 మహమ్మారి ప్రారంభమైనప్పటి నుండి, ప్రాణాలతో బయటపడినవారు నాడీ సంబంధిత, సైకియాట్రిక్ సమస్యల బారినపడుతున్న ప్రమాదం ఎక్కువగా ఉందని ఆధారాలు అంతకంతకు పెరుగుతూ వస్తున్నాయి. బ్రెయిన్ ఫాగ్.. ఇబ్బందికర పరిస్థితి. పనుల మీద దృష్టిసారించకపోవడం. విషయాల్ని గుర్తుంచుకోకపోవడం. చుట్టూ ఉన్న విషయాలను పట్టించుకోకపోవడం.. మీ మీద మీకే విరక్తి కలగడం. ఎపిలెప్సీ.. బ్రెయిన్ యాక్టివిటీ అబ్నార్మల్గా ఉండడం. అసాధారణ ప్రవర్తన. వీటితో పాటు మూర్ఛ సంబంధిత సమస్యలూ వెంటాడుతున్నాయి. డిప్రెషన్, యాంగ్జైటీ రూపంలో స్థిమితంగా ఉండనివ్వడం లేదు. వైరస్ బారినపడి కోలుకున్నవాళ్లలో.. ఆరు నెలల నుంచి రెండేళ్లపాటు మానసిక రుగ్మతలు కొనసాగడం గుర్తించినట్లు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ పౌల్ హారిసన్ వెల్లడించారు. కొవిడ్-19 తర్వాతే ఎందుకిలా జరుగుతుంది?.. ఇది ఇంకెంత కాలం సాగుతుంది?.. సమస్యలను అధిగమించడం ఎలా? అనే వాటిపై మరింత అధ్యయనం జరగాల్సి ఉందని ఆయన అంటున్నారు. ఇదీ చదవండి: షియోమి వారి కుంగ్ ఫూ రోబో! -
హైస్కూల్ చదువు.. మెంటల్ డాక్టర్ కొలువు..!!
మాస్కో : మానవత్వం కనుమరుగై స్నేహితుని గొంతు కోసి చంపడమే కాకుండా అతని రక్తం తాగిన ఓ రాక్షసుడు డాక్టర్ అవతారం ఎత్తాడు. హోమిసైడల్ స్క్రీజోఫీనియా అనే మానసిక వ్యాధితో.. ఉన్మాదిగా మారిన ఆ వ్యక్తి ఏకంగా సైకియాట్రిక్ డాక్టర్‌గా చలామణి అయ్యాడు. వివరాలు.. ఉరల్స్ పట్టణంలోని ఓ సైకియాట్రిక్ ఆస్పత్రిలో బోరిస్ కొంద్రషీన్ (36) డాక్టర్‌గా పనిచేస్తున్నారు. ఫేక్ సర్టిఫికెట్లతో ఉద్యోగం చేస్తున్నట్టు గత నవంబర్‌లో గుర్తించారు. రాక్షసుడిగా అవతారం 1998లో కొంద్రషీన్ 16 ఏళ్ల తన హైస్కూల్ స్నేహితున్ని మత్తుమందు ఇచ్చి హత్య చేశాడు. అనంతరం తనను తాను రాక్షసుడిగా ఊహించుకుని అతని రక్తం తాగాడు. కొంద్రషీన్ మానసిక వ్యాధితో బాధపడుతున్నందున కోర్టు అతనికి సైకియాట్రిక్ ట్రీట్మెంట్ ఇప్పించాలని అతని కుటుంబాన్ని 2000 సంవత్సరంలో ఆదేశించింది. పదేళ్లపాటు ట్రీట్మెంట్ పొందిన కొంద్రషీన్ ఫేక్ సర్టిఫికెట్లు సంపాదించి నగరంలోని‘ సిటీ హాస్పిటల్’లోఉద్యోగంలో చేరాడు. మద్యం సేవించడం.. పొగ త్రాగడం వల్ల వచ్చే అనర్ధాలను వివరిస్తూ ప్రజల్ని అప్రమత్తం చేయడమే అక్కడ కొంద్రషీన్ పని. ఎవరికీ అనుమానం రాకుండా డాక్టర్‌గా నటిస్తూ అందర్నీ నమ్మించాడు. అయితే ఇంటర్‌ఫ్యాక్స్ అధికారులు సదరు ఆస్పత్రిలో తనిఖీలు నిర్వహించడంతో ఈ నరహంతక ‘సైకియాట్రిక్’బండారం బయటపడింది. ఇంద్రషీన్ను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ‘నాకు గానీ, మా అమ్మకు గానీ కొంద్రషీన్ జాబ్ చేస్తున్నాడని తెలియదు. అతను హైస్కూల్ వరకే చదువుకున్నాడు’ అని కొంద్రషీన్ సోదరి చెప్పారు. అయితే, ట్రీట్మెంట్ అనతరం తన సోదరుడు పూర్తిగా మారిపోయాడని, ఎవరికీ హాని తలపెట్టడం లేదని తెలిపారు. అతను ఇంకొన్నాళ్లు వైద్యుల పర్యవేక్షలో ఉంటే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. -
సైకియాట్రీ కౌన్సెలింగ్
మా ఊళ్లో మాకు తెలిసిన ఒక వ్యక్తి రోజుల తరబడి ఒకే భంగిమలో స్థాణువులాగా నిలబడిపోయి ఉన్నాడు. అదే భంగిమలో స్థిరంగా, శిలావిగ్రహంలా ఉండటాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆయన మాకు దూరపు బంధువు. ఆయనను బాగు చేసే అవకాశం లేదా? - సునీల్, కర్నూలు ఒక వ్యక్తి శిలావిగ్రహంలా అదేపనిగా అలా నిలబడిపోవడాన్ని సైకియాట్రిక్ పరిభాషలో ‘కెటటో నియా’ అంటారు. ఇందులో చాలా రకాలు ఉంటాయి. ఉదాహరణకు కెటటోనిక్ రిజిడిటీ అనే కండిషన్లో వ్యక్తి కండరాలు బిగుసుకుపోయి చాలాసేపు కదలకుండా ఉంటాయి. ఇక పోస్ట్యూరింగ్ అనే స్థితిలో రోగులు అత్యంత కఠినమైన, ఇబ్బందికరమైన భంగిమల్లో గంటలు / రోజుల తరబడి ఉండిపోతారు. ఇలా కెటటోనియా కండిషన్ అనేక రకాలుగా వ్యక్తమవు తుంది. అయితే ఈసీటీ అనే చికిత్సతోనూ, కొన్ని మందులతోనూ వీళ్లను పూర్తిగా బాగు చేసే అవకాశం ఉంది. ఆ వ్యక్తిని మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లండి. - డాక్టర్ శ్రీనివాస్ ఎస్.ఆర్.ఆర్.వై కన్సల్టెంట్ సైకియాట్రిస్ట్, ప్రభుత్వ మానసిక చికిత్సాలయం, ఎర్రగడ్డ, హైదరాబాద్ -
మా అమ్మాయి మనసు మార్చేదెలా..?
మా అమ్మాయి వయసు 23. బీటెక్ పూర్తయి ఉద్యోగం చేస్తోంది. చాలా అందమైనది, తెలివైనది. క్రమశిక్షణగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి ఒక స్వామీజీ దగ్గరకెళ్లింది. స్వామీజీ తనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారట. అప్పటినుంచి ఆమె ఆ స్వామికి భక్తురాలిగా మారిపోయింది. తరచు స్వామి ఉండే ఆశ్రమానికి వెళ్లడం మొదలు పెట్టింది. పోనీలే అని మేము చూస్తూ ఊరుకున్నాము. అయితే కొద్దికాలంగా ఆమె ఉద్యోగం కూడా వదిలేసి పూర్తిగా ఆయన సేవకే అంకితమైపోయింది. పెళ్లి చేసుకోకుండా స్వామికి పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అంటోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఏం చేయమంటారు, సలహా ఇవ్వండి. - ఓ నిస్సహాయ తల్లిదండ్రులు, విశాఖపట్నం గాభరాపడకండి, ఇలాంటి సమస్య ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులకు ఎదురవుతోంది. అయితే అందరూ మీలాగా ధైర్యంగా బయటపడట్లేదంతే! సాధారణంగా ఇలా సన్యాస మార్గాన్ని ఎంచుకుంటున్న యువతీ యువకులలో చాలావరకు చిన్నప్పటినుంచి వివిధ కారణాల వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నవారే అయి ఉంటారు. మూడ్స్ తరచు మారిపోతుండటం, బాగా డల్‌గా లేదా బాగా యాక్టివ్‌గా ఉండటం కూడా వీరి లక్షణాలలో ఒకటి. ఇటువంటప్పుడు తల్లిదండ్రులు లేదా స్నేహితుల ఆసరా, సహకారం లభించకపోవడం వల్ల లేదా వారిముందు తమ సమస్యలను చెప్పుకోలేకపోవడం వల్ల మృదువుగా, మధురంగా మాట్లాడే స్వామీజీలవంటి వారి మాటల ప్రభావానికి ఇట్టే లోనయ్యే అవకాశం ఉంది. ఇదే అదనుగా అటువంటి స్వామీజీలు తమ మాటలతో, సాంత్వన వచనాలతో వారిని మరింతగా ఆకట్టుకుని, తమ చుట్టూ తిరిగేలా, తాము ఏది చెబితే దానిని గుడ్డిగా అనుసరించేలా చేసుకుంటారు. తమ శిష్యులుగా తయారు చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఇటువంటి వాటిని తొందరగా గమనించకపోవడం వల్ల, ఒకవేళ గమనించినా చూసీ చూడనట్టు వదిలేయడం వల్ల వారు స్వాముల ప్రలోభానికి, ప్రభావానికి మరింత ఎక్కువగా లోనై, వారి ఆకర్షణ నుంచి బయటకు రాలేని ఒకలాంటి తాదాత్మ్యస్థితిలోకి వెళ్లిపోతారు. మీరు మీ అమ్మాయి విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, వ్యవహారం పూర్తిగా తారుమారయే ప్రమాదం ఉంది. ముందు మీరు ఆశ్రమ సిబ్బందికి విషయాన్నంతటినీ వివరించి, వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడండి. తొలుత కొంతకాలంపాటు స్వామివారు ఇప్పుడు ఎవరినీ కలవాలని అనుకోవడం లేదని చెప్పిస్తూ, ఆశ్రమానికి వెళ్లడాన్ని తగ్గించేలా చేయండి. వారంలో కనీసం ఒకటి రెండు రోజులు తను ఎక్కడికీ వెళ్లకుండా మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉండేలా చేయండి లేదా మీరే ఆమెను అంటిపెట్టుకుని ఉండండి. ఎలాగో ఒకలాగా నచ్చజెప్పి, తనను వెంటబెట్టుకుని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకు వెళ్లండి. అంతకుమునుపే మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి విషయమంతా వివరిస్తే, వైద్యులు ఆమెతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు. సైకియాట్రిస్ట్ ఆమెతో మాట్లాడిన తర్వాత అసలు ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుకగల కారణాలను విశ్లేషించి, అందుకు తగిన కౌన్సెలింగ్ లేదా అవసరమైతే మందులను ఇచ్చి, ఆమె నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేసేందుకు ప్రయత్నించవచ్చు. మీ ప్రయత్నం మీరు చేయండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
ఆమెలోని విపరీత ధోరణి మారేదెలా?
నేనొక సాఫ్ట్వేర్ కంపెనీకి డెరైక్టర్ని. అందమైన భార్య, బుద్ధిమంతులైన పిల్లలు, అంతా సంతోషంగా గడిచిపోతోందనుకుంటున్న తరుణంలో జరిగిన కొన్ని సంఘటనలు మా కుటుంబాన్ని కూల్చేలా పరిణమించాయి. ఏమిటంటే... ఉద్యోగరీత్యా నేను తరచు క్యాంప్‌లకు వెళుతుంటాను. ఒక్కోసారి రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంటుంది. ఈ తరుణంలో ఒకసారి నా భార్య నా స్నేహితునితో చాలా ‘క్లోజ్’గా ఉండ గా నా తల్లిదండ్రుల కంటబడింది. తనని క్షమించమని, ఇంకెప్పుడూ అలా చెయ్యనని ప్రాధేయపడింది. కొన్నాళ్లకు అంతా సజావుగా ఉందనుకునేంతలోనే మరో‘సారీ...’ మామూలుగా ఆమె చాలా మంచిది. కానీ ఈ ఒక్క విషయంలోనే... ఏదైనా తీవ్రనిర్ణయం తీసుకుంటే నా పిల్లలు బాధపడతారని ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - అజిత్, హైదరాబాద్ మీ శాంతం, సహనం ప్రశంసనీయం. పిల్లల భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయం మెచ్చదగ్గది. మీది చాలా నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన తీవ్రమైన సమస్య. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ భార్య సైక్లోథైమిక్ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతోందని అర్థమవుతోంది. ఇది బైపోలార్ డిజార్డర్‌కు తీవ్రరూపం. ఈ స్థితిలో పేషెంట్లు రకరకాలైన భావోద్వేగాలు కలగలసిన మైండ్‌తో ఉంటారు. మంచి మూడ్‌లో ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటూ, మంచి పనులు చేయాలని కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతారు. ఈ ప్రపంచాన్నే జయించగలమన్నంత ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆ సమయంలోనే కొత్త కొత్త స్నేహితులను, సంబంధాలను పెంచుకుందామనుకుంటారు. ఒకదశలో అది శృతిమించి, వారితో రకరకాలైన రిలేషన్స్‌ను పెంచుకునే స్థాయికి వెళతారు. ఒకవేళ వారు ఇంటర్నెట్ను, సోషల్ నెట్వర్కింగ్ వెబ్సైట్లను వాడేవారైతే గనుక ఈ ధోరణి వెర్రితలలు వేస్తుంది. అపరిచితులను కూడా ఇంటికి ఆహ్వానించేంత తీవ్రస్థాయిలో వీరి భావోద్వేగాలుంటాయి. ఆ స్నేహితులు వీరి మూడ్‌ను అదనుగా చేసుకుని క్యాష్ చేసుకుంటే మనం చేయగలిగిందేమీ ఉండదు. అదే వీరి మూడ్ బాగోకపోతే మాత్రం నిరుత్సాహం, నిరాశానిస్పృహలతో కుంగిపోతారు. తమవల్ల ఏదైనా చిన్న తప్పు జరిగినా, అందుకు పదే పదే క్షమాపణలు కోరతారు. ఒకోసారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, నిస్సహాయ ధోరణికి మారిపోతారు. ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. ఒక తరుణంలో ఆత్మహత్యకు కూడా పాల్పడతారు. కుటుంబసభ్యులు ఇటువంటి పేషెంట్లలోని మూడ్స్‌ను గమనించి, అందుకు అనుగుణంగా నడుచుకోవడం అవసరం. వారిని తీవ్రంగా మందలించడం, కోప్పడటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండకపోగా, మరింత కుంగిపోతారు. మీ శ్రీమతి స్వతహాగా మంచిదేనంటున్నారు, స్వభావం కూడా చెడ్డది కాదంటున్నారు కాబట్టి, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తోందో అర్థమవుతుంది. ఇదే సమయంలో మీ శ్రీమతి విషయంలో మీరు సానుభూతి చూపడం, క్షమాగుణంతో వ్యవహరించడాన్ని కొనసాగించడం అవసరం. ఆమెను వెంటనే సైకియాట్రిస్ట్‌కు చూపించి, వారి సలహా మేరకు మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ ఇప్పించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మా అమ్మాయి ఎందుకిలా..?
మా అబ్బాయిది బీటెక్ చదివి, జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. పార్టీలు, విందువినోదాలకు రమ్మని ఎంత బతిమాలినా రాడు, బలవంతం చేస్తే, విసుక్కుంటాడు. వాడితో ఎలా వేగాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా చెప్పగలరు. -పార్వతి, విశాఖపట్నం మీరు చెబుతున్నదాన్ని బట్టి మీ అబ్బాయి అలా ప్రవర్తించడానికి డిప్రెషన్, రకరకాల భయాలు (ఫోబియాలు) వంటి సాధారణమైన కారణాలతోబాటు స్కిజోఫ్రినియా వంటి తీవ్రమైన కారణం కూడా ఉండవచ్చు. పరిశీలిస్తేగాని నిర్థారణగా చెప్పలేం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పుడు ఎవరితోనూ కలవకపోవడం, తోటిపిల్లలతో ఆటలాడకపోవడం, అల్లరి చేయకుండా, మందకొడిగా ఉండటాన్ని గమనించి కూడా తమ పిల్లలు బుద్ధిమంతులని మురిసిపోతారు. అది చాలా పొరపాటు. అలా వదిలేస్తే వారు పెద్దయ్యాక కూడా స్తబ్దుగా తయారవుతారు. ఫ్రెండ్స్ లేకపోవడం, పదిమందిలోనూ కలవకపోవడం, పార్టీలు, ఫంక్షన్లు అంటే విముఖత ఏర్పడటం వంటి లక్షణాలు పెంపొందుతాయి. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కొరవడి, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, ఆత్మన్యూనతాభావంతో ఎవరితోనూ పోటీపడలేక, తమలో తాము కుచించుకుపోతుంటారు. తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడితో బాధపడతారు. మీరు మీ అబ్బాయిని తీసుకుని సైకియాట్రిస్ట్‌ని సంప్రదించండి. వైద్యులు అతనికి మెడికల్ ట్రీట్మెంట్, కౌన్సెలింగ్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేస్తారు. క్రమంగా అతని పరిస్థితి మెరుగవుతుంది. మా అమ్మాయి ఎంబిఏ చేసింది. చక్కగా ఉంటుంది. 26 ఏళ్లు వచ్చాయి. పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుంటే, ఏదోవంకతో అన్నిటినీ తిరగ్గొడుతోంది. పోనీ ఎవరినైనా ప్రేమించిందా అంటే అదీ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - బి. కృష్ణవేణి, హైదరాబాద్ ఇది మనదేశంలో ఇటీవల కనిపిస్తున్న సమస్య. జపాన్ వంటి దేశాల్లో ఇది చాలా ప్రధాన సమస్య. ఇందుకు రెండు కారణాలుండవచ్చు. ప్రస్తుత సమాజంలో చాలా పెళ్లిళ్లు విచ్ఛిన్నమవటం, భార్యాభర్తలలో ఒకరు ఆవేశంతో జీవితాన్ని అంతం చేసుకోవడం, ఫలితంగా వారి కుటుంబంరోడ్డున పడటం వంటి విషాదకరమైన సన్నివేశాలు, సంఘటనల గురించి వింటుంటాం. దాంతో కొందరు అమ్మాయిలు లేదా అబ్బాయిలు ‘పెళ్లంటే... అయితే అడ్జస్టు, కాకుంటే కలహాల కాపురం లేదంటే బరువు బాధ్యతలు మోయటమే కదా, రేపు నా పరిస్థితీ ఇంతేనేమో’ అన్న ఆలోచిస్తారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రుల బంధాలు కొరవడిన వారిలో ఇటువంటి భావన క్రమేపీ బలపడి, పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేస్తారు. మరికొందరు తల్లిదండ్రుల అతిభద్రత, అతిజాగ్రత్త, క్రమశిక్షణ వల్ల కూడా పెళ్లి పట్ల వ్యతిరేకభావనలు పెంచుకుంటారు. అలాగే సమాజంలో అడపాదడపా జరిగే కొన్ని సంఘటనలు బంధువులో, తెలిసిన వాళ్ల చేతిలోనో మోసపోవటం, లైంగిక దాడికి గురవటం, ఫలితంగా పెళ్లి పట్ల తీవ్ర విముఖత ఏర్పరచుకుంటారు. వీటిని దృష్టిలో పెట్టుకుని, మీ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలను విశ్లేషించండి. ఫ్యామిలీ కౌన్సెలర్ వద్దకు తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇప్పించండి. నెమ్మదిగా ఆమెలో మార్పు వచ్చే అవకాశం ఉంది. డోంట్ వర్రీ. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మా అబ్బాయి దురలవాట్లను మాన్పించడం ఎలా?
మా అబ్బాయి చెన్నైలో మంచి పేరున్న కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే చెడుసావాసాలకు అలవాటుపడి, కానబీస్ అనే మత్తుపదార్థాన్ని సేవిస్తున్నాడని తెలిసి, కాలేజీ మాన్పించి ఇంటికి తీసుకొచ్చేశాం. చిన్నప్పటినుంచి కూడా ఆటలాడుకుంటూ, కులాసాగా గడిపేద్దామనే తప్ప చదువు ధ్యాస బొత్తిగా లేదు. ఎలాగో ఇంజినీరింగ్ వరకు నెట్టుకొచ్చాం. వాడికి మంచి లక్ష్యాలు ఉన్నాయి కానీ, వాటిని నెరవేర్చుకునేందుకు ప్రయత్నించడు. మాకు వాడితో ఎలా వేగాలో అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఒక తల్లి, హైదరాబాద్. మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను. అయితే దేనినైనా మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి. లేదంటే పెద్దయ్యాక ఇలాగే తయారవుతారు. అందుకే పిల్లలకు చిన్నప్పటినుంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేలా చూడటం ముఖ్యం. కొందరు పిల్లలు చిన్నప్పటినుంచి ఒకవిధమైన ధోరణిలో ఉంటారు. తల్లిదండ్రుల గారాబం వల్ల, పుష్కలంగా డబ్బుండటం వల్ల, జల్సాకు అలవాటుపడి, చదువును నిర్లక్ష్యం చేస్తారు. క్లాసులో టీచర్లు చెప్పేది వినరు, నోట్సు రాసుకోరు. క్లాసులే కాదు, పరీక్షలు కూడా ఎగ్గొడుతుంటారు. డబ్బుండటం వల్ల రకరకాల స్వభావాలుండే స్నేహితులు వీరి వెనకాల తిరుగుతుంటారు. పిల్లలు ఇలా ఉన్నప్పుడే పెద్దలు దానిని ఖండించి, నయానో, భయానో నచ్చజెప్పి వారిని గాడిలో పడేలా చేయాలి. లేదంటే పెద్దయినా వారిలో ఇదే ధోరణి కొనసాగుతుంది. సాధారణంగా ఇటువంటి పిల్లలు క్షణికమైన ఆనందాన్నిచ్చే మత్తుపదార్థాలు, మద్యపాన ం, ధూమపానం తదితర దురలవాట్లకు అలవాటుపడి, వాటికి తొందరగా బానిసలుగా మారతారు. ఫలితంగా సంఘవిద్రోహశక్తులుగా కూడా మారతారు. మీ అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతుంటే మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారంటున్నారు. అలా ఖాళీగా ఉంటే మరింతగా చెడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అతన్ని తనకిష్టమైన మరో మార్గం వైపు మళ్లించేందుకు ప్రయత్నించండి. అంటే స్పోర్ట్స్, గేమ్స్ లాంటి వాటివైపన్నమాట. మీరు, మిగిలిన కుటుంబ సభ్యులందరూ అతన్ని బాగా చూసుకోండి, ప్రేమగా మెలగండి. తాను చేస్తున్నది తప్పని తనే తెలుసుకునేలా చేయండి. సైకోథెరపీ, కౌన్సెలింగ్ వంటి వాటిద్వారా అతని మనసును మంచి మార్గంవైపు మళ్లేలా చూడండి. అంతేకానీ, హిప్నాటిజం వంటి వాటివల్ల అద్భుతం జరిగి, అతను అనూహ్యంగా మారతాడని మాత్రం ఆశించకండి. మీ అబ్బాయిని తీసుకుని మంచి సైకాలజిస్టును కలవండి. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్ సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
పిల్లలిద్దరితో వేగలేకపోతున్నాను..?
మా పెద్దవాడికి ఆరేళ్లు. రెండోవాడికి రెండేళ్లు. ఇద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. చిన్నవాడికి ఏమి తెస్తే అది తనకూ కావాలని పెద్దవాడు పేచీపెడుతుంటాడు. ‘తమ్ముడితోనే ఎక్కువసేపు గడుపుతున్నావు, నీకు నేనంటే ఇష్టం లేదు’ అని అలుగుతుంటాడు. నేను జాబ్ చేస్తున్నాను. ఇంటికి వచ్చేసరికి వీళ్లిద్దరి తగవులు తీర్చలేక సతమతమవుతున్నాను. మావారేమో ఇద్దరు పిల్లలను పెంచడం కూడా చేతకాకపోతే ఎలా అంటూ నన్నే ఎగతాళి చేస్తుంటారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా చెప్పగలరు. - సుప్రియ, తెనాలి ఇది చాలామంది ఇళ్లలో సాధారణంగా జరిగేదే. దీనిని సిబ్లింగ్ రైవలరీ అంటారు. ఒకవిధంగా ఇది ఇది డెవలపింగ్ మైల్‌స్టోన్‌గా చెప్పవచ్చు. అంటే సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడి, నెగ్గుకురావడం ఎలాగో మీ పిల్లలు ఇప్పటినుంచే నేర్చుకుంటున్నారన్నమాట! ఇదే ధోరణి వారికి కనీసం పదహారు పదిహేడేళ్లు వచ్చేవరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ స్నేహితులైపోతారు. అయితే ఇది రానురానూ మరీ తీవ్రమై, హింసాత్మక ధోరణులకు దారితీసేలా ఉంటే గనక ఇద్దరినీ చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. అసలు పిల్లలు అలా చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే... తల్లిదండ్రుల ప్రేమను పొందడం గురించి పిల్లలు ఒకరితో ఒకరు పోటీపడటం. మరీ చిన్నపిల్లలైతే గనక వారికి పూర్తిగా తెలియక, తమ అసంతృప్తిని రకరకాలుగా వ్యక్తం చేస్తుంటారు. చిన్నవాళ్లతో పోటీగా మరీ పసిపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. వయసును బట్టి వారి ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది. తమ్ముడిని లేదా చెల్లెలిని తిట్టడం, కొట్టడం, బాధ పెట్టడం...చేస్తుంటారు. ఇది కేవలం పెద్దపిల్లలు చిన్నవాళ్లను చేయడమే కాదు, చిన్నపిల్లలు పెద్దవారిని కూడా చేయవచ్చు. మీరు ఏం చేస్తారంటే... వీలైనంతవరకు ఇద్దరితోనూ సమానంగా సమయాన్ని వెచ్చిస్తుండాలి. మీరు చిన్నవాడితో గడిపేటప్పుడు పెద్దవాడిని వాళ్ల నానమ్మ దగ్గరో, నాన్న దగ్గరో ఉండేలా చేయండి. తర్వాత దగ్గరకు పిలిచి, ఇద్దరితోనూ కలిసి గడపండి. పెద్దవాడిని పొరపాటున కూడా ‘చిన్నవాడితో పోల్చకండి. నిజానికి పెద్దవాడు కూడా వయసులో అంత పెద్ద ఏమీ కాదు కదా! కొంతకాలం ఓపికపట్టడం, బుద్ధిగా ఉంటే బహుమతులు ఇస్తానని పెద్దవాడిని ఊరించడం, చిన్నవాడిని కూడా పెద్దవాడితో ఆడుకునేలా చేయడం ఒక్కటే మార్గం. వీరిద్దరి గొడవలో పడి మీరు రిలాక్స్ కావడం మరచిపోవద్దు. లేదంటే మీరు డిప్రెషన్లో పడతారు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మూడేళ్లొచ్చినా... ఇంకా నడక, మాటలు రాలేదు..?
మా అబ్బాయికి మూడేళ్లు. వాడిలో ఆటిజం లక్షణాలున్నట్లు కనుక్కున్నాము. ఇంకా మాటలు సరిగా రాలేదు. ఏది కావాలన్నా అడగలేడు. ఎవరితోనూ కలవడు. వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే కొన్ని రకాల రక్తపరీక్షలతోబాటు ఈయీజీ, ఎమ్మారై పరీక్షలు చేయించమన్నారు. దాంతో మా ఆవిడ చాలా కంగారుపడుతోంది. అసలు మా అబ్బాయి సమస్య ఏమిటి? ఇంత ఖరీదైన పరీక్షలు వాడికి ఈ వయసులోనే ఎందుకు? -బి. రాధాకృష్ణ, హైదరాబాద్ మీ సమస్యకు జవాబిచ్చే ముందు మాకు మరికొంత సమాచారం కావాలి. మీ అబ్బాయికి ఆటిజమ్ అని తెలిసిందన్నారు. ఎలా తెలిసింది? గర్భధారణ సమయంలో మీరేమైనా రుగ్మతలతో బాధపడ్డారా? ప్రసవం ఎలా జరిగింది? కాంప్లికేషన్లు ఏమైనా ఎదురైనాయా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మీకు పూర్తి సమాధానం ఇవ్వగలం. అయితే మాకు అర్థమయినదాన్ని బట్టి... మీ బాబులో ఏవైనా నరాలకు సంబంధించి అసాధారణ రుగ్మతలు లేదా ఫిట్స్, మూర్ఛ వంటి ఏమైనా ఉండి ఉండవచ్చునని మీ బాబుకు చికిత్స చేస్తున్న డాక్టర్ అనుమానించి ఉండవచ్చు. అందుకే ఎమ్మారై, ఈఈజీ పరీక్షలు చేయించమని సలహా ఇచ్చి ఉంటారు. ఒక్కోసారి జన్యుసంబంధిత పరీక్షలు చేయించవలసి రావచ్చు. డాక్టర్లు అయినా చిన్న పిల్లలకు సంబంధించి అన్ని విధాలైన కేస్ స్టడీస్ చేసి, ఆయా పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతగానీ చికిత్స మొదలు పెట్టలేరు కదా! పెరుగుదలకు సంబంధించిన సమస్యలు అంటే పారాడటం, నడక, మాట్లాడటం, మెదడు అభివృద్ధి చెందటం వంటివి ఆటిజమ్ ఉన్నవారికే ఉండాలని లేదు. ఎవరికైనా రావచ్చు. శిశువులో ఎదుగుదల ఆలస్యం అవుతోందనుకుంటే వైద్యుడి సలహాను బట్టి విటమిన్లు, ధాతువులు, ఇతర పోషకాలు కలిగిన ఆహారాన్ని లేదా నేరుగా విటమిన్ మాత్రలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను తగిన మోతాదులో బిడ్డకు అందించవలసి ఉంటుంది. మాటకు సంబంధించి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి చికిత్సల ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. అన్నింటికన్నా ముఖ్యం... కొందరిలో కొన్ని ఆలస్యంగా కూడా జరగవచ్చు. అంతమాత్రానికే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు భయపడిపోయి, బెంబేలెత్తిపోయి మీ బిడ్డకు ఇక మాటలు రావేమో, నడవలేడేమో అని కుంగిపోవలసిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఇంటిలోని ఇతర పెద్దల సలహా మేరకు సత్ఫలితాలను పొందడానికి చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూ... మరీ ఆలస్యం అవుతోందనుకుంటే డాక్టర్ సలహా తీసుకుని వాటిని ఆచరణలో పెట్టడం అవసరం. మీ బాబుకు మూడేళ్లే అన్నారు కదా, ఇప్పటికి ఏమీ మించి పోలేదు. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలా ఆలస్యంగా నడక, మాటలు వచ్చిన వారున్నారేమో మీ పెద్దల ద్వారా తెలుసుకుని, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే, చైల్డ్ సైకియాట్రిస్ట్‌ను కూడా సంప్రదించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
అబ్బాయి సమస్యకు ఆ పరీక్షలెందుకు?
మా అబ్బాయికి మూడేళ్లు. వాడికి ఆటిజమ్‌తో పాటు వికాసంలో లోపాలు ఉన్నట్లు తెలిసింది. అయితే వాడికి మాటలింకా రావాల్సి ఉంది. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేడు. మాకు తెలిసిన డాక్టర్‌కు చూపిస్తే ఆయన రక్తపరీక్షలు, ఈఈజీ, ఎమ్మారై చేయించమని చెప్పారు. మేం అడగదలచుకున్న అంశం ఏమిటంటే... మా అబ్బాయి విషయంలో వచ్చిన సమస్య ఏమిటి? పైన పేర్కొన్న పరీక్షలన్నీ వాడి విషయంలో ఎలా ఉపయోగపడతాయి? - ఎస్. ఝాన్సీ, రాజమండ్రి మీ అబ్బాయి లాంటి కేసుల్లో అతడి పుట్టుక నుంచి మొదలుకొని ఇప్పటివరకూ మెడికల్ హిస్టరీ అవసరమవుతుంది. గర్భధారణ సమయంలోని హిస్టరీ కూడా అవసరం. అతడి పరిస్థితిని అంచనా వేయడానికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేకమైన గణన పరీక్షలు కూడా చేయాలి. ఇలా అతడి గురించి అన్ని వివరాలూ సేకరించాకనే అతడికి ఉన్న సమస్య, ఆటిజమ్ ఉందా లేదా అన్న విషయం నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అయితే అన్ని కేసుల్లోనూ అన్ని రకాల పరీక్షలూ అవసరం కాకపోవచ్చు. కొన్ని కొన్ని విషయాలు బయటపడుతున్న కొద్దీ దాన్ని బట్టి తదుపరి కొన్ని నిర్దిష్టమైన పరీక్షలు అవసరమవుతాయా, లేదా అన్నది తెలుస్తుంది. ఒక్కోసారి ఇది జన్యుపరంగా వచ్చిందా అన్న సందేహం వస్తే అప్పుడు జెనెటిక్ పరీక్షలు అవసరమవుతాయి. అలాగే ఈఈజీ, ఎమ్మారై అన్న పరీక్షలతో పిల్లాడిలో ఏవైనా నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా లేదా ఫిట్స్ /సీజర్స్ ఉన్నాయా అన్నది తెలుస్తుంది. అయితే ఏయే పరీక్షలు ఎవరికి చేయాలన్నది రోగి నుంచి రోగికి మారుతుంది. ఇక మీరు చెబుతున్న వికాసంలో లోపాలు అంటే నడక పూర్తిగా రాకపోవడం, పాకడం సరిగా రాకపోవడం, మాటలు రాకపోవడం వంటివి మెదడులోని కొన్ని భాగాలు (కేంద్రాలు) సరిగా ఎదగకపోవడాన్ని సూచిస్తాయి. అయితే ఇలాంటి చాలా సందర్భాల్లో కాలం గడచిన కొద్దీ ఆ లోపాలు వాటంతట అవే సరైపోతాయి. కాకపోతే వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుందంతే. ఇలాంటి సందర్భాల్లో ఆ లోపాన్ని అధిగమించడం కోసం సమయానుకూలంగా, తగు మోతాదులు మార్చుకుంటూ... పోషకాలు, విటమిన్లు, ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఇవ్వడం ద్వారా చేసే అత్యాధునిక బయో-మెడికల్ చికిత్స అందివ్వడం వల్ల వేగంగా సరిదిద్దడం సాధ్యమవుతుంది. దీనివల్ల మాటలు త్వరగా రావడమేగాక... పిల్లవాడిలో మెదడు సాధారణ ఎదుగుదల కూడా బాగుపడుతుంది. (అయితే ఇందుకు తీవ్రమైన బుద్ధిమాంద్యత ఉన్న పిల్లల విషయం మినహాయింపు). ఇలా వికాసంలో తేడాలు ఉన్న పిల్లల విషయంలో ఎంత త్వరగా సమస్యను గుర్తించగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వికాసంలో భాగంగా జరిగే కొన్ని అభ్యాసాలు (ఉదాహరణకు మాటలు నేర్చుకోవడం) వంటివి ఆ వయసులో జరగకపోతే ఆ తర్వాత అంత తేలిగ్గా పట్టుబడవు. అందుకోసమే ఇలాంటి చికిత్సల విషయంలో చికిత్సలు / థెరపీస్ వంటివి ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరిగితేనే గరిష్ఠ ప్రయోజనాన్ని ఇస్తాయి. అందుకే ఇలాంటి పిల్లల విషయంలో ముందుగా తల్లి చాలా నిబ్బరంతో, పిల్లవాడిని బాగుపరచే విషయంలో కృతనిశ్చయంతో ఉండాలి. నిజానికి నిబ్బరమైన స్థితే పరిస్థితిని సగం మెరుగుపరుస్తుంది. మీరు ఆందోళన పడకుండా వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
ఆమెకు అన్నింటికీ అనుమానమే..!
నాదొక చిత్రమైన సమస్య. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న బిల్డర్‌ని. నా భార్య బాగా చదువుకుంది. అన్ని విషయాలను చక్కగా అర్థం చేసుకుంటుంది... ఒక్క నన్ను తప్ప! మా దూరపు బంధువు ఒకరితో నాకు వివాహేతర సంబంధం ఉందని తన అనుమానం. ఐదేళ్లక్రితం ఎలాగో మొదలైన ఈ అనుమానంతో నాకు ప్రతిరోజూ నరకం చూపిస్తోంది. తన అనుమానాన్ని బలపరిచే సాక్ష్యాధారాల కోసం నా భార్య ఈ ఐదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. నేను ఫోన్లో మాట్లాడుతుంటే ‘ఆమె’తోనే మాట్లాడుతున్నానని, నేను ఏదైనా ఆలోచనలో ఉంటే ఆ ఆలోచన ‘ఆమె’ గురించేనని అనుకుంటోంది. అలాగని నాతో గొడవ పడదు. తనలో తనే కుమిలిపోతుంటుంది. ఈ మధ్యయితే... మేమిద్దరం కలిసి త్వరగా తన పీడను వదిలించుకోవడం కోసం తనను చంపేందుకు కుట్రపన్నుతున్నామని భయపడుతోంది! ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు. - పేరు రాయలేదు, హైదరాబాద్ మీరు రాసిన దానిని బట్టి మీ శ్రీమతి పి.డి.డి. (పెర్సిస్టెంట్ డెల్యూషనల్ డిజార్డర్)తో బాధపడుతున్నట్లు అర్థమౌతోంది. పైకి అన్ని విధాలుగా బాగానే కనిపించడం ఈ డిజార్డర్‌లోని ప్రత్యేకత. అయితే ఇందులోని ప్రతికూల అంశం ఏమిటంటే... ఈ ప్రభావం అసలు వ్యక్తి మీద కన్నా, వారి కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా పడుతుంది. మీ శ్రీమతిలోని అనుమానం స్థాయి పరాకాష్టకు చేరుకోవడంతో మీరు తనకి నమ్మకద్రోహం చేస్తున్నట్లు ఆందోళన చెందుతున్నారు. అదే పనిగా ఆలోచిస్తూ, ఆరాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగా ఆమె దైనందిన జీవితంలోని ఎన్నో ముఖ్యమైన పనులు కుంటుబడిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పి.డి.డి. తారాస్థాయికి చేరి కళ్లముందు కనిపించే ప్రతిదానికీ మనసు విపరీతార్థాలు కల్పించుకుంటుంది. కనిపించని వాటిని ఊహించుకుని నిస్పృహకు లోనవుతుంది. ఎవరైనా ఈ ప్రస్తావన తెస్తే ఆ వ్యక్తి ఆలోచనలు, భావాలు, ప్రవర్తన ఉద్వేగభరితం అవుతాయి. ‘నీదే తప్పు’ అని ఎవరైనా అంటే కుప్పకూలిపోతారు లేదంటే విరుచుకుపడతారు. ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా పాల్పడవచ్చు. ఇలాంటి పరిణామాలేవీ సంభవించకముందే మీరు మీ శ్రీమతితో కలిసి సైకియాట్రిస్ట్‌ను కలవండి. పి.డి.డి.తీవ్రతను బట్టి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. మందులు కూడా సూచిస్తారు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
పిచ్చి ఆలోచనలు వేధిస్తున్నాయి...
నా వయసు 27. బిజినెస్ చేస్తుంటాను. నాకు ఇటీవలే పెళ్లయింది. నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. కుటుంబ సభ్యులు ఎవరైనా బయటికి వెళ్లారనుకోండి, వారికి ఏదో యాక్సిడెంట్ అయినట్టు... లేదా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయం. ఎప్పుడూ ఆలోచనలే, అన్నీ నెగటివ్‌గానే ఉంటాయి. దీంతో దేనిమీదా దృష్టిపెట్టలేకపోతున్నాను. భార్యతో కూడా హాయిగా గడపలేకపోతున్నాను. అయితే ఆహారం, నిద్ర విషయాలలో ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి పరిష్కార మార్గం చెప్పగలరు. -బి.ఆనంద్, విశాఖపట్నం నిజంగానే మీది బాధాకరమైన సమస్య. యాంగ్జైటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్... ఈ రెండింటి మూలంగా తలెత్తే సమస్య ఇది. ఇందులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మెదడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. దాంతో మనసు స్థిమితంగా వుండదు. దీనికితోడు భయం, ఆందోళన మనసును కమ్మేస్తుంటాయి. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇది ఇలాగే కొనసాగితే గుండెదడ, ఒళ్లంతా చెమటలు పట్టడం, గొంతు ఎండిపోవటం వంటి శారీరకసమస్యలు తలెత్తి, దానిప్రభావం మళ్లీ మెదడుపైనే పడుతుంది. దాంతో ఆలోచనలు అదుపు తప్పటం, చిన్న చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవటం, ఏ పనీ చేయలేక ప్రతిదానికీ ఇతరుల మీద ఆధారపడటం లేదా దేవుడి మీదనే భారం వేస్తూ, అన్నింటికీ చేతులు ఎత్తేయటం వంటి ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. క్రమేణా దీని ప్రభావం తిండి మీదా, నిద్రమీదా కూడా పడి ఏమీ తినాలనిపించకపోవటం, అతి నిద్ర లేదా అసలు నిద్ర లేకపోవటం, మనశ్శాంతి కరువవటం, వింత వింత పనులు చేయటం కూడా సంభవించవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే... ఇంకా అంతటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తకముందే ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్ట్‌ను కలిసి మీ పరిస్థితినంతటినీ వివరించండి. వారు సమస్య తీవ్రతను అంచనా వేసి, అనవసరమైన ఆలోచనలు అదుపు చేయాలంటే ఏమి చేయాలనే దానిపై మీకు కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ డిప్రెసెంట్స్ వాడవలసి రావచ్చు. మానసిక నిపుణుల సలహా మేరకు మీరు మీ జీవన శైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మా అబ్బాయికి బై పోలార్ డిజార్డర్... పెళ్లి చేస్తే దారిలోకొస్తాడా?
మా బాబుకు చిన్నప్పటినుంచి మానసిక రుగ్మత. దానికి మందులు ఇప్పిస్తూ వచ్చాము. ఇప్పుడు వాడికి 29 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ ఇంజినీర్. వయసుతోపాటే వాడి స్నేహాలు కూడా పెరిగిపోయాయి. వాడికి పెళ్లీడు వచ్చింది కాబట్టి, పెళ్లి చేసేస్తే అన్నీ అదుపులోకి వస్తాయని బంధుమిత్రులు అంటున్నారు. కానీ, చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయడం ఇష్టం లేదు. ఏం చేయమంటారు? తగిన సలహా ఇవ్వగలరు. -భూపతి వర్మ, హైదరాబాద్ మీ వాడికి ఉన్న సమస్య దీర్ఘకాలిక మానసిక సమస్య. దీనిని బై పోలార్ డిజార్డర్ అంటారు. దీనికి పెళ్లికి ముందు, తర్వాత కూడా చికిత్స చేయాలి. అయితే మీ బంధుమిత్రులు చెబుతున్నట్లుగా అసలు విషయాన్ని దాచి పెళ్లి చేస్తే అంతా సవ్యంగా అవుతుందనడం మాత్రం చాలా పొరపాటు అభిప్రాయం. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఇదే. పెళ్లికి ముందు తమ పిల్లలకు ఉన్న రకరకాల మానసిక, శారీరక రుగ్మతల సంగతి దాచి, పెళ్లి చేసేస్తుంటారు. ఆ తర్వాత ఆయా వ్యాధి లక్షణాలు ఏదో బయట పడటం, ఒకరినొకరు నిందించుకోవటం...ఫలితంగా వారి జీవితాలు దుర్భరంగా మారటం... మీరు మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు. అయితే పెళ్లికి ముందే అతనికి ప్రీ మేరిటల్ కౌన్సెలింగ్ ఇప్పించాలి. మానసిక రుగ్మతలకు వాడే మందులను ఆపి వెయ్యడం మంచిది కాదు. లైంగిక జీవితంపై ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుంది? మందుల డోసేజీ తగ్గించవచ్చా లేదా? వంటి విషయాలపై డాక్టర్ సలహా తీసుకోవాలి. పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు. అంతమాత్రాన పూర్తిగా తగ్గినట్లు కాదు. అమ్మాయి తల్లిదండ్రులకు, అమ్మాయికి కూడా అంతా వివరించి, అందుకు వారు పూర్తిగా సమ్మతించిన తర్వాతనే ముందుకు వెళ్లడం అవసరం. అతను ఏయే సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తుంటాడు? అందుకు ఏం చేయాలి? ఏ మందులు వాడాలి వంటి విషయాలన్నింటినీ వారికి వివరంగా చెప్పడం అవసరం. పెళ్లి తర్వాత కూడా మానసిక వైద్యులు, మ్యారేజ్ కౌన్సెలింగ్ నిపుణుల సలహాలు పాటిస్తూ, వారు చెప్పిన విధంగా చేయడం నడుచుకోవటం మంచిది. విష్ యు గుడ్ లక్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మా అమ్మాయిని ఎలా అదుపు చేయాలో అర్థం కావట్లేదు!
మాకు ఒక్కగానొక్క కుమార్తె. సంపన్న కుటుంబం కావడం వల్ల చిన్నప్పటినుంచి ఆమె కోరినదల్లా ఇచ్చి గారాబంగా పెంచాం. చిన్నప్పటినుంచి ఆమెకు స్నేహితులు చాలా ఎక్కువ. ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఇంటికి తీసుకువచ్చేది. అపరిచితులతో సైతం ఎంతో సన్నిహితంగా మెలిగేది. ఇంజినీరింగ్ అయ్యాక ఏదో ఉద్యోగం సంపాదించుకుంది. అయితే ఎందులోనూ స్థిరంగా ఉండక అనేకమైన కంపెనీలు మారింది. దేనినీ సీరియస్‌గా తీసుకోదు. ప్రతిదానిలోనూ ఎంతో నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడామెకు పాతికేళ్లు దాటాయి. పెళ్లి చేయాలనుకుంటున్నాము. అంతకన్నా ముందు ఆమె ప్రవర్తనను సరిదిద్దాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - ఒక తల్లిదండ్రులు, హైదరాబాద్ మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయడం వల్ల ఆమె మరింత అశాంతికి గురవుతుంది. దానిమూలంగా తన జీవితం మరింత చిక్కుల్లో పడటమేగాక వారి జీవితభాగస్వామి జీవితం కూడా దుర్భరమవుతుంది. మీరు ఉత్తరంలో రాసిన లక్షణాలను బట్టి మీ అమ్మాయి బై పోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని అర్థమవుతోంది. ఇలాగే వదిలిస్తే ఆమె భవిష్యత్తులో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయి, జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకునే ప్రమాదమూ లేకపోలేదు. ఇటువంటి కండిషన్‌తో బాధపడేవారు పుట్టుకతో చాలా తెలివైన వారు. తమ తెలివితేటలను ఒకదాని మీద నిలపలేక చివరికి దేనికీ న్యాయం చేయలేక నిరాశకు గురవడంతో ఆందోళన పడతారు. తమ ప్రవర్తనను తామే సరిగా అర్థం చేసుకోలేక, ఇతరులతో తమ సంబంధాలను సజావుగా నెరపలేక సతమతమవుతుంటారు. బైపోలార్ డిజార్డర్‌లో తిరిగి రెండు దశలున్నాయి. ఒకటి మానియా, రెండవది హైపర్ మానియా. లక్షణాలను బట్టి మీ అమ్మాయి హైపర్ మేనియాతో బాధపడుతోందని తెలుస్తోంది. ఇటువంటి వారిని హాస్పిటల్‌కు తీసుకురావడం చాలా కష్టమైన పని. అయితే మీరు నేర్పు, ఓర్పులతో వ్యవహరించి ఆమెను ఎలాగైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లి, మానసిక వైద్యుని చేత కౌన్సెలింగ్, చికిత్స ఇప్పించడం వల్ల తప్పనిసరిగా ఆమె పరిస్థితిలో మార్పు వస్తుంది. ప్రయత్నించి చూడండి. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్ -
గత చేదు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి..?
నా వయసు 33. పదేళ్ల క్రితం నాకు పెళ్లయింది. నా భర్త చాలా క్రూరుడు, శాడిస్టు. అనుమానం మనిషి. ఆయన పెట్టే చిత్రహింసలకు తట్టుకోలేక మా పుట్టింటికి చేరాను. అక్కడ చిన్న ఉద్యోగం చేస్తూ నా కాళ్లమీద నేను నిలబడ్డాక మళ్లీ పెళ్లి చేసుకున్నాను. ఈయన చాలా మంచివారు. ఇప్పుడు నాకు నాలుగేళ్ల బాబు. జీవితం హాయిగా గడిచిపోతోంది అనుకుంటుంటే... నన్ను గత జీవితం తాలూకు జ్ఞాపకాలు వెంటాడుతున్నాయి. సరిగా నిద్రపట్టదు... ఎలాగో నిద్రపోతే పీడకలలు రావటం, సడన్‌గా మూడ్స్ మారటం, అందరినీ విసుక్కోవడం... ఇంట్లోవాళ్లు చాలా బాధపడుతున్నారు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఒక సోదరి, విశాఖపట్నం శాడిస్టు అయిన భర్తతో దుర్భరజీవితాన్ని అనుభవించారు. ఎలాగో తప్పించుకుని మళ్లీ పెళ్లి చేసుకుని హాయిగా జీవితాన్ని అనుభవిద్దామనుకునేంతలో మిమ్మల్ని గత ం తాలూకు చేదు జ్ఞాపకాలు వెంటాడటం బాధాకరం. ప్రస్తుతం మీరనుభవించే స్థితిని పీటీఎస్డీ లేదా పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ అంటారు. ఈ వ్యాధి ... దాని పేరుకు తగ్గట్టుగానే, మెదడుపొరల్లో నిక్షిప్తమై ఉన్న గతం మిమ్మల్ని వెంటాడుతూ ఉండటం వల్ల మీరు ప్రస్తుతం ఎంతటి సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతున్నప్పటికీ వాటి ప్రభావం మీమీద పడి మీ మూడ్స్ మారిపోతుంటాయి. దీనిని నిర్లక్ష్యం చేస్తే దీని ప్రభావం మీ దైనందిన జీవితంపై పడి ప్రస్తుత జీవితం భారంగా అనిపిస్తుంది. అయితే మీ గతం ఎంత విషాదకరమైనదైనప్పటికీ అది గడిచిపోయింది, తిరిగి మీరు మంచి జీవితాన్ని గడపగలుగుతున్నారు కాబట్టి, దానిని మరచిపోయేందుకు గట్టిప్రయత్నం చేయండి. అది గతమే కదా, తిరిగి ఇప్పుడు సంతోషంగా ఉన్నాను కదా అన్న భావనతో మీ మెదడుకు మీరు సజెషన్స్ ఇచ్చుకోండి. అందులో భాగంగా మీ గతాన్నంతటినీ పేపర్ మీద రాసి, దాన్ని ఒకసారి చదువుకుని, కాల్చేయండి. దీనివల్ల కొంత మెరుగైన ఫలితం కలుగుతుంది. అయితే మీరు గతం తాలూకు పీడకలలతో సరిగా నిద్రపోలేకపోతున్నానంటున్నారు కాబట్టి అయితే డిప్రెషన్లోకి వెళ్లకుండా ఉండాలంటే మాత్రం సైకియాట్రిస్ట్‌ను సంప్రదించి, మీ పరిస్థితినంతటినీ వివరించండి. అవసరాన్ని బట్టి మందులు కూడా వాడవలసి ఉంటుంది. సైకియాట్రిస్ట్ కౌన్సెలింగ్ ద్వారా, మందుల ద్వారా మీలోని మానసిక ఒత్తిడిని, టెన్షన్‌ను తగ్గించి, వాస్తవ పరిస్థితుల పట్ల అవగాహన కలిగిస్తూ, సమస్యలను ధైర్యంగా ఎదుర్కోగలిగేలా చేస్తారు. మీలో ఆత్మవిశ్వాసం కలిగిస్తూ, మందులద్వారా హాయిగా నిద్రపట్టేలా చేస్తారు. మీరు క్రమేణా మామూలు స్థితికి వస్తారు. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్ -
ప్రతిదానికీ విపరీతమైన భయం... ఆందోళన..!
నా వయసు 33. నాదో చిత్రమైన సమస్య. నాకు విపరీతమైన భయం, ఆందోళన. ఎప్పుడూ ఏదో అనర్థమో, వైపరీత్యమో సంభవించబోతోందన్న భావనతో ఇంటిలోనుంచి కాలు బయటకు పెట్టాలంటే భయం. కొత్తవారితో కలవాలంటే బెరుకు. దీంతో నేను వ్యాపారం కూడా మానుకుని ఇంటిలో కూర్చుంటున్నాను. నావల్ల నా కుటుంబసభ్యులంతా బాధపడుతున్నారు. దయచేసి తగిన సలహా చెప్పగలరు. - ఒక సోదరుడు, అనంతపురం మీదొక మానసిక సమస్య. మెదడు నరాలలో చోటు చేసుకునే కొన్ని అసాధారణ రసాయన మార్పుల వల్ల ఇలా జరుగుతుంది. శరీరంలోని ఇతర అవయవాలకు వచ్చేటట్లే... మెదడుకు వచ్చే సమస్య ఇది. మెదడు సరిగా పని చేయకపోవడం వల్ల తెలియకుండానే సహజశైలికి, ప్రవర్తనకు భిన్నంగా వ్యవహరిస్తూ, చిత్రవిచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. అది చూసేవారికి అసాధారణంగా అనిపిస్తుంది. మానసిక సమస్యలకు మన ప్రవర్తనలోని లోపాలే నిదర్శనంగా నిలుస్తాయి తప్పించి, దానిని నిర్థారించడానికి ప్రత్యేకమైన పరీక్షలేవీ ఉండవు. అందువల్ల ఎవరైనా చెప్పేంతవరకు లేదా తమ ప్రవర్తనలోని లోపాలను తమంతట తామే గుర్తించినప్పటికీ మానసికవైద్యుని సంప్రదిస్తే తమను ఎవరైనా ఏమైనా అనుకుంటారేమోనని జాప్యం చేయడం వల్ల సమస్య మరింత ముదురుతుంది. మీది యాంగ్జైటీ, ఫోబియా కలగలిసిన పరిస్థితి. దీనినే తెలుగులో భయాందోళనలకు లోనవడం అంటారు. దీనిని నిర్లక్ష్యం చేసినకొద్దీ పరిస్థితి మరింత తీవ్రమై, దైనందిన జీవితం దుర్భరమవుతుంది. చాలా సందర్భాలలో కొందరు రోగులలో ఇది డిప్రెషన్తోపాటుగా ఉండటం వల్ల ఇతరులు చాలా సులువుగా చేయగలిగినది, ఇతరుల దృష్టిలో అసలు సమస్యే కానిది వీరికి మాత్రం చాలా కష్టంగా అనిపిస్తాయి. దీనివల్ల రోగితోపాటు కుటుంబసభ్యులందరూ బాధపడలసి వస్తుంది. ఇది ఒకే నాణానికి ఉండే బొమ్మబొరుసులా ఉంటుంది. విపరీతంగా చెమటలు పట్టడం, గుండెదడ, చేతులు వణకడం, గొంతు తడారిపోవటం, కడుపులో తీవ్రమైన నొప్పి, ఊపిరి అందనట్లు అనిపించడం వంటి సమస్యలు ... మరోవైపు అసలు పనికి ఉపక్రమించకమునుపే అందులో వైఫల్యం చెందుతున్నట్టు, ప్రతి ఒక్కరూ తమనే గమనిస్తున్నట్టు, ఇతరులు తమకేదో హాని తలపెడుతున్నట్టు...ఇలా తీవ్రమైన ప్రతికూల భావనలతో బాధపడతారు. ఇక మూడవదశలో ఇటువంటి సమస్య తమకొక్కరికే ఉందని, ఇక దానికి పరిష్కారమే లేదని భావిస్తూ, తమ సమస్యలను లేదా భావనలను ఇతరులకు చెప్పుకుంటే నవ్వుతారేమోనన్న భయంతో అసలు బయటికి చెప్పరు. మీరు వెంటనే సైకియాట్రిస్ట్‌ను కలవడం మంచిది. ఆందోళనకు మంచి మందులున్నాయి. మీ సమస్య మందులతో తప్పకుండా నయమవుతుంది. దీనికితోడు సైకాలజిస్టులు చేసే కౌన్సెలింగ్ వల్ల మీలో రోజురోజుకీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీరు మీ కుటుంబంలోని అత్యంత సన్నిహితులైన వ్యక్తి అంటే భార్య లేదా తల్లిదండ్రుల సాయం తీసుకోండి. సైకియాట్రిస్ట్ మీకిచ్చే మందులు ముందు తక్కువ డోసులో ఇస్తారు. అవి మీమీద చూపే ప్రభావాన్ని బట్టి డోసును మెల్లగా పెంచటం లేదా తగ్గించడం చే స్తారు. వీటికితోడు మీ జీవనశైలిలో కూడా తగిన మార్పులు చేసుకుంటే మరింత గుణం కనిపిస్తుంది. ధైర్యంగా ఉండండి. మీకు అంతే మంచే జరుగుతుంది. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్ -
మా అబ్బాయికి ఆటిజమ్... ఏ విధమైన ఆహారం ఇవ్వాలి?
మా అబ్బాయికి ఆటిజమ్ ఉంది. మేము ఇంతవరకూ డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లలేదు. అయినప్పటికీ స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి రకరకాల విధానాల ద్వారా వాడిలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాము. ఆటిజమ్ ఉన్న పిల్లలకు కెసీన్, గ్లూటెన్ లేని ఆహారాన్ని ఇవ్వాలని స్పీచ్ థెరపిస్ట్ చెప్పడంతో... పాలు, గోధుమ ఉత్పత్తులు ఇవ్వడం పూర్తిగా తగ్గించేశాము. అయితే అప్పటినుంచి వాడు బరువు తగ్గిపోతున్నాడు. మాకు ఆందోళనగా ఉంది. తగిన సలహా ఇవ్వగలరు. - కె. విశాల, వరంగల్ ఇటీ వలికాలంలో ఎక్కడ చూసినా తరచు వినిపిస్తున్న పదం ఆటిజం. ప్రత్యేకమైన కారణాలేమీ లేనప్పటికీ పిల్లల్లో అతి చిన్న వయస్సు నుంచే ఈ లక్షణాలు కనపడుతున్నాయి. దీనికి కారణాలు, చికిత్స పద్ధతుల గురించి విస్తృతంగా పరిశోధనలు జరుగుతున్నాయి. చాలాకాలంగా ఆటిజమ్ ఉన్న పిల్లల తల్లిదండ్రులు వైద్యుల సలహా సిఎఫ్జిఎఫ్ డైట్ ఇస్తున్నారు. అది సంపూర్ణమైన చికిత్సాపద్ధతి కానప్పటికీ, కొందరు పిల్లల్లో అసలు పని చేయనప్పటికీ, మొత్తం మీద దానిద్వారా మంచి ఫలితాలు కనిపిస్తున్నట్లు గుర్తించారు. అయితే ఆటిజమ్ ఉన్న పిల్లల్లో కనిపించే లక్షణాలను బట్టి ఆహారంలో మార్పులు చేయవలసిన అవసరం ఉంది. దీనిని మంచి అనుభవజ్ఞులైన పిల్లల వైద్యనిపుణులు, పిల్లల మానసిక చికిత్సావేత్తలు మాత్రమే గుర్తించగలరు. మీరు కనుక మీ పిల్లవాడికి సిఎఫ్జిఎఫ్ డైట్ ఇవ్వాలని అనుకుంటే మాత్రం దాని మూలంగా విటమిన్లు, ఇతర పోషకాల లోపం ఉండబోదని నిర్థారించుకున్న తర్వాతనే ఆ విధమైన డైట్ ఇవ్వడం ప్రారంభించాలి లేకుంటే పిల్లల్లో విటమిన్లు, ధాతువుల లోపంతో ఇతర సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంది. చాలామంది తల్లిదండ్రులలో తలెత్తే సందేహం ఏమిటంటే... ఈ విధమైన తమ పిల్లలకు ఎంతకాలం పాటు ఇవ్వాలని. సాధారణంగా ఈ విధమైన డైట్ ఇవ్వడం మొదలు పెట్టిన నాలుగు వారాల నుంచి మూడు నెలల్లోగానే పిల్లల ప్రవర్తన, సామాజిక బాధ్యత వంటి అంశాలలో మార్పు కనిపించడం మొదలవుతుంది. పిల్లల భావోద్వేగాలు, మాటతీరు, ఇతరుల కళ్లల్లో కళ్లుపెట్టి సూటిగా చూడటం, పిలిచినప్పుడు స్పందించే విధానం, తోటివారితో మెలిగే తీరు వంటి వాటిలో మార్పును గుర్తించవచ్చు. ఒకవేళ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏవిధమైన మార్పునూ కనిపెట్టలేకపోతే చైల్డ్ సైకియాట్రిస్ట్ వాటిని సులువుగా గుర్తిస్తారు. అయితే అదొక్కటే సరిపోదు. ఆహారంలో మార్పులతోబాటు వారి అవసరాలకు అనుగుణంగా బయో మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఇవ్వవలసి ఉంటుంది. అదేవిధంగా ఆటిజమ్ ఉన్న పిల్లలందరికీ ఒకేవిధమైన చికిత్సా పద్ధతి ఉండదు. వారి ప్రవర్తన, శారీరక స్థితిగతులు, తదితర లక్షణాల ఆధారంగానే చికిత్స చేయాలి. మీరు మీ అబ్బాయిని వెంటనే సుశిక్షితులు, అనుభవజ్ఞులైన చైల్డ్ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి, వారి సలహా మేరకు తగిన చికిత్స ఇప్పించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్