మా అమ్మాయి ఎందుకిలా..?
మా అబ్బాయిది బీటెక్ చదివి, జాబ్ చేస్తున్నాడు. ఎప్పుడూ ఏదో ఆలోచిస్తుంటాడు. ఎవరితోనూ మాట్లాడడు. పార్టీలు, విందువినోదాలకు రమ్మని ఎంత బతిమాలినా రాడు, బలవంతం చేస్తే, విసుక్కుంటాడు. వాడితో ఎలా వేగాలో అర్థం కావట్లేదు. దయచేసి సలహా చెప్పగలరు.
-పార్వతి, విశాఖపట్నం
మీరు చెబుతున్నదాన్ని బట్టి మీ అబ్బాయి అలా ప్రవర్తించడానికి డిప్రెషన్, రకరకాల భయాలు (ఫోబియాలు) వంటి సాధారణమైన కారణాలతోబాటు స్కిజోఫ్రినియా వంటి తీవ్రమైన కారణం కూడా ఉండవచ్చు. పరిశీలిస్తేగాని నిర్థారణగా చెప్పలేం. చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలు చిన్నప్పుడు ఎవరితోనూ కలవకపోవడం, తోటిపిల్లలతో ఆటలాడకపోవడం, అల్లరి చేయకుండా, మందకొడిగా ఉండటాన్ని గమనించి కూడా తమ పిల్లలు బుద్ధిమంతులని మురిసిపోతారు. అది చాలా పొరపాటు. అలా వదిలేస్తే వారు పెద్దయ్యాక కూడా స్తబ్దుగా తయారవుతారు. ఫ్రెండ్స్ లేకపోవడం, పదిమందిలోనూ కలవకపోవడం, పార్టీలు, ఫంక్షన్లు అంటే విముఖత ఏర్పడటం వంటి లక్షణాలు పెంపొందుతాయి. దాంతో వారిలో ఆత్మవిశ్వాసం కొరవడి, కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవటం, ఆత్మన్యూనతాభావంతో ఎవరితోనూ పోటీపడలేక, తమలో తాము కుచించుకుపోతుంటారు. తెలియని ఆందోళన, మానసిక ఒత్తిడితో బాధపడతారు.
మీరు మీ అబ్బాయిని తీసుకుని సైకియాట్రిస్ట్‌ని సంప్రదించండి. వైద్యులు అతనికి మెడికల్ ట్రీట్‌మెంట్, కౌన్సెలింగ్ ద్వారా ఆత్మవిశ్వాసం పెంపొందేలా చేస్తారు. క్రమంగా అతని పరిస్థితి మెరుగవుతుంది.
మా అమ్మాయి ఎంబిఏ చేసింది. చక్కగా ఉంటుంది. 26 ఏళ్లు వచ్చాయి. పెళ్లి చేద్దామని సంబంధాలు చూస్తుంటే, ఏదోవంకతో అన్నిటినీ తిరగ్గొడుతోంది. పోనీ ఎవరినైనా ప్రేమించిందా అంటే అదీ లేదు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
- బి. కృష్ణవేణి, హైదరాబాద్
ఇది మనదేశంలో ఇటీవల కనిపిస్తున్న సమస్య. జపాన్ వంటి దేశాల్లో ఇది చాలా ప్రధాన సమస్య. ఇందుకు రెండు కారణాలుండవచ్చు. ప్రస్తుత సమాజంలో చాలా పెళ్లిళ్లు విచ్ఛిన్నమవటం, భార్యాభర్తలలో ఒకరు ఆవేశంతో జీవితాన్ని అంతం చేసుకోవడం, ఫలితంగా వారి కుటుంబంరోడ్డున పడటం వంటి విషాదకరమైన సన్నివేశాలు, సంఘటనల గురించి వింటుంటాం. దాంతో కొందరు అమ్మాయిలు లేదా అబ్బాయిలు ‘పెళ్లంటే... అయితే అడ్జస్టు, కాకుంటే కలహాల కాపురం లేదంటే బరువు బాధ్యతలు మోయటమే కదా, రేపు నా పరిస్థితీ ఇంతేనేమో’ అన్న ఆలోచిస్తారు.
కుటుంబసభ్యులు, బంధుమిత్రుల బంధాలు కొరవడిన వారిలో ఇటువంటి భావన క్రమేపీ బలపడి, పెళ్లి చేసుకోకూడదన్న నిర్ణయానికి వచ్చేస్తారు.
మరికొందరు తల్లిదండ్రుల అతిభద్రత, అతిజాగ్రత్త, క్రమశిక్షణ వల్ల కూడా పెళ్లి పట్ల వ్యతిరేకభావనలు పెంచుకుంటారు. అలాగే సమాజంలో అడపాదడపా జరిగే కొన్ని సంఘటనలు బంధువులో, తెలిసిన వాళ్ల చేతిలోనో మోసపోవటం, లైంగిక దాడికి గురవటం, ఫలితంగా పెళ్లి పట్ల తీవ్ర విముఖత ఏర్పరచుకుంటారు.
వీటిని దృష్టిలో పెట్టుకుని, మీ అమ్మాయి అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక గల కారణాలను విశ్లేషించండి. ఫ్యామిలీ కౌన్సెలర్ వద్దకు తీసుకెళ్లి, కౌన్సెలింగ్ ఇప్పించండి. నెమ్మదిగా ఆమెలో మార్పు వచ్చే అవకాశం ఉంది. డోంట్ వర్రీ.
డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్