డిసోసియేటివ్ డిజార్డర్స్ (హిస్టీరియా) జబ్బు కాని జబ్బు..! | Dissociative Disorders (Hysteria) disease, but the disease ..! | Sakshi
Sakshi News home page

డిసోసియేటివ్ డిజార్డర్స్ (హిస్టీరియా) జబ్బు కాని జబ్బు..!

Published Sat, Sep 7 2013 10:31 PM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM

డిసోసియేటివ్ డిజార్డర్స్ (హిస్టీరియా) జబ్బు కాని జబ్బు..! - Sakshi

డిసోసియేటివ్ డిజార్డర్స్ (హిస్టీరియా) జబ్బు కాని జబ్బు..!

డిసోసియేటివ్ డిజార్డర్స్ అని పిలిచే ఈ తరహా మానసిక సమస్యలు చాలా విచిత్రమైనవి. ఇందులో జబ్బు లక్షణాలు కనిపిస్తుంటాయి గాని... వాటిని బట్టి ఎన్ని వైద్యపరీక్షలు చేయించినా జబ్బు మాత్రం తెలిసిరాదు. రోగి బాధ కనిపిస్తుంది గానీ రోగం కనిపించకపోవడంతో మూఢనమ్మకాలతో భూతవైద్యులను ఆశ్రయించి రోగిని చిత్రహింసలకు గురిచేసేవారు. ఈ జబ్బులు ఉన్నంతమాత్రాన రోగులు పిచ్చివాళ్లు కాదనీ, వీటికీ సరైన వైద్య చికిత్స ఉందనే అవగాహన కోసమే ఈ కథనం.
 
 గత కొన్నాళ నుంచి చాలా వింత అనుభవాన్ని ఎదుర్కొంటోంది ఇరవైమూడేళ్ల స్నేహిత. ఈమధ్యే బీటెక్ పూర్తి చేసుకుని యూఎస్‌లో ఎమ్మెస్ చేయాలని అనుకుంటున్న ఆమె కారణం తెలీకుండా గట్టిగా అరుస్తూ స్పృహతప్పి పడిపోతోంది. ఆ తర్వాత 5-10 నిమిషాల్లో మళ్లీ మామూలైపోతోంది. ఆ సమయంలో తనకు తీవ్రమైన తలనొప్పి వస్తోందంటోంది. ఆమె తల్లిదండ్రులు ఆమెను చాలాచోట్ల చూపించారు. బ్రెయిన్ స్కాన్‌తో సహా చాలా పరీక్షలు చేయించారు. విచిత్రం ఏమిటంటే అవన్నీ నార్మల్. దాంతో చివరగా వారు ఆమెను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ చాలారకాలైన ప్రశ్నల తర్వాత విషయం అర్థమైంది. ఇంట్లో జరిగిన కొన్ని సంఘటనల వల్ల ఆమె తీవ్రమైన ఒత్తిడికి లోనైందని, వాటి ప్రభావం వల్లే ఇలా జరుగుతోందని తెలిసింది. గతంలో ఆమె తన సీనియర్‌తో ప్రేమలో పడింది.

ఆ ప్రేమను తల్లిదండ్రులు నిరాకరించారు. దాంతో ఆమెలో కలిగిన భయం ఆమె అంతశ్చేతన (సబ్‌కాన్షస్ మైండ్)లోకి వెళ్లింది. అక్కడ తన ప్రేమకూ, తల్లిదండ్రులనుంచి ఎదురవుతున్న ప్రతికూలతకూ మధ్య కలుగుతున్న ఘర్షణలన్నీ ఇలా ఈ రూపంలో వ్యక్తమవుతున్నాయని వెల్లడించారు మానసిక వైద్యులు. అప్పటివరకూ ఆమె తన ప్రేమ గురించి పూర్తిగా మరచిపోయిందనే అనుకుంటున్నారామె తల్లిదండ్రులు. కానీ ఆమె మెదడులో అది ఉడుకుతున్న అగ్నిపర్వతంలా ఉండిపోయి, చివరకు ఈ రూపంలో వ్యక్తమైంది. ఒక విషయంపై తమలో ఉన్న అంతర్గత సంఘర్షణ, తీవ్రమైన భయాందోళలు నిబిడీకృతమైపోయి, అవి ఏదో రుగ్మతలా వెల్లడి కావడాన్నే సాధారణ పరిభాషలో ‘హిస్టీరికల్ కన్వల్షన్స్’ లేదా హిస్టీరియా అంటారు.
 
 హిస్టీరియా అనేది గ్రీకు పదం. ‘హిస్టెర్’ అంటే ‘గర్భసంచి’. ఒకప్పుడు ఈ జబ్బు కేవలం మహిళలకు మాత్రమే వస్తుందని, పైగా గర్భసంచి పొడిబారడం వల్ల ఇది వస్తుందనే అభిప్రాయం ఉండేది. అందుకే దీనికి ‘హిస్టీరియా’ అని పేరు పెట్టారు. కానీ వైద్యశాస్త్రం పురోగమించాక అది పొరబాటు అభిప్రాయమనీ, దీనికి నిర్దిష్టమైన వైద్య చికిత్స ఉందని తెలిసింది.
 
 పూర్వం దేనినైతే హిస్టీరియాగా భావించేవారో అదిప్పుడు రెండు రకాల రుగ్మతల రూపంలో వ్యక్తమవుతోంది. 1) డిసోసియేటివ్  2) సొమటోఫార్మ్
 
 డిసోసియేటివ్ డిజార్డర్స్:
 డిసోసియేటివ్ తరహా మానసిక సమస్యల్లో గతంలో తాము ఎదుర్కొన్న మానసికవేదన కారణంగా పరిసరాలను మరచిపోవడం, కొన్ని అనుభవాలను మరచిపోవడం చేస్తుంటారు. ఉదా:
 
 డిసొసియేటివ్ ఆమ్నీషియా: ఈ రుగ్మతలో రోగులు తమకు తీవ్రవేదన కలిగించిన సంఘటన తాలూకు కొన్ని విషయాలను పూర్తిగా మరచిపోతుంటారు. ఈ మరపు అన్నది కొన్ని నిమిషాలు మొదలుకొని కొన్నేళ్లవరకూ ఉండవచ్చు. (గజిని సినిమాలోలా).
 
 డిసోసియేటివ్ ఫ్యూజ్: ఇందులో రోగి తనకు తీవ్రమైన వేదన కలిగించిన సంఘటనకి సంబంధించిన జ్ఞాపకాల్లో కొంతకాల వ్యవధిలో జరిగిన దాన్ని, ఆ ప్రదేశాలనూ పూర్తిగా మరచిపోవచ్చు. ఆ ప్రదేశాలను మళ్లీ తాను సందర్శించాల్సి వస్తే వాటిని కొత్తగా చూస్తున్నట్లుగా అయిపోతాడు.
 
 డిసోసియేటివ్ ఐడెంటిటీ డిజార్డర్:
ఈ సందర్భంలో ఒక వ్యక్తే అనేక వ్యక్తులుగా మారిపోతూ ఒక వ్యక్తిగా ఉన్నప్పుడు ఉన్న జ్ఞాపకాలు మరో వ్యక్తిగా ఉన్నప్పుడు పూర్తిగా మరచిపోయి, అప్పుడు మరోపర్సనాలిటీగా ఉండిపోవడం.
 
 డీ-పర్సనలైజేషన్ డిజార్డర్: ఈ సందర్భంలో వ్యక్తి తన గురించి, తన వ్యక్తిగతం, తన భావనల గురించి పూర్తిగా మరచిపోతాడు.
 
 సొమటోఫార్మ్ డిజార్డర్స్:
 ఈ తరహా రుగ్మతలో రోగి ఒక తరహా జబ్బుకు సంబంధించిన లక్షణాలను కనబరుస్తాడు. కానీ దాన్ని నిర్ధారణ చేయడం కోసం ఎన్ని వైద్యపరీక్షలు నిర్వహించినా ఆ జబ్బు కనిపించదు. దాంతో రోగి ఎంతో వేదనకు గురవుతుంటాడు. ఒక్కోసారి అతడు కొన్ని రుగ్మతల తాలూకు లక్షణాలను ఎంత తీవ్రంగా ప్రదర్శిస్తాడంటే ఒక్కోసారి ఆ తీవ్రతను చూసి కొన్నిసార్లు దానికి సంబంధించిన శస్త్రచికిత్స కూడా చేసి, సమస్య ఏదీ కనిపించక డాక్టర్లూ అయోమయానికి గురవుతుంటారు. అయితే ఇలాంటి సందర్భంలో రోగికి సంబంధించిన బంధువులు దాన్ని నటనగా అనుకోకూడదు. ఆ లక్షణాలన్నీ నిజంగా ఉండి, వాటితో అతడు బాధపడుతున్నది మాత్రం వాస్తవమని గ్రహించాలి. వాటిలో కొన్ని...
 
 కన్వర్షన్ డిజార్డర్: ఇందులో మనిషి శారీరక లక్షణాల్లో ఒకదాన్ని పూర్తిగా పోగొట్టుకున్నట్లు రోగి వ్యవహరిస్తుంటాడు. ఉదాహరణకు కనుచూపు పోగొట్టుకోవడం, పక్షవాతం వచ్చినట్లు అయిపోవడం, ఫిట్స్‌కు గురికావడం, ఒళ్లంతా తిమ్మిర్లకు లోనుకావడం.
 
 సొమటైజేషన్ డిజార్డర్: ఇందులో నిర్దిష్టంగా ఒక వ్యాధికి చెందినవి కాకుండా అనేక వ్యాధులకు సంబంధించిన లక్షణాలు కలగలసి ఉంటాయి.
 
 పెయిన్ డిజార్డర్: రోగి తనకు అనేక నొప్పులు ఉన్నట్లుగా చెబుతాడు. దాంతో ఒక నొప్పికి, మరో నొప్పికీ మధ్య వైద్యపరంగా ఎలాంటి సమన్వయం ఉండదు. దాంతో  ఇది మానసికమైన సమస్య కావచ్చని వైద్యులు గుర్తించడానికి ఆస్కారం ఉంటుంది.
 
 హైపోకాండ్రియాసిస్: కొన్నిసార్లు రోగి తనకు లేని ఒక వ్యాధిని ఉన్నట్లుగా భ్రమపడుతూ, దాని తాలూకు లక్షణాలను కూడా కనబరుస్తుంటాడు. ఉదాహరణకు తనకు క్యాన్సర్, ఎయిడ్స్ ఉన్నట్లు భావించి, తనకు తెలిసిన ఆ జబ్బుల లక్షణాలను కనబరుస్తుంటాడు.
 
 బాడీ డిస్‌మార్ఫిక్ డిజార్డర్: రోగి తన శారీరక అవయవాల్లో ఏదో ఒకటి సరైన ఆకృతిలో లేదని, అది బాగా లేదని నమ్ముతుంటాడు. ఉదాహరణకు తన ముక్కు సరిగా లేదని, అలాగే తాను మరీ లావుగా ఉన్నాననో లేదా తన అంగాలు బాగాలేవనో తరచూ డాక్టర్లనూ, ప్లాస్టిక్‌సర్జన్లను కలుస్తూ వాటిని బాగుచేయమని కోరుతుంటాడు.
 
 డిసోసియేటివ్ జబ్బుకు కారణాలు:

 ఈ తరహా డిసోసియేటివ్ జబ్బుకు చిన్నతనంగా లేదా తమకు తెలియకుండానే తమ మనసులో పేరుకుపోయిన చేదు అనుభవాల వేదన అన్నది ప్రధాన కారణం. చిన్నతనంలో తనపై ఏదైనా అత్యాచారం జరగడం లేదా ఏదైనా తీవ్రమైన నష్టం జరగడం కూడా ఈ వ్యాధికి కారణమే. వాళ్లను సంరక్షించేవాళ్లకు ఇవేమీ తెలియకపోవడంతో తమ పిల్లలు కనబరుస్తున్న లక్షణాలు వార్ని అయోమయంలోకి నెట్టేస్తాయి.
 
 చికిత్స: డిసోసియేటివ్ డిజార్డర్‌కు చేయాల్సిన చికిత్సలో అనేక అంశాలుంటాయి. ఉదాహరణకు ఈ రోగుల్లో వారిని అలాంటి స్థితికి తీసుకెళ్లిన కారణాన్ని ఎలాగైనా తెలుసుకుని, ఆ కారణాన్ని దూరం చేయాలి.
 
 ఇక రెండో విషయం...
రోగి కనబరుస్తున్న లక్షణాలకూ, వాస్తవంగా వైద్య పరీక్షల నివేదకల్లో కనిపిస్తున్న తేడాను జాగ్రత్తగా అంచనా వేస్తూ...  ఫిజీషియన్లు / సర్జన్లు కుటుంబ సభ్యులను అనేక విషయాలను అడిగి తెలుసుకోవాలి. రోగానికి సంబంధించిన విషయాలుగాక కుటుంబానికి సంబంధించిన అనేక విషయాల వల్ల కూడా రోగకారణానికి సంబంధించిన క్లూస్ దొరకవచ్చు. ఇలా చేయడం ద్వారా కొన్ని అనవసర ఇన్వెస్టిగేషన్లను కూడా తప్పించవచ్చు. దాని ద్వారా సమయం, డబ్బు ఆదా చేయచ్చు. మన సమాజంగా ఇలాంటి జబ్బులు ఉన్న సందర్భంలో సైకియాట్రిస్ట్‌ను సంప్రదించడానికి వెనకాడుతుంటారు. అదేదో పిచ్చి అనే ముద్ర పడుతుందనే సామాజిక నిషేధం వాళ్లను వెనక్కు లాగుతుంటుంది. కానీ మనసుకూ జబ్బు చేస్తుంది. దానికీ చికిత్స ఉంది. చికిత్స పూర్తయితే వాళ్లూ ఎప్పట్లాగే, అందరిలాగే ఆరోగ్యంగా ఉంటారు. అంతేగాని సైకియాట్రిస్ట్‌ల వద్దకు వెళ్లే ప్రతి కేసూ పిచ్చి కాదనే భావనను రోగికీ, రోగి బంధువులకీ తోటి డాక్టర్లు వివరించి వారిని మానసిక చికిత్సకుడి వద్దకు వెళ్లేలా ప్రోత్సహించాలి. రోగి కుటుంబ సభ్యులు సైతం రోగి సమస్య పట్ల సానుభూతితో వ్యవహరించాలి. అతడు నటిస్తున్నాడంటూ అనుమానించకూడదు.
 
 ఇక మూడో విషయం... రోగి కనబరుస్తున్న కొన్ని లక్షణాలను బట్టి కొందరు అతడిని భూతవైద్యుల వద్దకు తీసుకెళ్తుంటారు. కానీ అది పొరబాటు. మూఢనమ్మకాలను వదిలేసి మానసిక వైద్యుడి వద్దకే తీసుకెళ్లేలా  అవగాహన కలిగించాలి. సైకియాట్రిస్ట్ సైతం చాలా ఓపిగ్గా కౌన్సెలింగ్ నిర్వహించడం, రోగితో పాటు రోగి బంధువులతో మాట్లాడటం వల్లనే ఈ జబ్బు నిర్ధారణ సాధ్యమవుతుంది. కొన్నిసార్లు కొన్ని విషయాలను రోగి, అతడి బంధువులు డాక్టర్‌తో పంచుకోడానికి ఇష్టపడకపోవచ్చు. అలాంటి సందర్భాల్లోనూ రోగ నిర్ధారణ కష్టమవుతుంది. అందుకే దీనికి చికిత్స నిర్వహించడం చాలా ఓపికతో కూడుకున్న పని. డాక్టర్, రోగి సత్సంబంధాలపైనే చికిత్స విజయవంతం కావడం ఆధారపడి ఉంటుంది.
 
 మందులు: యాంటీడిప్రెసెంట్స్ రోగిలోని డిప్రెషన్‌ను తగ్గించి చాలావరకు సమస్యను ఉపశమింపజేయడానికి తోడ్పడతాయి. అలాగే యాంటీ యాంగ్జైటీ మందులు కూడా రోగిలోని ఉద్వేగాలను అదుపు చేయడానికి ఉపయోగపడతాయి. మందులతో పాటు కాగ్నెటివ్ బిహేవియరల్ థెరపీ (సీబీటీ), హిప్నోసిస్ వంటి ప్రక్రియలు కూడా ఈ జబ్బు చికిత్సకు తోడ్పడతాయి.
 
 - నిర్వహణ: యాసీన్
 
 మాస్ హిస్టీరియా

 దీన్నే కలెక్టివ్ హిస్టీరియా అని లేదా కలెక్టివ్ అబ్సెషనల్ బిహేవియర్ అని అంటారు. ఇది ఒక పెద్ద గుంపులో ఉన్న వారందరికీ సామూహికంగా కలిగే భ్రాంతి. ఒక్కోసారి పుకార్లు వ్యాపిస్తున్నప్పుడు లేదా ఏదైనా సంఘటన దావానంలా చెలరేగినప్పుడు అందరిలో కనిపించే ఫీలింగ్. ఒక్కోసారి ఒక ఊళ్లోని అవివాహిత బాలికలంతా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారనే వార్త రాగానే అందరూ అలాగే ప్రవర్తిస్తుంటారు. ఒక ఊళ్లో చేతబడి ఏదో జరిగిందనీ అందుకే ఊరు ఊరంతా విచిత్రంగా ప్రవరిస్తోందనే వార్తలు ఒక్కోసారి వస్తుంటాయి. అలాంటి సందర్భాల్లో ఊరు ఊరంతా ఒకేసారి ఉమ్మడిగా గురయ్యే భ్రాంతిని మాస్ హిస్టీరియా అంటారు.
 
 గుర్తించడం ఎలా:

 వీటిని గుర్తించడం ఒకింత కష్టమైన పనే. ఈ వ్యాధి కనబరిచే తీవ్రతలో విపరీతమైన వ్యత్యాసం ఉంటుంది. సాధారణ ప్రజలుగా ఉండేవారిలో ఈ జబ్బు లక్షణాలు ఒకలాంటి తీవ్రతతోనూ, సైకియాట్రిక్ ఇన్‌పేషెంట్‌గా ఉండాల్సిన వారిలో అదే జబ్బు తీవ్రత మరోరకంగానూ వ్యక్తమవుతుంటుంది. జబ్బు లక్షణాలు కనబరుస్తున్నవారిలో వీటిని అనుమనించి వారితో మామూలుగానే సంభాషిస్తున్నట్లుగా నిర్వహించే సెషన్స్‌తో (డిసోసియేటివ్ డిజార్డర్ ఇంటర్వ్యూ షెడ్యూల్)తో, స్ట్రక్చర్డ్ క్లినికల్ ఇంటర్వ్యూ ఫర్ డీఎస్‌ఎమ్-ఫోర్ డిసోసియేటివ్ డిజార్డర్స్ అనే ప్రక్రియతోనూ లేదా డిసోసియేటివ్ ఎక్స్‌పీరియెన్సెస్ స్కేల్ (డీఈఎస్) అనే ప్రశ్నావళిని పూర్తిచేయించడం ద్వారా దీన్ని కనుగొనవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement