పిచ్చి ఆలోచనలు వేధిస్తున్నాయి...
నా వయసు 27. బిజినెస్ చేస్తుంటాను. నాకు ఇటీవలే పెళ్లయింది. నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. కుటుంబ సభ్యులు ఎవరైనా బయటికి వెళ్లారనుకోండి, వారికి ఏదో యాక్సిడెంట్ అయినట్టు... లేదా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయం. ఎప్పుడూ ఆలోచనలే, అన్నీ నెగటివ్‌గానే ఉంటాయి. దీంతో దేనిమీదా దృష్టిపెట్టలేకపోతున్నాను. భార్యతో కూడా హాయిగా గడపలేకపోతున్నాను. అయితే ఆహారం, నిద్ర విషయాలలో ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి పరిష్కార మార్గం చెప్పగలరు.
-బి.ఆనంద్, విశాఖపట్నం
నిజంగానే మీది బాధాకరమైన సమస్య. యాంగ్జైటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్... ఈ రెండింటి మూలంగా తలెత్తే సమస్య ఇది. ఇందులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మెదడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. దాంతో మనసు స్థిమితంగా వుండదు. దీనికితోడు భయం, ఆందోళన మనసును కమ్మేస్తుంటాయి. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు.
ఇది ఇలాగే కొనసాగితే గుండెదడ, ఒళ్లంతా చెమటలు పట్టడం, గొంతు ఎండిపోవటం వంటి శారీరకసమస్యలు తలెత్తి, దానిప్రభావం మళ్లీ మెదడుపైనే పడుతుంది. దాంతో ఆలోచనలు అదుపు తప్పటం, చిన్న చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవటం, ఏ పనీ చేయలేక ప్రతిదానికీ ఇతరుల మీద ఆధారపడటం లేదా దేవుడి మీదనే భారం వేస్తూ, అన్నింటికీ చేతులు ఎత్తేయటం వంటి ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. క్రమేణా దీని ప్రభావం తిండి మీదా, నిద్రమీదా కూడా పడి ఏమీ తినాలనిపించకపోవటం, అతి నిద్ర లేదా అసలు నిద్ర లేకపోవటం, మనశ్శాంతి కరువవటం, వింత వింత పనులు చేయటం కూడా సంభవించవచ్చు.
దీనికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే... ఇంకా అంతటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తకముందే ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్ట్‌ను కలిసి మీ పరిస్థితినంతటినీ వివరించండి. వారు సమస్య తీవ్రతను అంచనా వేసి, అనవసరమైన ఆలోచనలు అదుపు చేయాలంటే ఏమి చేయాలనే దానిపై మీకు కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ డిప్రెసెంట్స్ వాడవలసి రావచ్చు. మానసిక నిపుణుల సలహా మేరకు మీరు మీ జీవన శైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది.
డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్,
సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్