పిల్లలిద్దరితో వేగలేకపోతున్నాను..?
మా పెద్దవాడికి ఆరేళ్లు. రెండోవాడికి రెండేళ్లు. ఇద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. చిన్నవాడికి ఏమి తెస్తే అది తనకూ కావాలని పెద్దవాడు పేచీపెడుతుంటాడు. ‘తమ్ముడితోనే ఎక్కువసేపు గడుపుతున్నావు, నీకు నేనంటే ఇష్టం లేదు’ అని అలుగుతుంటాడు. నేను జాబ్ చేస్తున్నాను. ఇంటికి వచ్చేసరికి వీళ్లిద్దరి తగవులు తీర్చలేక సతమతమవుతున్నాను. మావారేమో ఇద్దరు పిల్లలను పెంచడం కూడా చేతకాకపోతే ఎలా అంటూ నన్నే ఎగతాళి చేస్తుంటారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా చెప్పగలరు.
- సుప్రియ, తెనాలి
ఇది చాలామంది ఇళ్లలో సాధారణంగా జరిగేదే. దీనిని సిబ్లింగ్ రైవలరీ అంటారు. ఒకవిధంగా ఇది ఇది డెవలపింగ్ మైల్‌స్టోన్‌గా చెప్పవచ్చు. అంటే సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడి, నెగ్గుకురావడం ఎలాగో మీ పిల్లలు ఇప్పటినుంచే నేర్చుకుంటున్నారన్నమాట! ఇదే ధోరణి వారికి కనీసం పదహారు పదిహేడేళ్లు వచ్చేవరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ స్నేహితులైపోతారు. అయితే ఇది రానురానూ మరీ తీవ్రమై, హింసాత్మక ధోరణులకు దారితీసేలా ఉంటే గనక ఇద్దరినీ చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది.
అసలు పిల్లలు అలా చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే... తల్లిదండ్రుల ప్రేమను పొందడం గురించి పిల్లలు ఒకరితో ఒకరు పోటీపడటం. మరీ చిన్నపిల్లలైతే గనక వారికి పూర్తిగా తెలియక, తమ అసంతృప్తిని రకరకాలుగా వ్యక్తం చేస్తుంటారు. చిన్నవాళ్లతో పోటీగా మరీ పసిపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు.
వయసును బట్టి వారి ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది. తమ్ముడిని లేదా చెల్లెలిని తిట్టడం, కొట్టడం, బాధ పెట్టడం...చేస్తుంటారు. ఇది కేవలం పెద్దపిల్లలు చిన్నవాళ్లను చేయడమే కాదు, చిన్నపిల్లలు పెద్దవారిని కూడా చేయవచ్చు. మీరు ఏం చేస్తారంటే... వీలైనంతవరకు ఇద్దరితోనూ సమానంగా సమయాన్ని వెచ్చిస్తుండాలి.
మీరు చిన్నవాడితో గడిపేటప్పుడు పెద్దవాడిని వాళ్ల నానమ్మ దగ్గరో, నాన్న దగ్గరో ఉండేలా చేయండి. తర్వాత దగ్గరకు పిలిచి, ఇద్దరితోనూ కలిసి గడపండి. పెద్దవాడిని పొరపాటున కూడా ‘చిన్నవాడితో పోల్చకండి. నిజానికి పెద్దవాడు కూడా వయసులో అంత పెద్ద ఏమీ కాదు కదా! కొంతకాలం ఓపికపట్టడం, బుద్ధిగా ఉంటే బహుమతులు ఇస్తానని పెద్దవాడిని ఊరించడం, చిన్నవాడిని కూడా పెద్దవాడితో ఆడుకునేలా చేయడం ఒక్కటే మార్గం. వీరిద్దరి గొడవలో పడి మీరు రిలాక్స్ కావడం మరచిపోవద్దు. లేదంటే మీరు డిప్రెషన్‌లో పడతారు.
డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్,
సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్