Dr. Kalyan
-
ఈటింగ్ డిజార్డర్స్ తిండి తిప్పలు!
తినడం కూడా కొన్ని వ్యాధుల లక్షణమే అంటే అది విచిత్రంగా ఉండవచ్చు. కానీ అది వాస్తవం. తీవ్రమైన భావోద్వేగాలు, కోపం, ప్రవర్తనలో మార్పులు, వ్యాకులత, యాంగ్జైటీ వంటి అనేక సమస్యల వల్ల మనం తినే తీరులో మార్పులు వచ్చి... సదరు వ్యాధికి ఒక లక్షణంగా ప్రకటితమవుతాయి. కొన్నిసార్లు అవి భౌతికంగా మార్పులు మాత్రమే కాదు. ఒక్కోసారి అవి ప్రాణాంతకం కూడా కావచ్చంటే ఆశ్చర్యంగా ఉంటుంది. మహిళలూ, పురుషులూ... ప్రత్యేకంగా కౌమార వయసులోకి వచ్చే టీనేజీ పిల్లల్లో ఎక్కువగా కనిపించే ఈ భోజనరుగ్మతలపై అవగాహన కోసమే ఈ ప్రత్యేక కథనం. ఈటింగ్ డిజార్డర్స్కు కారణాలు ఆహార రుగ్మతలకు అనేక కారణాలు ఉన్నాయి. ఇందులో ప్రవర్తనపూర్వకమైనవి, జీవసంబంధమైనవి, ఉద్వేగాలకు, సంబంధించినవి, మానసికమైనవి, వ్యక్తిగతబంధాలకు సంబంధించినవి, సామాజిక అంశాలు... ఇలా రకరకాల కారణాలు ఆహారసంబంధ రుగ్మతలకు దారితీస్తాయి. ఇందులో చాలావరకు మానసికమైనవి. అవి క్రమంగా శారీరక ఆరోగ్య సమస్యలకూ దారితీస్తాయి. వ్యక్తిత్వంపై ప్రభావం చూపుతూ న్యూనతను కలిగిస్తాయి. 1. అనొరెక్సియా నర్వోజా సాధారణంగా పిల్లలు టీనేజీలోకి వస్తుండగానే తమ అందంపైనా, లుక్స్పైనా దృష్టి ఎక్కువగా ఉంటుంది. తాము లావెక్కి అసహ్యంగా కనిపిస్తున్నామేమో అన్న సందేహం వారిని పట్టి పీడిస్తుంటుంది. ఏమాత్రం ఎక్కువగా తిన్నా బరువు పెరిగి అందం దెబ్బతింటుందేమో అన్న సంశయంతో వారు కావాలనే తినడం మానేస్తుంటారు. దాంతో ఉండాల్సిన దాని కంటే మరీ ఎక్కువగా బరువు తగ్గి ఎముకలపోగులా మిగిలిపోతారు. కావాలన్నా తినలేని ఈ రుగ్మత పేరే ‘అనొరెక్సియా నర్వోజా’ బాల్యం నుంచి కౌమార దశలోకి ప్రవేశించేవారిలో ముఖ్యంగా అమ్మాయిల్లో కనిపించే ఈ జాడ్యం 5 శాతం నుంచి 20 శాతం మందిలో ప్రాణాంతకంగా మారుతుంది. ఇటీవల టీవీల్లో, సినిమాల్లో, ర్యాంప్షోలలో, ఇతర ప్రసారమాధ్యాలలో కనిపించే మోడల్స్‌ను అనుసరిస్తూ అలా సన్నగా ఉండటమే అందం అనే భావనలో జీరోసైజ్ అంటూ ఈ వ్యాధికి గురయ్యేవారి సంఖ్య తక్కువేమీ కాదు. అందుకే దీన్ని ‘ఫ్యాషన్ డిజార్డర్’ అని కూడా వ్యవహరిస్తుంటారు. లక్షణాలు ♦ వారి శరీర పోషణకూ, జీవక్రియలకూ అవసరమైనదాని కంటే చాలా తక్కువగా తినడం ♦ తినే సందర్భం వస్తే అక్కడి నుంచి తప్పించుకోవడం ♦ తమ శరీరంపై ఎక్కువ స్పృహ కలిగి ఆత్మన్యూనతతో వ్యవహరించడం ♦ తమ పరిస్థితి తమకు తెలుస్తున్నా దాన్ని గుర్తించేందుకు సంసిద్ధంగా లేకపోవడం. హెచ్చరిక సూచనలు (వార్నింగ్ సిగ్నల్స్) ♦ గణనీయంగా బరువు తగ్గిపోవడం ♦ ఎప్పుడూ బరువు తగ్గడం గురించి, క్యాలరీలను తక్కువ చేసుకోవడం గురించి, కొవ్వు కరిగించుకోవడం, డైటింగ్ గురించే ప్రస్తావిస్తుండటం. ♦ చాలా రుచికరమైన ఆహారం ముందుంచినా తినడానికి తిరస్కరించడం ♦ నేనేమైనా లావుగా కనిపిస్తున్నానా అంటూ వాకబు చేస్తుండటం. ♦ తినడం తప్పించుకోవడానికి ఏదో ఒక సాకు వెతుక్కుంటూ ఉండటం. ♦ తాము బరువు పెరగడం లేదని తెలిసినా, ఎక్కడ బరువు పెరుగుతామో అన్న ఆందోళనతో క్యాలరీస్‌ను దహించాలంటూ కఠినమైన వ్యాయామాలకు పాల్పడటం. ♦ స్నేహితులనుంచి క్రమంగా దూరం కావడం. అనొరెక్సియాతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ♦ శరీరానికి అందాల్సిన పోషకాలు అందకపోవడంతో ఆరోగ్యంపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు పడతాయి. దాంతో శరీరం తనలోని శక్తిని ఆదా చేసుకోవడానికి సాధారణంగా జరగాల్సిన జీవక్రియలన్నింటినీ మందకొడిగా జరిగేలా చూస్తుంది. ఈ ‘మందకొడి’ ప్రక్రియ వల్ల తీవ్రస్థాయిలో వైద్యపరమైన సమస్యలు ఎదురవుతాయి. ఉదాహరణకు... ♦ గుండె స్పందనల వేగం మందగిస్తుంది. రక్తపోటు పడిపోతుంది. ఫలితంగా గుండె కండరాల పనితీరులో కూడా మార్పు వస్తుంది. ఇది క్రమంగా హార్ట్‌ఫెయిల్యూర్‌కు దారితీయవచ్చు. ♦ ఎముకల సాంద్రత మందగిస్తుంది. దాంతో ఆస్టియోపోరోసిస్ రావచ్చు. ఎముకలు పెళుసుగా మారి తేలిగ్గా విరిగిపోవచ్చు. ♦ కండరాలు బలహీనంగా మారవచ్చు. సన్నబడిపోవచ్చు. ♦ తీవ్రమైన డీ-హైడ్రేషన్‌కు దారితీయవచ్చు. దానివల్ల మూత్రపిండాలు దెబ్బతినవచ్చు. ♦ నీరసం, నిస్సత్తువతోపాటు ఒక్కోసారి స్పృహతప్పడం జరగవచ్చు. ♦ వెంట్రుకల కింద ఉండే ‘ల్యానుగో’ అనే ఒక పొర మందంగా మారుతుంది. శరీరం తన వేడిని కోల్పోకుండా ఉండేందుకు ఈ పరిణామం సంభవిస్తుంది. 2. బులీమియా నర్వోజా బులీమియా నర్వోజా అనే వ్యాధి చాలా తీవ్రమైనది. ఈ రుగ్మతలో... బింజ్ఈటింగ్ అని పిలిచే అదేపనిగా తినే అలవాటుతో పాటూ... తింటే బరువు పెరిగిపోతామేమో అనే అనొరెక్సియా లక్షణాలూ కలగలసి ఉంటాయి. బులీమియా నర్వోజా వ్యాధి ఒక్కోసారి డిప్రెషన్ లక్షణాలతో కలగలసి ఉంటుంది. ఒక్కోసారి ఇది మరణానికి సైతం దారితీసే ప్రమాదం ఉంది. లక్షణాలు ♦ భోజనంపై అమిత ఇష్టం వల్ల రుచికరమైన పదార్థాలపై మోజు కారణంగా మొదట ఆహారాన్ని తినేస్తారు. ఆ తర్వాత తాము తిన్న పదార్థాల వల్ల అపరిమితంగా బరువు పెరిగిపోతామేమో అన్న ఆందోళనతో ప్రయత్నపూర్వకంగా వాంతి చేసుకుంటారు. ♦ తినే విషయంలో స్వీయనియంత్రణ చేసుకోలేరు. తిన్న తర్వాత తమంతట తామే బరువు పెంచుకుంటున్నామేమో అంటూ తీవ్ర అపరాధ భావనకు లోనవుతారు. ♦ శరీరాకృతిపై అవసరమైన దాని కంటే ఎక్కువగా దృష్టిసారించి ఆత్మన్యూనతకు లోనవుతారు. ♦ బులీమియా నర్వోజా వ్యాధిని ఎంత త్వరగా నిర్ధారణ చేయగలిగితే... దీని నుంచి బయటపడే అవకాశాలు అంత ఎక్కువ. హెచ్చరిక సూచనలు (వార్నింగ్ సిగ్నల్స్) ♦ చాలా తక్కువ సమయంలో ఎక్కువగా తినేస్తారు. ఆతృతగా తినేస్తుంటారు. ♦ జిహ్వచాపల్యాన్ని తట్టుకోలేక తినేశామనీ... కానీ తాము తిన్నది తమకు అవసరం లేనిదన్న భావనతో దాన్ని ఎలాగైనా వదులుకోవాలనే కోరికతో తరచూ బాత్రూమ్కు వెళ్లి ఎవరూ చూడకుండా వాంతి చేసుకుంటారు. ♦ కొందరు తాము తిన్నదాన్ని వదులుకోడానికి వాంతి చేసుకోడానికి బదులు విరేచనం చేసుకోవాలనే ఉద్దేశంతో అవసరానికి మించి విరేచనకారి (లాక్సెటివ్స్), అతిగా మూత్రం వచ్చే మందులు (డై-యూరెటిక్స్) వాడతారు. ♦ క్యాలరీలను కరిగించుకోవాలంటూ కఠిన వ్యాయామాలు చేస్తుంటారు. ♦ రోగుల్లో అసాధారణరీతిలో చెంపలు, దవడల వాపు కనిపిస్తుంది. ♦ వేళ్లను నోటిలోకి జొనిపి వాంతి చేసుకుంటుంటారు కాబట్టి వేళ్ల కణుపులు (నకుల్స్) పళ్లతో ఒరిపిడికి గురై చర్మం మందంగా మారుతుంది. ♦ తరచూ వాంతుల వల్ల పళ్లరంగు మారుతుంది. ♦ స్నేహితుల నుంచి దూరంగా ఉంటారు. ఒంటరిగా ఉండటాన్ని ఇష్టపడతారు. బులీమియాతో వచ్చే ఆరోగ్య అనర్థాలు ♦ అదేపనిగా ఎక్కువగా తినేయడం, ఆ తర్వాత మళ్లీ వాంతి చేసుకోవడం వెంటవెంటనే జరుగుతుండటం వల్ల జీర్ణక్రియలోని క్రమబద్ధతపై ప్రభావం చూపుతుంది. జీర్ణక్రియ సైకిల్ దెబ్బతింటుంది. ♦ డీ-హైడ్రేషన్ వల్ల శరీరంలో పొటాషియమ్, సోడియమ్ పాళ్లు తగ్గుతాయి. ♦ గుండె స్పందనలు లయ తప్పుతాయి. ఒక్కోసారి ఇది ప్రాణాపాయం కలిగించవచ్చు. ♦ ప్రయత్నపూర్వకంగా మాటిమాటికీ చేసుకునే వాంతుల వల్ల కడుపులో మంట వస్తుంది. ♦ కడుపులో ఉండే యాసిడ్ వాంతి వల్ల బయటకు వచ్చి, పళ్లపై ప్రభావం చూపడం వల్ల పళ్లు దెబ్బతినే ప్రమాదం ఉంది. ♦ విరేచనకారి మందులను విచక్షణరహితంగా వాడటం వల్ల విసర్జన అలవాట్లలో మార్పు, దీర్ఘకాలిక మలబద్దకం వంటి అనర్థాలు వస్తాయి. 3. బింజ్ ఈటింగ్ డిజార్డర్ (బీఈడీ) ఈ రుగ్మత ఉన్న రోగులు ఏ ఆహారాన్ని అయినా అదేపనిగా తినేస్తూ ఉంటారు. ఎప్పుడూ ఆకలితో ఉన్నట్లుగా తింటూ ఉంటారు. దీన్నే ‘బింజ్ ఈటింగ్ డిజార్డర్’ అంటారు. ఇది డిప్రెషన్ వ్యాధితో పాటు కలగలిసి ఉంటుంది. వీరిలో జీవననాణ్యత (క్వాలిటీ ఆఫ్ లైఫ్) తక్కువ. లక్షణాలు ♦ ఎప్పుడూ తినాలనిపించే తమ కోరికను నియంత్రించుకోలేరు. ♦ అలా తింటూ ఉండటమూ, దాన్ని మిగతావాళ్లు గమనిస్తూ ఉన్నారన్న విషయం వాళ్లలో అపరాధభావనను కలిగిస్తుంది. ♦ అదేపనిగా తినడం తమకే నచ్చక ఆత్మన్యూనతకు గురవుతుంటారు. బింజ్ ఈటింగ్ వల్ల కలిగే ఆరోగ్య అనర్థాలు ♦ బింజ్ ఈటింగ్ వల్ల కనిపించే తక్షణ అనర్థం బరువు అమితంగా పెరిగిపోవడం. రోగికి స్థూలకాయం రావడం. దాంతో ఆరోగ్యంపై ఎన్నో ప్రతికూల ప్రభావాలు కలుగుతాయి. ఉదాహరణకు... ♦ రక్తపోటు విపరీతంగా పెరగడం ♦ కొలెస్ట్రాల్ పాళ్లు పెరిగిపోవడం ♦ డయాబెటిస్ గాల్‌బ్లాడర్‌కు సంబంధించిన వ్యాధులు ♦ కండరాలూ, ఎముకల రుగ్మతలు గుండెజబ్బులు 4. డయాబులీమియా ఇది సాధారణంగా టైప్-1 డయాబెటిస్తో కలిసి ఉండే తిండి సంబంధమైన రుగ్మత. డయాబులీమియా వ్యాధిగ్రస్తులు తమ బరువు తగ్గాలనే ఉద్దేశంతో కావాలనే ఇన్సులిన్ పాళ్లను తక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇందులో డయాబెటిస్, బులీమియా... ఈ రెండు వ్యాధులూ ఉంటాయి కాబట్టి ‘డ్యుయల్ డయాగ్నోసిస్ డిజార్డర్’గా పేర్కొంటారు. ఈ వ్యాధి ఉన్నప్పుడు ఇన్సులిన్ ఉపయోగించే తీరును దుర్వినియోగం చేస్తారు కాబట్టి ఇది ఇతర రుగ్మతలకూ దారితీసే అవకాశమూ ఉంది. 5. ఆర్థోరెక్సియా నర్వోజా ఇది సరైన ఆహారం తీసుకోవాలనే తపన నుంచి ఆవిర్భవించే రుగ్మత. ఆర్థోరెక్సియా నర్వోజాకూ... అనొరెక్సియా, బులీమియాలకూ ఓ తేడా ఉంది. అనొరెక్సియా, బులీమియాలో అందాలకూ, లుక్స్కూ ప్రాధాన్యమిస్తారు. కానీ ఆర్థోరెక్సియా నర్వోజా రోగులకు అన్నీ ఆరోగ్య సంబంధమైన సందేహాలే! తాము తిన్నది సరైన ఆహారమేనా, అది సమతులాహారమేనా అనే సందేహాలు రోగిని పట్టి పీడిస్తుంటాయి. తాము ఆరోగ్యకరమైన పరిణామంలోనే తింటున్నామా లేక ఎక్కువగానో, తక్కువగానో తింటున్నామా అనే సంశయాలు వస్తుంటాయి. దీంతో వారు తిండి విషయంలో చాలా కఠినమైన నియమాలు పెట్టుకుని ఆచరిస్తుంటారు. ప్రతిదీ తినేప్పుడు దాని ఆరోగ్యవిలువలూ, పోషకాలూ వంటి లెక్కలేసుకుని తింటుంటారు. ఫలానా పదార్థం ఆరోగ్యానికి మంచిది కాదని తెలిస్తే నిర్దాక్షిణ్యంగా దానినుంచి దూరంగా ఉంటారు. తమ జిహ్వచాపల్యాన్ని కఠినంగా నియంత్రించుకుంటూ తమను తాము శిక్షించుకుంటుంటారు. నూనెలు ఎక్కువ తీసుకుంటే కొవ్వు పేరుకుంటుందేమోననే సందేహంతో వాటిని తగ్గించి... కొవ్వుల్లో కరిగే విటమిన్ల లోపాలు తెచ్చుకుంటారు. ఉప్పు ఆరోగ్యానికి అనర్థమంటూ బాగా తగ్గించుకుని హైపోనేట్రీమియా లాంటి జబ్బులతో ఆసుపత్రుల పాలవుతుంటారు. ఇటీవల ఆరోగ్య స్పృహ మరీ ఎక్కువగా పెరగడంతో వచ్చిన అనర్థమిది. ఆరోగ్యంగా ఉండాలనే కోరికతో మంచి నియమాలు పాటించడంలో తప్పులేదు. కానీ అదేపనిగా ఆరోగ్యం గురించే ఆలోచిస్తూ ఒకరకమైన నిస్పృహకూ, న్యూనతకూ గురయి ఆరోగ్యానికి ముప్పు తెచ్చుకోవడం సరికాదు. కాబట్టి ఆరోగ్యస్పృహనూ మరీ పెచ్చుమీరిపోనివ్వకుండా ఉండాలి. ఆర్థోరెక్సియాను అధిగమించడానికి మార్గాలు : ♦ ఎప్పుడైనా, ఏదో ఒక సమయంలో వేళ తప్పి భోజనం చేయాల్సి వస్తే దాని గురించి అతిగా ఆలోచించకూడదు. ఎప్పుడో ఒకసారి జరిగే ఉల్లంఘన వెంటనే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావాలేమీ చూపదు. ♦ ఎప్పుడైనా రుచికరమైన ఆహారాన్ని జిహ్వను సంతృప్తి పరచడానికి తినడం వల్ల వెంటనే ఆరోగ్యమేమీ దెబ్బతినదు. దాని గురించి అతిగా ఆలోచించకుండా వెంటనే ఆ విషయాన్ని మరచిపోవాలి. చేసిన పొరబాటు కంటే పొరబాటును మాటిమాటికీ తలచుకోవడమే ఎక్కువ కీడు చేస్తుంది. ♦ అపరాధ భావనతో కుంగిపోతూ ఒంటరిగా ఉండకూడదు. అందరితో కలిసి ఆనందంగా ఉండాలి. చికిత్సలు... ♦ ఆహార రుగ్మతలకు చికిత్స దీర్ఘకాలం పాటు బహుముఖంగా జరగాల్సి ఉంటుంది. ఇందులో మానసిక చికిత్స, సైకలాజికల్ కౌన్సెలింగ్, కొన్ని రకాల మందులు, న్యూట్రిషన్ లోపాలు కలుగుతాయి కాబట్టి వాటిని భర్తీ చేసే విధంగా పోషకాహారాలు... ఇలా అనేక అంశాలతో ఈ చికిత్స జరగాల్సి ఉంటుంది. ఈ ఆహారరుగ్మతలకు చికిత్స నిర్దిష్టంగా ఉండక, సమస్యను బట్టి ఉంటుంది. ♦ కొన్ని సందర్భాల్లో మానసిక, వ్యక్తుల మధ్య బాంధవ్యసంబంధాల (ఇంటర్‌పర్సనల్ రిలేషన్స్), సాంస్కృతిక అంశాల ఆధారంగా కూడా ఆహారరుగ్మతలు రావచ్చు. కాబట్టి అలాంటి సందర్భాల్లో వాటిని పరిగణనలోకి తీసుకుని చికిత్స-ప్రణాళికను రూపొందించాల్సి ఉంటుంది. ♦ ఆహారం అన్నది మనకు ఆరోగ్యం, ఆనందం, మనశ్శాంతిని కలిగించడానికి అని గుర్తించి దాన్ని ఆస్వాదిస్తూ భుజించాలి. అంతే తప్ప కేవలం క్రమబద్ధమైన జీవితంలోని ఒక అనివార్య అంశంగా మాత్రమే భావించకూడదు. ♦ ఆహారరుగ్మతల విషయంలో సమస్యలు ఎదురైతే సరైన అర్హతలు ఉన్న సైకియాట్రిస్ట్, ప్రొఫెషనల్ న్యూట్రిషనిస్ట్, సైకాలజిస్ట్, మెడికల్ డాక్టర్, కొన్ని సందర్భాల్లో సామాజికవేత్తల వంటి నిపుణుల పర్యవేక్షణలో చికిత్స తీసుకోవాలి. అంతేగాని చెప్పుడు మాటలు వినడం, తగిన విద్యార్హతలు లేని వారి సలహాలతో జీవితాన్ని మరింత దుర్భరం చేసుకోకూడదు. - నిర్వహణ: యాసీన్ -
మా అమ్మాయి మనసు మార్చేదెలా..?
మా అమ్మాయి వయసు 23. బీటెక్ పూర్తయి ఉద్యోగం చేస్తోంది. చాలా అందమైనది, తెలివైనది. క్రమశిక్షణగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి ఒక స్వామీజీ దగ్గరకెళ్లింది. స్వామీజీ తనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారట. అప్పటినుంచి ఆమె ఆ స్వామికి భక్తురాలిగా మారిపోయింది. తరచు స్వామి ఉండే ఆశ్రమానికి వెళ్లడం మొదలు పెట్టింది. పోనీలే అని మేము చూస్తూ ఊరుకున్నాము. అయితే కొద్దికాలంగా ఆమె ఉద్యోగం కూడా వదిలేసి పూర్తిగా ఆయన సేవకే అంకితమైపోయింది. పెళ్లి చేసుకోకుండా స్వామికి పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అంటోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఏం చేయమంటారు, సలహా ఇవ్వండి. - ఓ నిస్సహాయ తల్లిదండ్రులు, విశాఖపట్నం గాభరాపడకండి, ఇలాంటి సమస్య ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులకు ఎదురవుతోంది. అయితే అందరూ మీలాగా ధైర్యంగా బయటపడట్లేదంతే! సాధారణంగా ఇలా సన్యాస మార్గాన్ని ఎంచుకుంటున్న యువతీ యువకులలో చాలావరకు చిన్నప్పటినుంచి వివిధ కారణాల వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నవారే అయి ఉంటారు. మూడ్స్ తరచు మారిపోతుండటం, బాగా డల్‌గా లేదా బాగా యాక్టివ్‌గా ఉండటం కూడా వీరి లక్షణాలలో ఒకటి. ఇటువంటప్పుడు తల్లిదండ్రులు లేదా స్నేహితుల ఆసరా, సహకారం లభించకపోవడం వల్ల లేదా వారిముందు తమ సమస్యలను చెప్పుకోలేకపోవడం వల్ల మృదువుగా, మధురంగా మాట్లాడే స్వామీజీలవంటి వారి మాటల ప్రభావానికి ఇట్టే లోనయ్యే అవకాశం ఉంది. ఇదే అదనుగా అటువంటి స్వామీజీలు తమ మాటలతో, సాంత్వన వచనాలతో వారిని మరింతగా ఆకట్టుకుని, తమ చుట్టూ తిరిగేలా, తాము ఏది చెబితే దానిని గుడ్డిగా అనుసరించేలా చేసుకుంటారు. తమ శిష్యులుగా తయారు చేసుకుంటారు. చాలామంది తల్లిదండ్రులు ఇటువంటి వాటిని తొందరగా గమనించకపోవడం వల్ల, ఒకవేళ గమనించినా చూసీ చూడనట్టు వదిలేయడం వల్ల వారు స్వాముల ప్రలోభానికి, ప్రభావానికి మరింత ఎక్కువగా లోనై, వారి ఆకర్షణ నుంచి బయటకు రాలేని ఒకలాంటి తాదాత్మ్యస్థితిలోకి వెళ్లిపోతారు. మీరు మీ అమ్మాయి విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, వ్యవహారం పూర్తిగా తారుమారయే ప్రమాదం ఉంది. ముందు మీరు ఆశ్రమ సిబ్బందికి విషయాన్నంతటినీ వివరించి, వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడండి. తొలుత కొంతకాలంపాటు స్వామివారు ఇప్పుడు ఎవరినీ కలవాలని అనుకోవడం లేదని చెప్పిస్తూ, ఆశ్రమానికి వెళ్లడాన్ని తగ్గించేలా చేయండి. వారంలో కనీసం ఒకటి రెండు రోజులు తను ఎక్కడికీ వెళ్లకుండా మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉండేలా చేయండి లేదా మీరే ఆమెను అంటిపెట్టుకుని ఉండండి. ఎలాగో ఒకలాగా నచ్చజెప్పి, తనను వెంటబెట్టుకుని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకు వెళ్లండి. అంతకుమునుపే మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి విషయమంతా వివరిస్తే, వైద్యులు ఆమెతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు. సైకియాట్రిస్ట్ ఆమెతో మాట్లాడిన తర్వాత అసలు ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుకగల కారణాలను విశ్లేషించి, అందుకు తగిన కౌన్సెలింగ్ లేదా అవసరమైతే మందులను ఇచ్చి, ఆమె నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేసేందుకు ప్రయత్నించవచ్చు. మీ ప్రయత్నం మీరు చేయండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
డెల్యూజన్ డిజార్డర్స్... మెదడు కనికట్టు... భ్రాంతుల్లోకి నెట్టు!!
ఇది మెదడు చేసే మాయాజాలం. ఆ కనికట్టుకు లోబడిన రోగులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. వింతవింత భ్రాంతులకు లోనవుతుంటారు. ఈ భ్రాంతుల వలన కలిగే రుగ్మతలను గతంలో పారనాయిడ్ డిజార్డర్స్ అని పిలిచేవారు. ఇవి మానసిక వ్యాధుల్లో సైకోసిస్ తరహాకు చెందినవి. వీటిలో రోగి తన ఊహను, భ్రాంతిని అత్యంత వాస్తవంగా భావిస్తుంటాడు. రోగికి తనకు జరుగుతున్న అనుభవమంతా వాస్తవంగా కనిపిస్తుంటే... ఎదుటివారుఎంతగా వివరించినా దాన్ని భ్రాంతి అని చెప్పడాన్ని ఒప్పుకోడు. ఇది జబ్బులేని వారికి భ్రాంతిగా అనిపించవచ్చేమోగానీ, జబ్బుతో బాధపడేవారికి మాత్రం తమలోని జీవరసాయన చర్యల ఫలితంగా ఆ భ్రాంతులే వాస్తవంగా తోస్తాయి. వాటిపై అవగాహన కోసమే ఈ కథనం. ఇంగ్లిష్‌లో డెల్యూజనల్ డిజార్డర్స్ అని పిలిచే వీటిని భ్రాంతి రుగ్మతలుగా పేర్కొనవచ్చు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వాటి గురించి... విచిత్రంగా అనిపించని భ్రాంతులు (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్) ఇందులో రోగికి తను నిత్యజీవితంలో అనుభవంలోకి వచ్చే వాటినే భ్రాంతులుగా పొందుతుంటాడు. అందుకే వీటిని విచిత్రంగా అనిపించని భ్రాంతులుగా పేర్కొనవచ్చు. అంటే... తనను ఎవరో వెంటాడుతున్నట్లు, తనకు వ్యతిరేకంగా ఎవరో కుట్రపన్నుతున్నట్లు, తనకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తాడు. కానీ వాస్తవంగా అది నిజం కాదు. దాంతో రోగి వల్ల పరిస్థితులు ఒక్కోసారి తీవ్ర అపార్థాలకూ, అనర్థాలకూ దారితీయవచ్చు. పైగా ఈ తరహా భ్రాంతులకు లోనయ్యేవారు చూడటానికి, ప్రవర్తన విషయంలో, నలుగురితో కలిసే విషయంలో అంతా మామూలుగానే ఉంటారు. ఇక కొన్ని భ్రాంతులు ఒక అంశం ఆధారం (థీమ్ బేస్డ్)గా సాగుతుంటాయి. వాటిల్లో కొన్ని ఇలా ఉంటాయి. జెలస్ (ఈర్ష్య : ఈ తరహా భ్రాంతి చాలామందిలో ఉంటుంది. ఈ భ్రాంతితో కొన్ని జీవితాలే నాశనమవుతుంటాయి. తన జీవిత భాగస్వామి ఎవరితోనో ప్రేమలో ఉందని, వారితో అక్రమసంబంధం నెరపుతోందని భావిస్తుంటారు. ఆ రుగ్మత కారణంగా అవతలివారిని వేధిస్తూ ఉంటారు. అకారణంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా జీవిత భాగస్వామిని అనుమానిస్తుంటే వెంటనే మానసిక నిపుణులను కలవాల్సి ఉంటుంది. ఎరటోమానియాక్: ఈ భ్రాంతి ఉన్నవారు తనతో ఓ సెలబ్రిటీ లేదా ఓ వీఐపీ ప్రేమలో పడిపోయారని నమ్ముతుంటారు. వారిని కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఫోన్లో మాట్లాడుతూ, వెంటాడుతూ ఉండటం కూడా సాధారణమే. గ్రాండియోజ్: ఈ తరహా భ్రాంతి ఉన్నవారు తనను తాను ఓ అసాధారణమైన వ్యక్తిగా భావిస్తుంటారు. తనకు అద్భుత శక్తులున్నాయనీ, విపరీతమైన విజ్ఞానం ఉందనీ లేదా తాను చాలా ప్రధానమైన వ్యక్తిననీ భావిస్తుంటారు. తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటుంటారు. పర్సెక్యూటరీ: ఈ తరహా భ్రాంతుల్లో ఉండేవారిని ఎప్పుడూ ఓ శంక వేధిస్తూ ఉంటుంది. తమను (చాలా సందర్భాల్లో తమకు కావాల్సిన, తమకు చాలా దగ్గరి బంధువులైనవారిని లేదా తమకు చెందినవారిని కూడా) అవతలివారు అవమానిస్తున్నారని, చిన్న చూపు చూస్తూ కించపరుస్తున్నారని భావిస్తుంటారు. అంతేకాదు... తమపై నిఘా ఉంచారని, తమకు హాని చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారనే భ్రాంతిలో ఉంటారు. సొమాటిక్: ఈ తరహా భ్రాంతులకు లోనయ్యేవరు తమకు ఏదో జబ్బు ఉందని, ఏదో వైద్యపరమైన లోపం ఉందని, తమకు వైద్యం అవసరమని భావిస్తుంటారు. తమకు సరైన చికిత్స దొరకడం లేదనే భ్రాంతిలో ఉంటారు. మిక్స్డ్: కొందరిలో పైన పేర్కొన్న ఏ ఒక్క భ్రాంతి రుగ్మతో కాకుండా... ఒకటి కంటే ఎక్కువగా భ్రాంతులు ఉండవచ్చు. అలాంటివారిని ఈ విభాగంలో పేర్కొంటారు. భ్రాంతులకు లోనయ్యేవారి లక్షణాలు: ఎప్పుడూ ఉద్వేగంగా, అస్థిమితంగా ఉంటారు తక్షణం కోపం వచ్చేస్తుంటుంది కాస్త నిరాశాపూరితంగా ఉంటారు కొన్ని రకాల భ్రాంతులు (హెల్యూసినేషన్స్)లో ఉంటారు. అంటే... తమకు ఏవో దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా లేదా మాటలు వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొందరిలో తమకు ఏదో చెడు వాసన వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. భ్రాంతులకు కారణాలు: నిజానికి చాలా సందర్భాల్లో ఈ తరహా రుగ్మతలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు. అయితే పరిశోధకుల అధ్యయనాలను బట్టి అనేక రకాల అంశాలు దీనికి కారణమని తెలుస్తున్నాయి. వాటిలో జన్యుపరమైన, జీవసంబంధమైన, వాతావరణానికి సంబంధించిన అంశాలు ముఖ్యమైనవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మానసిక అంశాలూ దీనికి దోహదం చేస్తాయి. మానసికకారణాలు/ఇతరాలు: కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా భ్రాంతులు కలగవచ్చని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే మితిమీరి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, కొన్ని రకాల మాదకద్రవ్యాలు తీసుకున్నప్పుడు కూడా రకరకాల భ్రాంతులు కలగవచ్చు. అలాగే ఒంటరిగా ఉండేవారిలో చాలామందికి మానసిక కారణాల వల్ల భ్రాంతులు కలగవచ్చు. ఇక కనుచూపు మసకగా ఉండేవారికి, వినికిడి శక్తి సరిగా లేనివారికి భ్రాంతులు కలిగే అవకాశాలు ఎక్కువ. ఈ రుగ్మత ఉన్నట్లు నిర్ధారణ ఎలా... సాధారణంగా రోగికి విచిత్రమైన భ్రాంతులు (బిజ్జార్ డెల్యూజన్స్) ఉన్నప్పుడు మిగతావారు వాటిని చూడలేకపోవడం వల్ల, పైగా అవి అసాధ్యమైనవి కావడం వల్ల రోగి భ్రాంతికి గురవుతున్నాడని తేలిగ్గా గుర్తించవచ్చు. కానీ సాధారణంగా అనిపించే భ్రాంతులు (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్)... అంటే పైన పేర్కొన్నట్లుగా తమ జీవిత భాగస్వామికి ఇంకెవరితోనో అక్రమ సంబంధాలున్నాయనే భ్రాంతి లేదా తమకు తమ ఆప్తులే కీడు చేయడానికి యత్నిస్తున్నారన్న భ్రాంతితో బాధపడే నాన్-బిజ్జార్ తరహా రుగ్మతలను గుర్తించడం కష్టం. పైగా ఈ భ్రాంతులకు లోనయ్యేవారి ప్రవర్తన కూడా చాలా సాధారణంగా అందరూ నమ్మదగినదిగా ఉంటుంది. దాంతో చాలా సందర్భాల్లో అనర్థాలు, అపార్థాలు, అపోహలు కలిగి జీవితాలు సైతం ఛిద్రం కావడం సాధారణంగా జరిగేదే. అందుకే భ్రాంతులను నిర్ధారణ (డయాగ్నోజ్) చేసే విషయంలో చాలా నిశితం (మెటిక్యులస్)గా ఉండాలి. భ్రాంతులకు లోనవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబితే రోగిని చాలా రకాలుగా అంటే... రోగి తాలూకు పూర్తి వైద్య సమాచారం, మెడికల్ హిస్టరీ, భౌతిక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. భ్రాంతులను ఇదమిత్థంగా నిర్ధారణ చేయడానికి ల్యాబ్ పరీక్షలు లేకపోయినా... కొన్ని సందర్భాల్లో ఏవైనా భౌతిక కారణాల వల్ల ఇలాంటి భ్రాంతులు కలుగుతున్నాయా అన్న అంశాన్ని రూల్అవుట్ చేసుకోడానికి రక్తపరీక్షల వంటి కొన్ని పరీక్షలు చేయించవచ్చు. ఇక రోగికి భ్రాంతులు కలుగుతున్నప్పుడు అక్కడ భౌతికంగా అలాంటి ఆస్కారమే లేని సందర్భాల్లో డాక్టర్లు... పేషెంట్‌ను సైకియాట్రిస్ట్‌కు చూపమని సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కూడా విచిత్రం కాని భ్రాంతుల (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్)కు ఒక నెలపైగా లోనవుతుంటే అప్పుడు ఆ రోగికి భ్రాంతిరుగ్మత (డెల్యూజన్ డిజార్డర్) ఉన్నట్లు నిర్ధారణ చేస్తారు. అయితే ఆ సమయంలో అతడికి ఏవైనా స్కీజోఫ్రీనియా వంటి సైకోటిక్ (మానసిక) జబ్బులు లేవన్న తర్వాతే... అతడికి భ్రాంతిరుగ్మత ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. ఎందుకంటే స్కీజోఫ్రీనియా వంటి మానసిక రుగ్మత ఉంటే... అప్పుడు తప్పనిసరిగా భ్రాంతులు ఉంటాయి. ఆ జబ్బు లేకుండా కూడా భ్రాంతులు ఉన్నాయంటే... అది తప్పనిసరిగా భ్రాంతిరుగ్మతేనని నిర్ధారణ చేస్తారు. చికిత్స: భ్రాంతి రుగ్మతలు ఉన్న రోగికి అటు మందులతోనూ, ఇటు కౌన్సెలింగ్‌తోనూ చికిత్స చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏ ఒక్కదానితోనో ఇవి నయం కావు. చాలా కేసుల్లో మందులు వాడాల్సిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక్కోసారి కేవలం మందులు వాడటం వల్ల కూడా అవి నియంత్రణలోకి రావు. అప్పుడు సైకోథెరపీ (కౌన్సెలింగ్ తరహా చికిత్స) తో ఆ లక్షణాలను నియంత్రించుకోవడం ఎలాగో రోగికి సైతం అవగాహన కలిగించి, స్వీయనియంత్రణ చేసుకునేలా కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ తరహా భ్రాంతులు నియంత్రణలోకి వచ్చినట్లే వచ్చి... మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటాయి. అందుకే ఈ తరహా చికిత్సలో పదే పదే తిరగబెట్టడాన్ని నివారించేందుకు ప్రణాళిక (రిలాప్స్ ప్రివెన్షన్ ప్లాన్) లు రచించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ కింద పేర్కొన్న చికిత్సలను ఇస్తుంటారు. అవి... వ్యక్తిగత సైకోథెరపీ: తనకు వాస్తవంగా తోచినట్లుగా కనిపిస్తున్న ఆ భ్రాంతి గురించి రోగికే అవగాహన కల్పించి... అది తనకు వాస్తవంగా అనిపిస్తున్నప్పటికీ అది భ్రాంతి అనీ, అది వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించేలా కౌన్సెలింగ్ చేయడాన్ని వ్యక్తిగత (ఇండివిడ్యువల్) సైకోథెరపీగా పేర్కొంటారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ): తనకు ఇబ్బంది కలిగించే అంశాలను గుర్తించి, వాటి నుంచి క్రమంగా దూరమయ్యేలా ఇచ్చే కౌన్సెలింగ్‌తో పాటు తనకు ఇబ్బంది కలిగించే ఆలోచనలనుంచి తప్పుకోవడం, అవి రాకుండా నివారించడానికి పాటించాల్సిన అంశాలు, అందుకు అనుగుణంగా మన ప్రవర్తనను మార్చుకోవడం ఎలాగో బోధించడం వంటివి ఈ చికిత్స ప్రక్రియలో ఉంటాయి. ఫ్యామిలీ థెరపీ: నిజానికి ఈ తరహా రోగుల చికిత్సలో కుటుంబం పాత్ర ఎంతో కీలకమైనది. తమకు కనిపించని అంశం కుటుంబ సభ్యులకు ఎంత వాస్తవమో, రోగి ఫీలయ్యే భ్రాంతి కూడా అంతే వాస్తవమని కుటుంబ సభ్యులు గ్రహించాలి. అది రోగలక్షణంగా వారు గుర్తించాలి. అలా గుర్తించి, రోగిని బుజ్జగిస్తూ దారిలోకి తెచ్చుకోవాలి. అంతేగాని దాన్ని ఖండిస్తూ పోకూడదు. అందుకే ఈ తరహా రోగులతో వ్యవహరించాల్సిన తీరు విషయంలో కుటుంబ సభ్యులకు కూడా కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుంది. దీని ఆధారంగా రోగితో కుటుంబసభ్యులు వ్యవహరించే/వ్యవహరించాల్సిన తీరునే సైకియాట్రిస్ట్‌లు ఫ్యామిలీ థెరపీగా పేర్కొంటారు. రోగి త్వరగా కోలుకోడానికి ఇదెంతో ముఖ్యం. దీంతోపాటు యాంటీ-సైకోటిక్ మందులుగా పేర్కొనే మందులను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి తన భ్రాంతులతో ఇతర కుటుంబసభ్యులకు హాని కలిగించేంత ప్రమాదకరంగా ఉంటే వారిని ఆసుపత్రిలో ఉంచి వారు సాధారణ స్థితికి వచ్చే వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది. -నిర్వహణ: యాసీన్ కొన్ని చిత్రవిచిత్ర భ్రాంతులు కాప్‌గ్రాస్ డెల్యూజన్: ఈ భ్రాంతులకు లోనయ్యేవారు... తమ తల్లిదండ్రుల లేదా కుటుంబసభ్యులు, భార్య/భర్త స్థానంలో వేరెవరో అదే రూపంలో వచ్చి ఉంటున్నారనీ, నిజానికి వారు వారు కారనీ భావిస్తుంటారు. ఫ్రెగోలీ డెల్యూజన్: ఒక వ్యక్తే తన కుటుంబ సభ్యుల్లోకి... అనేక రూపాల్లోకి మారిపోతున్నారనీ, ఆయనే అనేక స్థానాలు తీసుకుంటున్నారనీ భ్రాంతికి లోనవుతుంటారు. ఇటాలియన్ నటుడైన లియోపోల్డో ఫ్రెగోలీ వెంటవెంటనే అనేక వేషాలు మార్చడంలో సిద్ధహస్తుడు. అతడి పేరిటే ఈ భ్రాంతి రుగ్మతకు ఈ పేరు వచ్చింది. కోటార్డ్ సిండ్రోమ్: ఈ భ్రాంతి మరీ విచిత్రం. ఇందులో భ్రాంతికి లోనయ్యే వ్యక్తి తాను అసలు జీవించే లేనని భ్రాంతికి లోనవుతుంటాడు. తన శరీరం, రక్తమాంసాలు, అవయవాలు... ఇవేవీ లేవనీ, తన మనుగడే లేదని అనుకుంటుంటాడు. రీడ్యూప్లికేటివ్ పారామ్నీషియా: వాస్తవానికి తాను ఒకచోట ఉన్నా...ఉన్న ప్రదేశం... అక్కడ లేదనీ, అదేదో వేరే దేశంలోనో లేదా మరో సుదూర ప్రాంతంలోనో ఉందని అనుకుంటుంటాడు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఒక వ్యక్తిని చేర్చారనుకుందాం. అతడు... తాను హైదరాబాద్‌లో లేననీ, వేరే ఎక్కడో అమెరికాలో ఉన్నాననీ భావిస్తుంటాడు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మా అబ్బాయి దురలవాట్లను మాన్పించడం ఎలా?
మా అబ్బాయి చెన్నైలో మంచి పేరున్న కాలేజీలో ఇంజినీరింగ్ చదువుతున్నాడు. అయితే చెడుసావాసాలకు అలవాటుపడి, కానబీస్ అనే మత్తుపదార్థాన్ని సేవిస్తున్నాడని తెలిసి, కాలేజీ మాన్పించి ఇంటికి తీసుకొచ్చేశాం. చిన్నప్పటినుంచి కూడా ఆటలాడుకుంటూ, కులాసాగా గడిపేద్దామనే తప్ప చదువు ధ్యాస బొత్తిగా లేదు. ఎలాగో ఇంజినీరింగ్ వరకు నెట్టుకొచ్చాం. వాడికి మంచి లక్ష్యాలు ఉన్నాయి కానీ, వాటిని నెరవేర్చుకునేందుకు ప్రయత్నించడు. మాకు వాడితో ఎలా వేగాలో అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - ఒక తల్లి, హైదరాబాద్. మీ సమస్యను నేను అర్థం చేసుకోగలను. అయితే దేనినైనా మొగ్గగా ఉన్నప్పుడే తుంచేయాలి. లేదంటే పెద్దయ్యాక ఇలాగే తయారవుతారు. అందుకే పిల్లలకు చిన్నప్పటినుంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో పెరిగేలా చూడటం ముఖ్యం. కొందరు పిల్లలు చిన్నప్పటినుంచి ఒకవిధమైన ధోరణిలో ఉంటారు. తల్లిదండ్రుల గారాబం వల్ల, పుష్కలంగా డబ్బుండటం వల్ల, జల్సాకు అలవాటుపడి, చదువును నిర్లక్ష్యం చేస్తారు. క్లాసులో టీచర్లు చెప్పేది వినరు, నోట్సు రాసుకోరు. క్లాసులే కాదు, పరీక్షలు కూడా ఎగ్గొడుతుంటారు. డబ్బుండటం వల్ల రకరకాల స్వభావాలుండే స్నేహితులు వీరి వెనకాల తిరుగుతుంటారు. పిల్లలు ఇలా ఉన్నప్పుడే పెద్దలు దానిని ఖండించి, నయానో, భయానో నచ్చజెప్పి వారిని గాడిలో పడేలా చేయాలి. లేదంటే పెద్దయినా వారిలో ఇదే ధోరణి కొనసాగుతుంది. సాధారణంగా ఇటువంటి పిల్లలు క్షణికమైన ఆనందాన్నిచ్చే మత్తుపదార్థాలు, మద్యపాన ం, ధూమపానం తదితర దురలవాట్లకు అలవాటుపడి, వాటికి తొందరగా బానిసలుగా మారతారు. ఫలితంగా సంఘవిద్రోహశక్తులుగా కూడా మారతారు. మీ అబ్బాయి ఇంజినీరింగ్ చదువుతుంటే మాన్పించి ఇంట్లో కూర్చోబెట్టారంటున్నారు. అలా ఖాళీగా ఉంటే మరింతగా చెడిపోయే ప్రమాదం ఉంది. అయితే ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. అతన్ని తనకిష్టమైన మరో మార్గం వైపు మళ్లించేందుకు ప్రయత్నించండి. అంటే స్పోర్ట్స్, గేమ్స్ లాంటి వాటివైపన్నమాట. మీరు, మిగిలిన కుటుంబ సభ్యులందరూ అతన్ని బాగా చూసుకోండి, ప్రేమగా మెలగండి. తాను చేస్తున్నది తప్పని తనే తెలుసుకునేలా చేయండి. సైకోథెరపీ, కౌన్సెలింగ్ వంటి వాటిద్వారా అతని మనసును మంచి మార్గంవైపు మళ్లేలా చూడండి. అంతేకానీ, హిప్నాటిజం వంటి వాటివల్ల అద్భుతం జరిగి, అతను అనూహ్యంగా మారతాడని మాత్రం ఆశించకండి. మీ అబ్బాయిని తీసుకుని మంచి సైకాలజిస్టును కలవండి. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్ సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
‘ఆరోగ్య స్పృహ’ మితిమీరితే..!
ఏదైనా సరే అది మితంగానే ఉండాలి. మంచి కూడా మితిమీరితే చెడు చేస్తుందనడానికి ఈ రుగ్మతే ఒక ఉదాహరణ. ఇటీవల ప్రతివారిలోనూ ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. దాంతో మనం తినేది మంచా, చెడా అని సరిచూసుకోవడమూ పెరిగింది. అది మంచిదే. కానీ కొంతవరకే. ఏది మంచిదో తర్కించుకోవడం ఒక స్థాయికి మించితే అది మనకు మేలు చేయదు సరికదా... మనల్ని సంశయానికి దారితీయిస్తుంది. సంక్షోభంలో పడేస్తుంది. ఇది అన్ని విషయాల్లోనూ కనిపించినా... ప్రధానంగా ఇటీవల మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనే స్పృహ విపరీతంగా పెరిగి అది రుగ్మత స్థాయికి దారితీసింది. ఆ జబ్బుపేరే... ‘ఆర్థోరెక్సియా నర్వోజా’. ఇటీవల కొత్తగా పుట్టి, కొత్తగా పేరు పెట్టుకున్న కొత్త రుగ్మత గురించి అవగాహన కోసమే ఈ కథనం. ఆర్థోరెక్సియా నర్వోజా గురించి తెలుసుకోడానికి ముందుగా కాస్త మనం దాని తల్లిదండ్రుల్లాంటి రెండు వ్యాధుల గురించి తెలుసుకోవాలి. అవే... అనొరెక్సియా నర్వోజా, బులీమియా. తాము అందంగా కనిపించాలన్న స్పృహ ఉన్న చాలామందికి ఈ వ్యాధుల గురించి ఇప్పటికే తెలుసు. కొందరిలో తాము లావెక్కితే అందంగా కనిపించమేమోనన్న స్పృహ మరింత పెరిగిపోతుంది, దాంతో తాము ఏ పదార్థాన్నీ ఇష్టపడకుండా పోతారు, అసలు ఒక దశలో ఆహారం అంటేనే అసహ్యించుకునే స్థాయికి చేరుతారు. రుగ్మత దశకు చేరిన ఆ స్థితి పేరే ‘అనొరెక్సియా నర్వోజా’. అంతకుముందు ఆరోగ్యంగా, అందంగా ఉన్నవారు కాస్తా... ఆ స్థితిని పోగొట్టుకోకూడదన్న పట్టుదలతో కొంచెం కొంచెం మాడుతూ క్రమంగా ఎముకలగూడులా మిగిలిపోతారు. ఒకదశలో ఇక వారికి ఆహారం అంటేనే అసహ్యం వేసి అన్నాన్ని ఎంతమాత్రమూ ముట్టుకోరు. ఈ కండిషన్‌ను అనొరెక్సియా నర్వోజా అంటారు. బులీమియా కూడా ఇంచుమించు ఇంతే. కాకపోతే వీళ్లు అసలు తినకుండా ఉండరు. రుచికోసం ఆహారాన్ని తింటారు. తిన్న వెంటనే కాసేపటికి దాన్ని వమనం చేసుకొని బయటకు పంపుతారు. అందం స్పృహ మితిమీరి, కోరి తెచ్చుకున్న ఇలాంటి కండిషన్‌ను ‘బులీమియా నర్వోజా’ అంటారు. మొదట తాము కోరి చేసుకుంటున్న వమనం కాస్తా... ఒక దశకు చేరాక తాము ఏది తిన్నా అది వాంతి రూపంలో బయటకు వెళ్తుంటుంది. ఈ రెండు కండిషన్లలాంటి స్థితే ‘ఆర్థోరెక్సియా’. అయితే అనొరెక్సియాలో అందానిది ప్రధాన భూమిక కాగా... ఆర్థోరెక్సియాలో ఆరోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనొరెక్సియా, బులీమియా కండిషన్లలో అందం చెడకుండా ఉండటానికి ప్రాధాన్యమిచ్చేవారు ఈ కండిషన్‌కు లోనవుతుంటారు. ప్రధానంగా మోడలింగ్ చేసేవారు, బాలే డాన్సర్లు, యాక్టింగ్ వంటి వృత్తుల్లో ఉన్నవారు దీనికి లోనయ్యే ప్రమాదం ఉండగా... ఆరోగ్యస్పృహ మితిమీరిన ప్రతి ఒక్కరూ ఆర్థోరెక్సియాకు లోనయ్యే ప్రమాదం ఉంది. ఎలా కనుగొన్నారు ఈ జబ్బును...? ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ రోమ్కు చెందిన దాదాపు 400కు పైగా విద్యార్థులు ఒక సర్వే నిర్వహించారు. కేవలం అందంగా కనిపించడానికి ఆస్కారం ఉండే కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి మాత్రమే గతంలో పరిమితమైన అనొరెక్సియా, బులీమియా రుగ్మతలు ఇప్పుడు తాము సర్వే జరిపిన శాంపిల్‌లో దాదాపు 7 శాతం మందికి పైగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి తోడు ఈ రెండు వ్యాధులూ కలగలసి ఉన్న ఒక కొత్త రుగ్మతను కలిగి ఉన్న వారు సైతం తాము సర్వే నిర్వహించిన జనాభాలో ఉన్నట్లుగా వారు గ్రహించారు. ఆరోగ్యానికి వారిచ్చే ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ రోమ్ విద్యార్థులు రూపొందించుకున్న ప్రశ్నావళి ఆధారంగా ఈ కొత్త జబ్బు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని వారికి తెలిసింది. పైగా ఇదో దీర్ఘకాలిక రుగ్మత అన్న విషయం కూడా వారికి అర్థమైంది. నిజానికి తమ ప్రమేయం లేకుండానే తమకు తెలిసి వచ్చిన సరికొత్త వ్యాధి ఇదని వారు తెలుసుకున్నారు. ఇలాంటి లక్షణాలను డాక్టర్ స్టీవెన్ బ్రాట్మేన్ ‘ద ఫుడ్ ఆఫ్ జంకీస్’ అనే పుస్తకంలో ఉటంకించారు. ఆర్థోరెక్సియా నర్వోజా అంటే ఏమిటి...? ఇటీవల టీవీల్లో, వార్తాపత్రికల్లోని హెల్త్ కాలమ్స్‌లో ఆరోగ్యం గురించిన కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రజల ప్రాథమిక అవగాహన కోసం రాసిన విషయాలను... ఆ మేరకే పరిమితం చేసుకోకుండా కొందరు వాటిని చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. అనారోగ్యకరమైనవిగా తాము భావించే పదార్థాలను అస్సలు ముట్టుకోకపోవడం, ఏది తిన్నా అది ఆరోగ్యకరమైనదో, కాదో అంటూ ఆందోళన పడుతుండటం, ఆ ఆందోళన స్థాయి మితిమీరి మానసిక వ్యాకులతకు దారితీయడం వంటివి జరిగితే అదే... ‘ఆర్థోరెక్సియా నర్వోజా’. మరికొందరైతే తాము తీసుకునే ఆహారంలో ఎలాంటి రంగులు కలిపారో, ఎలాంటి ప్రిజర్వేటివ్ కలిపారో, ఎలాంటి చోట్ల వండారో, వాటి వల్ల మనకు ఎలాంటి జబ్బులు వస్తాయో అంటూ ఆందోళనను అధికం చేసుకుంటుంటారు. ఎలా ఉంటాయి దీని లక్షణాలు...? ఆర్థోరెక్సియా నర్వోజా లక్షణాలు మనలో ఉన్నాయేమో అని పరిశీలించుకోవడం సులభం. సాధారణంగా మనందరికీ ఆరోగ్యసూత్రాలు బాగా తెలిసే ఉంటాయి. ఉదాహరణకు... ఉప్పు ఎక్కువగా తినకూడదు నూనెలు ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి పిజ్జాలు, బర్గర్లు అనారోగ్య హేతువులు చక్కెర ఎక్కువ తింటే అనర్థమే జంక్‌ఫుడ్ తింటే జబ్బులే బయటి పదార్థాలు తినడం అంటే జబ్బును కోరితెచ్చుకోవడమే... లాంటివి. ఇక పైన చెప్పిన కొన్ని సాధారణ సూత్రాలను మితిమీరి పాటిస్తుంటే మనలో ఆర్థోరెక్సియా వృద్ధి చెందుతున్నట్లే. ఉదాహరణకు ఉప్పు ఎక్కువగా తినకూడదనేది మంచి ఆరోగ్యసూత్రం. కానీ ఏదో ఒక సందర్భంలో ఒక అప్పడమో లేదా రుచి కోసం కాస్తంత ఆవకాయో తిన్నారనుకుందాం. అప్పట్నుంచీ మీలో అపరాధ భావన మొదలవుతుంటుంది. మనం తిన్న ఉప్పు కిడ్నీలను దెబ్బతీస్తుందేమో, దీనివల్ల మనలో రక్తపోటు పెరిగిపోతుందేమో అన్న భావన మితిమీరుతుంది. అలాగే నూనె ఎక్కువగా తినకూడదనే స్పృహ పెరిగిపోయాక, తాము తిన్న పదార్థాల్లో నూనె పాళ్లు ఎంత ఉన్నాయో, వాటివల్ల బరువు పెరిగిపోతుందేమో అంటూ ఆందోళన చెందుతారు. ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు... చాక్లెట్, ఐస్‌క్రీమ్ తిన్నా దానివల్లనే తమకు డయాబెటిస్ వస్తుందేమో అనే ఆందోళన. ఇలాంటి ఆందోళనలన్నీ పెచ్చుమీరిపోయి... ఎవరు చాక్లెట్, ఐస్‌క్రీమ్ లాంటి వాటిని ఇచ్చినా లేదా ఎవరైనా ఏదైనా తినే పదార్థాన్ని ఆఫర్ చేసినా దాన్ని తిరస్కరిస్తూ పోతుంటారు. దీన్నే ‘హైపర్ యాక్యురసీ’గా పేర్కొంటారు. ఈ హైపర్ యాక్యురసీ భావనను అధిగమించడానికి తాము రోజూ చేయాల్సిన దానికంటే మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉండటం, ఈ వ్యాయామం తాము తిన్న ఆహారాన్ని పూర్తిగా కాల్చి వేసిందో లేదో అంటూ దాన్ని కొనసాగిస్తూ తమను తాము బాధపెట్టుకుంటూ ఉంటారు. ఈ బాధపెట్టుకోవడం అన్నది క్రమంగా తమను తాము వ్యాయామంతో హింసించుకునే స్థాయికి చేరుతుంది. ఆధ్యాత్మిక ఆర్థోరెక్సియా కూడా ఉంటుందా? మన సమాజంలో కొన్ని ఆహారపు అలవాట్లను పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఉదాహరణకు పాలు, నెయ్యి,అరటిపండు, కొబ్బరిముక్కలు లాంటివి మన సమాజంలో పవిత్రమైన ఆహారాలు. మన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి శుక్రవారం పూజ నిర్వహించి, అరటిపండు, కొబ్బరిముక్కలను చిన్న ముక్కలుగా చేసి, వాటిపై చక్కెర జల్లి ప్రసాదం రూపంలో ఇవ్వడం పరిపాటి. ఇక కొన్నిప్రసాదాల్లో తియ్యటి బూంది, జీడిపప్పు వంటివి ఉండటం సహజమే. వాటిలోని కొన్నిపోషకాలు హానికరమైనవంటూ ఎక్కడైనా చదవడమో లేదా ఏ టీవీ కార్యక్రమంలోనైనా చూడటమో జరుగవచ్చు. దాంతో అనేక అనుమానాలు కలుగుతుంటాయి. ఉదాహరణకు... ‘‘పాలల్లో ఏదో ఒక మేరకు కొలెస్ట్రాల్ లాంటి కొవ్వుపదార్థాలు ఉంటాయి. అందుకే కొవ్వు లేని పాలు తాగాలి. ఇక నెయ్యిలో పూర్తిగా శాచ్యురేటెడ్ కొవ్వులే ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. అరటిపండులో కార్బోహైడ్రేట్స్, చక్కెర పాళ్లు ఎక్కువ. అది డయాబెటిస్‌కు దారితీయవచ్చు. పైగా ప్రసాదం పైన చక్కెర జల్లడం వల్ల అది మరింత ప్రమాదకారి కావచ్చు’’ లాంటి భావనలు పెరిగి, కొద్ది ప్రమాణాల్లో తీసుకునే ప్రసాదం కూడా వారికి హానికరంగానే అనిపిస్తుంది. ఈ భావన ఎంతగా పెరుగుతుందంటే ఒక్కోసారి టీ, కాఫీలలో చక్కెర ఎక్కువైతే అది ఎక్కువైన మేరకు హాని చేస్తుందనీ, ఆ హానిని తొలగించేందుకు ఆ చక్కెరను బర్న్ చేయడానికి, ఏ పనీ లేకపోయినా మరో రెండుమూడుసార్లు మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటారు. అయోమయం, అపరాధభావన కలగలిసి... ప్రసాదంలోని పాలు, నెయ్యి, అరటి, కొబ్బరిలాంటి పదార్థాలను పవిత్రంగా స్వీకరించాల్సినవన్న ఫీలింగ్ మనలో ఉంటుంది. ప్రసాదం కాబట్టి తిరస్కరించకూడదన్న భావన ఒకవైపు, పాలలోని కొలెస్ట్రాల్, అరటిలోని చక్కెర, నెయ్యి, కొబ్బరిలోని కొవ్వుపదార్థాలు ఆరోగ్యానికి శత్రువులు కాబట్టి వాటిని తీసుకోవడమా, మానడమా అన్న సందిగ్ధత మరోవైపు! ఇక తీసుకోకూడదన్న ఆలోచన వచ్చినందుకు గిల్టీఫీలింగ్ వస్తుంది. దాంతో తాము భగవంతుడి పట్ల ద్రోహచింతనతో మెలుగుతున్నామనే అపరాధ భావన పెరిగి అది మానసిక క్షోభకు దారితీస్తుంది. క్రమంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) భావనలూ పెంపొందుతాయి. అవి యాంగ్జైటీకి దారితీసి...అన్నీ కలగలసి ఆర్థోరెక్సియా నర్వోజాకు దారితీస్తాయి. తమకు తామే సామాజిక బహిష్కరణ చేసుకునే తీరిది... ఆర్థోరెక్సియా నర్వోజా భావనలు బలంగా వృద్ధి చెందుతున్న / చెందిన వారు క్రమంగా తమకు తాము సామాజిక బహిష్కరణ శిక్ష వేసుకుంటారు. సాధారణంగా కొనుగోలు చేయాల్సిన ఆహారపదార్థాల కోసం ఆర్గానిక్ పదార్థాలు దొరికే షాపింగ్ మాల్స్ లేదా ప్రదేశాల కోసం వెతుకుతుంటారు. అవి ఆర్గానిక్‌గా పండించినవేనా అని పదే పదే తెలుసుకుంటుంటారు. వాటి నాణ్యత గురించి షాపుయజమానులతో మితిమీరి వాకబు చేస్తుంటారు. ఇక బయట ఎక్కడైనా రెస్టారెంట్లో తినాల్సి వస్తే వారు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేశారో, అవి మంచివో-కావో, బాగా వండారో-లేదో, ఎలాంటి నూనెలు వాడరో, అవి ఆరోగ్యవంతమైనవి కాకపోవచ్చేమో అనే భావనలు క్రమంగా పెరుగుతాయి. దాంతో ఇంటివంటకే పరిమితమై, ఇంట్లోనూ వంట సమయంలో అతి పర్ఫెక్షన్కు ప్రాధాన్యమిస్తుంటారు. నిజానికి ఆరోగ్యస్పృహ ఉండటం మంచిదేగాని మితిమీరిన ఆరోగ్య స్పృహ ఆరోగ్యకరం కాదని గ్రహించాలి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యంగా ఉండగలం. -నిర్వహణ: యాసీన్ బయట పడటం ఎలా...? తమకు తాము కౌన్సెలింగ్ చేసుకోవడం, ఆరోగ్య స్పృహ ఉండటం తప్పు కాదని, అయితే అది మితిమీరేలా చేసుకొని కోరి కోరి తమకు తామే శారీరక, మానసిక అనారోగ్యాలు తెచ్చుకోవడం సరికాదని గ్రిహ స్తే, ఈ ఆర్థోరెక్సియా నుంచి బయటపడటం చాలా తేలిక. అయితే ఒక్కోసారి తమను తాము అధిగమించలేని పరిస్థితుల్లో మాత్రం మానసిక నిపుణుల/ప్రొఫెషనల్స్ సలహా/కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇదెంతో తేలికగా అధిగమించదగిన సమస్యగా భావిస్తుండాలి. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, స్టార్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్ -
పిల్లలిద్దరితో వేగలేకపోతున్నాను..?
మా పెద్దవాడికి ఆరేళ్లు. రెండోవాడికి రెండేళ్లు. ఇద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. చిన్నవాడికి ఏమి తెస్తే అది తనకూ కావాలని పెద్దవాడు పేచీపెడుతుంటాడు. ‘తమ్ముడితోనే ఎక్కువసేపు గడుపుతున్నావు, నీకు నేనంటే ఇష్టం లేదు’ అని అలుగుతుంటాడు. నేను జాబ్ చేస్తున్నాను. ఇంటికి వచ్చేసరికి వీళ్లిద్దరి తగవులు తీర్చలేక సతమతమవుతున్నాను. మావారేమో ఇద్దరు పిల్లలను పెంచడం కూడా చేతకాకపోతే ఎలా అంటూ నన్నే ఎగతాళి చేస్తుంటారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా చెప్పగలరు. - సుప్రియ, తెనాలి ఇది చాలామంది ఇళ్లలో సాధారణంగా జరిగేదే. దీనిని సిబ్లింగ్ రైవలరీ అంటారు. ఒకవిధంగా ఇది ఇది డెవలపింగ్ మైల్‌స్టోన్‌గా చెప్పవచ్చు. అంటే సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడి, నెగ్గుకురావడం ఎలాగో మీ పిల్లలు ఇప్పటినుంచే నేర్చుకుంటున్నారన్నమాట! ఇదే ధోరణి వారికి కనీసం పదహారు పదిహేడేళ్లు వచ్చేవరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ స్నేహితులైపోతారు. అయితే ఇది రానురానూ మరీ తీవ్రమై, హింసాత్మక ధోరణులకు దారితీసేలా ఉంటే గనక ఇద్దరినీ చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. అసలు పిల్లలు అలా చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే... తల్లిదండ్రుల ప్రేమను పొందడం గురించి పిల్లలు ఒకరితో ఒకరు పోటీపడటం. మరీ చిన్నపిల్లలైతే గనక వారికి పూర్తిగా తెలియక, తమ అసంతృప్తిని రకరకాలుగా వ్యక్తం చేస్తుంటారు. చిన్నవాళ్లతో పోటీగా మరీ పసిపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. వయసును బట్టి వారి ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది. తమ్ముడిని లేదా చెల్లెలిని తిట్టడం, కొట్టడం, బాధ పెట్టడం...చేస్తుంటారు. ఇది కేవలం పెద్దపిల్లలు చిన్నవాళ్లను చేయడమే కాదు, చిన్నపిల్లలు పెద్దవారిని కూడా చేయవచ్చు. మీరు ఏం చేస్తారంటే... వీలైనంతవరకు ఇద్దరితోనూ సమానంగా సమయాన్ని వెచ్చిస్తుండాలి. మీరు చిన్నవాడితో గడిపేటప్పుడు పెద్దవాడిని వాళ్ల నానమ్మ దగ్గరో, నాన్న దగ్గరో ఉండేలా చేయండి. తర్వాత దగ్గరకు పిలిచి, ఇద్దరితోనూ కలిసి గడపండి. పెద్దవాడిని పొరపాటున కూడా ‘చిన్నవాడితో పోల్చకండి. నిజానికి పెద్దవాడు కూడా వయసులో అంత పెద్ద ఏమీ కాదు కదా! కొంతకాలం ఓపికపట్టడం, బుద్ధిగా ఉంటే బహుమతులు ఇస్తానని పెద్దవాడిని ఊరించడం, చిన్నవాడిని కూడా పెద్దవాడితో ఆడుకునేలా చేయడం ఒక్కటే మార్గం. వీరిద్దరి గొడవలో పడి మీరు రిలాక్స్ కావడం మరచిపోవద్దు. లేదంటే మీరు డిప్రెషన్లో పడతారు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మూడేళ్లొచ్చినా... ఇంకా నడక, మాటలు రాలేదు..?
మా అబ్బాయికి మూడేళ్లు. వాడిలో ఆటిజం లక్షణాలున్నట్లు కనుక్కున్నాము. ఇంకా మాటలు సరిగా రాలేదు. ఏది కావాలన్నా అడగలేడు. ఎవరితోనూ కలవడు. వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే కొన్ని రకాల రక్తపరీక్షలతోబాటు ఈయీజీ, ఎమ్మారై పరీక్షలు చేయించమన్నారు. దాంతో మా ఆవిడ చాలా కంగారుపడుతోంది. అసలు మా అబ్బాయి సమస్య ఏమిటి? ఇంత ఖరీదైన పరీక్షలు వాడికి ఈ వయసులోనే ఎందుకు? -బి. రాధాకృష్ణ, హైదరాబాద్ మీ సమస్యకు జవాబిచ్చే ముందు మాకు మరికొంత సమాచారం కావాలి. మీ అబ్బాయికి ఆటిజమ్ అని తెలిసిందన్నారు. ఎలా తెలిసింది? గర్భధారణ సమయంలో మీరేమైనా రుగ్మతలతో బాధపడ్డారా? ప్రసవం ఎలా జరిగింది? కాంప్లికేషన్లు ఏమైనా ఎదురైనాయా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మీకు పూర్తి సమాధానం ఇవ్వగలం. అయితే మాకు అర్థమయినదాన్ని బట్టి... మీ బాబులో ఏవైనా నరాలకు సంబంధించి అసాధారణ రుగ్మతలు లేదా ఫిట్స్, మూర్ఛ వంటి ఏమైనా ఉండి ఉండవచ్చునని మీ బాబుకు చికిత్స చేస్తున్న డాక్టర్ అనుమానించి ఉండవచ్చు. అందుకే ఎమ్మారై, ఈఈజీ పరీక్షలు చేయించమని సలహా ఇచ్చి ఉంటారు. ఒక్కోసారి జన్యుసంబంధిత పరీక్షలు చేయించవలసి రావచ్చు. డాక్టర్లు అయినా చిన్న పిల్లలకు సంబంధించి అన్ని విధాలైన కేస్ స్టడీస్ చేసి, ఆయా పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతగానీ చికిత్స మొదలు పెట్టలేరు కదా! పెరుగుదలకు సంబంధించిన సమస్యలు అంటే పారాడటం, నడక, మాట్లాడటం, మెదడు అభివృద్ధి చెందటం వంటివి ఆటిజమ్ ఉన్నవారికే ఉండాలని లేదు. ఎవరికైనా రావచ్చు. శిశువులో ఎదుగుదల ఆలస్యం అవుతోందనుకుంటే వైద్యుడి సలహాను బట్టి విటమిన్లు, ధాతువులు, ఇతర పోషకాలు కలిగిన ఆహారాన్ని లేదా నేరుగా విటమిన్ మాత్రలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను తగిన మోతాదులో బిడ్డకు అందించవలసి ఉంటుంది. మాటకు సంబంధించి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి చికిత్సల ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. అన్నింటికన్నా ముఖ్యం... కొందరిలో కొన్ని ఆలస్యంగా కూడా జరగవచ్చు. అంతమాత్రానికే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు భయపడిపోయి, బెంబేలెత్తిపోయి మీ బిడ్డకు ఇక మాటలు రావేమో, నడవలేడేమో అని కుంగిపోవలసిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఇంటిలోని ఇతర పెద్దల సలహా మేరకు సత్ఫలితాలను పొందడానికి చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూ... మరీ ఆలస్యం అవుతోందనుకుంటే డాక్టర్ సలహా తీసుకుని వాటిని ఆచరణలో పెట్టడం అవసరం. మీ బాబుకు మూడేళ్లే అన్నారు కదా, ఇప్పటికి ఏమీ మించి పోలేదు. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలా ఆలస్యంగా నడక, మాటలు వచ్చిన వారున్నారేమో మీ పెద్దల ద్వారా తెలుసుకుని, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే, చైల్డ్ సైకియాట్రిస్ట్‌ను కూడా సంప్రదించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
అబ్బాయి సమస్యకు ఆ పరీక్షలెందుకు?
మా అబ్బాయికి మూడేళ్లు. వాడికి ఆటిజమ్‌తో పాటు వికాసంలో లోపాలు ఉన్నట్లు తెలిసింది. అయితే వాడికి మాటలింకా రావాల్సి ఉంది. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేడు. మాకు తెలిసిన డాక్టర్‌కు చూపిస్తే ఆయన రక్తపరీక్షలు, ఈఈజీ, ఎమ్మారై చేయించమని చెప్పారు. మేం అడగదలచుకున్న అంశం ఏమిటంటే... మా అబ్బాయి విషయంలో వచ్చిన సమస్య ఏమిటి? పైన పేర్కొన్న పరీక్షలన్నీ వాడి విషయంలో ఎలా ఉపయోగపడతాయి? - ఎస్. ఝాన్సీ, రాజమండ్రి మీ అబ్బాయి లాంటి కేసుల్లో అతడి పుట్టుక నుంచి మొదలుకొని ఇప్పటివరకూ మెడికల్ హిస్టరీ అవసరమవుతుంది. గర్భధారణ సమయంలోని హిస్టరీ కూడా అవసరం. అతడి పరిస్థితిని అంచనా వేయడానికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేకమైన గణన పరీక్షలు కూడా చేయాలి. ఇలా అతడి గురించి అన్ని వివరాలూ సేకరించాకనే అతడికి ఉన్న సమస్య, ఆటిజమ్ ఉందా లేదా అన్న విషయం నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది. అయితే అన్ని కేసుల్లోనూ అన్ని రకాల పరీక్షలూ అవసరం కాకపోవచ్చు. కొన్ని కొన్ని విషయాలు బయటపడుతున్న కొద్దీ దాన్ని బట్టి తదుపరి కొన్ని నిర్దిష్టమైన పరీక్షలు అవసరమవుతాయా, లేదా అన్నది తెలుస్తుంది. ఒక్కోసారి ఇది జన్యుపరంగా వచ్చిందా అన్న సందేహం వస్తే అప్పుడు జెనెటిక్ పరీక్షలు అవసరమవుతాయి. అలాగే ఈఈజీ, ఎమ్మారై అన్న పరీక్షలతో పిల్లాడిలో ఏవైనా నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా లేదా ఫిట్స్ /సీజర్స్ ఉన్నాయా అన్నది తెలుస్తుంది. అయితే ఏయే పరీక్షలు ఎవరికి చేయాలన్నది రోగి నుంచి రోగికి మారుతుంది. ఇక మీరు చెబుతున్న వికాసంలో లోపాలు అంటే నడక పూర్తిగా రాకపోవడం, పాకడం సరిగా రాకపోవడం, మాటలు రాకపోవడం వంటివి మెదడులోని కొన్ని భాగాలు (కేంద్రాలు) సరిగా ఎదగకపోవడాన్ని సూచిస్తాయి. అయితే ఇలాంటి చాలా సందర్భాల్లో కాలం గడచిన కొద్దీ ఆ లోపాలు వాటంతట అవే సరైపోతాయి. కాకపోతే వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుందంతే. ఇలాంటి సందర్భాల్లో ఆ లోపాన్ని అధిగమించడం కోసం సమయానుకూలంగా, తగు మోతాదులు మార్చుకుంటూ... పోషకాలు, విటమిన్లు, ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఇవ్వడం ద్వారా చేసే అత్యాధునిక బయో-మెడికల్ చికిత్స అందివ్వడం వల్ల వేగంగా సరిదిద్దడం సాధ్యమవుతుంది. దీనివల్ల మాటలు త్వరగా రావడమేగాక... పిల్లవాడిలో మెదడు సాధారణ ఎదుగుదల కూడా బాగుపడుతుంది. (అయితే ఇందుకు తీవ్రమైన బుద్ధిమాంద్యత ఉన్న పిల్లల విషయం మినహాయింపు). ఇలా వికాసంలో తేడాలు ఉన్న పిల్లల విషయంలో ఎంత త్వరగా సమస్యను గుర్తించగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వికాసంలో భాగంగా జరిగే కొన్ని అభ్యాసాలు (ఉదాహరణకు మాటలు నేర్చుకోవడం) వంటివి ఆ వయసులో జరగకపోతే ఆ తర్వాత అంత తేలిగ్గా పట్టుబడవు. అందుకోసమే ఇలాంటి చికిత్సల విషయంలో చికిత్సలు / థెరపీస్ వంటివి ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరిగితేనే గరిష్ఠ ప్రయోజనాన్ని ఇస్తాయి. అందుకే ఇలాంటి పిల్లల విషయంలో ముందుగా తల్లి చాలా నిబ్బరంతో, పిల్లవాడిని బాగుపరచే విషయంలో కృతనిశ్చయంతో ఉండాలి. నిజానికి నిబ్బరమైన స్థితే పరిస్థితిని సగం మెరుగుపరుస్తుంది. మీరు ఆందోళన పడకుండా వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
ఆమెకు అన్నింటికీ అనుమానమే..!
నాదొక చిత్రమైన సమస్య. సమాజంలో పేరు ప్రతిష్టలు ఉన్న బిల్డర్‌ని. నా భార్య బాగా చదువుకుంది. అన్ని విషయాలను చక్కగా అర్థం చేసుకుంటుంది... ఒక్క నన్ను తప్ప! మా దూరపు బంధువు ఒకరితో నాకు వివాహేతర సంబంధం ఉందని తన అనుమానం. ఐదేళ్లక్రితం ఎలాగో మొదలైన ఈ అనుమానంతో నాకు ప్రతిరోజూ నరకం చూపిస్తోంది. తన అనుమానాన్ని బలపరిచే సాక్ష్యాధారాల కోసం నా భార్య ఈ ఐదేళ్లుగా ప్రయత్నిస్తూనే ఉంది. నేను ఫోన్లో మాట్లాడుతుంటే ‘ఆమె’తోనే మాట్లాడుతున్నానని, నేను ఏదైనా ఆలోచనలో ఉంటే ఆ ఆలోచన ‘ఆమె’ గురించేనని అనుకుంటోంది. అలాగని నాతో గొడవ పడదు. తనలో తనే కుమిలిపోతుంటుంది. ఈ మధ్యయితే... మేమిద్దరం కలిసి త్వరగా తన పీడను వదిలించుకోవడం కోసం తనను చంపేందుకు కుట్రపన్నుతున్నామని భయపడుతోంది! ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో సలహా ఇవ్వగలరు. - పేరు రాయలేదు, హైదరాబాద్ మీరు రాసిన దానిని బట్టి మీ శ్రీమతి పి.డి.డి. (పెర్సిస్టెంట్ డెల్యూషనల్ డిజార్డర్)తో బాధపడుతున్నట్లు అర్థమౌతోంది. పైకి అన్ని విధాలుగా బాగానే కనిపించడం ఈ డిజార్డర్‌లోని ప్రత్యేకత. అయితే ఇందులోని ప్రతికూల అంశం ఏమిటంటే... ఈ ప్రభావం అసలు వ్యక్తి మీద కన్నా, వారి కుటుంబ సభ్యులపైనే ఎక్కువగా పడుతుంది. మీ శ్రీమతిలోని అనుమానం స్థాయి పరాకాష్టకు చేరుకోవడంతో మీరు తనకి నమ్మకద్రోహం చేస్తున్నట్లు ఆందోళన చెందుతున్నారు. అదే పనిగా ఆలోచిస్తూ, ఆరాలు తీసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ కారణంగా ఆమె దైనందిన జీవితంలోని ఎన్నో ముఖ్యమైన పనులు కుంటుబడిపోయే ప్రమాదం ఉంది. కొన్నిసార్లు పి.డి.డి. తారాస్థాయికి చేరి కళ్లముందు కనిపించే ప్రతిదానికీ మనసు విపరీతార్థాలు కల్పించుకుంటుంది. కనిపించని వాటిని ఊహించుకుని నిస్పృహకు లోనవుతుంది. ఎవరైనా ఈ ప్రస్తావన తెస్తే ఆ వ్యక్తి ఆలోచనలు, భావాలు, ప్రవర్తన ఉద్వేగభరితం అవుతాయి. ‘నీదే తప్పు’ అని ఎవరైనా అంటే కుప్పకూలిపోతారు లేదంటే విరుచుకుపడతారు. ఒక్కోసారి ఆత్మహత్యకు కూడా పాల్పడవచ్చు. ఇలాంటి పరిణామాలేవీ సంభవించకముందే మీరు మీ శ్రీమతితో కలిసి సైకియాట్రిస్ట్‌ను కలవండి. పి.డి.డి.తీవ్రతను బట్టి సైకియాట్రిస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారు. మందులు కూడా సూచిస్తారు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
ఆటిజమ్‌కు బయోమెడికల్ చికిత్స పనిచేస్తుందా?
మా అబ్బాయి వయసు నాలుగేళ్లు. వాడు ఆటిజమ్ చైల్డ్. ఈ వ్యాధికి సరైన చికిత్స లేదని చాలా చోట్ల చదివాను. బయోమెడికల్ విధానం ద్వారా ఈ వ్యాధికి చికిత్స ఉందని విన్నాను. మా అబ్బాయి విషయంలో ఈ చికిత్స ఎంతవరకు పనిచేస్తుందో తెలియ చేయండి. - సత్యవాణి, విశాఖపట్టణం ఆటిజమ్‌తో బాధపడే పిల్లల త ల్లులలో మీరు కూడా ఒకరు. పిల్లలు ఆటిజమ్‌తో బాధపడుతున్నప్పుడు తల్లిదండ్రులకి డిప్రెషన్ ఉండటం సహజమే. ఆటిజమ్ అనేది ఒక విచిత్రమైన వ్యాధి. ఈ వ్యాధి ఉన్న పిల్లలు చాలా తెలివిగలవారిలా కనిపిస్తారు కానీ, వీరిలో వయసుకు తగ్గ ఎదుగుదల ఉండదు. అలోపతిలో ఈ వ్యాధికి మందులు ఉన్నట్లుగా తెలుస్తోంది. అలాగే బయోమెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంది. అయితే ఈ వ్యాధికి పూర్తి చికిత్స లేదు. కేవలం వ్యాధి లక్షణాల తీవ్రత మాత్రమే తగ్గించగలుగుతారు. అందువల్ల వీరు మిగతా విద్యార్థులలాగే స్కూల్‌కి వెళ్తారు. కాకపోతే కొద్దిగా డల్‌గా ఉంటారు. బయోమెడికల్ ట్రీట్మెంట్లో... ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారులలో ఉన్న లక్షణాలను సూక్ష్మంగా పరిశీలించి, వారిలో ఉన్న లక్షణాలను అనుసరించి, ఎటువంటి మందులు వాడాలో నిర్ధరిస్తారు. ఇటువంటి పిల్లల తల్లిదండ్రులకు మనోధైర్యం ఎక్కువగా ఉండాలి. కుటుంబంలో ఇటువంటి వారు ఉండటం వల్ల ఇవి వంశపారంపర్యంగా వస్తాయని ఎక్కడా చెప్పలేదు. నెట్లో మీరు చదివినది అవగాహన కోసం మాత్రమే. అందులోని విషయమంతా మీవాడికి చెందినది కాదు. చాలామంది తల్లిదండ్రులు అక్కడా ఇక్కడా చదివిన దాన్ని బట్టి, తెలుసుకున్న దాన్ని బట్టి తమంతట తాముగా వారి పిల్లలకు సిఎఫ్జిఎఫ్ డైట్ విధానం అనుసరిస్తారు. మీరు చైల్డ్ సైకియాట్రిస్ట్ సూచన మేరకు మాత్రమే ఈ విధానం అనుసరించాలి. మీ అబ్బాయి గురించి మీరు పాజిటివ్‌గా ఆలోచించడం ప్రారంభించండి. ఆటిజమ్ వలన భవిష్యత్తంతా అంధకారమని భావించకండి. అనుభవజ్ఞులైన చైల్డ్ సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో సమస్యను పరిష్కరించుకుంటే భవిష్యత్తు ఆనందమయంగా ఉంటుంది. ఆల్ ద బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
తెలివైనవాడే కానీ జ్ఞాపకశక్తి తక్కువ..?
మా బాబుకు ఏడేళ్లు. సెకండ్ క్లాస్ చదువుతున్నాడు. వాడు బుద్ధిమంతుడే కానీ, స్కూల్లో ప్రతి చిన్న విషయం మర్చిపోతుంటాడని, చిన్న చిన్న పదాలకు కూడా ఎన్నిసార్లు చెప్పినా స్పెల్లింగ్స్ సరిగా రాయడని, బోర్డ్ మీద రాసిన వాటిని నోట్ చేసుకోమంటే నోట్ చేసుకోడని పేరెంట్స్ మీటింగ్స్‌లో టీచర్స్ కంప్లైంట్ చేస్తుంటారు. వాడు తెలివైనవాడే, వీడియో గేమ్స్ బాగా ఆడతాడు. అన్ని విషయాల్లోనూ యాక్టివ్గానే ఉంటాడు. మరి ఇలా ఎందుకు జరుగుతోందో మాకు అర్థం కావడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు. - బిందుమాధవి, హైదరాబాద్ మీ అబ్బాయిది నిజానికి అసలు పెద్ద సమస్య కానే కాదు. దీనిని ఒక స్పెషల్ కేస్ కింద పరిగణించవలసి ఉంటుంది. ఇతరత్రా ఏవైనా మానసిక సమస్యలుంటే తప్ప సాధారణంగా ఈ వయసు పిల్లలలో మతిమరపు తలెత్తే అవకాశమే లేదు. మీరు చెబుతున్న దానిని బట్టి మీ బాబులో ఐక్యూకి సంబంధించి కానీ, తెలివితేటలకు సంబంధించి కానీ ఎటువంటి సమస్యలూ లేవు. ఉన్నదల్లా ఎడిడి అంటే అటెన్షన్ డెఫిసిట్ డిజార్డర్. చెప్పే సమయంలో సరిగా వినకపోవటం, వారి మాటల మీద ఆసక్తి చూపించకపోవటం వల్ల ఇటువంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ విషయాన్ని సరిగా అర్థం చేసుకోలేక తల్లిదండ్రులు వారిని ‘మొద్దబ్బాయి’ అని పిలవడం, దండించడం వంటివి చేస్తుంటారు. దానివల్ల నిజంగానే వారు తమను తాము మందకొడివారిగా, తెలివి తక్కువ వారిగా భావించుకుని, ఒక్క చదువు విషయంలోనే కాకుండా మిగతా అన్ని విషయాల్లోనూ వెనకడుగు వేస్తూ, స్తబ్దుగా ఉండిపోతారు. దాంతో భవిష్యత్తులో అది ఎన్నో రకాల ఇతర సమస్యలకు దారితీస్తుంది. మీరు మీ బాబు విషయంలో ఆందోళన చెందనవసరం లేదు. వైద్యపరంగా ఎంతో అభివృద్ధి చెందిన ప్రస్తుత దశలో అన్ని విధాలైన సమస్యలకూ మంచి వైద్యవిధానాలు, చికిత్సా విధానాలు ఉన్నాయి. మీరు వెంటనే మీ బాబును అనుభవజ్ఞుడైన చైల్డ్ సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకెళ్లి, ఐక్యూ, మెమరీ, కాన్సన్ట్రేషన్ టెస్ట్ చేయించండి. ఆ రిపోర్ట్‌ల ఆధారంగా మానసిక వైద్యుడు బాబుకు తగిన కౌన్సెలింగ్, శిక్షణ ఇస్తారు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్