డెల్యూజన్ డిజార్డర్స్... మెదడు కనికట్టు... భ్రాంతుల్లోకి నెట్టు!! | Delyujan Disorders ... Mercy of the brain ... Bhrantulloki cast! | Sakshi
Sakshi News home page

డెల్యూజన్ డిజార్డర్స్... మెదడు కనికట్టు... భ్రాంతుల్లోకి నెట్టు!!

Published Sun, Jan 5 2014 11:10 PM | Last Updated on Sat, Sep 2 2017 2:19 AM

Delyujan Disorders ... Mercy of the brain ... Bhrantulloki cast!

ఇది మెదడు చేసే మాయాజాలం. ఆ కనికట్టుకు లోబడిన రోగులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. వింతవింత భ్రాంతులకు లోనవుతుంటారు. ఈ భ్రాంతుల  వలన కలిగే రుగ్మతలను గతంలో పారనాయిడ్ డిజార్డర్స్ అని పిలిచేవారు. ఇవి మానసిక వ్యాధుల్లో సైకోసిస్ తరహాకు చెందినవి. వీటిలో రోగి తన ఊహను, భ్రాంతిని అత్యంత వాస్తవంగా భావిస్తుంటాడు. రోగికి తనకు జరుగుతున్న అనుభవమంతా వాస్తవంగా కనిపిస్తుంటే... ఎదుటివారుఎంతగా వివరించినా దాన్ని భ్రాంతి అని చెప్పడాన్ని ఒప్పుకోడు. ఇది జబ్బులేని వారికి భ్రాంతిగా అనిపించవచ్చేమోగానీ, జబ్బుతో బాధపడేవారికి మాత్రం తమలోని జీవరసాయన చర్యల ఫలితంగా ఆ భ్రాంతులే వాస్తవంగా తోస్తాయి. వాటిపై అవగాహన కోసమే ఈ కథనం.  
 
ఇంగ్లిష్‌లో డెల్యూజనల్ డిజార్డర్స్ అని పిలిచే వీటిని భ్రాంతి రుగ్మతలుగా పేర్కొనవచ్చు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వాటి గురించి...
 
 విచిత్రంగా అనిపించని భ్రాంతులు (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్)

 ఇందులో రోగికి తను నిత్యజీవితంలో అనుభవంలోకి వచ్చే వాటినే భ్రాంతులుగా పొందుతుంటాడు. అందుకే వీటిని విచిత్రంగా అనిపించని భ్రాంతులుగా పేర్కొనవచ్చు. అంటే... తనను ఎవరో వెంటాడుతున్నట్లు, తనకు వ్యతిరేకంగా ఎవరో కుట్రపన్నుతున్నట్లు, తనకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తాడు. కానీ వాస్తవంగా అది నిజం కాదు. దాంతో రోగి వల్ల పరిస్థితులు ఒక్కోసారి తీవ్ర అపార్థాలకూ, అనర్థాలకూ దారితీయవచ్చు. పైగా ఈ తరహా భ్రాంతులకు లోనయ్యేవారు చూడటానికి, ప్రవర్తన విషయంలో, నలుగురితో కలిసే విషయంలో అంతా మామూలుగానే ఉంటారు.
 
 ఇక కొన్ని భ్రాంతులు ఒక అంశం ఆధారం (థీమ్ బేస్‌డ్)గా సాగుతుంటాయి. వాటిల్లో కొన్ని ఇలా ఉంటాయి.
 
 జెలస్ (ఈర్ష్య : ఈ తరహా భ్రాంతి చాలామందిలో ఉంటుంది. ఈ భ్రాంతితో కొన్ని జీవితాలే నాశనమవుతుంటాయి. తన జీవిత భాగస్వామి ఎవరితోనో ప్రేమలో ఉందని, వారితో అక్రమసంబంధం నెరపుతోందని భావిస్తుంటారు. ఆ రుగ్మత కారణంగా అవతలివారిని వేధిస్తూ ఉంటారు. అకారణంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా జీవిత భాగస్వామిని అనుమానిస్తుంటే వెంటనే మానసిక నిపుణులను కలవాల్సి ఉంటుంది.
 
 ఎరటోమానియాక్: ఈ భ్రాంతి ఉన్నవారు తనతో ఓ సెలబ్రిటీ లేదా ఓ వీఐపీ ప్రేమలో పడిపోయారని నమ్ముతుంటారు. వారిని కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఫోన్లో మాట్లాడుతూ, వెంటాడుతూ ఉండటం కూడా సాధారణమే.


 గ్రాండియోజ్: ఈ తరహా భ్రాంతి ఉన్నవారు తనను తాను ఓ అసాధారణమైన వ్యక్తిగా భావిస్తుంటారు. తనకు అద్భుత శక్తులున్నాయనీ, విపరీతమైన విజ్ఞానం ఉందనీ లేదా తాను చాలా ప్రధానమైన వ్యక్తిననీ భావిస్తుంటారు. తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటుంటారు.
 
 పర్సెక్యూటరీ: ఈ తరహా భ్రాంతుల్లో ఉండేవారిని ఎప్పుడూ ఓ శంక వేధిస్తూ ఉంటుంది. తమను (చాలా సందర్భాల్లో తమకు కావాల్సిన, తమకు చాలా దగ్గరి బంధువులైనవారిని లేదా తమకు చెందినవారిని కూడా) అవతలివారు అవమానిస్తున్నారని, చిన్న చూపు చూస్తూ కించపరుస్తున్నారని భావిస్తుంటారు. అంతేకాదు... తమపై నిఘా ఉంచారని, తమకు హాని చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారనే భ్రాంతిలో ఉంటారు.
 
 సొమాటిక్: ఈ తరహా భ్రాంతులకు లోనయ్యేవరు తమకు ఏదో జబ్బు ఉందని, ఏదో వైద్యపరమైన లోపం ఉందని, తమకు వైద్యం అవసరమని భావిస్తుంటారు. తమకు సరైన చికిత్స దొరకడం లేదనే భ్రాంతిలో ఉంటారు.
 
 మిక్స్‌డ్: కొందరిలో పైన పేర్కొన్న ఏ ఒక్క భ్రాంతి రుగ్మతో కాకుండా... ఒకటి కంటే ఎక్కువగా భ్రాంతులు ఉండవచ్చు. అలాంటివారిని ఈ విభాగంలో పేర్కొంటారు.
 
 భ్రాంతులకు లోనయ్యేవారి

 లక్షణాలు:  
 ఎప్పుడూ ఉద్వేగంగా, అస్థిమితంగా ఉంటారు
 తక్షణం కోపం వచ్చేస్తుంటుంది  
 కాస్త నిరాశాపూరితంగా ఉంటారు  
 కొన్ని రకాల భ్రాంతులు (హెల్యూసినేషన్స్)లో ఉంటారు. అంటే... తమకు ఏవో దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా లేదా మాటలు వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొందరిలో తమకు ఏదో చెడు వాసన వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు.
 
 భ్రాంతులకు కారణాలు: నిజానికి చాలా సందర్భాల్లో ఈ తరహా రుగ్మతలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు. అయితే పరిశోధకుల అధ్యయనాలను బట్టి అనేక రకాల అంశాలు దీనికి కారణమని తెలుస్తున్నాయి. వాటిలో జన్యుపరమైన, జీవసంబంధమైన, వాతావరణానికి సంబంధించిన అంశాలు ముఖ్యమైనవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మానసిక అంశాలూ దీనికి దోహదం చేస్తాయి.
 
 మానసికకారణాలు/ఇతరాలు:  కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా భ్రాంతులు కలగవచ్చని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే మితిమీరి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, కొన్ని రకాల మాదకద్రవ్యాలు తీసుకున్నప్పుడు కూడా రకరకాల భ్రాంతులు కలగవచ్చు. అలాగే ఒంటరిగా ఉండేవారిలో చాలామందికి మానసిక కారణాల వల్ల భ్రాంతులు కలగవచ్చు. ఇక కనుచూపు మసకగా ఉండేవారికి,  వినికిడి శక్తి సరిగా లేనివారికి భ్రాంతులు కలిగే అవకాశాలు ఎక్కువ.
 
 ఈ రుగ్మత ఉన్నట్లు నిర్ధారణ ఎలా...

 
 సాధారణంగా రోగికి విచిత్రమైన భ్రాంతులు (బిజ్జార్ డెల్యూజన్స్) ఉన్నప్పుడు మిగతావారు వాటిని చూడలేకపోవడం వల్ల, పైగా అవి అసాధ్యమైనవి కావడం వల్ల రోగి భ్రాంతికి గురవుతున్నాడని తేలిగ్గా గుర్తించవచ్చు. కానీ సాధారణంగా అనిపించే భ్రాంతులు (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్)... అంటే పైన పేర్కొన్నట్లుగా తమ జీవిత భాగస్వామికి ఇంకెవరితోనో అక్రమ సంబంధాలున్నాయనే భ్రాంతి లేదా తమకు తమ ఆప్తులే కీడు చేయడానికి యత్నిస్తున్నారన్న భ్రాంతితో బాధపడే నాన్-బిజ్జార్ తరహా రుగ్మతలను గుర్తించడం కష్టం. పైగా ఈ భ్రాంతులకు లోనయ్యేవారి ప్రవర్తన కూడా చాలా సాధారణంగా అందరూ నమ్మదగినదిగా ఉంటుంది. దాంతో చాలా సందర్భాల్లో అనర్థాలు, అపార్థాలు, అపోహలు కలిగి జీవితాలు సైతం ఛిద్రం కావడం సాధారణంగా జరిగేదే. అందుకే భ్రాంతులను నిర్ధారణ (డయాగ్నోజ్) చేసే విషయంలో చాలా నిశితం (మెటిక్యులస్)గా ఉండాలి. భ్రాంతులకు లోనవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబితే రోగిని చాలా రకాలుగా అంటే... రోగి తాలూకు పూర్తి వైద్య సమాచారం, మెడికల్ హిస్టరీ, భౌతిక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. భ్రాంతులను ఇదమిత్థంగా నిర్ధారణ చేయడానికి ల్యాబ్ పరీక్షలు లేకపోయినా... కొన్ని సందర్భాల్లో ఏవైనా భౌతిక కారణాల వల్ల ఇలాంటి భ్రాంతులు కలుగుతున్నాయా అన్న అంశాన్ని రూల్‌అవుట్ చేసుకోడానికి రక్తపరీక్షల వంటి కొన్ని పరీక్షలు చేయించవచ్చు.
 
 ఇక రోగికి భ్రాంతులు కలుగుతున్నప్పుడు అక్కడ భౌతికంగా అలాంటి ఆస్కారమే లేని సందర్భాల్లో డాక్టర్లు... పేషెంట్‌ను సైకియాట్రిస్ట్‌కు చూపమని సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కూడా విచిత్రం కాని భ్రాంతుల (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్)కు ఒక నెలపైగా లోనవుతుంటే అప్పుడు ఆ రోగికి భ్రాంతిరుగ్మత (డెల్యూజన్ డిజార్డర్) ఉన్నట్లు నిర్ధారణ చేస్తారు. అయితే ఆ సమయంలో అతడికి ఏవైనా స్కీజోఫ్రీనియా వంటి సైకోటిక్ (మానసిక) జబ్బులు లేవన్న తర్వాతే... అతడికి భ్రాంతిరుగ్మత ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. ఎందుకంటే స్కీజోఫ్రీనియా వంటి మానసిక రుగ్మత ఉంటే... అప్పుడు తప్పనిసరిగా భ్రాంతులు ఉంటాయి. ఆ జబ్బు లేకుండా కూడా భ్రాంతులు ఉన్నాయంటే... అది తప్పనిసరిగా భ్రాంతిరుగ్మతేనని నిర్ధారణ చేస్తారు.
 
 చికిత్స: భ్రాంతి రుగ్మతలు ఉన్న రోగికి అటు మందులతోనూ, ఇటు కౌన్సెలింగ్‌తోనూ చికిత్స చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏ ఒక్కదానితోనో ఇవి నయం కావు. చాలా కేసుల్లో మందులు వాడాల్సిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక్కోసారి కేవలం మందులు వాడటం వల్ల కూడా అవి నియంత్రణలోకి రావు. అప్పుడు సైకోథెరపీ (కౌన్సెలింగ్ తరహా చికిత్స) తో ఆ లక్షణాలను నియంత్రించుకోవడం ఎలాగో రోగికి సైతం అవగాహన కలిగించి, స్వీయనియంత్రణ చేసుకునేలా కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ తరహా భ్రాంతులు నియంత్రణలోకి వచ్చినట్లే వచ్చి... మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటాయి. అందుకే ఈ తరహా చికిత్సలో పదే పదే తిరగబెట్టడాన్ని నివారించేందుకు ప్రణాళిక (రిలాప్స్ ప్రివెన్షన్ ప్లాన్) లు రచించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ కింద పేర్కొన్న చికిత్సలను ఇస్తుంటారు. అవి...
 
 వ్యక్తిగత సైకోథెరపీ:
తనకు వాస్తవంగా తోచినట్లుగా కనిపిస్తున్న ఆ భ్రాంతి గురించి రోగికే అవగాహన కల్పించి... అది తనకు వాస్తవంగా అనిపిస్తున్నప్పటికీ అది భ్రాంతి అనీ, అది వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించేలా కౌన్సెలింగ్ చేయడాన్ని వ్యక్తిగత (ఇండివిడ్యువల్) సైకోథెరపీగా పేర్కొంటారు.
 
  కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ): తనకు ఇబ్బంది కలిగించే అంశాలను గుర్తించి, వాటి నుంచి క్రమంగా దూరమయ్యేలా ఇచ్చే కౌన్సెలింగ్‌తో పాటు తనకు ఇబ్బంది కలిగించే ఆలోచనలనుంచి తప్పుకోవడం, అవి రాకుండా నివారించడానికి పాటించాల్సిన అంశాలు, అందుకు అనుగుణంగా మన ప్రవర్తనను మార్చుకోవడం ఎలాగో బోధించడం వంటివి ఈ చికిత్స ప్రక్రియలో ఉంటాయి.
 
 ఫ్యామిలీ థెరపీ:
నిజానికి ఈ తరహా రోగుల చికిత్సలో కుటుంబం పాత్ర ఎంతో కీలకమైనది. తమకు కనిపించని అంశం కుటుంబ సభ్యులకు ఎంత వాస్తవమో, రోగి ఫీలయ్యే భ్రాంతి కూడా అంతే వాస్తవమని కుటుంబ సభ్యులు గ్రహించాలి. అది రోగలక్షణంగా వారు గుర్తించాలి. అలా గుర్తించి, రోగిని బుజ్జగిస్తూ దారిలోకి తెచ్చుకోవాలి. అంతేగాని దాన్ని ఖండిస్తూ పోకూడదు. అందుకే ఈ తరహా రోగులతో వ్యవహరించాల్సిన తీరు విషయంలో కుటుంబ సభ్యులకు కూడా కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుంది. దీని ఆధారంగా రోగితో కుటుంబసభ్యులు వ్యవహరించే/వ్యవహరించాల్సిన తీరునే సైకియాట్రిస్ట్‌లు ఫ్యామిలీ థెరపీగా పేర్కొంటారు. రోగి త్వరగా కోలుకోడానికి ఇదెంతో ముఖ్యం. దీంతోపాటు యాంటీ-సైకోటిక్ మందులుగా పేర్కొనే మందులను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి తన భ్రాంతులతో ఇతర కుటుంబసభ్యులకు హాని కలిగించేంత ప్రమాదకరంగా ఉంటే వారిని ఆసుపత్రిలో ఉంచి వారు సాధారణ స్థితికి వచ్చే వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది.
 
  -నిర్వహణ: యాసీన్

 
 కొన్ని చిత్రవిచిత్ర భ్రాంతులు
 కాప్‌గ్రాస్ డెల్యూజన్: ఈ భ్రాంతులకు లోనయ్యేవారు... తమ తల్లిదండ్రుల లేదా కుటుంబసభ్యులు, భార్య/భర్త స్థానంలో వేరెవరో అదే రూపంలో వచ్చి ఉంటున్నారనీ, నిజానికి వారు వారు కారనీ భావిస్తుంటారు.


 ఫ్రెగోలీ డెల్యూజన్: ఒక వ్యక్తే తన కుటుంబ సభ్యుల్లోకి... అనేక రూపాల్లోకి మారిపోతున్నారనీ, ఆయనే అనేక స్థానాలు తీసుకుంటున్నారనీ భ్రాంతికి లోనవుతుంటారు. ఇటాలియన్ నటుడైన లియోపోల్డో ఫ్రెగోలీ వెంటవెంటనే అనేక వేషాలు మార్చడంలో సిద్ధహస్తుడు. అతడి పేరిటే ఈ భ్రాంతి రుగ్మతకు ఈ పేరు వచ్చింది.
 
 కోటార్డ్ సిండ్రోమ్: ఈ భ్రాంతి మరీ విచిత్రం. ఇందులో భ్రాంతికి లోనయ్యే వ్యక్తి తాను అసలు జీవించే లేనని భ్రాంతికి లోనవుతుంటాడు. తన శరీరం, రక్తమాంసాలు, అవయవాలు... ఇవేవీ లేవనీ, తన మనుగడే లేదని అనుకుంటుంటాడు.
 
 రీడ్యూప్లికేటివ్ పారామ్నీషియా: వాస్తవానికి తాను ఒకచోట ఉన్నా...ఉన్న ప్రదేశం... అక్కడ లేదనీ, అదేదో వేరే దేశంలోనో లేదా మరో సుదూర ప్రాంతంలోనో ఉందని అనుకుంటుంటాడు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఒక వ్యక్తిని చేర్చారనుకుందాం. అతడు... తాను హైదరాబాద్‌లో లేననీ, వేరే ఎక్కడో అమెరికాలో ఉన్నాననీ భావిస్తుంటాడు.
 
 డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్,  హైదరాబాద్
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement