సైంటిస్ట్ బుజ్జిగాడు..! | Scientist equipment ..! | Sakshi
Sakshi News home page

సైంటిస్ట్ బుజ్జిగాడు..!

Published Sun, Feb 9 2014 11:18 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM

సైంటిస్ట్ బుజ్జిగాడు..!

సైంటిస్ట్ బుజ్జిగాడు..!

మా బుజ్జిగాడిని సైంటిస్టు చేయాలన్నది నా కోరిక. నాలో ఆ కాంక్షను పెంచిన సంఘటన ఒకటుంది. అదేమిటంటే...
 ఒకరోజున మా ఆవిడతో సరదాగా మాట్లాడుతూ... ‘‘ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం... నీ చెంత ఉంటే రోజులు క్షణాల్లా గడుస్తాయి. నువ్వు ఊరెళితే క్షణాలు కూడా రోజుల్లా గడుస్తాయి...’’ అన్నాను. అదే టైమ్‌లో మూడోక్లాసు చదువుతున్న మా బుజ్జిగాడు ఎంటరైపోయాడు.
 
‘‘నాన్నా... ఈ థియరీ నాకు తెలుసు. ఆదివారం తొందరగా అయిపోతుంది. సోమవారం అంతా బోరింగ్‌గా, పొడుగ్గా ఉంటుంది’’ అన్నాడు. దాంతో మా బుజ్జిగాడిలో ఐన్‌స్టీన్‌ను చూసుకుని ఎంతో ఆనందించాను.
           
ఇక మా వాడిని సైంటిస్టు చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎవరో విదేశీయులెందుకూ... మన దేశ సైంటిస్టులనే ఆదర్శంగా తీసుకుందామని  అనుకున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా ముందుగా మన చేతుల్లో ఉన్న పని  నెరవేర్చడం కోసం ముందుగా వాణ్ణి బార్బర్‌షాపుకు తీసుకెళ్లి... ‘‘బాబూ.. మా బుజ్జిగాడికి కలాం కటింగ్ చేయి నాయనా’’ అని కోరుకున్నాను.
 
వాడి మెదడు చుట్టూ అచ్చం కలాం గారి లాంటి క్రాపు చేయించి... ఆ వాతావరణాన్నే సృష్టిస్తే... సేమ్ టు సేమ్ ఎన్విరాన్‌మెంట్ కాబట్టి మా బుజ్జిగాడి మెదడూ కలాంగారి బ్రెయిన్‌లాగే ఎదుగుతుందనే ఆశ నాది. ఈ పని కాస్తా అయిపోయాక వాణ్ణి తీసుకొచ్చి నిద్రపుచ్చడం మొదలుపెట్టాను. ‘‘అప్పుడే నేను పడుకోను. కాసేపు కార్టూన్ నెట్‌వర్క్ చూస్తాను’’ అని వాడు మారాం చేస్తున్నా, ‘‘పడుకోరా వెధవా... కలాం గారు చెప్పినట్టు కలలు కనాలి. లేకపోతే సైంటిస్టువి కాలేవు’’ అంటూ రోజూకంటే కాసేపు ఎక్కువగా కలలు కననిద్దామని ప్రయత్నం చేశాను. దీంతో వాడు మరింత నిద్రపోయి స్కూల్ టైమయ్యాక లేచాడు. ఇలా మొదటి ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది.
           
 ఇలా స్కూలెగ్గొట్టి మా బుజ్జిగాడు చేసిన పని వల్ల నేను మా అమ్మతో తలవాచేట్లు తిట్లు తిన్నాను.
 ‘‘చూశావా! నీ కొడుకు నిర్వాకం. రోజంతా ఎక్కడెక్కడి నుంచో    సాలీళ్లను పట్టుకొచ్చి మనింట్లో వదులుతున్నాడు’’ అంది అమ్మ.
 ఎందుకలా చేశాడని వాకబు చేస్తే తెలిసిన విషయమిది...
 ‘‘ఆయనెవరో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వాడు బూజు నుంచి పెన్సిలిన్ అనే మందును కనిపెట్టాడట. వీడు ఈ సాలీళ్ల బూజు నుంచి అంతకంటే పవర్‌ఫుల్ మందు కనిపెడతాడట’’ అంటూ మా వాడు చేసిన పనికి మా ఇద్దరిపైనా ఒకేసారి కోపంగా అరిచింది మా అమ్మ.
 

- యాసీన్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement