yasina
-
హోమియో...హామీలు!
ఏప్రిల్ 10 పపంచ హోమియో దినం ఉష్ణం ఉష్ణేన శీతలం, వజ్రాన్ని వజ్రమే కోస్తుంది లాంటివి మన సామెతలే. వీటిని చాలాసార్లు వినే ఉంటారు. కానీ శామ్యూల్ హనీమన్ మహనీయుడు ఆ సిద్ధాంతాలను చికిత్స ప్రక్రియకు అన్వయింపజేశాడు. అలా అందరికీ అందుబాటులో ఉండే చవకైన, సులభమైన ఒక కొత్త చికిత్స ప్రక్రియకు నాంది పలికాడాయన. చాలా మందికి చికిత్స అంటే భయం. మరెంతో ఆందోళన. చేదు మందుల్ని మింగాల్సి వస్తుందనీ, మేని కోతల్ని భరించాల్సి వస్తుందనే బెంగ. వీటన్నింటినీ దూరం చేస్తూ... ‘‘రోగి కోరేదీ... వైద్యుడిచ్చేదీ ఒకటే అయితే...’’ అనే మనదైన మరో సామెతనూ నిజం చేసేలా మందుల్ని రూపొందించాడాయన. ఈ నెల 10న ఆయన పుట్టిన రోజు. దీన్ని ప్రపంచ హోమియో దినంగా జరుపుకుంటున్న సందర్భంగా... ఈ చికిత్స ప్రక్రియపై అవగాహనతో పాటు... మనకు రోజూ కనిపించే అనేక చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాల కోసమే ఈ ప్రత్యేక కథనం. మీ హోమియో కిట్... జ్వరాలు (ఫీవర్స్) అనేక రుగ్మతలకు జ్వరం ఒక లక్షణం మాత్రమే. హోమియోలో లక్షణాల ఆధారంగా మందును నిర్ణయిస్తారు కాబట్టి జ్వరంతో పాటు ఆయా లక్షణాలను బట్టి వాడాల్సిన మందును నిర్ణయించుకోవచ్చు. బెల్లడోనా: అకస్మాత్తుగా జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యక్తిగత లక్షణాల విషయానికి వస్తే... అతి ప్రేమ-ఆప్యాయతలు కనబరచడం, కోపం వంటి లక్షణాలు ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఇక పులుపు ఎక్కువగా ఇష్టపడేవారూ, జ్వరం వచ్చినప్పుడు ముఖం ఎర్రగా మారిపోయేవారికి ఇది మంచి మందు. అకోనైట్: తీవ్రమైన జ్వరం (హైఫీవర్), అతి భయం, చిన్న విషయానికే ఎక్కువగా ఆందోళన చెందడం, తలనొప్పితో బాధపడటం, మాటిమాటికీ దగ్గు, జలుబు, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. క్యాంథరిస్: తరచూ మూత్రంలో మంట వల్ల తీవ్రమైన జ్వరం (హై ఫీవర్), విపరీతమైన కోపం, చలిజ్వరం, మూత్రంలో మంటరావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడాలి. మందు తీసుకున్న నాలుగు గంటల్లో జ్వరం తగ్గుతుంది. చైనా: మాటిమాటికీ చలిజ్వరం , సాయంకాలం జ్వరం, అన్ని విషయాలపై అసంతృప్తిగా ఉండటం, శబ్దాలను భరించలేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో నాలుగు వారాలు వాడటం వల్ల జ్వరం మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉంటుంది. బాప్టీషియా: లోజ్వరం, దీర్ఘకాలం జ్వరం కొనసాగడం వల్ల రక్తం విషపూరితం కావడం, దాహం తక్కువగా ఉండటం, చెమట వాసనతో ఉండటం లాంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడవచ్చు. ఆర్సినిక్ ఆల్బమ్: చలిజ్వరం, అతి దాహం, జ్వరం వచ్చినప్పుడు నిద్రలేకపోవడం, అర్ధరాత్రి నిద్రలేవడం, జ్వరం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకపోవడం, భయపడటం, అభద్రతా భావం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉదయం-సాయంకాలం ఒక డోసు వాడితే జ్వరం తగ్గిపోతుంది. రస్టాక్స్: జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లునొప్పులు, నాలుక తడారిపోవడం, చలి ఎక్కువగా ఉండటం, నిద్రలేకపోవడం వంటి లక్షణాలకు ఈ మందును 200 పొటెన్సీలో ఒక్క డోసు వాడాలి. స్పంజియా: తరచూ జలుబు, పసుపు రంగులో గల్ల (కళ్లె) పడటం, ఉదయం దగ్గురావడం, వేడిని తట్టుకోలేకపోవడం, జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, దగ్గుతో తెమడ పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో రోజుకు రెండుసార్లు వాడవచ్చు. సిలిసియా: ముక్కులు బిగుసుకుపోవడం, చలిగా ఉండటం, ఒళ్లంతా వణుకుతో జ్వరం, కాళ్లూ-చేతులు చల్లబడటం, ఎక్కువ చెమట వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. పల్సటిల్లా: రోజు విడిచి రోజు జ్వరం రావడం, చలి తర్వాత వేడిగా అనిపించడం, దాహం లేకపోవడం, జలుబు వల్ల వాసన తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, తలనొప్పి వంటి శారీరక లక్షణాలతో పాటు సున్నిత స్వభావం కలిగి ఉండటం వంటి లక్షణాలు న్నవారికి ఈ మందును 200 పొటెన్సీలో ఇవ్వవచ్చు. కాలీ సల్ఫ్: రాత్రివేళల్లో తీవ్రమైన జ్వరం (హై ఫీవర్) రావడం, తరచూ జ్వరం తిరగబెడుతుండటం, నాలుక పసుపురంగులో ఉండటం, త్వరగా కోపం రావడం, చిరాకుగా ఉండటం, ముక్కులు బిగదీసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో వారం రోజుల పాటు వాడాలి. అలోయేస్: నీళ్ల విరేచనాలతో జ్వరం రావడంతో పాటు వేడిని తట్టుకోలేకపోవడం, అందరిపై ఆధిపత్యధోరణి వంటి లక్షణాలు కలిగి ఉన్నవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో పై లక్షణాలతో జ్వరం వస్తే ఇది చాలా మంచి మందు. పోడోఫిల్లమ్: దాహం తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం, విరేచనాలు కావడంతో పాటు కడుపునొప్పిగా ఉండటం, ఫుడ్‌పాయిజనింగ్ వంటి సందర్భాల్లో ఈ మందు బాగా పనిచేస్తుంది. కోలోసింథిస్: కడుపునొప్పి రావడం, విరేచనాలు కావడం, ఏది తిన్నా /తాగినా విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. జలుబు నక్స్‌వామికా: తరచూ వచ్చే దగ్గు, జలుబు, తుమ్ములు, విపరీతమైన విసుగు, చలిని తట్టుకోలేకపోవడం కనిపిస్తే నక్స్‌వామికా 30 పొటెన్సీలో తీసుకోండి. ఆర్సెనికమ్ ఆల్బమ్: తరచూ విపరీతంగా తుమ్ములు వస్తూ, దుమ్మూ-ధూళికి గురికాగానే అవి మరింత ఎక్కువ కావడం, అతిశుభ్రత, నిత్యం అపనమ్మకంతో పాటు, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం వంటి లక్షణాలుంటే 30 పొటెన్సీలో తీసుకోవాలి. బొవిస్టా: విపరీతమైన తుమ్ములు, జ్వరం వచ్చినట్లుగా ఉండటం, ఏ పనిపైనా ధ్యాస లేకపోవడం, కొంచెం అమాయకత్వం, వేడిని తట్టుకోలేకపోవడం, దాహం తక్కువగా ఉండటం లాంటి లక్షణాలుంటే దీన్ని 30 పొటెన్సీలో వాడుకోవచ్చు. సిలిసియా: జలుబు వల్ల తల బరువుగా ఉండటం, గళ్ల (కళ్లె) పసుపురంగులో పడటం, పనిలో ఎక్కువగా శ్రద్ధ చూపే గుణం ఉండటం, మొహమాటం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. అల్లియమ్ సెపా: విపరీతమైన తుమ్ములతో పాటు కళ్ల నుంచి నీళ్లు కారడం, ముక్కు కారడం, తలనొప్పిగా ఉండటం, దగ్గు రావడం వంటి సమస్యలుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు. తలనొప్పి నేట్రమ్ మూర్: ఎండలో ఎక్కువగా తిరిగితే వచ్చే తలనొప్పికి ఈ మందును వాడవచ్చు. బెల్లడోనా: అకస్మాత్తుగా తలనొప్పి రావడంతో పాటు ప్రతి చిన్న విషయానికీ కోపం రావడం, తలనొప్పి వల్ల ముఖం ఎర్రగా మారడం వంటి లక్షణాలున్నవారికి ఇది మంచి మందు. స్పైజీలియా: తలనొప్పి వల్ల కళ్లనొప్పి కూడా రావడం, కళ్లు బరువుగా అనిపించడం, జ్వరం రావడం, సూది మందుకు త్వరగా భయపడటం, ఎడమవైపు నొప్పి, ఎండలో తలనొప్పి, మైగ్రేన్ వంటి తలనొప్పికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది. బ్రయోనియా ఆల్బ్: తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. తలపై సుత్తితో కొట్టిన భావన. చాలా చికాకుగా అనిపిస్తుంది. ఎండాకాలంలో వచ్చే సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. సాంగ్యునేరియా: కుడివైపు తలనొప్పి విపరీతంగా ఉండటం, ఉదయం తలనొప్పి ఎక్కువగా ఉంటూ, రాత్రివేళ తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందు చక్కగా పనిచేస్తుంది. కడుపునొప్పి కడుపునొప్పి ఉన్నవారు, ఇతర లక్షణాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ మందులను వాడుకోవచ్చు. న్యాట్‌ఫాస్: కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, ఎక్కువగా మసాలాలు తినడం వల్ల వచ్చే గ్యాస్ సమస్యలతో పాటు మొహమాటం ఎక్కువగా ఉండేవారికి ఇది మంచి మందు. నక్స్‌వామికా: మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల వచ్చిన గ్యాస్ సమస్యకు ఇది మంచి మందు. కోపం ఎక్కువగా రావడం, టైమ్‌కు ఆహారం తీసుకోకపోవడం వంటి వారికి ఈ మందును 30 పొటెన్సీలో ఇవ్వడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది. సీనా: కడుపులో నులిపురుగులు (వార్మ్స్ ఉండటం వల్ల వచ్చిన కడుపునొప్పికి ఇది మంచి మందు. కోపంతో ఉండే స్వభావం ఉన్నవారికి దీన్ని సూచించాలి. కొలోసింథ్: మహిళల్లో రుతుస్రావం సమయంలో వచ్చే కడుపునొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. విపరీతమైన కడుపునొప్పితో పాటు, రక్తస్రావం ఎక్కువగా కనిపించేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వడదెబ్బ వేసవిలో వడదెబ్బ చాలా తరచూ కనిపించే సమస్య. దీనికోసం మందులివే... గ్లోనైన్: వేడిని తట్టుకోలేకపోవడం, రక్తపోటు ఎక్కువ కావడం, తలనొప్పిగా ఉండటం లాంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి. నేట్రమ్ మూర్: వడదెబ్బకు లోనైన ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత లక్షణాలను సరిచూసుకుని ఈ మందువాడాలి. అవి... ఎవరితోనూ ఎక్కువగా మాటలాడకపోవడం, పనులపైనా ఎప్పుడూ అసంతృప్తితో ఉండటం, నీరసంగా ఉండటం, తరచూ రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉండటం వంటి సమస్యలున్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. జెల్సీమియమ్: వేడిని తట్టుకోలేకపోవడం, అతి భయం, అన్ని విషయాలకూ ఆతృత పడటం, ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, ఎండలోకి వెళ్తే కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం... వంటి లక్షణాలు ఉంటే ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి. నేట్-కార్బ్: ఎండలోకి వెళ్తే దద్దుర్లలా కనిపించడం, కళ్లు తిరగడం, వాంతులు రావడం, ఎండలోకి వెళ్లగానే తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. ఓపియమ్: అతిసున్నితత్వం, ఏ విషయంపైనైనా త్వరగా స్పందించడం వంటి లక్షణాలున్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. దీంతో పాటు... ఎండలోకి వెళ్లి తిరిగి రాగానే నీరసంగా ఉండటం, అతినిద్ర, త్వరగా అలసిపోవడం, ఊబకాయం ఉన్నవారికి వడదెబ్బ రాకుండా నివారించేందుకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. దీన్ని 200 పొటెన్సీలో వాడుకోవచ్చు. క్యాంఫర్: ఎండలోకి వెళ్లగానే కళ్లు తిరగడం, శరీరం, చేతులూ చల్లబడటం, చలికాలంలో హుషారుగా ఉండి, వేసవిలో నీరసంగా ఉండటం వంటి లక్షణాలుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. చర్మంపై కనిపించే అలర్జీలు కొందరికి పడని వస్తువులు తారసిల్లిన వెంటనే దాని గుణం చర్మంపై ప్రతిఫలిస్తుంది. అప్పుడు వాడాల్సిన మందులివి... సల్ఫర్: చర్మవ్యాధులకు ఇది మంచి మందు. అకస్మాత్తుగా ఒంటిపై దద్దుర్లు రావడం, ఆర్టికేరియా ర్యాష్, దద్దుర్లు పెద్దవి కావడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వారానికి ఒకసారి తీసుకోవాలి. నేట్-మూర్: ఎండలోకి వెళ్తే దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది. డల్కమారా: వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. దద్దుర్లు పెద్దగా ఉండటం, వర్షంలో తడిసిన తర్వాత దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు. గ్రాఫైటిస్: గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు చర్మ సమస్యలు వచ్చే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. త్వరగా ఏడ్వటం, సున్నితమైన స్వభావం, లావుగా ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. హెపార్ సల్ఫ్: చలికి తట్టుకోలేకపోవడం, దురద ఎక్కువగా ఉండటంతో పాటు దద్దుర్లు రావడం, తొందరపాటు ఎక్కువగా ఉండటం, విపరీతమైన కోపం రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఇది మంచి మందు. ఏయే దేశాల్లో ఉంది? ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రత్యామ్నాయ ఔషధంగా హోమియోవైద్యం అందుబాటులో ఉంది. అన్నింటికంటే యూరప్ దేశాలల్లో హోమియో వాడకం ఎక్కువగా ఉంటోంది. అందులో ఫ్రాన్స్‌ది మొదటిస్థానం. ఇంగ్లండ్ రాజకుటుంబం హోమియోవైద్యాన్ని కూడా అనుసరిస్తున్నట్లు సమాచారం. జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, మెక్సికో దేశాలు హోమియో మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి. పొటెన్సీ అంటే... హోమియో మందుల మోతాదును పొటెన్సీ అనే ప్రమాణం ద్వారా నిర్ణయిస్తారు. హోమియో మందుల్లో ఉన్న సామర్థ్యానికి (పవర్‌కు) పొటెన్సీ అన్నది ఒక సూచిక. హోమియో మందులో ప్రతి మందుకూ ఒక అత్యద్భుత శక్తి (డైనమిక్ పవర్) ఉంటుంది. ఏ జబ్బు తీవ్రతకు ఎంత మేరకు శక్తి కలిగిన మందు ఇవ్వాలన్నది హోమియో వైద్యులు నిర్ణయిస్తారు. జబ్బు తీవ్రతను బట్టి 200, 30, 1ఎమ్ అనే పొటెన్సీల్లో (మోతాదుల్లో) మందులు ఇస్తారు. రోగి చేయాల్సిన పథ్యం... హోమియో మందులు తీసుకునే వారు ఎలాంటి పథ్యాన్నీ చేయనవసరం లేదు. ఎందుకంటే రోగికి వచ్చిన జబ్బును బట్టి అతడిలోని వ్యాధిని తొలగించడానికి ఇచ్చే మందు ఒక అంతర్గత శక్తిలా పనిచేస్తుంది. దీన్ని ఎలాంటి ఆహారాలూ అవరోధించలేవు. కాబట్టి హోమియో మందులకు ఎలాంటి పథ్యనియమాలూ పాటించాల్సిన అవసరం లేదు. హోమియో మందులు ఎలా పనిచేస్తాయి? హోమియో మందు ఎలా పనిచేస్తుందన్న విషయం తెలుసుకోడానికి హానీమన్ అనుసరించిన మార్గాన్ని పరిశీలిస్తే చాలు. సింకోనా అనే మొక్క బెరడును తింటే వాంతులు అవుతాయి. చలిజ్వరం వస్తుంది. ఇదే సిద్ధాంతాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందని హనీమన్ పరిశీలించారు. చలిజ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి హనీమన్ చాలా కొద్ది మోతాదులో సింకోనా బెరడును ఇచ్చారు. తత్ఫలితంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ వ్యక్తికి చలిజ్వరం తగ్గింది. ఏదైనా జబ్బుకు కారణమయ్యే అంశాన్ని చాలా కొద్ది మోతాదుల్లో ఇస్తే ఆ జబ్బు తగ్గుతుందనేది హోమియో ప్రధాన సిద్ధాంతం. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని హానీమన్ ఎన్నో మొక్కలనుంచి, జంతువులనుంచి ఔషధగుణాలున్న రసాయనాలను సేకరించారు. అలాగే ఖనిజ లవణాలనుంచీ స్వీకరించి పరిశీలించారు. అలా ఎన్నో జబ్బులకు మందులను రూపొందించారు. కాబట్టి స్థూలంగా మనకు కనిపించే చక్కెర గోలీలు, వాహికగా పనిచే ఆల్కహాల్ ఒకటే అయినా... అందులో కలిపే మందు మాత్రం వేర్వేరుగా ఉంటుంది. హోమియోపతి గురించి కొన్ని వాస్తవాలు! హోమియోపతిలో సిద్ధాంతాలు స్థిరంగా ఉంటాయి. తరచూ అభిప్రాయాలు మారడం ఇందులో ఉండదు. హోమియోపతి అనేది శాస్త్రీయత, సృజనాత్మకతల సమ్మేళనం. హోమియోపతి ఆధారపూర్వకమైన ప్రయోగాత్మకమైన ఔషధం. హోమియోపతి మందులు శరీరానికి సహజంగా ఉండే వ్యాధి నిర్మూలన శక్తిని ఉద్దీపన చేస్తాయి. శరీరానికి ఉన్న వ్యాధి నిర్మూలన శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి. ఈ వైద్యంలో అప్పుడు బాధిస్తున్న వ్యాధిని నిర్మూలించడమే కాక దేహమంతటినీ చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. ఈ మందులతో ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవు, పైగా వీటిని ఎన్ని రోజులు వాడినా ఎప్పుడైనా మానేయవచ్చు. దేహానికి ఒకసారి అలవాటు చేస్తే ఇక తప్పని సరిగా కొనసాగించాలనే పరిస్థితి ఉండదు. కొన్ని ఇతర మందులు వ్యాధిని తగ్గించాక దేహంలో వ్యర్థాలను మిగులుస్తుంటాయి. వాటిని బయటకు పంపడం మరో ప్రక్రియ. హోమియోమందులతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి ఏ విధమైన వ్యర్థాలనూ దేహంలో వదలవు. ఈ శాస్త్రం గురించి నిపుణులు రాసిన పుస్తకాలు మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. సామాన్యులకు ప్రాథమిక అవగాహన కల్పించే విధంగా అర్థమయ్యేరీతిలో రాసినవే ఇవన్నీ. త్వరగా తగ్గే అవకాశాలూ ఉంటాయి... సాధారణంగా హోమియో మందులు చాలా ఆలస్యంగా తమ ఫలితాలను కనబరుస్తాయనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొంతవరకూ ఇది నిజమే అయినా హోమియో చికిత్స ద్వారా కొన్ని వ్యాధుల విషయంలో చాలా త్వరగా గుణం కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఈ ఆలస్యం జరగడానికి కారణం... చాలామంది చాలాకాలం పాటు అనేక వైద్య విధానాలను ప్రయత్నించి రోగాన్ని ముదరబెట్టుకుని, అప్పుడు హోమియో విధానానికి వస్తారు. అలాంటి సందర్భాల్లో జబ్బు నయం కావడంలో ఆలస్యం జరగడం మామూలే. వ్యాధి అంతగా ముదరకముందే వస్తే నయం కావడం కూడా త్వరగానే జరుగుతుంది. జబ్బు దానంతట అదే నయం అయ్యిదంటే కాస్త ఆలోచించాల్సిందే... కొన్ని జబ్బులు వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే తగ్గుతాయని ఇంగ్లిష్ విధానంలో డాక్టర్లు చెబుతుంటారు. కానీ హోమియో విధానం ప్రకారం అది పూర్తిగా వాస్తవం కాదు. ఉదాహరణకు చిన్నప్పుడు వచ్చే ఉబ్బసం (ఆస్తమా) కొందరిలో వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని ఇంగ్లిష్ మందుల ప్రక్రియలో చెబుతుంటారు. కానీ హోమియో వైద్య విధానం ప్రకారం అది తగ్గకుండా ఇంకొక అంచెకు చేరుకుంటుంది. అంటే... అది గ్యాస్ట్రిక్ సమస్యగానో లేదా హార్మోన్ల అసమతౌల్యతకో దారితీయవచ్చు. అందుకే ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది పూర్తిగా తొలగిపోయేలా చికిత్స జరగాలి. అందుకే హోమియో విధానంలో చికిత్స అన్నది వ్యాధికి జరగదు. వ్యక్తికి జరుగుతుంది. వ్యక్తికి జబ్బు తగ్గేలా చేయడం కంటే... అసలు ఆ వ్యక్తికి పూర్తి ఆరోగ్యం కలిగి జబ్బులన్నవే మటుమాయం అయ్యేలా చేసే ప్రక్రియే హోమియో. హోమియో సమర్థంగా తగ్గించిన వ్యాధులివి... ట్యూబర్క్యులోసిస్, సిఫిలిస్, గనేరియా, సోరా (స్కేబిస్), క్యాన్సర్, కుష్టువ్యాధులను హోమియో మందులతో సమూలంగా తగ్గించవచ్చు. 19వ శతాబ్దంలో కలరా, టైఫాయిడ్ వ్యాధులు ఇతర మందులతో నియంత్రించలేని దశలో హోమియో మందులతో తగ్గాయి. హోమియో - అపోహలు - వాస్తవాలు అపోహ: హోమియో మందులు దీర్ఘకాలిక వ్యాధులను మాత్రమే నయం చేస్తాయి. జలుబు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలకు పనిచేయవు. వాస్తవం: హోమియోపతి దీర్ఘకాలిక వ్యాధులను, స్వల్పకాలిక వ్యాధులను రెండింటినీ నయం చేస్తుంది. జలుబు, ఇన్ఫెక్షన్లు, జ్వరం, అతిసార వంటి వ్యాధులను సమర్థంగా నయం చేస్తుంది. అపోహ: హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయి. వాస్తవం: స్వల్పకాలిక అనారోగ్యాలకు తక్షణ చర్య ఉండేలా, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతోనూ మందులను రూపొందిస్తారు. ఆస్థ్మా, బ్రాంకైటిస్, ఆర్థరైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఆస్టియోపోరోసిస్, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులకు ఇచ్చే మందుల పనితీరు తెలియడానికి కొంత కాలం పట్టే మాట నిజమే. ఇది కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికీ మారుతుంది. వారి వారి వ్యాధి నిరోధక శక్తి, ఒత్తిడిని తట్టుకునేస్థాయి, జీవనవిధానం, ఆహారపు అలవాట్లు వంటి వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది. అపోహ: హోమియోపతి మందుల తయారీలో స్టెరాయిడ్స్ వాడతారు. వాస్తవం: హోమియోపతి మందులను మొక్కలు, జంతువుల నుంచి సేకరించిన సహజమైన పదార్థాలు, ఖనిజాలతో తయారు చేస్తారు. మొక్కలలో సహజంగా ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల సత్ఫలితాలే తప్ప ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవని నిర్ధారణ అయింది. అపోహ: గర్భిణులకు హోమియో మందుల వల్ల హాని కలుగుతుంది. వాస్తవం: హోమియోపతి మందులు గర్భిణికి చక్కటి ఔషధం అని చెప్పాలి. అల్లోపతి మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే వారికి చక్కటి ప్రత్యామ్నాయం హోమియో మందులే. గర్భిణిలో తల తిరగడం, రక్తహీనత, వెన్నునొప్పి, కండరాలు పట్టేయడం, వేవిళ్లు, గుండెలో మంట, అతిసార, రక్తపోటు, ఆందోళన, ఉద్వేగానికి లోనుకావడం వంటి సమస్యలకు హోమియో మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. కడుపులో బిడ్డ పెరుగుదలకు కూడా హోమియో మందుల వాడకం శ్రేయస్కరమే. అపోహ: హోమియో చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ వంటి ప్రక్రియలు ఉండవు, కాబట్టి క్యాన్సర్ వంటి వ్యాధులకు హోమియోమందుల వల్ల ప్రయోజనం ఉండదు. వాస్తవం: హోమియో మందులతో క్యాన్సర్‌ని సమర్థంగా నిర్మూలించిన సంఘటనలు అనేకం. క్యాన్సర్ రావడానికి మూలకారణాన్ని తెలుసుకుని, ఆ కారణానికి చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నయమవుతుంది. అపోహ: ఇన్ఫెక్షన్ తగ్గాలంటే యాంటీ బయాటిక్స్ తప్ప మరో మార్గం లేదు. వాస్తవం: యాంటీ బయాటిక్స్ ఇన్ఫెక్షన్ని అణచివేస్తాయి, ఈ ప్రక్రియలో వ్యాధి కారణాన్ని కనుక్కునే ప్రయత్నం జరగదు. వ్యాధి కారక మైక్రోబ్స్‌ను చంపకపోగా వ్యాధి లక్షణాలు అణచివేయబడతాయి. యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల కొంతమందిలో జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం, వికారం, అతిసార వంటి సైడ్ఎఫెక్ట్స్ కలుగుతుంటాయి. హోమియో మందులు వ్యాధి కారక క్రిములను నిర్మూలించడంతోపాటు దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఒకసారి హోమియో కోర్సు తీసుకున్న వారికి ఈ వ్యాధి మళ్లీ రావడానికి అవకాశాలు తక్కువ. అపోహ: హోమియోపతిలో మందులంటే చక్కెర గుళికలు మాత్రమే. వాస్తవం: హోమియోలోని చక్కెర గుళికలు మందును ఇముడ్చుకున్న రూపాలు మాత్రమే. హోమియో మందులలో మూడు వేల రకాల సమీకరణలుంటాయి. వ్యాధిని బట్టి ఏయే ఔషధాలను ఎంతెంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించిన తర్వాత ఆ మందును చక్కెర, పిండి పదార్థంతో కలిపి గుళికలుగా చేస్తారు. అపోహ: హోమియోపతిలో చక్కెర గుళికల మందులు మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచివి కాదు. వాస్తవం: హోమియో మందుల తయారీలో ఉపయోగించేది లాక్టోజ్ తియ్యదనమే, ఇందులో గ్లూకోజ్ ఉండదు. పైగా ఇందులో ఉండే చక్కెర అతి తక్కువ కాబట్టి ఇది రక్తంలో షుగర్‌లెవెల్స్ మీద ప్రభావం చూపదు. హోమియో వైద్యవిధానంలో ప్యాంక్రియాస్ గ్రంథిని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే స్థితికి తీసుకురావడం సాధ్యమే. దీని ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు. అపోహ: హోమియో మందులు వాడుతున్న కాలంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, టీ, కాఫీలను మానేయాల్సి ఉంటుంది. వాస్తవం: హోమియో మందు వేసుకోవడానికి 15 నిమిషాల ముందు, తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదనే నియమం ఉంటుంది. అంతే తప్ప ఏదీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో పరిమితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది. అపోహ: హోమియో వైద్యంలో ఎటువంటి పరీక్షలు చేయకనే వ్యాధిని నిర్ధారణ చేస్తారు. వాస్తవం: హోమియో వైద్యంలో సాధారణంగా రోగి చెప్పే లక్షణాల ఆధారంగా మందును నిర్ధారణ చేస్తారు. ప్రతి చిన్న అనారోగ్యానికీ పరీక్షలు చేయించి నిర్ధారణ చేయడం ఉండదు. కానీ కొన్ని రోగాలకు రోగ తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయిస్తారు. హోమియో సిద్ధాంతాలూ... విధానాలు హోమియో వైద్యుడికి ఉన్న ఏకైక, అతి ముఖ్యమైన లక్ష్యం రోగిని అస్వస్థత నుంచి దూరం చేసి అతడికి పూర్తి ఆరోగ్యాన్ని అందించడమే... హోమియోపతి డాక్టర్లందరికీ హనీమన్ చెప్పిన మొదటి సూత్రం ఇది. ‘ఆర్గనాన్ మెడిసిన్’ అనే పుస్తకం ద్వారా హోమియోపతి వైద్య విధానంలోని సిద్ధాంతాలను వివరించారు. అందులోని సిద్ధాంతాలను ‘అఫోరిజమ్స్’ అంటారు. తొలి సిద్ధాంతం (అఫోరిజమ్) రోగికి ఒక జబ్బుకోసం మందు ఇస్తే... అది ఆ జబ్బును అణిచివేయవచ్చు. కానీ అది మరికొన్ని రుగ్మతలకు దారి తీసే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక యుగంలో మందు తీసుకోవడం అంటే మరికొన్ని జబ్బులను ఆహ్వానించడం లాంటిదే. అందుకే ఈ ఆధునిక సమాజం ఏదో ఒక జబ్బుతో బాధపడాల్సి వస్తోంది. ఒక జబ్బుకు మందు వేయడం వల్ల అది మరో స్థాయి (నెక్ట్స్ లెవెల్)కి వెళ్లి మరో రుగ్మతకు కారణమవుతోంది. ఉదాహరణకు చర్మ వ్యాధులను ఆయింట్మెంట్ ద్వారా అణచివేస్తే అది శ్వాసకోశ వ్యాధులకూ, ఎముకలకు సంబంధించిన వ్యాధులకూ, హార్మోన్ల స్థాయుల మార్పులకూ దారితీయవచ్చు. ఈ జబ్బులు వంశపారంపర్యమూ రావచ్చు. సాధారణంగా ఇంగ్లిష్ మందుల వల్ల ఈ పరిణామాలు సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ హోమియోపతి వైద్యవిధానం ద్వారా మనిషిలోని జబ్బును తగ్గించడం కంటే పూర్ణారోగ్యాన్ని బాగు చేయడానికి కృషి జరుగుతుంది. ఫలితంగా జబ్బూ తగ్గుతుంది. దాంతో అప్పటివరకూ ఉన్న ఆ వ్యాధితో పాటు దాని అనుబంధ వ్యాధులన్నింటినీ హోమియో నిర్మూలిస్తుంది. ఈ సిద్ధాంతాన్నే ‘సిమిలియా నిమిలిబస్ క్యూరెంటర్’ అంటారు. మనిషి తాలూకు వ్యాధి నిరోధకశక్తిని బాగు చేయడం వల్ల ఇలా అతడి ఆరోగ్యాన్ని కాపాడి, అతడు ఎల్లప్పుడూ పూర్తిగా ఫిట్‌గా ఉండేలా చేయవచ్చు. ఔషధం ఎంపిక ఇలా... మనిషిలోని వ్యాధి నిరోధక తత్వాన్ని ప్రేరేపించి, అతడు అన్ని జబ్బులకూ అతీతుడయ్యేలా చేయడానికి అతడి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని మందు ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియనే ‘రిపార్టరైజేషన్’ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఔషధాన్ని ఎంపిక చేయాలంటే మనిషి అన్ని లక్షణాలనూ, గుణగణాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చేసే ప్రక్రియను ‘కాన్స్టిట్యూషన్’ పద్ధతి అంటారు. ఏ మందు, ఏ కాన్‌స్టిట్యూషన్స్‌తో జతపడుతోంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇలా మందుకూ, కాన్‌స్టిట్యూషన్స్‌కూ లంకె కుదిరేలా పరిశీలించడాన్ని ‘సిమిలియమ్’ అంటారు. ఈ సిమిలియమ్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా రోగికి మళ్లీ జబ్బు రాకుండానూ, అదే సమయంలో అతడి వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఇతర జబ్బులకు దారి తీయకుండానూ కాపాడవచ్చు. ఉదాహరణకు టైఫాయిడ్, మలేరియా వంటి జబ్బులు. ఈ జబ్బుల విషయంలో ఇంగ్లిష్ మందుల రూపంలో ఉపయోగించే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల తొలి దశలో జబ్బు తగ్గినా, వ్యాధి కారక క్రిములు ఆ యాంటీబయాటిక్ పట్ల నిరోధాన్ని (రెసిస్టెన్స్‌ను) పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల అసలా జబ్బు తగ్గకపోవచ్చు కూడా. కానీ హోమియోపతి వైద్య విధానం ప్రకారం కచ్చితమైన డ్రగ్ ఇవ్వడం వల్ల జబ్బు తగ్గి మళ్లీ రాకుండా చేయవచ్చు. అంతేకాదు అతి తక్కువ మోతాదులతో, నొప్పి లేని మందులు ఇవ్వడం అన్నది హోమియో విధానం తాలూకు ప్రత్యేకత. ఈ విధానాన్ని డాక్టర్ శామ్యూల్ హనీమన్ సూచించారు. అందుకే అతి తక్కువ మోతాదులో శరీరంలోని జన్యుస్థాయికి వెళ్లి హోమియో మందులు పనిచేస్తాయి. వ్యక్తి తాలూకు మానసిక లక్షణాలను సైతం పరిగణనలోకి తీసుకుని హోమియో విధానంలో మందును ఎంపిక చేయడం ఎందుకు జరుగుతుందంటే... శరీరంలో ‘మైండ్’ అన్నది కూడా ఒక అత్యున్నత కేంద్ర వ్యవస్థ. అక్కడ నుంచి చికిత్స మొదలు కావాలన్నది హోమియో విధానం. అందుకే శరీరం నుంచే కాకుండా మనసు నుంచి కూడా వ్యక్తికి రోగవిముక్తి జరగాలన్నది హోమియో విధానం సిద్ధాంతం. ఇదే హోమియో ప్రత్యేకత. సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉండవు? ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక జబ్బుకు మందు వేసి అణచడం కంటే... అసలు ఆ జబ్బుకు కారణమైన అన్ని అంశాలనూ శరీరం నుంచి తొలగించేందుకు హోమియో విధానం తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో మందులు జన్యుస్థాయికి వెళ్లి అక్కడ రోగ కారణాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. ఈ ప్రక్రియతో సదరు జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగనిరోధకత కల్పిస్తాయి. అంతేగాని అవి జబ్బును అణచవు. అందుకే హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ (సైడ్ఎఫెక్ట్స్) కలగవు. ప్రయాణాల్లో హోమియో... తరచూ ప్రయాణం చేసేవారు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ప్రయాణాల్లో అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా తరచూ ప్రయాణాలు చేసేవారు లేదా వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారు ఈ కింది మందులను తమ వద్ద ఉంచుకోవడం వాళ్లకెంతో మేలు చేస్తుంది. కాకులస్ ఇండికస్: ప్రయాణాల్లో వాంతులు చేసుకునేవారూ, ప్రయాణం తర్వాత తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవారు... 200 పొటెన్సీలో ఈ మందు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. నక్స్ వామికా: ప్రయాణాల్లో వచ్చే ఉదర సంబంధమైన సమస్యలకు ఇది మంచి మందు. ప్రయాణ సమయాల్లో దీన్ని 30 పొటెన్సీలో వరసగా మూడు రోజులు తీసుకోవడం మేలు. ఆర్జంటమ్-నైట్రికం: ప్రయాణం అంటే అతిగా భయపడేవారు, ప్రయాణాల్లో అతి జాగ్రత్త పాటిస్తూ బాధపడేవారికి ఈ మందు ఇవ్వవచ్చు. పెట్రోలియమ్: తరచూ కార్లలో ప్రయాణం చేసేవారికి తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దీన్ని 200 పొటెన్సీలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పోడో ఫిల్లమ్: తరచూ ప్రయాణాలు చేసేవారికి విరేచనాలూ, కడుపునొప్పి కనిపిస్తే ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును గంటలకోసారి చొప్పున తీసుకుంటూ ఉంటే విరేచనాలు తగ్గుతాయి. - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి -
సైంటిస్ట్ బుజ్జిగాడు..!
మా బుజ్జిగాడిని సైంటిస్టు చేయాలన్నది నా కోరిక. నాలో ఆ కాంక్షను పెంచిన సంఘటన ఒకటుంది. అదేమిటంటే... ఒకరోజున మా ఆవిడతో సరదాగా మాట్లాడుతూ... ‘‘ఐన్‌స్టీన్ థియరీ ఆఫ్ రిలేటివిటీ ప్రకారం... నీ చెంత ఉంటే రోజులు క్షణాల్లా గడుస్తాయి. నువ్వు ఊరెళితే క్షణాలు కూడా రోజుల్లా గడుస్తాయి...’’ అన్నాను. అదే టైమ్‌లో మూడోక్లాసు చదువుతున్న మా బుజ్జిగాడు ఎంటరైపోయాడు. ‘‘నాన్నా... ఈ థియరీ నాకు తెలుసు. ఆదివారం తొందరగా అయిపోతుంది. సోమవారం అంతా బోరింగ్‌గా, పొడుగ్గా ఉంటుంది’’ అన్నాడు. దాంతో మా బుజ్జిగాడిలో ఐన్‌స్టీన్‌ను చూసుకుని ఎంతో ఆనందించాను. ఇక మా వాడిని సైంటిస్టు చేద్దామని నిర్ణయించుకున్నాను. ఎవరో విదేశీయులెందుకూ... మన దేశ సైంటిస్టులనే ఆదర్శంగా తీసుకుందామని అనుకున్నాను. ఈ ప్రయత్నంలో భాగంగా ముందుగా మన చేతుల్లో ఉన్న పని నెరవేర్చడం కోసం ముందుగా వాణ్ణి బార్బర్షాపుకు తీసుకెళ్లి... ‘‘బాబూ.. మా బుజ్జిగాడికి కలాం కటింగ్ చేయి నాయనా’’ అని కోరుకున్నాను. వాడి మెదడు చుట్టూ అచ్చం కలాం గారి లాంటి క్రాపు చేయించి... ఆ వాతావరణాన్నే సృష్టిస్తే... సేమ్ టు సేమ్ ఎన్విరాన్మెంట్ కాబట్టి మా బుజ్జిగాడి మెదడూ కలాంగారి బ్రెయిన్లాగే ఎదుగుతుందనే ఆశ నాది. ఈ పని కాస్తా అయిపోయాక వాణ్ణి తీసుకొచ్చి నిద్రపుచ్చడం మొదలుపెట్టాను. ‘‘అప్పుడే నేను పడుకోను. కాసేపు కార్టూన్ నెట్వర్క్ చూస్తాను’’ అని వాడు మారాం చేస్తున్నా, ‘‘పడుకోరా వెధవా... కలాం గారు చెప్పినట్టు కలలు కనాలి. లేకపోతే సైంటిస్టువి కాలేవు’’ అంటూ రోజూకంటే కాసేపు ఎక్కువగా కలలు కననిద్దామని ప్రయత్నం చేశాను. దీంతో వాడు మరింత నిద్రపోయి స్కూల్ టైమయ్యాక లేచాడు. ఇలా మొదటి ప్రయత్నం కాస్తా బెడిసికొట్టింది. ఇలా స్కూలెగ్గొట్టి మా బుజ్జిగాడు చేసిన పని వల్ల నేను మా అమ్మతో తలవాచేట్లు తిట్లు తిన్నాను. ‘‘చూశావా! నీ కొడుకు నిర్వాకం. రోజంతా ఎక్కడెక్కడి నుంచో సాలీళ్లను పట్టుకొచ్చి మనింట్లో వదులుతున్నాడు’’ అంది అమ్మ. ఎందుకలా చేశాడని వాకబు చేస్తే తెలిసిన విషయమిది... ‘‘ఆయనెవరో అలెగ్జాండర్ ఫ్లెమింగ్ అనే వాడు బూజు నుంచి పెన్సిలిన్ అనే మందును కనిపెట్టాడట. వీడు ఈ సాలీళ్ల బూజు నుంచి అంతకంటే పవర్ఫుల్ మందు కనిపెడతాడట’’ అంటూ మా వాడు చేసిన పనికి మా ఇద్దరిపైనా ఒకేసారి కోపంగా అరిచింది మా అమ్మ. - యాసీన్ -
డెల్యూజన్ డిజార్డర్స్... మెదడు కనికట్టు... భ్రాంతుల్లోకి నెట్టు!!
ఇది మెదడు చేసే మాయాజాలం. ఆ కనికట్టుకు లోబడిన రోగులు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. వింతవింత భ్రాంతులకు లోనవుతుంటారు. ఈ భ్రాంతుల వలన కలిగే రుగ్మతలను గతంలో పారనాయిడ్ డిజార్డర్స్ అని పిలిచేవారు. ఇవి మానసిక వ్యాధుల్లో సైకోసిస్ తరహాకు చెందినవి. వీటిలో రోగి తన ఊహను, భ్రాంతిని అత్యంత వాస్తవంగా భావిస్తుంటాడు. రోగికి తనకు జరుగుతున్న అనుభవమంతా వాస్తవంగా కనిపిస్తుంటే... ఎదుటివారుఎంతగా వివరించినా దాన్ని భ్రాంతి అని చెప్పడాన్ని ఒప్పుకోడు. ఇది జబ్బులేని వారికి భ్రాంతిగా అనిపించవచ్చేమోగానీ, జబ్బుతో బాధపడేవారికి మాత్రం తమలోని జీవరసాయన చర్యల ఫలితంగా ఆ భ్రాంతులే వాస్తవంగా తోస్తాయి. వాటిపై అవగాహన కోసమే ఈ కథనం. ఇంగ్లిష్‌లో డెల్యూజనల్ డిజార్డర్స్ అని పిలిచే వీటిని భ్రాంతి రుగ్మతలుగా పేర్కొనవచ్చు. ఇందులో అనేక రకాలు ఉన్నాయి. వాటి గురించి... విచిత్రంగా అనిపించని భ్రాంతులు (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్) ఇందులో రోగికి తను నిత్యజీవితంలో అనుభవంలోకి వచ్చే వాటినే భ్రాంతులుగా పొందుతుంటాడు. అందుకే వీటిని విచిత్రంగా అనిపించని భ్రాంతులుగా పేర్కొనవచ్చు. అంటే... తనను ఎవరో వెంటాడుతున్నట్లు, తనకు వ్యతిరేకంగా ఎవరో కుట్రపన్నుతున్నట్లు, తనకు విషం ఇచ్చి చంపడానికి ప్రయత్నిస్తున్నట్లుగా భావిస్తాడు. కానీ వాస్తవంగా అది నిజం కాదు. దాంతో రోగి వల్ల పరిస్థితులు ఒక్కోసారి తీవ్ర అపార్థాలకూ, అనర్థాలకూ దారితీయవచ్చు. పైగా ఈ తరహా భ్రాంతులకు లోనయ్యేవారు చూడటానికి, ప్రవర్తన విషయంలో, నలుగురితో కలిసే విషయంలో అంతా మామూలుగానే ఉంటారు. ఇక కొన్ని భ్రాంతులు ఒక అంశం ఆధారం (థీమ్ బేస్డ్)గా సాగుతుంటాయి. వాటిల్లో కొన్ని ఇలా ఉంటాయి. జెలస్ (ఈర్ష్య : ఈ తరహా భ్రాంతి చాలామందిలో ఉంటుంది. ఈ భ్రాంతితో కొన్ని జీవితాలే నాశనమవుతుంటాయి. తన జీవిత భాగస్వామి ఎవరితోనో ప్రేమలో ఉందని, వారితో అక్రమసంబంధం నెరపుతోందని భావిస్తుంటారు. ఆ రుగ్మత కారణంగా అవతలివారిని వేధిస్తూ ఉంటారు. అకారణంగా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇలా జీవిత భాగస్వామిని అనుమానిస్తుంటే వెంటనే మానసిక నిపుణులను కలవాల్సి ఉంటుంది. ఎరటోమానియాక్: ఈ భ్రాంతి ఉన్నవారు తనతో ఓ సెలబ్రిటీ లేదా ఓ వీఐపీ ప్రేమలో పడిపోయారని నమ్ముతుంటారు. వారిని కలవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.ఫోన్లో మాట్లాడుతూ, వెంటాడుతూ ఉండటం కూడా సాధారణమే. గ్రాండియోజ్: ఈ తరహా భ్రాంతి ఉన్నవారు తనను తాను ఓ అసాధారణమైన వ్యక్తిగా భావిస్తుంటారు. తనకు అద్భుత శక్తులున్నాయనీ, విపరీతమైన విజ్ఞానం ఉందనీ లేదా తాను చాలా ప్రధానమైన వ్యక్తిననీ భావిస్తుంటారు. తనను తాను చాలా ఎక్కువగా అంచనా వేసుకుంటుంటారు. పర్సెక్యూటరీ: ఈ తరహా భ్రాంతుల్లో ఉండేవారిని ఎప్పుడూ ఓ శంక వేధిస్తూ ఉంటుంది. తమను (చాలా సందర్భాల్లో తమకు కావాల్సిన, తమకు చాలా దగ్గరి బంధువులైనవారిని లేదా తమకు చెందినవారిని కూడా) అవతలివారు అవమానిస్తున్నారని, చిన్న చూపు చూస్తూ కించపరుస్తున్నారని భావిస్తుంటారు. అంతేకాదు... తమపై నిఘా ఉంచారని, తమకు హాని చేయడానికి పన్నాగాలు పన్నుతున్నారనే భ్రాంతిలో ఉంటారు. సొమాటిక్: ఈ తరహా భ్రాంతులకు లోనయ్యేవరు తమకు ఏదో జబ్బు ఉందని, ఏదో వైద్యపరమైన లోపం ఉందని, తమకు వైద్యం అవసరమని భావిస్తుంటారు. తమకు సరైన చికిత్స దొరకడం లేదనే భ్రాంతిలో ఉంటారు. మిక్స్డ్: కొందరిలో పైన పేర్కొన్న ఏ ఒక్క భ్రాంతి రుగ్మతో కాకుండా... ఒకటి కంటే ఎక్కువగా భ్రాంతులు ఉండవచ్చు. అలాంటివారిని ఈ విభాగంలో పేర్కొంటారు. భ్రాంతులకు లోనయ్యేవారి లక్షణాలు: ఎప్పుడూ ఉద్వేగంగా, అస్థిమితంగా ఉంటారు తక్షణం కోపం వచ్చేస్తుంటుంది కాస్త నిరాశాపూరితంగా ఉంటారు కొన్ని రకాల భ్రాంతులు (హెల్యూసినేషన్స్)లో ఉంటారు. అంటే... తమకు ఏవో దృశ్యాలు కనిపిస్తున్నట్లుగా లేదా మాటలు వినిపిస్తున్నట్లుగా అనిపిస్తుంది. కొందరిలో తమకు ఏదో చెడు వాసన వస్తున్నట్లుగా కూడా అనిపించవచ్చు. భ్రాంతులకు కారణాలు: నిజానికి చాలా సందర్భాల్లో ఈ తరహా రుగ్మతలకు కారణాలు నిర్దిష్టంగా తెలియదు. అయితే పరిశోధకుల అధ్యయనాలను బట్టి అనేక రకాల అంశాలు దీనికి కారణమని తెలుస్తున్నాయి. వాటిలో జన్యుపరమైన, జీవసంబంధమైన, వాతావరణానికి సంబంధించిన అంశాలు ముఖ్యమైనవని నిపుణులు విశ్లేషిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో మానసిక అంశాలూ దీనికి దోహదం చేస్తాయి. మానసికకారణాలు/ఇతరాలు: కొన్ని సందర్భాల్లో తీవ్రమైన ఒత్తిడి కారణంగా భ్రాంతులు కలగవచ్చని చాలా అధ్యయనాల్లో తేలింది. అలాగే మితిమీరి ఆల్కహాల్ తీసుకున్నప్పుడు, కొన్ని రకాల మాదకద్రవ్యాలు తీసుకున్నప్పుడు కూడా రకరకాల భ్రాంతులు కలగవచ్చు. అలాగే ఒంటరిగా ఉండేవారిలో చాలామందికి మానసిక కారణాల వల్ల భ్రాంతులు కలగవచ్చు. ఇక కనుచూపు మసకగా ఉండేవారికి, వినికిడి శక్తి సరిగా లేనివారికి భ్రాంతులు కలిగే అవకాశాలు ఎక్కువ. ఈ రుగ్మత ఉన్నట్లు నిర్ధారణ ఎలా... సాధారణంగా రోగికి విచిత్రమైన భ్రాంతులు (బిజ్జార్ డెల్యూజన్స్) ఉన్నప్పుడు మిగతావారు వాటిని చూడలేకపోవడం వల్ల, పైగా అవి అసాధ్యమైనవి కావడం వల్ల రోగి భ్రాంతికి గురవుతున్నాడని తేలిగ్గా గుర్తించవచ్చు. కానీ సాధారణంగా అనిపించే భ్రాంతులు (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్)... అంటే పైన పేర్కొన్నట్లుగా తమ జీవిత భాగస్వామికి ఇంకెవరితోనో అక్రమ సంబంధాలున్నాయనే భ్రాంతి లేదా తమకు తమ ఆప్తులే కీడు చేయడానికి యత్నిస్తున్నారన్న భ్రాంతితో బాధపడే నాన్-బిజ్జార్ తరహా రుగ్మతలను గుర్తించడం కష్టం. పైగా ఈ భ్రాంతులకు లోనయ్యేవారి ప్రవర్తన కూడా చాలా సాధారణంగా అందరూ నమ్మదగినదిగా ఉంటుంది. దాంతో చాలా సందర్భాల్లో అనర్థాలు, అపార్థాలు, అపోహలు కలిగి జీవితాలు సైతం ఛిద్రం కావడం సాధారణంగా జరిగేదే. అందుకే భ్రాంతులను నిర్ధారణ (డయాగ్నోజ్) చేసే విషయంలో చాలా నిశితం (మెటిక్యులస్)గా ఉండాలి. భ్రాంతులకు లోనవుతున్నట్లు కుటుంబ సభ్యులు చెబితే రోగిని చాలా రకాలుగా అంటే... రోగి తాలూకు పూర్తి వైద్య సమాచారం, మెడికల్ హిస్టరీ, భౌతిక పరీక్షలు చేయాల్సి ఉంటుంది. భ్రాంతులను ఇదమిత్థంగా నిర్ధారణ చేయడానికి ల్యాబ్ పరీక్షలు లేకపోయినా... కొన్ని సందర్భాల్లో ఏవైనా భౌతిక కారణాల వల్ల ఇలాంటి భ్రాంతులు కలుగుతున్నాయా అన్న అంశాన్ని రూల్అవుట్ చేసుకోడానికి రక్తపరీక్షల వంటి కొన్ని పరీక్షలు చేయించవచ్చు. ఇక రోగికి భ్రాంతులు కలుగుతున్నప్పుడు అక్కడ భౌతికంగా అలాంటి ఆస్కారమే లేని సందర్భాల్లో డాక్టర్లు... పేషెంట్‌ను సైకియాట్రిస్ట్‌కు చూపమని సిఫార్సు చేస్తారు. ఆ తర్వాత సైకియాట్రిస్ట్ పర్యవేక్షణలో కూడా విచిత్రం కాని భ్రాంతుల (నాన్-బిజ్జార్ డెల్యూజన్స్)కు ఒక నెలపైగా లోనవుతుంటే అప్పుడు ఆ రోగికి భ్రాంతిరుగ్మత (డెల్యూజన్ డిజార్డర్) ఉన్నట్లు నిర్ధారణ చేస్తారు. అయితే ఆ సమయంలో అతడికి ఏవైనా స్కీజోఫ్రీనియా వంటి సైకోటిక్ (మానసిక) జబ్బులు లేవన్న తర్వాతే... అతడికి భ్రాంతిరుగ్మత ఉన్నట్లుగా నిర్ధారణ చేస్తారు. ఎందుకంటే స్కీజోఫ్రీనియా వంటి మానసిక రుగ్మత ఉంటే... అప్పుడు తప్పనిసరిగా భ్రాంతులు ఉంటాయి. ఆ జబ్బు లేకుండా కూడా భ్రాంతులు ఉన్నాయంటే... అది తప్పనిసరిగా భ్రాంతిరుగ్మతేనని నిర్ధారణ చేస్తారు. చికిత్స: భ్రాంతి రుగ్మతలు ఉన్న రోగికి అటు మందులతోనూ, ఇటు కౌన్సెలింగ్‌తోనూ చికిత్స చేయాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఏ ఒక్కదానితోనో ఇవి నయం కావు. చాలా కేసుల్లో మందులు వాడాల్సిన సందర్భాలే ఎక్కువగా ఉంటాయి. అయితే ఒక్కోసారి కేవలం మందులు వాడటం వల్ల కూడా అవి నియంత్రణలోకి రావు. అప్పుడు సైకోథెరపీ (కౌన్సెలింగ్ తరహా చికిత్స) తో ఆ లక్షణాలను నియంత్రించుకోవడం ఎలాగో రోగికి సైతం అవగాహన కలిగించి, స్వీయనియంత్రణ చేసుకునేలా కూడా శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ తరహా భ్రాంతులు నియంత్రణలోకి వచ్చినట్లే వచ్చి... మళ్లీ మళ్లీ తిరగబెడుతుంటాయి. అందుకే ఈ తరహా చికిత్సలో పదే పదే తిరగబెట్టడాన్ని నివారించేందుకు ప్రణాళిక (రిలాప్స్ ప్రివెన్షన్ ప్లాన్) లు రచించాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ఈ కింద పేర్కొన్న చికిత్సలను ఇస్తుంటారు. అవి... వ్యక్తిగత సైకోథెరపీ: తనకు వాస్తవంగా తోచినట్లుగా కనిపిస్తున్న ఆ భ్రాంతి గురించి రోగికే అవగాహన కల్పించి... అది తనకు వాస్తవంగా అనిపిస్తున్నప్పటికీ అది భ్రాంతి అనీ, అది వచ్చినప్పుడు దాని నుంచి బయటపడేందుకు ప్రయత్నించేలా కౌన్సెలింగ్ చేయడాన్ని వ్యక్తిగత (ఇండివిడ్యువల్) సైకోథెరపీగా పేర్కొంటారు. కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ (సీబీటీ): తనకు ఇబ్బంది కలిగించే అంశాలను గుర్తించి, వాటి నుంచి క్రమంగా దూరమయ్యేలా ఇచ్చే కౌన్సెలింగ్‌తో పాటు తనకు ఇబ్బంది కలిగించే ఆలోచనలనుంచి తప్పుకోవడం, అవి రాకుండా నివారించడానికి పాటించాల్సిన అంశాలు, అందుకు అనుగుణంగా మన ప్రవర్తనను మార్చుకోవడం ఎలాగో బోధించడం వంటివి ఈ చికిత్స ప్రక్రియలో ఉంటాయి. ఫ్యామిలీ థెరపీ: నిజానికి ఈ తరహా రోగుల చికిత్సలో కుటుంబం పాత్ర ఎంతో కీలకమైనది. తమకు కనిపించని అంశం కుటుంబ సభ్యులకు ఎంత వాస్తవమో, రోగి ఫీలయ్యే భ్రాంతి కూడా అంతే వాస్తవమని కుటుంబ సభ్యులు గ్రహించాలి. అది రోగలక్షణంగా వారు గుర్తించాలి. అలా గుర్తించి, రోగిని బుజ్జగిస్తూ దారిలోకి తెచ్చుకోవాలి. అంతేగాని దాన్ని ఖండిస్తూ పోకూడదు. అందుకే ఈ తరహా రోగులతో వ్యవహరించాల్సిన తీరు విషయంలో కుటుంబ సభ్యులకు కూడా కొంత కౌన్సెలింగ్ అవసరమవుతుంది. దీని ఆధారంగా రోగితో కుటుంబసభ్యులు వ్యవహరించే/వ్యవహరించాల్సిన తీరునే సైకియాట్రిస్ట్‌లు ఫ్యామిలీ థెరపీగా పేర్కొంటారు. రోగి త్వరగా కోలుకోడానికి ఇదెంతో ముఖ్యం. దీంతోపాటు యాంటీ-సైకోటిక్ మందులుగా పేర్కొనే మందులను వారికి ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ రోగి తన భ్రాంతులతో ఇతర కుటుంబసభ్యులకు హాని కలిగించేంత ప్రమాదకరంగా ఉంటే వారిని ఆసుపత్రిలో ఉంచి వారు సాధారణ స్థితికి వచ్చే వరకు చికిత్స చేయాల్సి ఉంటుంది. -నిర్వహణ: యాసీన్ కొన్ని చిత్రవిచిత్ర భ్రాంతులు కాప్‌గ్రాస్ డెల్యూజన్: ఈ భ్రాంతులకు లోనయ్యేవారు... తమ తల్లిదండ్రుల లేదా కుటుంబసభ్యులు, భార్య/భర్త స్థానంలో వేరెవరో అదే రూపంలో వచ్చి ఉంటున్నారనీ, నిజానికి వారు వారు కారనీ భావిస్తుంటారు. ఫ్రెగోలీ డెల్యూజన్: ఒక వ్యక్తే తన కుటుంబ సభ్యుల్లోకి... అనేక రూపాల్లోకి మారిపోతున్నారనీ, ఆయనే అనేక స్థానాలు తీసుకుంటున్నారనీ భ్రాంతికి లోనవుతుంటారు. ఇటాలియన్ నటుడైన లియోపోల్డో ఫ్రెగోలీ వెంటవెంటనే అనేక వేషాలు మార్చడంలో సిద్ధహస్తుడు. అతడి పేరిటే ఈ భ్రాంతి రుగ్మతకు ఈ పేరు వచ్చింది. కోటార్డ్ సిండ్రోమ్: ఈ భ్రాంతి మరీ విచిత్రం. ఇందులో భ్రాంతికి లోనయ్యే వ్యక్తి తాను అసలు జీవించే లేనని భ్రాంతికి లోనవుతుంటాడు. తన శరీరం, రక్తమాంసాలు, అవయవాలు... ఇవేవీ లేవనీ, తన మనుగడే లేదని అనుకుంటుంటాడు. రీడ్యూప్లికేటివ్ పారామ్నీషియా: వాస్తవానికి తాను ఒకచోట ఉన్నా...ఉన్న ప్రదేశం... అక్కడ లేదనీ, అదేదో వేరే దేశంలోనో లేదా మరో సుదూర ప్రాంతంలోనో ఉందని అనుకుంటుంటాడు. ఉదాహరణకు హైదరాబాద్‌లోని ఒక ఆసుపత్రిలో ఒక వ్యక్తిని చేర్చారనుకుందాం. అతడు... తాను హైదరాబాద్‌లో లేననీ, వేరే ఎక్కడో అమెరికాలో ఉన్నాననీ భావిస్తుంటాడు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
గుండె గురించి గుప్పెడు విషయాలు
మనిషి గుండె కొట్టుకోవలసిన వేగం నిమిషానికి 72 సార్లు అయినప్పటికీ అది ఆ వ్యక్తి చేస్తున్న పనిని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి - నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. కాబట్టి గుండె స్పందనలు నిమిషానికి 90- 100 మధ్యన ఉన్నా దాన్ని నార్మల్‌గానే పరిగణించవచ్చు. ఎప్పుడైతే గుండె వేగం నిమిషానికి 100 కంటే ఎక్కువగా ఉందో దాన్ని టాకికార్డియా అని, అది 60 కంటే తక్కువగా ఉంటే దాన్ని బ్రాడీకార్డియా అని పరిగణించాలి. ఏదైనా ప్రత్యేకసందర్భం (ఉదాహరణకు మెట్లపై వేగంగా పరుగెత్తుతున్నప్పుడు)లో గుండె స్పందన పెరిగితే దాన్ని నార్మల్‌గానే పరిగణించాలి. ఆందోళనకు గురైనప్పుడు కూడా గుండెవేగం నిమిషానికి 100 దాటవచ్చు. అయితే ఈ నార్మల్ రేంజ్లో కాకుండా ఎప్పుడూ అబ్నార్మల్ రేంజ్లో ఉండేవారు మాత్రం డాక్టర్‌ను కలిసి తగు సలహా తీసుకోవాలి. ఒక ఆస్పిరిన్ మాత్ర... జీవితాన్ని రక్షిస్తుంది... ఒక ఆస్పిరిన్ మాత్ర జీవితాన్ని రక్షిస్తుంది. ఆస్పిరిన్‌లో రక్తాన్ని పలచబార్చే గుణం ఉంది. గుండెపోటు రావడం అంటే... ప్రధానంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఎక్కడైనా అడ్డంకి (బ్లాక్) ఉండటం వల్ల, దానికారణంగా గుండెకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఈ పరిణామం వల్ల గుండెకండరం చచ్చుబడిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే గుండెపోటు లక్షణాలు (ఎడమ పక్క భుజం లేదా చేయి లాగినట్లుగా ఉండటం, గుండె / ఛాతీలో నొప్పి, చెమటలు పట్టడం వంటివి) కనిపించినప్పుడు ఒక ఆస్పిరిన్ మాత్ర అందుబాటులో ఉంచుకుని, అలాంటి లక్షణాలు కనిపించగానే టక్కున నోట్లో వేసుకోవాలి. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టర్ సలహా మీద క్రమం తప్పకుండా స్టాటిన్స్ అనే మందులు వాడాలి. స్టాటిన్స్ వాడేవారూ ఈ విషయాలు తెలుసా? స్టాటిన్స్ అన్నవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించే మాత్రలు. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీదే కాకుండా ప్రతి మనిషి తాలూకు జన్యుపరమైన కారణాల వల్ల కూడా కావచ్చు. అయితే ఇలాంటివారు ఆహారనియమాలు ఏవీ పాటించనట్లయితే కొలెస్ట్రాల్ పాళ్లు మరింతగా పెరగవచ్చు. కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణాలు ఏవైనప్పటికీ, మున్ముందు దానివల్ల గుండెజబ్బులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అనే ఒకరకం కొవ్వుపదార్థం ఉత్పత్తి కాకుండా నివారించే మందులే స్టాటిన్స్. ఇవి శరీరంపై పెద్దగా సైడ్ఎఫెక్ట్స్ చూపకుండానే గుండెకు మరింత లాభం చేకూరుస్తాయి. గుండెపోటు రిస్క్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఈ మందులను క్రమం తప్పకుండా వాడుతున్నంతకాలమే వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. వీటిని మానేస్తే వీటివల్ల శరీరానికి కలిగే రక్షణ తొలగిపోతుంది. అందుకే ఒకసారి స్టాటిన్స్ మొదలుపెట్టినవారు వాటిని మానకుండా డాక్టర్ సలహా మేరకు వాటిని ఎప్పటికీ వాడుతుండటమే మంచిది. మరి అవి వాడుతున్నప్పుడు రక్తసిక్త గాయమైతే..? ఆస్పిరిన్ లేదా ఇతర రక్తాన్ని పలచబార్చే మందులు వాడేవారికి ఒక సందేహం ఉంటుంది. అదేమిటంటే... గుండె ఆపరేషన్ అయ్యాక మళ్లీ జబ్బు రాకుండా ఉండటానికి కార్డియాలజిస్ట్ సలహా మేరకు జీవితాంతం ఆస్పిరిన్, స్టాటిన్ వంటి మాత్రలు వాడాల్సి ఉంటుంది కదా... మరి అవి వాడే క్రమంలో ఏదైనా రక్తస్రావం జరిగేలా దెబ్బతగిలితే ఎలా... అన్నదే వారి ఆందోళన. ఆస్పిరిన్ లేదా ఇతర రక్తాన్ని పలచబార్చే మందులు వాడటం వల్ల గాయం అయినప్పుడు రక్తస్రావం అయిపోతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. కొందరిలో గుండె, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉండటం లేదా గుండె కవాటం మార్పిడి చికిత్స చేసినట్లయితే వారికి ఓరల్ యాంటీకోయాగ్యులెంట్స్ (ఎసిట్రోమ్, వార్‌ఫేరిన్) కూడా ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే రక్తస్రావం కాకుండా, దెబ్బలేమీ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భాల్లోనే రక్తస్రావం జరిగి, ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అయితే దెబ్బతగిలి, రక్తస్రావం అవుతుంటే కంగారుపడకుండా శుభ్రమైన బట్టతో దాన్ని అదిమిపట్టి వెంటనే దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాలి. - నిర్వహణ: యాసీన్ నడక ఎంతో మేలు... గుండెజబ్బులను నివారించడానికి లేదా గుండె జబ్బును కనుగొన్న తర్వాత దానిని అదుపులో పెట్టుకోడానికైనా నడక మంచి వ్యాయామం. అయితే ఆరుబయట లేదా ట్రెడ్‌మిల్‌పై నడవడం మంచిది. అయితే నడిచేవారు ఒక ప్రాథమిక నియమం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వేగంతో తక్కువ దూరాలు నడవటం కంటే...గుండెజబ్బులు ఉన్నవారు తక్కువ వేగంతో ఎక్కువ సమయం నడిస్తే మంచిది. మామూలుగా ఆరోగ్యం కోసం నడిచేవారు ఉదయం వేళ వాకింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటే సాయంత్రం కూడా నడవచ్చు. అయితే ఒకవేళ గుండెజబ్బు నిర్ధారణ అయినవారు మాత్రం ఉదయం వేళ నడవడం మేలు. సాయంత్రాలు నడిచేవారు మాత్రం వాకింగ్ చేయడానికి ముందు మితంగా ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా ఆహారం తీసుకుని వాకింగ్ చేయకూడదని గుర్తుంచుకోవాలి. -
కాఫీ, చాక్లెట్స్ మెదడుకు చేసేదేమిటీ!
కొందరికి టీ కాఫీలు మంచినీళ్ల ప్రాయం. అలా తాగడం వల్ల ఒనగూరే లాభాలు, నష్టాలు తెలియకపోయినా అదేపనిగా వాటిని తాగేస్తుంటారు. నాలుగు కప్పులకు మించకుండా తాగే టీ... కనీసం 20 శాతం పక్షవాతాలను నివారిస్తుంది. చాక్లెట్ల తీరూ అంతే. కానీ మూడు కప్పులు మించిన కాఫీతో మాత్రం ఇబ్బందులు తప్పవు. పరిమితంగా తినే చాక్లెట్లు మెదడుకు తియ్యటి నేస్తాలై మతిమరపు రానివ్వకుండా చేస్తాయి. అలాగని మస్తీ చేస్తే మళ్లీ డేంజరే. కాఫీ, టీ, చాక్లెట్ల వల్ల మెదడుపై ప్రభావాల వివరాల సమాహారమే ఈ కథనం. మనకు సంబంధించినంత వరకు కాఫీ చూడటానికి ఆకర్షణీయంగా, చిక్కటి రంగుతో, పొగలుకక్కుతూ, రుచికరమైన సువాసనను వెలువరుస్తూ చూడగానే తాగాలనిపిస్తుంది. అంతవరకే మనకు తెలిసింది. కానీ అదెంతో సంక్లిష్టమైన పానీయం. ఒక కప్పు కాఫీలో వందలకొద్దీ జీవసంబంధమైన పదార్థాలున్నాయి. అందులో కొన్ని చురుకైనవి. ఉదాహరణకు కెఫిన్, డైటర్‌పిన్స్, డైఫీనాల్స్ వంటివి. ఒక కప్పు కాఫీ తాగగానే హృదయ స్పందనల విషయంలో దాని ప్రభావం ఉంటుంది. అయితే ఆ ప్రభావం ఏమేరకు అన్నది... వ్యక్తిగతంగా తాగేవారికి ఉన్న కొన్ని వ్యాధులు, లక్షణాలపై ఆధారపడి ఉంటుంది. అలాగే కాఫీ ఎలా తయారుచేశారు అనే అంశంపై కూడా ఆధారపడి ఉంటుంది. అంటే... అది ఫిల్టర్ కాఫీయా లేక సాధారణ కాఫీయా అన్న అంశంపైన అన్నమాట. కెఫిన్ ప్రభావం: కాఫీలో ఉండే కెఫిన్ చాలా ప్రధానమైన ఉత్ప్రేరకం. మనం కాఫీ తాగగానే ఏమవుతుందో చూద్దాం. కాఫీ ఒంట్లోకి ఇంకగానే దాని ప్రభావం శరీరంపై, ఆరోగ్యంపై కనిపిస్తుంది. కాఫీ తాగిన కాసేపట్లో రక్తపోటు (ప్రధానంగా సిస్టోల్ బ్లడ్‌ప్రెషర్) పెరుగుతుంది. బీపీని కొలిచే సాధనంతో చూస్తే, అది సాధారణం కంటే 8 ఎంఎం/హెచ్‌జీ ఎక్కువవుతుంది. డయాస్టోలిక్ ప్రెషర్ కూడా పెరుగుతుంది. అయితే అది 6 ఎంఎం/హెచ్‌జీ పెరుగుతుంది. ఈ రెండు పెరుగుదలలూ కాఫీతాగిన తర్వాత సుమారు గంట నుంచి మూడు గంటల పాటు అలాగే ఉంటాయి. ఈ కొలతల్లో పెరుగుదల అన్నది సాధారణ వ్యక్తుల కంటే రక్తపోటుతో బాధపడేవారిలో ఎక్కువ. అందుకే హైబీపీతో బాధపడేవారు కాఫీ తాగే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. అంతగా తాగాలనిపిస్తే కొద్ది మోతాదులో మాత్రమే తమ జిహ్వను సంతృప్తిపరచడానికి తీసుకోవాలి. ఎందుకంటే... ఇలా కాఫీ ఎక్కువగా తాగుతూ బీపీని పెంచుకోవడం వల్ల దీర్ఘకాలికంగా దాని దుష్ర్పభావాలు ఉంటాయి. ఎందుకంటే కాఫీ తాగిన ప్రతిసారీ కెఫిన్ విషయంలో కొంత నిరోధకత (టాలరెన్స్) పెరుగుతూ ఉంటుంది. అంటే మొదటిసారి కాఫీ తాగినప్పుడు కలిగే ఉత్తేజం, రెండో కాఫీకి తగ్గుతుందన్నమాట. అందుకే రెండోసారి కూడా అంత ఉత్తేజం పొందాలనుకుంటే రెండోసారి కాస్త ఎక్కువ తాగాలన్నమాట. ఇలా కాఫీ ఇచ్చే ఉత్తేజానికి అలవాటుపడ్డప్పుడు క్రమంగా మోతాదును పెంచుకుంటా రు. ప్రధానంగా పరీక్షల కోసం చదివే పిల్లలు రాత్రుళ్లు చురుగ్గా ఉండటం కోసం, నిద్రమత్తును దూరం చేసుకోవడం కోసం దీనిపై ఆధారపడతారు. కాఫీని కేవలం పానీయంగానే పరిగణించకూడదు. ఎందుకంటే ఇందులో మైగ్రేన్ తలనొప్పిని తగ్గించే ‘యాంటీ మైగ్రేన్’ ఔషధం ఉంటుంది. అందుకే ఒకసారి ఒక కప్పు కాఫీ తాగాక రెండోదానికి వ్యవధి ఇవ్వాలి. లేకపోతే అవసరం లేని మందును/మాత్రను వేసుకుని దాని సైడ్‌ఎఫెక్ట్స్‌ను పొందడమేనని గుర్తుంచుకోవాలి. అలాగే కాఫీ... యాంగ్జైటీని పెంచుతుంది. కొందరిలో వణుకును కూడా పెంచుతుంది. అందుకే యాంగ్జైటీతో బాధపడేవారు కాఫీని తాగకపోవడమే మంచిది. ఇక ఎస్ప్రెస్సో కాఫీతో ఆరోగ్యానికి జరిగే హాని అంతా ఇంతా కాదు. డైటర్‌పీన్ ప్రభావం: కాఫీలో ఉండే డైటర్‌పీన్ ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో చూద్దాం. కాఫీలో ఉండే ఈ జీవరసాయనం శరీరంలోకి ప్రవేశించగానే అది శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ (ఎల్డీఎల్) పాళ్లను, హానికరమైన ట్రైగ్లిజరైడ్స్ పాళ్లను అకస్మాత్తుగా పెంచేస్తుంది. ఇక ఫిల్టర్ కాఫీలో డైటర్పీన్స్ పెద్దగా ఉండవు. ఎందుకంటే వడపోత ప్రక్రియలో ఇవి కాఫీలోకి వెళ్లకుండా, ఫిల్టర్ కాగితంపైనే ఉండిపోతాయి. కానీ ఫిల్టర్ చేయని కాఫీలో మాత్రం డైటర్‌పీన్ పాళ్లు అధికంగా ఉంటాయి. అందుకే కేవలం హైపర్‌టెన్షన్ ఉన్నవాళ్లు మాత్రమేగాక... శరీరంలో కొవ్వు పాళ్లు ఎక్కువగా ఉండే హైపర్లిపిడేమియాతో బాధపడే రోగులు సైతం కాఫీ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు మామూలు కాఫీకి బదులుగా ఫిల్టర్ కాఫీని ఒక కప్పు మాత్రం తీసుకోవచ్చు. మంచి గుణాలు లేవా?: కాఫీ ఎప్పుడూ హానికరమేనా? ఇందులో మంచి గుణాలు లేవా? కాఫీ ప్రియులు అంతగా నిరాశ పడనక్కర్లేదు. ఎందుకంటే కాఫీని పరిమిత మోతాదులో తీసుకుంటే అది పక్షవాతాన్ని (స్ట్రోక్‌ని) నివారిస్తుంది. కాఫీలోని డైఫినాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఈ పని చేస్తుంది. ఐదులక్షల మంది కాఫీ ప్రియులపై విస్తృతంగా చేసిన అధ్యయనాలలో ఈ విషయం తెలిసింది. అయితే ఈ ప్రయోజనాన్ని పొందడానికి కాఫీని కేవలం రోజుకు రెండు కప్పులకు మాత్రమే పరిమితం చేసుకోవాలి. గ్రీన్ టీ - బ్లాక్ టీ ల ప్రభావాలు: టీ గురించి పూర్వం నుంచే తెలుసు. ప్రధానంగా చైనా వారికి టీ గురించి 4,700 సంవత్సరాల క్రితం నుంచీ అవగాహన ఉంది. మంచినీళ్ల తర్వాత మానవాళి అత్యధికంగా తాగేది టీనే. ఇందులోనూ అనేక రకాలున్నాయి. అయితే మనం తీసుకునే టీ ఎంతోకొంత పులిసే తత్వం ఉన్న పానీయం. కానీ గ్రీన్ టీలో పులిసే తత్వం లేదు. ఇక అన్నిరకాల టీలలో కాటేచిన్స్, ఫ్లేవనాయిడ్స్ అనే జీవరసాయనాలు ప్రధానంగా ఉంటాయి. ఇవి రెండూ ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్స్. అయితే టీలో... ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్స్, కొవ్వు పదార్థాలు... వంటివేవీ ఉండవు. టీ తాగగానే అందులోని ఫ్లేవనాయిడ్స్ హానికరమైన కొలెస్ట్రాల్ అయిన ఎల్‌డీఎల్‌ను, కొవ్వుపదార్థాలైన ట్రైగ్లిజరాయిడ్స్‌ను సైతం తగ్గిస్తాయి. కానీ శరీరానికి మేలు చేసే మంచి కొలెస్ట్రాల్ (హెచ్‌డీఎల్) ను మాత్రం పెంచలేవు. టీ తాగడం వల్ల కొవ్వు పేరుకునే ప్రక్రియకు కాస్త అడ్డుకట్ట పడుతుంది. అయితే ఈ సుగుణం ఉంది కదా అని మోతాదుకు మించకుండా పరిమితంగా మాత్రమే తాగాలి. అంటే రోజుకు నాలుగు కప్పులకు మించనివ్వకూడదు. ఇలా పరిమితంగా టీ తాగడం పక్షవాతాన్ని నివారిస్తుంది. రక్తనాళాల్లో కొవ్వు పేరుకొని రక్తప్రవాహాన్ని అడ్డుకోవడం వల్ల వచ్చే ఇస్కిమిక్ స్ట్రోక్, రక్తనాళాలు చిట్లడం వల్ల వచ్చే హేమరేజిక్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్‌ల నివారణకు తోడ్పడతాయి. ఇలా స్ట్రోక్‌ను నివారించే గుణం సాధారణ టీ కంటే గ్రీన్ టీ లో ఎక్కువగా ఉంది. వివిధరకాల పక్షవాతాల్లో కనీసం 20 శాతం పక్షవాతాలను టీ నివారిస్తుంది. తాగిన వెంటనే శరీరంలో కొలెస్ట్రాల్ పాళ్లను తగ్గించడం, నైట్రిక్ ఆక్సైడ్ పాళ్లను పెంచడం వంటి గుణాలు ఉన్నందున ఈ ప్రయోజనం చేకూరుతుంది. రక్తనాళాల్లోని లోపలి పొర అయిన ఎండోథీలియం... రక్తాన్ని సాఫీగా ప్రవహించేలా చేస్తుంది. ఈ గుణాన్ని టీ మరింత మెరుగుపరుస్తుందని పరిశోధనల్లో తేలింది. టీలోనూ కొంత మేరకు కెఫిన్ పాళ్లు టీలో ఉన్నప్పటికీ వాటి ప్రభావం చాలా తక్కువ. ఆరోగ్యానికి మేలు చేకూరేలా టీ తాగడం ఎలా: టీలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ అనే యాంటీఆక్సిడెంట్స్ ఉన్నాయన్న సంగతి తెలిసిందే. అప్పటికప్పుడు కాచిన టీలోనే అవి ఎక్కువగా లభిస్తాయి. అందుకే టీని ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా తయారుచేసుకుని తాగాలి. ఇన్స్టాంట్ టీ/ఐస్ టీలలో కాచెటిన్, ఫ్లేవనాయిడ్స్ పాళ్లు చాలా తక్కువ. టీ లో ప్రతికూల అంశాలు... మేలు గుణాలతో పాటు, టీ లో కొన్ని ప్రతికూల గుణాలూ ఉన్నాయి. ఉదాహరణకు మనం తీసుకున్న ఆహారం, పండ్లు, కూరగాయల నుంచి శరీరానికి అందాల్సిన ఐరన్‌ను టీ శరీరంలోకి ఇంకకుండా నిరోధిస్తుంది. అందుకే ఆహారం తీసుకునే సమయంలో టీని పూర్తిగా దూరంగా ఉంచాలి. తినే ముందు, తిన్న తర్వాత కూడా చాలాసేపటి వరకు టీ తాగకూడదు. అలాగే టీ ఎక్కువగా తాగే అలవాటు (అంటే రోజుకు ఒక లీటర్ కంటే ఎక్కువగా తాగుతూ, అలా ఏళ్ల తరబడి తాగేవారికి) దీర్ఘకాలంలో ‘ఫ్లోరోసిస్’ కు దారితీసే ప్రమాదం ఉంది. పైన పేర్కొన్న అధ్యయనాలతో తేలిన విషయం ఏమిటంటే... గ్రీన్ టీ లేదా సాధారణ టీ తాగే అలవాటును కొనసాగించవచ్చు. కాకపోతే రోజుకు నాలుగు కప్పులకు మించి తాగవద్దు. ఆ పరిమితుల్లో టీ తాగడం వల్ల భవిష్యత్తులో పక్షవాతాన్ని చాలావరకు, గుండెజబ్బులను కొద్దిమేరకు నివారించుకోవచ్చు. ఇక చాక్లెట్ కూడా ఒకటికి మించి తినవద్దు. అయితే కాఫీ అలవాటు ఉన్నవారు మాత్రం రోజుకు రెండు కప్పులకు మించి తాగకూడదు. ఆ మోతాదు మించితే అది హానికరమని గ్రహించండి. కాఫీ, టీలలో వేసుకునే చక్కెర పాళ్లను గణనీయంగా తగ్గించాలని గుర్తుపెట్టుకోండి. పరిమితికి మించిన చక్కెర వేసుకుంటుంటే అది క్రమంగా రక్తంలో చక్కెరపాళ్లను పెంచడం, బరువును పెంచి స్థూలకాయం వచ్చేలా చేయడం జరుగుతుందని మర్చిపోకూడదు. -నిర్వహణ: యాసీన్ చాక్లెట్ ప్రభావాలు ఒకప్పుడు చాక్లెట్ చాలా ప్రియం (ఎక్స్పెన్సివ్) గా ఉండేది. అది చాలా అరుదైన పదార్థంగా మాత్రమే లభ్యమయ్యేది. కేవలం ధనవంతులకే అందుబాటులో ఉండేది. అప్పట్లో దాని లభ్యత చాలా తక్కువ కావడం, పైగా అది సెక్స్ ఉద్దీపించే పదార్థంగా ప్రాచుర్యం పొందడంతో వాటి ధర మరీ ఎక్కువగా ఉండేది. చాక్లెట్లో ఉపయోగించే కోకాలో... ఫ్లేవనాయిడ్స్ అని పిలిచే చాలా ప్రభావపూర్వకమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంతేకాదు... చాలా పరిమితంగా తీసుకున్నప్పుడు చాక్లెట్స్ హైబీపీని కొద్దిమేర నియంత్రిస్తుంటాయి. అయితే కొలెస్ట్రాల్‌పై మాత్రం దీని ప్రభావం అంతగా ఉండదు. పరిమితంగా చాక్లెట్ తినే గుణం ఉన్నవారిలో అది పక్షవాతం రిస్క్‌ను 19 శాతం తగ్గిస్తుందని అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అంతేకాదు... పరిమితంగా చాక్లెట్ తినేవారిలో జ్ఞాపకశక్తి మందగించడం వల్ల వచ్చే ‘డిమెన్షియా’ కూడా తక్కువే. ఈ గుణం కారణంగా అది భవిష్యత్తులో ‘అల్జైమర్స్ డిసీజ్’ రిస్క్‌ను గణనీయంగా తగ్గిస్తుంది. చాక్లెట్ల ద్వారా లభ్యమయ్యే ఈ ప్రయోజనాలు కేవలం డార్క్ చాక్లెట్లు లేదా కోకో ఉన్న చాక్లెట్లకు మాత్రమే పరిమితం. అయితే పరిమితికి మించి చాక్లెట్లు తీసుకోవడం స్థూలకాయం వంటి అనేక అనర్థాలకు దారితీస్తుందని గ్రహించాలి. డాక్టర్ బి. చంద్రశేఖర్ రెడ్డి చీఫ్ న్యూరోఫిజీషియన్, కేర్ హాస్పిటల్స్, బంజారాహిల్స్, హైదరాబాద్. -
వయసును గెలవండి...
నిత్యం యవ్వనంతో ఉండటం కంటే మరో వరం లేదు. ముఖ్యంగా వయసు తెలిసిపోయేది చర్మంతోనే. తెల్లబడే తలకు రంగు వేసైనా వృద్ధాప్యాన్ని కనిపించకుండా ఆపవచ్చేమోగాని, ముడుతలు పడే చర్మానికి ఏం చేసి వృద్ధాప్య లక్షణాలను ఆపగలం? చర్మంపై త్వరగా వృద్ధాప్య లక్షణాలు కనబడటానికి కారణాలు, వాటిని నివారించేందుకు తీసుకువాల్సిన జాగ్రత్తలను తెలుసుకునేందుకే ఈ కథనం. చర్మం మన దేహంలోని అతి పెద్ద అవయవం. సూర్యుడి హానికారక కిరణాలనుంచి, వాతావరణంలోని వేడిమి/చలి నుంచి, అనేక సూక్ష్మక్రిములనుంచి రక్షణ కల్పిస్తుంది చర్మం. అదే లేకపోతే ఏ జీవి మనుగడా సాధ్యం కాదు. ఇలా రక్షణ కల్పించే ప్రక్రియలో దానికి అయ్యే హానిని అదే తొలగించుకుని, దానికి అయ్యే గాయాలను అదే చక్కబరచుకుంటుంది. ఎప్పటికప్పుడు తనను తాను రిపేర్ చేసుకుంటుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వయసు తాలూకు అనేక మార్పులు కనిపిస్తాయి. చర్మంపై కాల ప్రభావాన్ని రెండు రకాలుగా వర్గీకరించవచ్చు. మొదటిది అంతర్గతంగా వచ్చే మార్పుల (ఇంట్రిన్సిక్) తాలూకు కారణాలు, రెండోది బాహ్య కారణాలు (ఎక్స్ట్రిన్సిక్). వయసు పైబడటానికి అంతర్గత (ఇంట్రిన్సిక్) కారణాలు కాలం గడుస్తున్న కొద్దీ చర్మంలో వచ్చే మార్పులకు ప్రధాన కారణం జన్యువుల్లో ఉంటుంది. కొందరు... ముఫ్ఫైలలో ఉన్నా టీన్స్‌లో ఉన్నట్లే కనబడతారు. దానికి కారణం వారి జన్యువులే. ఇలా అంతర్గత కారణాలతో జరిగే వయసు మార్పులను ‘స్వాభావిక వయసు మార్పులు’ (నేచురల్ ఏజింగ్) అంటారు. మన చర్మం బిగుతుగా ఉండటానికి కారణం... అందులో కొలాజెన్ అనే పదార్థం. ఈ కొలాజెనే చర్మం కణాలను పట్టి ఉంచినట్లుగా బిగుతుగా ఉంచడానికి సపోర్ట్ ఇస్తుంది. అయితే కాలం గడుస్తున్న కొద్దీ కొలాజెన్ ఉత్పత్తి మందగిస్తూ పోతుంటుంది. అలా మందగిస్తున్నకొద్దీ... చర్మాన్ని సాగదీసినప్పుడు మళ్లీ యథాస్థితికి వచ్చే గుణం (ఎలాస్టిసిటీ) తగ్గి వదులుగా మారుతుంది. ఇక చర్మంపైన మృతకణాలు ఎప్పటికప్పుడు తొలగిపోయి, ఆ స్థానంలో మళ్లీ కొత్త కణాలు పుడుతుంటాయి. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ మృతకణాల స్థానాన్ని తీసుకునే కొత్త కణాల ఉత్పత్తి కూడా మందగిస్తుంటుంది. ఈ మార్పులన్నీ 20 తర్వాత నుంచి కనిపిస్తుంటాయి కాబట్టి ఏజింగ్ ఆ వయసు నుంచే మొదలవుతుంది. వయసు పెరగడంతో వచ్చే స్వాభావిక మార్పులివి... చాలా సూక్ష్మమైన ముడుతలు (సాధారణంగా నుదుటిమీదపై ప్రస్ఫుటంగా కనిపిస్తాయి) ఈ చర్మం క్రమంగా పారదర్శకం కావడం చర్మం కింద ఉండే కొవ్వు క్రమంగా తగ్గిపోతుండటంతో చెంపల భాగంలో గుంటలు పడటం. అలాగే కంటి చుట్టుపక్కల ఉన్న చర్మం కింది కొవ్వు కూడా తగ్గుతూ పోతుంది. అలాగే అరచేతుల వెనక భాగంలో, మెడ దగ్గర చర్మం వదులవుతూ ఉంటుంది కాలక్రమంలో ఎముక కాస్తంత కురచగా మారడంతో ఎముక చుట్టూ ఉండే చర్మం వదులవుతుంది పొడిగా ఉండే చర్మంలో దురదలు వస్తాయి. (అక్కడి గ్రంథుల సంఖ్య తగ్గడం వల్ల). స్వేదగ్రంథుల సంఖ్య తగ్గడంతో చెమటలు తగ్గి శరీరాన్ని చల్లబరిచే గుణం క్రమంగా తగ్గుతుంది శరీరంపై ఉండే వెంట్రుకలు క్రమంగా తెల్లబడతాయి. హార్మోనల్ మార్పుల వల్ల తలపై (మాడు భాగంలోని) వెంట్రుకలు క్రమంగా పలచబడతాయి. ఈ మార్పు స్త్రీ, పురుషులిద్దరిలోనూ చోటుచేసుకుంటుంది ఇక స్త్రీలలో అవాంఛనీయమైన వెంట్రుకల పెరుగుదల ఎక్కువవుతుంది. (ఈస్ట్రోజెన్ తగ్గడం వల్ల) గోళ్ల చివర అర్థచంద్రాకారంలో ఉండే తెల్లటి భాగం క్రమంగా మాయమైపోయి, గోళ్లపై చిన్న చిన్న గాట్ల వంటివి ఏర్పడుతుంటాయి. అయితే పై మార్పులు కొందరిలో ఇరవైలలో కాకుండా నలభైల్లోకి వచ్చే వరకూ ప్రారంభం కావు. ఇక కొందరిలో వయసు పెరగడం అనే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. దీనికీ జన్యువులే కారణం. ఈ కండిషన్‌ను ‘వీనర్స్ సిండ్రోమ్’ అంటారు. ఈ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో వెంట్రుకలు టీనేజ్లోనే తెల్లబడతాయి. ముప్ఫయిలలో క్యాటరాక్ట్ వస్తుంది. వారి బతికేది గరిష్ఠంగా 40 ఏళ్ల వరకు మాత్రమే. ఇక ‘ప్రొజీరియా’ అనే కండిషన్ ఉన్నవారిలో సైతం వయసు పైబడే ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. వీరిలో జుట్టురంగు, చర్మం, గోళ్లు అన్నింట్లోనూ మార్పులు వస్తాయి. వయసు పైబడినప్పుడు జరిగే మార్పులు వారి అంతర్గత అవయవాల్లోనూ చోటుసుకుంటాయి. ప్రోజీరియా వచ్చిన పదేళ్ల కుర్రాడు 50 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తాడు. వాళ్లు కూడా 12-15 ఏళ్లు మాత్రమే. వయసు పైబడటానికి బయటి కారణాలు (ఎక్స్ట్రిన్సిక్) వయసు పైబడినట్లుగా కనిపించడానికి అనేక బయటి కారణాలు దోహదం చేస్తాయి. వాటిలో ముఖ్యమైనవి... ఈ సూర్యుడికి ఎక్స్పోజ్ కావడం : సూర్యుడి కిరణాలకు ఎక్స్పోజ్ కావడం వల్ల చర్మం కొన్ని మార్పులకు గురవుతుంది. కమిలినట్లుగా మారడం, ప్రెకిల్స్ (చిన్న చుక్కల్లా కనిపించే గోధుమ రంగు మచ్చలు), ఏజ్ స్పాట్స్, చర్మంపై సన్నటి ముడుతలు కనిపిస్తాయి. చర్మాన్ని సాగదీసినప్పుడు ఇవి మాయమౌతాయి. కొన్ని సందర్భాల్లో కాస్త ఎర్రగా, గరుకుగా కనిపించే పులిపిరి కాయల్లాంటి యాక్టినిక్ కెరటోసిస్ వల్ల వయసు ఉన్నదాని కంటే ఎక్కువగా కనిపిస్తుంది. ఇది తర్వాతి దశలో చర్మ క్యాన్సర్‌కూ దారితీయవచ్చు. సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం వల్ల వయసు పైబడినట్లుగా మారడాన్ని ‘ఫొటో ఏజింగ్’ అంటారు. ఒకరి చర్మం ఫొటో ఏజింగ్‌కు గురికావడం అన్నది మళ్లీ ఆ వ్యక్తి చర్మపు రంగుతో పాటు అతడు ఎంతసేపు ఎండవేడికి ఎక్స్పోజ్ అవుతున్నాడనే అంశాలపై ఆధారపడి ఉంటుంది. ఫెయిర్‌గా (తెల్లటి/ఎర్రటి చర్మపు రంగుతో) ఉండేవారికి చర్మంలో మెలనిన్ అనే పదార్థం తక్కువగా ఉంటుంది. అందుకే వీళ్లు సూర్యరశ్మి ప్రభావానికి ఎక్కువగా గురవుతుంటారు. ఇక చర్మం డార్క్‌గా మారుతున్న కొద్దీ పై దుష్ర్పభావాలు తగ్గుతాయి. సూర్యరశ్మి తాలూకు దుష్ర్పభావాలకు చర్మం గురికావడం అన్నది కాలక్రమేణా జరుగుతుంటుంది. దీనివల్ల చర్మం నల్లబడటం, మందంగా మారడం, ముడుతలు పడటం జరుగుతుంది. అదేపనిగా సూర్యుడికి ఎక్స్పోజ్ కావడం వల్ల పై మార్పులన్నీ శాశ్వతం అయ్యే అవకాశమూ ఉంది. అందుకే వేడి ప్రదేశాల్లో నివసించేవారిలో ఏజింగ్ మార్పులన్నీ వారి ఇరవైలలోనే కనిపించడం మొదలవుతుంది. సూర్యరశ్మివల్ల కలిగే ఏజింగ్ ప్రక్రియ నివారణకు.. సూర్యరశ్మికి ఎక్స్పోజ్ కావడం వల్ల వయసు పైబడినట్లుగా కనిపించడానికి దోహదం చేసే చర్మంలోని మార్పులను నివారించడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలివి... ఈ ఎండ సమయంలో అంటే... ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్య వీలైనంతగా సూర్యరశ్మికి గురికాకుండా చూసుకోవడం . సూర్యరశ్మిలోకి వెళ్లినప్పుడు సూర్యకిరణాలు నేరుగా తాకకుండా, చర్మాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు (అంటే పొడవుచేతుల చొక్కాల వంటివి) ధరించాలి. ముఖంపూర్తిగా కప్పుకుపోయేలా వెడల్పాటి అంచు ఉండే హ్యాట్ పెట్టుకోవాలి. నిత్యం బయటికి వచ్చే ముందర సన్‌స్క్రీన్ రాసుకోవడం. అందునా ఎస్పీఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే సన్‌స్క్రీన్‌ను బయటికి రావడానికి 20 నిమిషాల ముందే రాసుకోవాలి. బయటికి వచ్చాక కూడా ప్రతి 3 గంటలకు ఒకమారు ఈ సన్‌స్క్రీన్‌ను రాసుకుంటూ ఉండాలి. స్విమ్మింగ్‌కు వెళ్తున్నప్పుడు లేదా ఎక్కువగా చెమట పడుతుందనుకున్నప్పుడు తడికి తట్టుకోగల (వాటర్ రెసిస్టెంట్) సన్‌స్క్రీన్‌ను ఉపయోగించాలి. చికిత్స : సూర్యరశ్మికి గురై నష్టపోయిన చర్మానికి లేజర్ టోనింగ్, మైక్రో డర్మా అబ్రేషన్, డర్మారోలర్, కెమికల్ పీలింగ్, లేజర్ రీ-సర్ఫేసింగ్ వంటి చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా, మీసోథెరపీ, ఫైన్ థ్రెడ్ లిఫ్టింగ్ ప్రక్రియల వంటివి అత్యాధునికమైనవి. చికిత్స కోసం చాలా సమయం వెచ్చించలేనివారికి బొటాక్స్, ఫిల్లర్స్ అనే ప్రక్రియలు కూడా ఉన్నాయి. భూమ్యాకర్షణ శక్తి (గ్రావిటీ)కి గురికావడం : మనం ప్రతి నిత్యం భూమ్యాకర్షణ శక్తికి గురవుతూనే ఉంటాం. అనుక్షణం మనల్ని అది కిందికి లాగుతూ ఉంటుంది. దీని ప్రభావం వల్ల మన చర్మంలో కనిపించే మార్పులను 50 ఏళ్లకు పైబడిన వారిలో చూడవచ్చు. ఎందుకంటే వారిలో చర్మం భూమ్యాకర్షణ శక్తికి లోబడి కిందికి వేలాడుతున్నట్లు కనిపిస్తుంది. ఈ చర్మంపై గ్రావిటీ దుష్ర్పభావాల నివారణ ఇలా: క్రమం తప్పకుండా వ్యాయామం, పుష్టికరమైన ఆహారం వల్ల మన ముఖంలోని చర్మం ఎలాస్టిసిటీని కోల్పోకుండా ఉంటుంది. ముఖంపై పడే సన్నటి ముడుతలు (రింకిల్స్)ను సరిచేయడానికి బొటాక్స్‌తో, చెంపల వద్ద గుంటలు పడటాన్ని ఫిల్లర్స్ చికిత్సతో సరిచేయడానికి అవకాశం ఉంది. ఇప్పుడు శస్త్రచికిత్స అవసరం లేకుండానే ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియను ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా థెరపీతో సాధించవచ్చు. నిద్రలో ముఖాన్ని ఉంచే పొజిషన్ వల్ల కనిపించే ఏజింగ్ : మన ముఖాన్ని ఒక పక్కకు ఒరిగి ఉండేలా నిత్యం పడుకోవడం వల్ల ముఖంలో ఒకవైపు గీతలు పడతాయి. వీటిని ‘స్లీప్లైన్స్’ అంటారు. ఇవి నిద్రలో ముఖం వాలి ఉండే వైపునకు ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కూడా వయసు పైబడి కనిపిస్తుంటుంది. పొగతాగడం వల్ల : ఈ దురలవాటుతో దేహంలోకి ప్రవేశించే విషపదార్థాల కారణంగా శరీరంలో ఎన్నో జీవరసాయన మార్పులు చోటుచేసుకుంటాయి. ఒక అధ్యయనం ప్రకారం రోజుకు 10 కంటే ఎక్కువ సిగరెట్లు తాగేవారిలో... 10 ఏళ్ల తర్వాత ముఖం మీద రావాల్సిన ఏజింగ్ ముడుతలు పదేళ్ల కంటే ముందుగానే వస్తాయని తెలిసింది. పైగా సిగరెట్ల సంఖ్య పెరుగుతున్న కొద్దీ ఈ ముడుతల లోతు కూడా పెరుగుతూ పోతుంది. మితిమీరిన ఫేఫియల్ వ్యాయామాలు : కొందరు ముఖ (ఫేషియల్) వ్యాయామాలు చేస్తూ ఉంటారు. అయితే మితిమీరి చేసే ఫేషియల్ వ్యాయామాల వల్ల కూడా ముఖం... వయసు కంటే ముందే ఏజింగ్‌కు గురవుతుందని తేలింది. -నిర్వహణ: యాసీన్ ఏజింగ్ దుష్పరిణామాల నివారణకు సూచనలు... ఈ మనం సమతుల ఆహారం తీసుకోవాలి. మనం తినే ఆహారపు జాబితాకి రంగురంగుల పండ్లను, కూరగాయలను చేర్చాలి. మన ఆహారంలో ఏజింగ్‌ను నివారించే క్యాటర్, బీట్రూట్, కలర్డ్ కాప్సికమ్, ఆరంజెస్, నిమ్మజాతి పండ్లు, స్ట్రాబెర్రీస్, బొప్పాయి పండ్లు, జామ, పుచ్చకాయలను ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వ్యాయామం, యోగా చేయాలి మన భావ వ్యక్తీకరణను ముఖం ద్వారా చేయడాన్ని తగ్గించాలి. (ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్స్‌ను వీలైనంతగా తగ్గించాలి) స్క్రబ్బింగ్‌ను కూడా వీలైనంతగా తగ్గించుకోవాలి వీలైనంతగా ఒకపక్కకు ఒరిగి కాకుండా, పడకకు వీపును ఆనించే నిద్రపోవాలి రోజుకు రెండుసార్లు ముఖం కడుక్కోవాలి. మరీ ఎక్కువ వేడినీటితో ముఖం కడుక్కోవడం, స్నానం చేయడాన్ని నివారించాలి. ఇందుకోసం గోరువెచ్చని నీటిని లేదా చల్లటి నీటినే ఉపయోగించాలి ప్రతిరోజూ మాయిష్చరైజర్ను వాడాలి ఈ డాక్టర్ సలహా లేకుండా ముఖానికి పూసుకునే ఓవర్ ద కౌంటర్ సౌందర్యసాధనాలన్నింటినీ మానేయాలి. కేవలం డాక్టర్ సలహాతోనే వాటిని వాడాలి. డాక్టర్ స్మిత ఆళ్లగడ్డ ఛీఫ్ డర్మటాలజిస్ట్ త్వచ స్కిన్ క్లినిక్ గచ్చిబౌలి, హైదరాబాద్