హోమియో...హామీలు! | April 10 world Homeopathic Day | Sakshi
Sakshi News home page

హోమియో...హామీలు!

Published Mon, Apr 7 2014 11:25 PM | Last Updated on Wed, Jun 13 2018 8:02 PM

April 10 world Homeopathic Day

ఏప్రిల్ 10 పపంచ హోమియో దినం

ఉష్ణం ఉష్ణేన శీతలం, వజ్రాన్ని వజ్రమే కోస్తుంది లాంటివి మన సామెతలే. వీటిని  చాలాసార్లు వినే ఉంటారు. కానీ శామ్యూల్ హనీమన్ మహనీయుడు ఆ సిద్ధాంతాలను చికిత్స ప్రక్రియకు అన్వయింపజేశాడు. అలా అందరికీ అందుబాటులో ఉండే చవకైన, సులభమైన ఒక కొత్త చికిత్స ప్రక్రియకు నాంది పలికాడాయన. చాలా మందికి చికిత్స అంటే భయం. మరెంతో ఆందోళన. చేదు మందుల్ని మింగాల్సి వస్తుందనీ, మేని కోతల్ని భరించాల్సి వస్తుందనే బెంగ. వీటన్నింటినీ దూరం చేస్తూ... ‘‘రోగి కోరేదీ... వైద్యుడిచ్చేదీ ఒకటే అయితే...’’ అనే మనదైన మరో సామెతనూ నిజం చేసేలా మందుల్ని రూపొందించాడాయన. ఈ నెల 10న ఆయన పుట్టిన రోజు.
 దీన్ని ప్రపంచ హోమియో దినంగా జరుపుకుంటున్న సందర్భంగా... ఈ చికిత్స ప్రక్రియపై అవగాహనతో పాటు... మనకు రోజూ కనిపించే అనేక చిన్న చిన్న సమస్యలకు పరిష్కారాల కోసమే ఈ ప్రత్యేక కథనం.

 
 మీ హోమియో కిట్...
 జ్వరాలు (ఫీవర్స్)
 అనేక రుగ్మతలకు జ్వరం ఒక లక్షణం మాత్రమే. హోమియోలో లక్షణాల ఆధారంగా మందును నిర్ణయిస్తారు కాబట్టి జ్వరంతో పాటు ఆయా లక్షణాలను బట్టి వాడాల్సిన మందును నిర్ణయించుకోవచ్చు.
 
 బెల్లడోనా: అకస్మాత్తుగా జ్వరం, ఒళ్లునొప్పులు, వ్యక్తిగత లక్షణాల విషయానికి వస్తే... అతి ప్రేమ-ఆప్యాయతలు కనబరచడం, కోపం వంటి లక్షణాలు ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఇక పులుపు ఎక్కువగా ఇష్టపడేవారూ, జ్వరం వచ్చినప్పుడు ముఖం ఎర్రగా మారిపోయేవారికి ఇది మంచి మందు.
 
 అకోనైట్: తీవ్రమైన జ్వరం (హైఫీవర్), అతి భయం, చిన్న విషయానికే ఎక్కువగా ఆందోళన చెందడం, తలనొప్పితో బాధపడటం, మాటిమాటికీ దగ్గు, జలుబు, జ్వరం రావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు.
 
 క్యాంథరిస్: తరచూ మూత్రంలో మంట వల్ల తీవ్రమైన జ్వరం (హై ఫీవర్), విపరీతమైన కోపం, చలిజ్వరం, మూత్రంలో మంటరావడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వాడాలి. మందు తీసుకున్న నాలుగు గంటల్లో జ్వరం తగ్గుతుంది.
 
 చైనా: మాటిమాటికీ చలిజ్వరం , సాయంకాలం జ్వరం, అన్ని విషయాలపై అసంతృప్తిగా ఉండటం, శబ్దాలను భరించలేకపోవడం లాంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో నాలుగు వారాలు వాడటం వల్ల జ్వరం మళ్లీ మళ్లీ తిరగబెట్టకుండా ఉంటుంది.
 
 బాప్టీషియా: లోజ్వరం, దీర్ఘకాలం జ్వరం కొనసాగడం వల్ల రక్తం విషపూరితం కావడం, దాహం తక్కువగా ఉండటం, చెమట వాసనతో ఉండటం లాంటి లక్షణాలు ఉంటే ఈ మందు వాడవచ్చు.
 
 ఆర్సినిక్ ఆల్బమ్: చలిజ్వరం, అతి దాహం, జ్వరం వచ్చినప్పుడు నిద్రలేకపోవడం, అర్ధరాత్రి నిద్రలేవడం, జ్వరం వచ్చినప్పుడు ఎవరితో మాట్లాడకపోవడం, భయపడటం, అభద్రతా భావం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉదయం-సాయంకాలం ఒక డోసు వాడితే జ్వరం తగ్గిపోతుంది.
 
 రస్టాక్స్: జ్వరంతో పాటు విపరీతమైన ఒళ్లునొప్పులు, నాలుక తడారిపోవడం, చలి ఎక్కువగా ఉండటం, నిద్రలేకపోవడం వంటి లక్షణాలకు ఈ మందును 200 పొటెన్సీలో ఒక్క డోసు వాడాలి.
 
 స్పంజియా: తరచూ జలుబు, పసుపు రంగులో గల్ల (కళ్లె) పడటం, ఉదయం దగ్గురావడం, వేడిని తట్టుకోలేకపోవడం, జ్వరం, పొడి దగ్గు, గొంతు నొప్పి, దగ్గుతో తెమడ పడటం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో రోజుకు రెండుసార్లు వాడవచ్చు.
 
 సిలిసియా: ముక్కులు బిగుసుకుపోవడం, చలిగా ఉండటం, ఒళ్లంతా వణుకుతో జ్వరం, కాళ్లూ-చేతులు చల్లబడటం, ఎక్కువ చెమట వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు.
 
 పల్సటిల్లా: రోజు విడిచి రోజు జ్వరం రావడం, చలి తర్వాత వేడిగా అనిపించడం, దాహం లేకపోవడం, జలుబు వల్ల వాసన తెలియకపోవడం, ఆకలి లేకపోవడం, తలనొప్పి వంటి శారీరక లక్షణాలతో పాటు సున్నిత స్వభావం కలిగి ఉండటం వంటి లక్షణాలు న్నవారికి ఈ మందును 200 పొటెన్సీలో ఇవ్వవచ్చు.
 
 కాలీ సల్ఫ్: రాత్రివేళల్లో తీవ్రమైన జ్వరం (హై ఫీవర్) రావడం, తరచూ జ్వరం తిరగబెడుతుండటం, నాలుక పసుపురంగులో ఉండటం, త్వరగా కోపం రావడం, చిరాకుగా ఉండటం, ముక్కులు బిగదీసుకుపోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో వారం రోజుల పాటు వాడాలి.
 
 అలోయేస్: నీళ్ల విరేచనాలతో జ్వరం రావడంతో పాటు వేడిని తట్టుకోలేకపోవడం, అందరిపై ఆధిపత్యధోరణి వంటి లక్షణాలు కలిగి ఉన్నవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. వేసవిలో పై లక్షణాలతో జ్వరం వస్తే ఇది చాలా మంచి మందు.


 పోడోఫిల్లమ్: దాహం తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం, విరేచనాలు కావడంతో పాటు కడుపునొప్పిగా ఉండటం, ఫుడ్‌పాయిజనింగ్ వంటి సందర్భాల్లో ఈ మందు బాగా పనిచేస్తుంది.
 
 కోలోసింథిస్: కడుపునొప్పి రావడం, విరేచనాలు కావడం, ఏది తిన్నా /తాగినా విరేచనాలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు.
 
 జలుబు
 నక్స్‌వామికా:  తరచూ వచ్చే దగ్గు, జలుబు, తుమ్ములు, విపరీతమైన విసుగు, చలిని తట్టుకోలేకపోవడం కనిపిస్తే నక్స్‌వామికా 30 పొటెన్సీలో తీసుకోండి.
 
 ఆర్సెనికమ్ ఆల్బమ్: తరచూ విపరీతంగా తుమ్ములు వస్తూ, దుమ్మూ-ధూళికి గురికాగానే అవి మరింత ఎక్కువ కావడం, అతిశుభ్రత, నిత్యం అపనమ్మకంతో పాటు, చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా ఆలోచించడం వంటి లక్షణాలుంటే 30 పొటెన్సీలో తీసుకోవాలి.
 
 బొవిస్టా: విపరీతమైన తుమ్ములు, జ్వరం వచ్చినట్లుగా ఉండటం, ఏ పనిపైనా ధ్యాస లేకపోవడం, కొంచెం అమాయకత్వం, వేడిని తట్టుకోలేకపోవడం, దాహం తక్కువగా ఉండటం లాంటి లక్షణాలుంటే దీన్ని 30 పొటెన్సీలో  వాడుకోవచ్చు.
 
 సిలిసియా: జలుబు వల్ల తల బరువుగా ఉండటం, గళ్ల (కళ్లె) పసుపురంగులో పడటం, పనిలో ఎక్కువగా శ్రద్ధ చూపే గుణం ఉండటం, మొహమాటం ఎక్కువగా ఉండటం వంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు.
 
 అల్లియమ్ సెపా: విపరీతమైన తుమ్ములతో పాటు కళ్ల నుంచి నీళ్లు కారడం, ముక్కు కారడం, తలనొప్పిగా ఉండటం, దగ్గు రావడం వంటి సమస్యలుంటే ఈ మందును 200 పొటెన్సీలో ఉపయోగించవచ్చు.
 
 తలనొప్పి
 నేట్రమ్ మూర్: ఎండలో ఎక్కువగా తిరిగితే వచ్చే తలనొప్పికి ఈ మందును వాడవచ్చు.
 
 బెల్లడోనా: అకస్మాత్తుగా తలనొప్పి రావడంతో పాటు ప్రతి చిన్న విషయానికీ కోపం రావడం, తలనొప్పి వల్ల ముఖం ఎర్రగా మారడం వంటి లక్షణాలున్నవారికి ఇది మంచి మందు.
 
 స్పైజీలియా: తలనొప్పి వల్ల కళ్లనొప్పి కూడా రావడం, కళ్లు బరువుగా అనిపించడం, జ్వరం రావడం, సూది మందుకు త్వరగా భయపడటం, ఎడమవైపు నొప్పి, ఎండలో తలనొప్పి, మైగ్రేన్ వంటి తలనొప్పికి ఈ మందు చక్కగా పనిచేస్తుంది.
 
 బ్రయోనియా ఆల్బ్: తలనొప్పి చాలా తీవ్రంగా ఉంటుంది. తలపై సుత్తితో కొట్టిన భావన. చాలా చికాకుగా అనిపిస్తుంది. ఎండాకాలంలో వచ్చే సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది.
 
 సాంగ్యునేరియా: కుడివైపు తలనొప్పి విపరీతంగా ఉండటం, ఉదయం తలనొప్పి ఎక్కువగా ఉంటూ, రాత్రివేళ తక్కువగా ఉండటం, వేడిని తట్టుకోలేకపోవడం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందు చక్కగా పనిచేస్తుంది.
 
 కడుపునొప్పి
 కడుపునొప్పి ఉన్నవారు, ఇతర లక్షణాలనూ పరిగణనలోకి తీసుకుని ఈ మందులను వాడుకోవచ్చు.
 
 న్యాట్‌ఫాస్: కడుపులో మంట, గ్యాస్ ట్రబుల్, ఎక్కువగా మసాలాలు తినడం వల్ల వచ్చే గ్యాస్ సమస్యలతో పాటు మొహమాటం ఎక్కువగా ఉండేవారికి ఇది మంచి మందు.
 
 నక్స్‌వామికా: మాంసాహారం ఎక్కువగా తినడం వల్ల వచ్చిన గ్యాస్ సమస్యకు ఇది మంచి మందు. కోపం ఎక్కువగా రావడం, టైమ్‌కు ఆహారం తీసుకోకపోవడం వంటి వారికి ఈ మందును 30 పొటెన్సీలో ఇవ్వడం వల్ల మంచి గుణం కనిపిస్తుంది.
 
 సీనా: కడుపులో నులిపురుగులు (వార్మ్స్ ఉండటం వల్ల వచ్చిన కడుపునొప్పికి ఇది మంచి మందు. కోపంతో ఉండే స్వభావం ఉన్నవారికి దీన్ని సూచించాలి.
 
 కొలోసింథ్: మహిళల్లో రుతుస్రావం సమయంలో వచ్చే కడుపునొప్పికి ఇది బాగా పనిచేస్తుంది. విపరీతమైన కడుపునొప్పితో పాటు, రక్తస్రావం ఎక్కువగా కనిపించేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది.
 
 వడదెబ్బ
 వేసవిలో వడదెబ్బ చాలా తరచూ కనిపించే సమస్య. దీనికోసం మందులివే...
 గ్లోనైన్: వేడిని తట్టుకోలేకపోవడం, రక్తపోటు ఎక్కువ కావడం, తలనొప్పిగా ఉండటం లాంటి సమస్యలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి.
 
 నేట్రమ్ మూర్: వడదెబ్బకు లోనైన ఫీలింగ్ ఉన్నప్పుడు ఈ వ్యక్తిగత లక్షణాలను సరిచూసుకుని ఈ మందువాడాలి. అవి... ఎవరితోనూ ఎక్కువగా మాటలాడకపోవడం, పనులపైనా ఎప్పుడూ అసంతృప్తితో ఉండటం, నీరసంగా ఉండటం, తరచూ రక్తపోటు హెచ్చుతగ్గులకు లోనవుతూ ఉండటం వంటి సమస్యలున్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు.
 
 జెల్సీమియమ్: వేడిని తట్టుకోలేకపోవడం, అతి భయం, అన్ని విషయాలకూ ఆతృత పడటం, ప్రతి చిన్న విషయానికీ ఆందోళన చెందడం, ఎండలోకి వెళ్తే కళ్లు తిరగడం, నీరసంగా ఉండటం... వంటి లక్షణాలు ఉంటే ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవాలి.
 
 నేట్-కార్బ్: ఎండలోకి వెళ్తే దద్దుర్లలా కనిపించడం, కళ్లు తిరగడం, వాంతులు రావడం, ఎండలోకి వెళ్లగానే తలనొప్పి రావడం వంటి లక్షణాలు కనిపిస్తుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడుకోవచ్చు.
 
 ఓపియమ్: అతిసున్నితత్వం, ఏ విషయంపైనైనా త్వరగా స్పందించడం వంటి లక్షణాలున్నవారికి ఇది బాగా పనిచేస్తుంది. దీంతో పాటు... ఎండలోకి వెళ్లి తిరిగి రాగానే నీరసంగా ఉండటం, అతినిద్ర, త్వరగా అలసిపోవడం, ఊబకాయం ఉన్నవారికి వడదెబ్బ రాకుండా నివారించేందుకు కూడా ఈ మందు బాగా పనిచేస్తుంది. దీన్ని 200 పొటెన్సీలో వాడుకోవచ్చు.
 
 క్యాంఫర్: ఎండలోకి వెళ్లగానే కళ్లు తిరగడం, శరీరం, చేతులూ చల్లబడటం, చలికాలంలో హుషారుగా ఉండి, వేసవిలో నీరసంగా ఉండటం వంటి లక్షణాలుండేవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు.  
 
 చర్మంపై కనిపించే అలర్జీలు

 కొందరికి పడని వస్తువులు తారసిల్లిన వెంటనే దాని గుణం చర్మంపై ప్రతిఫలిస్తుంది. అప్పుడు వాడాల్సిన మందులివి...
 
 సల్ఫర్: చర్మవ్యాధులకు ఇది మంచి మందు. అకస్మాత్తుగా ఒంటిపై దద్దుర్లు రావడం, ఆర్టికేరియా ర్యాష్, దద్దుర్లు పెద్దవి కావడం, దురద వంటి లక్షణాలు కనిపిస్తే ఈ మందును 200 పొటెన్సీలో వారానికి ఒకసారి తీసుకోవాలి.
 
 నేట్-మూర్: ఎండలోకి వెళ్తే దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో తీసుకోవడం వల్ల ఉపయోగం ఉంటుంది.
 
 డల్కమారా:
వర్షాకాలంలో వచ్చే చర్మ సమస్యలకు ఈ మందు బాగా పనిచేస్తుంది. దద్దుర్లు పెద్దగా ఉండటం, వర్షంలో తడిసిన తర్వాత దద్దుర్లు రావడం వంటి లక్షణాలు ఉన్నవారు ఈ మందును 200 పొటెన్సీలో వాడవచ్చు.
 
 గ్రాఫైటిస్: గ్యాస్ట్రిక్ సమస్యలతో పాటు చర్మ సమస్యలు వచ్చే వారికి ఈ మందు బాగా పనిచేస్తుంది. త్వరగా ఏడ్వటం, సున్నితమైన స్వభావం, లావుగా ఉండేవారికి ఈ మందు బాగా ఉపయోగపడుతుంది.
 
 హెపార్ సల్ఫ్: చలికి తట్టుకోలేకపోవడం, దురద ఎక్కువగా ఉండటంతో పాటు దద్దుర్లు రావడం, తొందరపాటు ఎక్కువగా ఉండటం, విపరీతమైన కోపం రావడం వంటి లక్షణాలు ఉన్నవారికి ఇది మంచి మందు.
 
 ఏయే దేశాల్లో ఉంది?


 ప్రపంచంలో అనేక దేశాల్లో ప్రత్యామ్నాయ ఔషధంగా హోమియోవైద్యం అందుబాటులో ఉంది. అన్నింటికంటే యూరప్ దేశాలల్లో హోమియో వాడకం ఎక్కువగా ఉంటోంది. అందులో ఫ్రాన్స్‌ది మొదటిస్థానం. ఇంగ్లండ్ రాజకుటుంబం హోమియోవైద్యాన్ని కూడా అనుసరిస్తున్నట్లు సమాచారం. జర్మనీ, స్విట్జర్లాండ్, ఇటలీ, నెదర్లాండ్స్, అమెరికా, బ్రెజిల్, అర్జెంటీనా, ఇండియా, పాకిస్తాన్, శ్రీలంక, రష్యా, మెక్సికో దేశాలు హోమియో మందులను ఎక్కువగా ఉపయోగిస్తున్నాయి.
 
 పొటెన్సీ అంటే...


 హోమియో మందుల మోతాదును పొటెన్సీ అనే ప్రమాణం ద్వారా నిర్ణయిస్తారు. హోమియో మందుల్లో ఉన్న సామర్థ్యానికి (పవర్‌కు) పొటెన్సీ అన్నది ఒక సూచిక. హోమియో మందులో ప్రతి మందుకూ ఒక అత్యద్భుత శక్తి (డైనమిక్ పవర్) ఉంటుంది. ఏ జబ్బు తీవ్రతకు ఎంత మేరకు శక్తి కలిగిన మందు ఇవ్వాలన్నది హోమియో వైద్యులు నిర్ణయిస్తారు. జబ్బు తీవ్రతను బట్టి 200, 30, 1ఎమ్ అనే పొటెన్సీల్లో (మోతాదుల్లో) మందులు ఇస్తారు.
 
 రోగి చేయాల్సిన పథ్యం...


 హోమియో మందులు తీసుకునే వారు ఎలాంటి పథ్యాన్నీ చేయనవసరం లేదు. ఎందుకంటే రోగికి వచ్చిన జబ్బును బట్టి అతడిలోని వ్యాధిని తొలగించడానికి ఇచ్చే మందు ఒక అంతర్గత శక్తిలా పనిచేస్తుంది. దీన్ని ఎలాంటి ఆహారాలూ అవరోధించలేవు. కాబట్టి హోమియో మందులకు ఎలాంటి పథ్యనియమాలూ పాటించాల్సిన అవసరం లేదు.
 
 హోమియో మందులు ఎలా పనిచేస్తాయి?


 హోమియో మందు ఎలా పనిచేస్తుందన్న విషయం తెలుసుకోడానికి హానీమన్ అనుసరించిన మార్గాన్ని పరిశీలిస్తే చాలు. సింకోనా అనే మొక్క బెరడును తింటే వాంతులు అవుతాయి. చలిజ్వరం వస్తుంది. ఇదే సిద్ధాంతాన్ని రివర్స్ చేస్తే ఎలా ఉంటుందని హనీమన్ పరిశీలించారు. చలిజ్వరంతో బాధపడుతున్న ఒక వ్యక్తికి హనీమన్ చాలా కొద్ది మోతాదులో సింకోనా బెరడును ఇచ్చారు. తత్ఫలితంగా ఒక అద్భుతం ఆవిష్కృతమైంది. ఆ వ్యక్తికి చలిజ్వరం తగ్గింది. ఏదైనా జబ్బుకు కారణమయ్యే అంశాన్ని చాలా కొద్ది మోతాదుల్లో ఇస్తే ఆ జబ్బు తగ్గుతుందనేది హోమియో ప్రధాన సిద్ధాంతం. ఈ అంశాన్ని ఆధారం చేసుకుని హానీమన్ ఎన్నో మొక్కలనుంచి, జంతువులనుంచి ఔషధగుణాలున్న రసాయనాలను సేకరించారు. అలాగే ఖనిజ లవణాలనుంచీ స్వీకరించి పరిశీలించారు. అలా ఎన్నో జబ్బులకు మందులను రూపొందించారు. కాబట్టి స్థూలంగా మనకు కనిపించే చక్కెర గోలీలు, వాహికగా పనిచే ఆల్కహాల్ ఒకటే అయినా... అందులో కలిపే మందు మాత్రం వేర్వేరుగా ఉంటుంది.
 
 హోమియోపతి గురించి కొన్ని వాస్తవాలు!


 హోమియోపతిలో సిద్ధాంతాలు స్థిరంగా ఉంటాయి. తరచూ అభిప్రాయాలు మారడం ఇందులో ఉండదు.
     
 హోమియోపతి అనేది శాస్త్రీయత, సృజనాత్మకతల సమ్మేళనం.
     
 హోమియోపతి ఆధారపూర్వకమైన ప్రయోగాత్మకమైన ఔషధం.
     
 హోమియోపతి మందులు శరీరానికి సహజంగా ఉండే వ్యాధి నిర్మూలన శక్తిని ఉద్దీపన చేస్తాయి. శరీరానికి ఉన్న వ్యాధి నిర్మూలన శక్తిని పెంచడానికి దోహదం చేస్తాయి.
     
 ఈ వైద్యంలో అప్పుడు బాధిస్తున్న వ్యాధిని నిర్మూలించడమే కాక దేహమంతటినీ చైతన్యవంతం చేయడానికి ప్రయత్నం జరుగుతుంది.
     
 ఈ మందులతో ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవు, పైగా వీటిని ఎన్ని రోజులు వాడినా ఎప్పుడైనా మానేయవచ్చు. దేహానికి ఒకసారి అలవాటు చేస్తే ఇక తప్పని సరిగా కొనసాగించాలనే పరిస్థితి ఉండదు.
     
 కొన్ని ఇతర మందులు వ్యాధిని తగ్గించాక దేహంలో వ్యర్థాలను మిగులుస్తుంటాయి. వాటిని బయటకు పంపడం మరో ప్రక్రియ. హోమియోమందులతో అలాంటి ఇబ్బందులు ఉండవు. ఇవి ఏ విధమైన వ్యర్థాలనూ దేహంలో వదలవు.
     
 ఈ శాస్త్రం గురించి నిపుణులు రాసిన పుస్తకాలు మార్కెట్‌లో అందుబాటులో ఉంటాయి. సామాన్యులకు ప్రాథమిక అవగాహన కల్పించే విధంగా అర్థమయ్యేరీతిలో రాసినవే ఇవన్నీ.
 
  త్వరగా తగ్గే అవకాశాలూ ఉంటాయి...


 సాధారణంగా హోమియో మందులు చాలా ఆలస్యంగా తమ ఫలితాలను కనబరుస్తాయనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో కొంతవరకూ ఇది నిజమే అయినా హోమియో చికిత్స ద్వారా కొన్ని వ్యాధుల విషయంలో చాలా త్వరగా గుణం కనిపిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో ఈ ఆలస్యం జరగడానికి కారణం... చాలామంది చాలాకాలం పాటు అనేక వైద్య విధానాలను ప్రయత్నించి రోగాన్ని ముదరబెట్టుకుని, అప్పుడు హోమియో విధానానికి వస్తారు. అలాంటి సందర్భాల్లో జబ్బు నయం కావడంలో ఆలస్యం జరగడం మామూలే. వ్యాధి అంతగా ముదరకముందే వస్తే నయం కావడం కూడా త్వరగానే జరుగుతుంది.
 
 జబ్బు దానంతట అదే నయం అయ్యిదంటే కాస్త ఆలోచించాల్సిందే...


 కొన్ని జబ్బులు వయసు పెరుగుతున్న కొద్దీ వాటంతట అవే తగ్గుతాయని ఇంగ్లిష్ విధానంలో డాక్టర్లు చెబుతుంటారు. కానీ హోమియో విధానం ప్రకారం అది పూర్తిగా వాస్తవం కాదు. ఉదాహరణకు చిన్నప్పుడు వచ్చే ఉబ్బసం (ఆస్తమా) కొందరిలో వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతుందని ఇంగ్లిష్ మందుల ప్రక్రియలో చెబుతుంటారు. కానీ హోమియో వైద్య విధానం ప్రకారం అది తగ్గకుండా ఇంకొక అంచెకు చేరుకుంటుంది. అంటే... అది గ్యాస్ట్రిక్ సమస్యగానో లేదా హార్మోన్ల అసమతౌల్యతకో దారితీయవచ్చు. అందుకే ఏదైనా సమస్య ఉన్నప్పుడు అది పూర్తిగా తొలగిపోయేలా చికిత్స జరగాలి. అందుకే హోమియో విధానంలో చికిత్స అన్నది వ్యాధికి జరగదు. వ్యక్తికి జరుగుతుంది. వ్యక్తికి జబ్బు తగ్గేలా చేయడం కంటే... అసలు ఆ వ్యక్తికి పూర్తి ఆరోగ్యం కలిగి జబ్బులన్నవే మటుమాయం అయ్యేలా చేసే ప్రక్రియే హోమియో.
 
 హోమియో సమర్థంగా తగ్గించిన వ్యాధులివి...


 ట్యూబర్‌క్యులోసిస్, సిఫిలిస్, గనేరియా, సోరా (స్కేబిస్), క్యాన్సర్, కుష్టువ్యాధులను హోమియో మందులతో సమూలంగా తగ్గించవచ్చు.
     
 19వ శతాబ్దంలో కలరా, టైఫాయిడ్ వ్యాధులు ఇతర మందులతో నియంత్రించలేని దశలో హోమియో మందులతో తగ్గాయి.
 
 హోమియో - అపోహలు - వాస్తవాలు
 అపోహ: హోమియో మందులు దీర్ఘకాలిక వ్యాధులను మాత్రమే నయం చేస్తాయి. జలుబు, జ్వరం వంటి సాధారణ అనారోగ్యాలకు పనిచేయవు.
 వాస్తవం: హోమియోపతి దీర్ఘకాలిక వ్యాధులను, స్వల్పకాలిక వ్యాధులను రెండింటినీ నయం చేస్తుంది. జలుబు, ఇన్‌ఫెక్షన్‌లు, జ్వరం, అతిసార వంటి వ్యాధులను సమర్థంగా నయం చేస్తుంది.
 
 అపోహ: హోమియోపతి మందులు నిదానంగా పనిచేస్తాయి.
 వాస్తవం: స్వల్పకాలిక అనారోగ్యాలకు తక్షణ చర్య ఉండేలా, దీర్ఘకాలిక వ్యాధుల విషయంలో వ్యాధిని సమూలంగా నిర్మూలించే ఉద్దేశంతోనూ మందులను రూపొందిస్తారు. ఆస్థ్మా, బ్రాంకైటిస్, ఆర్థరైటిస్, కిడ్నీ ఫెయిల్యూర్, ఆస్టియోపోరోసిస్, అధిక కొలెస్ట్రాల్, మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు, క్యాన్సర్ వ్యాధులకు ఇచ్చే మందుల పనితీరు తెలియడానికి కొంత కాలం పట్టే మాట నిజమే. ఇది కూడా ఒక వ్యక్తికి మరో వ్యక్తికీ మారుతుంది. వారి వారి వ్యాధి నిరోధక శక్తి, ఒత్తిడిని తట్టుకునేస్థాయి, జీవనవిధానం, ఆహారపు అలవాట్లు వంటి వాటి మీద కూడా ఆధారపడి ఉంటుంది.
 
 అపోహ: హోమియోపతి మందుల తయారీలో స్టెరాయిడ్స్ వాడతారు.
 వాస్తవం: హోమియోపతి మందులను మొక్కలు, జంతువుల నుంచి సేకరించిన సహజమైన పదార్థాలు, ఖనిజాలతో తయారు చేస్తారు. మొక్కలలో సహజంగా ఉండే ఆల్కలాయిడ్స్ వల్ల సత్ఫలితాలే తప్ప ఎటువంటి దుష్ర్పభావాలూ ఉండవని నిర్ధారణ అయింది.
 
 అపోహ: గర్భిణులకు హోమియో మందుల వల్ల హాని కలుగుతుంది.
 వాస్తవం: హోమియోపతి మందులు గర్భిణికి చక్కటి ఔషధం అని చెప్పాలి. అల్లోపతి మందుల వాడకం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కనిపించే వారికి చక్కటి ప్రత్యామ్నాయం హోమియో మందులే. గర్భిణిలో తల తిరగడం, రక్తహీనత, వెన్నునొప్పి, కండరాలు పట్టేయడం, వేవిళ్లు, గుండెలో మంట, అతిసార, రక్తపోటు, ఆందోళన, ఉద్వేగానికి లోనుకావడం వంటి సమస్యలకు హోమియో మందులు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా పనిచేస్తాయి. కడుపులో బిడ్డ పెరుగుదలకు కూడా హోమియో మందుల వాడకం శ్రేయస్కరమే.
 
 అపోహ:
హోమియో చికిత్సలో కీమోథెరపీ, రేడియేషన్ వంటి ప్రక్రియలు ఉండవు, కాబట్టి క్యాన్సర్ వంటి వ్యాధులకు హోమియోమందుల వల్ల ప్రయోజనం ఉండదు.
వాస్తవం: హోమియో మందులతో క్యాన్సర్‌ని సమర్థంగా నిర్మూలించిన సంఘటనలు అనేకం. క్యాన్సర్ రావడానికి మూలకారణాన్ని తెలుసుకుని, ఆ కారణానికి చికిత్స చేయడం ద్వారా క్యాన్సర్ వ్యాధి నయమవుతుంది.
 
 అపోహ:
ఇన్‌ఫెక్షన్ తగ్గాలంటే యాంటీ బయాటిక్స్ తప్ప మరో మార్గం లేదు.
 వాస్తవం: యాంటీ బయాటిక్స్ ఇన్ఫెక్షన్‌ని అణచివేస్తాయి, ఈ ప్రక్రియలో వ్యాధి కారణాన్ని కనుక్కునే ప్రయత్నం జరగదు. వ్యాధి కారక మైక్రోబ్స్‌ను చంపకపోగా వ్యాధి లక్షణాలు అణచివేయబడతాయి. యాంటీ బయాటిక్స్ వాడకం వల్ల కొంతమందిలో జీర్ణవ్యవస్థ అస్తవ్యస్తం కావడం, వికారం, అతిసార వంటి సైడ్‌ఎఫెక్ట్స్ కలుగుతుంటాయి. హోమియో మందులు వ్యాధి కారక క్రిములను నిర్మూలించడంతోపాటు దేహంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచుతాయి. కాబట్టి ఒకసారి హోమియో కోర్సు తీసుకున్న వారికి ఈ వ్యాధి మళ్లీ రావడానికి అవకాశాలు తక్కువ.
 
 అపోహ: హోమియోపతిలో మందులంటే చక్కెర గుళికలు మాత్రమే.
 వాస్తవం: హోమియోలోని చక్కెర గుళికలు మందును ఇముడ్చుకున్న రూపాలు మాత్రమే. హోమియో మందులలో మూడు వేల రకాల సమీకరణలుంటాయి. వ్యాధిని బట్టి ఏయే ఔషధాలను ఎంతెంత మోతాదులో ఇవ్వాలో నిర్ణయించిన తర్వాత ఆ మందును చక్కెర, పిండి పదార్థంతో కలిపి గుళికలుగా చేస్తారు.
 
 అపోహ: హోమియోపతిలో చక్కెర గుళికల మందులు మధుమేహ వ్యాధిగ్రస్థులకు మంచివి కాదు.
 వాస్తవం: హోమియో మందుల తయారీలో ఉపయోగించేది లాక్టోజ్ తియ్యదనమే, ఇందులో గ్లూకోజ్ ఉండదు. పైగా ఇందులో ఉండే చక్కెర అతి తక్కువ కాబట్టి ఇది రక్తంలో షుగర్‌లెవెల్స్ మీద ప్రభావం చూపదు. హోమియో వైద్యవిధానంలో ప్యాంక్రియాస్ గ్రంథిని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే స్థితికి తీసుకురావడం సాధ్యమే. దీని ద్వారా మధుమేహాన్ని తగ్గించవచ్చు.
 
 అపోహ: హోమియో మందులు వాడుతున్న కాలంలో ఉల్లిపాయ, వెల్లుల్లి, టీ, కాఫీలను మానేయాల్సి ఉంటుంది.
 వాస్తవం: హోమియో మందు వేసుకోవడానికి 15 నిమిషాల ముందు, తర్వాత ఎటువంటి ఆహారం తీసుకోకూడదనే నియమం ఉంటుంది. అంతే తప్ప ఏదీ పూర్తిగా మానేయాల్సిన అవసరం ఉండదు. అయితే కొన్ని సందర్భాలలో పరిమితంగా కొన్ని ఆహార నియమాలను పాటించాల్సి ఉంటుంది.
 
 అపోహ: హోమియో వైద్యంలో ఎటువంటి పరీక్షలు చేయకనే వ్యాధిని నిర్ధారణ చేస్తారు.
 వాస్తవం: హోమియో వైద్యంలో సాధారణంగా రోగి చెప్పే లక్షణాల ఆధారంగా మందును నిర్ధారణ చేస్తారు. ప్రతి చిన్న అనారోగ్యానికీ పరీక్షలు చేయించి నిర్ధారణ చేయడం ఉండదు. కానీ కొన్ని రోగాలకు రోగ తీవ్రతను కచ్చితంగా అంచనా వేయడానికి కొన్ని పరీక్షలు చేయిస్తారు.
 
 హోమియో సిద్ధాంతాలూ... విధానాలు
 హోమియో వైద్యుడికి ఉన్న ఏకైక, అతి ముఖ్యమైన లక్ష్యం రోగిని అస్వస్థత నుంచి దూరం చేసి అతడికి పూర్తి ఆరోగ్యాన్ని అందించడమే... హోమియోపతి డాక్టర్లందరికీ హనీమన్ చెప్పిన మొదటి సూత్రం ఇది.
     
 ‘ఆర్గనాన్ మెడిసిన్’ అనే పుస్తకం ద్వారా హోమియోపతి వైద్య విధానంలోని సిద్ధాంతాలను వివరించారు. అందులోని సిద్ధాంతాలను ‘అఫోరిజమ్స్’ అంటారు.
 
 తొలి సిద్ధాంతం (అఫోరిజమ్)
 రోగికి ఒక జబ్బుకోసం మందు ఇస్తే... అది ఆ జబ్బును అణిచివేయవచ్చు. కానీ అది మరికొన్ని రుగ్మతలకు దారి తీసే అవకాశమూ ఉంది. కాబట్టి ఈ ఆధునిక యుగంలో మందు తీసుకోవడం అంటే మరికొన్ని జబ్బులను ఆహ్వానించడం లాంటిదే. అందుకే ఈ ఆధునిక సమాజం ఏదో ఒక జబ్బుతో బాధపడాల్సి వస్తోంది. ఒక జబ్బుకు మందు వేయడం వల్ల అది మరో స్థాయి (నెక్ట్స్ లెవెల్)కి వెళ్లి మరో రుగ్మతకు కారణమవుతోంది. ఉదాహరణకు చర్మ వ్యాధులను  ఆయింట్‌మెంట్ ద్వారా అణచివేస్తే అది శ్వాసకోశ వ్యాధులకూ, ఎముకలకు సంబంధించిన వ్యాధులకూ, హార్మోన్‌ల స్థాయుల మార్పులకూ దారితీయవచ్చు. ఈ జబ్బులు వంశపారంపర్యమూ రావచ్చు. సాధారణంగా ఇంగ్లిష్ మందుల వల్ల ఈ పరిణామాలు సంభవించడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ హోమియోపతి వైద్యవిధానం ద్వారా మనిషిలోని జబ్బును తగ్గించడం కంటే పూర్ణారోగ్యాన్ని బాగు చేయడానికి కృషి జరుగుతుంది. ఫలితంగా జబ్బూ తగ్గుతుంది. దాంతో అప్పటివరకూ ఉన్న ఆ వ్యాధితో పాటు దాని అనుబంధ వ్యాధులన్నింటినీ హోమియో నిర్మూలిస్తుంది. ఈ సిద్ధాంతాన్నే ‘సిమిలియా నిమిలిబస్ క్యూరెంటర్’ అంటారు. మనిషి తాలూకు వ్యాధి నిరోధకశక్తిని బాగు చేయడం వల్ల ఇలా అతడి ఆరోగ్యాన్ని కాపాడి, అతడు ఎల్లప్పుడూ పూర్తిగా ఫిట్‌గా ఉండేలా చేయవచ్చు.
 
 ఔషధం ఎంపిక ఇలా...
 మనిషిలోని వ్యాధి నిరోధక తత్వాన్ని ప్రేరేపించి, అతడు అన్ని జబ్బులకూ అతీతుడయ్యేలా చేయడానికి అతడి మానసిక, శారీరక లక్షణాలను పరిగణనలోకి తీసుకుని మందు ఎంపిక చేయాలి. ఈ ప్రక్రియనే ‘రిపార్టరైజేషన్’ అంటారు. ఈ ప్రక్రియ ద్వారా ఔషధాన్ని ఎంపిక చేయాలంటే మనిషి అన్ని లక్షణాలనూ,  గుణగణాలను పరిగణనలోకి తీసుకోవాలి. ఇలా చేసే ప్రక్రియను ‘కాన్‌స్టిట్యూషన్’ పద్ధతి అంటారు. ఏ మందు, ఏ కాన్‌స్టిట్యూషన్స్‌తో జతపడుతోంది అన్న విషయాన్ని గ్రహించాలి. ఇలా మందుకూ, కాన్‌స్టిట్యూషన్స్‌కూ లంకె కుదిరేలా పరిశీలించడాన్ని ‘సిమిలియమ్’ అంటారు. ఈ సిమిలియమ్ రోగనిరోధకశక్తిని పెంచుతుంది. తద్వారా రోగికి మళ్లీ జబ్బు రాకుండానూ, అదే సమయంలో అతడి వ్యాధి నిరోధక శక్తి తగ్గి, ఇతర జబ్బులకు దారి తీయకుండానూ కాపాడవచ్చు. ఉదాహరణకు టైఫాయిడ్, మలేరియా వంటి జబ్బులు. ఈ జబ్బుల విషయంలో ఇంగ్లిష్ మందుల రూపంలో ఉపయోగించే యాంటీబయాటిక్స్ వాడటం వల్ల తొలి దశలో జబ్బు తగ్గినా, వ్యాధి కారక క్రిములు ఆ యాంటీబయాటిక్ పట్ల నిరోధాన్ని (రెసిస్టెన్స్‌ను) పెంచుకునే అవకాశం ఉంది. దీనివల్ల అసలా జబ్బు తగ్గకపోవచ్చు కూడా. కానీ హోమియోపతి వైద్య విధానం ప్రకారం కచ్చితమైన డ్రగ్ ఇవ్వడం వల్ల జబ్బు తగ్గి మళ్లీ రాకుండా చేయవచ్చు. అంతేకాదు అతి తక్కువ మోతాదులతో, నొప్పి లేని మందులు ఇవ్వడం అన్నది హోమియో విధానం తాలూకు ప్రత్యేకత. ఈ విధానాన్ని డాక్టర్ శామ్యూల్ హనీమన్ సూచించారు. అందుకే అతి తక్కువ మోతాదులో శరీరంలోని జన్యుస్థాయికి వెళ్లి హోమియో మందులు పనిచేస్తాయి.
 
 వ్యక్తి తాలూకు మానసిక లక్షణాలను సైతం పరిగణనలోకి తీసుకుని హోమియో విధానంలో మందును ఎంపిక చేయడం ఎందుకు జరుగుతుందంటే... శరీరంలో ‘మైండ్’ అన్నది కూడా ఒక అత్యున్నత కేంద్ర వ్యవస్థ. అక్కడ నుంచి చికిత్స మొదలు కావాలన్నది హోమియో విధానం. అందుకే శరీరం నుంచే కాకుండా మనసు నుంచి కూడా వ్యక్తికి రోగవిముక్తి జరగాలన్నది హోమియో విధానం సిద్ధాంతం. ఇదే హోమియో ప్రత్యేకత.
 
 సైడ్ ఎఫెక్ట్స్ ఎందుకు ఉండవు?
 ముందుగా చెప్పుకున్నట్లుగా ఒక జబ్బుకు మందు వేసి అణచడం కంటే... అసలు ఆ జబ్బుకు కారణమైన అన్ని అంశాలనూ శరీరం నుంచి తొలగించేందుకు హోమియో విధానం తోడ్పడుతుంది. ఈ ప్రక్రియలో మందులు జన్యుస్థాయికి వెళ్లి అక్కడ రోగ కారణాన్ని అంకురం నుంచి తొలగిస్తాయి. ఈ ప్రక్రియతో సదరు జబ్బు పట్ల మన శరీరానికి పూర్తి రోగనిరోధకత కల్పిస్తాయి. అంతేగాని అవి జబ్బును అణచవు. అందుకే హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ర్పభావాలూ (సైడ్‌ఎఫెక్ట్స్) కలగవు.
 
 ప్రయాణాల్లో హోమియో...
 తరచూ ప్రయాణం చేసేవారు తమ ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకోవడం అవసరం. ఎందుకంటే ప్రయాణాల్లో అస్వస్థతకు గురయ్యే అవకాశాలు ఎక్కువ. ఇలా తరచూ ప్రయాణాలు చేసేవారు లేదా వృత్తిపరంగా ప్రయాణాలు చేయాల్సిన అవసరం ఉన్నవారు ఈ కింది మందులను తమ వద్ద ఉంచుకోవడం వాళ్లకెంతో మేలు చేస్తుంది.


 కాకులస్ ఇండికస్: ప్రయాణాల్లో వాంతులు చేసుకునేవారూ, ప్రయాణం తర్వాత తీవ్రమైన నిద్రలేమితో బాధపడేవారు... 200 పొటెన్సీలో ఈ మందు తీసుకోవడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది.
 
 నక్స్ వామికా: ప్రయాణాల్లో వచ్చే ఉదర సంబంధమైన సమస్యలకు ఇది మంచి మందు. ప్రయాణ సమయాల్లో దీన్ని 30 పొటెన్సీలో వరసగా మూడు రోజులు తీసుకోవడం మేలు.
 
 ఆర్జంటమ్-నైట్రికం: ప్రయాణం అంటే అతిగా భయపడేవారు, ప్రయాణాల్లో అతి జాగ్రత్త పాటిస్తూ బాధపడేవారికి ఈ మందు ఇవ్వవచ్చు.
 
 పెట్రోలియమ్: తరచూ కార్లలో ప్రయాణం చేసేవారికి తల తిరగడం వంటి లక్షణాలు కనిపిస్తే దీన్ని 200 పొటెన్సీలో తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది.
 
 పోడో ఫిల్లమ్: తరచూ ప్రయాణాలు చేసేవారికి విరేచనాలూ, కడుపునొప్పి కనిపిస్తే ఈ మందు బాగా ఉపయోగపడుతుంది. ఈ మందును గంటలకోసారి చొప్పున తీసుకుంటూ ఉంటే విరేచనాలు తగ్గుతాయి.
 
 - నిర్వహణ: యాసీన్ - మంజులారెడ్డి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement