మనిషి గుండె కొట్టుకోవలసిన వేగం నిమిషానికి 72 సార్లు అయినప్పటికీ అది ఆ వ్యక్తి చేస్తున్న పనిని బట్టి, ఉన్న పరిస్థితిని బట్టి - నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటుంది. కాబట్టి గుండె స్పందనలు నిమిషానికి 90- 100 మధ్యన ఉన్నా దాన్ని నార్మల్‌గానే పరిగణించవచ్చు. ఎప్పుడైతే గుండె వేగం నిమిషానికి 100 కంటే ఎక్కువగా ఉందో దాన్ని టాకికార్డియా అని, అది 60 కంటే తక్కువగా ఉంటే దాన్ని బ్రాడీకార్డియా అని పరిగణించాలి. ఏదైనా ప్రత్యేకసందర్భం (ఉదాహరణకు మెట్లపై వేగంగా పరుగెత్తుతున్నప్పుడు)లో గుండె స్పందన పెరిగితే దాన్ని నార్మల్‌గానే పరిగణించాలి. ఆందోళనకు గురైనప్పుడు కూడా గుండెవేగం నిమిషానికి 100 దాటవచ్చు. అయితే ఈ నార్మల్ రేంజ్‌లో కాకుండా ఎప్పుడూ అబ్‌నార్మల్ రేంజ్‌లో ఉండేవారు మాత్రం డాక్టర్‌ను కలిసి తగు సలహా తీసుకోవాలి.
ఒక ఆస్పిరిన్ మాత్ర... జీవితాన్ని రక్షిస్తుంది...
ఒక ఆస్పిరిన్ మాత్ర జీవితాన్ని రక్షిస్తుంది. ఆస్పిరిన్‌లో రక్తాన్ని పలచబార్చే గుణం ఉంది. గుండెపోటు రావడం అంటే... ప్రధానంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో ఎక్కడైనా అడ్డంకి (బ్లాక్) ఉండటం వల్ల, దానికారణంగా గుండెకు తగినంత రక్తసరఫరా జరగకపోవడం. ఈ పరిణామం వల్ల గుండెకండరం చచ్చుబడిపోవడం ప్రారంభమవుతుంది. అందుకే గుండెపోటు లక్షణాలు (ఎడమ పక్క భుజం లేదా చేయి లాగినట్లుగా ఉండటం, గుండె / ఛాతీలో నొప్పి, చెమటలు పట్టడం వంటివి) కనిపించినప్పుడు ఒక ఆస్పిరిన్ మాత్ర అందుబాటులో ఉంచుకుని, అలాంటి లక్షణాలు కనిపించగానే టక్కున నోట్లో వేసుకోవాలి. ఇక రక్తంలో కొలెస్ట్రాల్ ఉన్నవారు డాక్టర్ సలహా మీద క్రమం తప్పకుండా స్టాటిన్స్ అనే మందులు వాడాలి.
స్టాటిన్స్ వాడేవారూ ఈ విషయాలు తెలుసా?
స్టాటిన్స్ అన్నవి కొలెస్ట్రాల్‌ను నియంత్రించే మాత్రలు. రక్తంలో కొలెస్ట్రాల్ పాళ్లు ఎక్కువగా ఉండటం అన్నది కేవలం మన ఆహార నియమాల మీదే కాకుండా ప్రతి మనిషి తాలూకు జన్యుపరమైన కారణాల వల్ల కూడా కావచ్చు. అయితే ఇలాంటివారు ఆహారనియమాలు ఏవీ పాటించనట్లయితే కొలెస్ట్రాల్ పాళ్లు మరింతగా పెరగవచ్చు. కొలెస్ట్రాల్ పెరుగుదలకు కారణాలు ఏవైనప్పటికీ, మున్ముందు దానివల్ల గుండెజబ్బులకు దారితీసే అవకాశాలు ఉంటాయి. శరీరంలో కొలెస్ట్రాల్ అనే ఒకరకం కొవ్వుపదార్థం ఉత్పత్తి కాకుండా నివారించే మందులే స్టాటిన్స్. ఇవి శరీరంపై పెద్దగా సైడ్‌ఎఫెక్ట్స్ చూపకుండానే గుండెకు మరింత లాభం చేకూరుస్తాయి. గుండెపోటు రిస్క్ ఉన్నవారు డాక్టర్ సలహా మేరకు ఈ మందులను క్రమం తప్పకుండా వాడుతున్నంతకాలమే వీటి వల్ల ప్రయోజనం ఉంటుంది. వీటిని మానేస్తే వీటివల్ల శరీరానికి కలిగే రక్షణ తొలగిపోతుంది. అందుకే ఒకసారి స్టాటిన్స్ మొదలుపెట్టినవారు వాటిని మానకుండా డాక్టర్ సలహా మేరకు వాటిని ఎప్పటికీ వాడుతుండటమే మంచిది.
మరి అవి వాడుతున్నప్పుడు రక్తసిక్త గాయమైతే..?
ఆస్పిరిన్ లేదా ఇతర రక్తాన్ని పలచబార్చే మందులు వాడేవారికి ఒక సందేహం ఉంటుంది. అదేమిటంటే... గుండె ఆపరేషన్ అయ్యాక మళ్లీ జబ్బు రాకుండా ఉండటానికి కార్డియాలజిస్ట్ సలహా మేరకు జీవితాంతం ఆస్పిరిన్, స్టాటిన్ వంటి మాత్రలు వాడాల్సి ఉంటుంది కదా... మరి అవి వాడే క్రమంలో ఏదైనా రక్తస్రావం జరిగేలా దెబ్బతగిలితే ఎలా... అన్నదే వారి ఆందోళన. ఆస్పిరిన్ లేదా ఇతర రక్తాన్ని పలచబార్చే మందులు వాడటం వల్ల గాయం అయినప్పుడు రక్తస్రావం అయిపోతుందేమోనని భయపడాల్సిన అవసరం లేదు. కొందరిలో గుండె, రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశం ఉండటం లేదా గుండె కవాటం మార్పిడి చికిత్స చేసినట్లయితే వారికి ఓరల్ యాంటీకోయాగ్యులెంట్స్ (ఎసిట్రోమ్, వార్‌ఫేరిన్) కూడా ఇచ్చినట్లయితే అప్పుడు మాత్రమే రక్తస్రావం కాకుండా, దెబ్బలేమీ తగలకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భాల్లోనే రక్తస్రావం జరిగి, ప్రమాదం ఏర్పడే అవకాశం ఉంది. అయితే దెబ్బతగిలి, రక్తస్రావం అవుతుంటే కంగారుపడకుండా శుభ్రమైన బట్టతో దాన్ని అదిమిపట్టి వెంటనే దగ్గర్లోని డాక్టర్‌ను సంప్రదించాలి.
- నిర్వహణ: యాసీన్
నడక ఎంతో మేలు...
గుండెజబ్బులను నివారించడానికి లేదా గుండె జబ్బును కనుగొన్న తర్వాత దానిని అదుపులో పెట్టుకోడానికైనా నడక మంచి వ్యాయామం. అయితే ఆరుబయట లేదా ట్రెడ్‌మిల్‌పై నడవడం మంచిది. అయితే నడిచేవారు ఒక ప్రాథమిక నియమం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వేగంతో తక్కువ దూరాలు నడవటం కంటే...గుండెజబ్బులు ఉన్నవారు తక్కువ వేగంతో ఎక్కువ సమయం నడిస్తే మంచిది. మామూలుగా ఆరోగ్యం కోసం నడిచేవారు ఉదయం వేళ వాకింగ్ చేయడం ఇబ్బందిగా ఉంటే సాయంత్రం కూడా నడవచ్చు. అయితే ఒకవేళ గుండెజబ్బు నిర్ధారణ అయినవారు మాత్రం ఉదయం వేళ నడవడం మేలు. సాయంత్రాలు నడిచేవారు మాత్రం వాకింగ్ చేయడానికి ముందు మితంగా ఆహారం తీసుకోవాలి. కడుపు నిండా ఆహారం తీసుకుని వాకింగ్ చేయకూడదని గుర్తుంచుకోవాలి.