మా అమ్మాయి మనసు మార్చేదెలా..?
మా అమ్మాయి వయసు 23. బీటెక్ పూర్తయి ఉద్యోగం చేస్తోంది. చాలా అందమైనది, తెలివైనది. క్రమశిక్షణగా ఉంటుంది. అయితే ఇటీవల ఆమె తన స్నేహితులతో కలిసి ఒక స్వామీజీ దగ్గరకెళ్లింది. స్వామీజీ తనతో కాసేపు ఏకాంతంగా మాట్లాడారట. అప్పటినుంచి ఆమె ఆ స్వామికి భక్తురాలిగా మారిపోయింది. తరచు స్వామి ఉండే ఆశ్రమానికి వెళ్లడం మొదలు పెట్టింది. పోనీలే అని మేము చూస్తూ ఊరుకున్నాము. అయితే కొద్దికాలంగా ఆమె ఉద్యోగం కూడా వదిలేసి పూర్తిగా ఆయన సేవకే అంకితమైపోయింది. పెళ్లి చేసుకోకుండా స్వామికి పాదసేవ చేసుకుంటూ బతికేస్తాను అంటోంది. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఏం చేయమంటారు, సలహా ఇవ్వండి.
- ఓ నిస్సహాయ తల్లిదండ్రులు, విశాఖపట్నం
గాభరాపడకండి, ఇలాంటి సమస్య ఇటీవల కాలంలో చాలామంది తల్లిదండ్రులకు ఎదురవుతోంది. అయితే అందరూ మీలాగా ధైర్యంగా బయటపడట్లేదంతే! సాధారణంగా ఇలా సన్యాస మార్గాన్ని ఎంచుకుంటున్న యువతీ యువకులలో చాలావరకు చిన్నప్పటినుంచి వివిధ కారణాల వల్ల మానసిక ఒత్తిడిని ఎదుర్కొన్నవారే అయి ఉంటారు. మూడ్స్ తరచు మారిపోతుండటం, బాగా డల్‌గా లేదా బాగా యాక్టివ్‌గా ఉండటం కూడా వీరి లక్షణాలలో ఒకటి. ఇటువంటప్పుడు తల్లిదండ్రులు లేదా స్నేహితుల ఆసరా, సహకారం లభించకపోవడం వల్ల లేదా వారిముందు తమ సమస్యలను చెప్పుకోలేకపోవడం వల్ల మృదువుగా, మధురంగా మాట్లాడే స్వామీజీలవంటి వారి మాటల ప్రభావానికి ఇట్టే లోనయ్యే అవకాశం ఉంది. ఇదే అదనుగా అటువంటి స్వామీజీలు తమ మాటలతో, సాంత్వన వచనాలతో వారిని మరింతగా ఆకట్టుకుని, తమ చుట్టూ తిరిగేలా, తాము ఏది చెబితే దానిని గుడ్డిగా అనుసరించేలా చేసుకుంటారు. తమ శిష్యులుగా తయారు చేసుకుంటారు.
చాలామంది తల్లిదండ్రులు ఇటువంటి వాటిని తొందరగా గమనించకపోవడం వల్ల, ఒకవేళ గమనించినా చూసీ చూడనట్టు వదిలేయడం వల్ల వారు స్వాముల ప్రలోభానికి, ప్రభావానికి మరింత ఎక్కువగా లోనై, వారి ఆకర్షణ నుంచి బయటకు రాలేని ఒకలాంటి తాదాత్మ్యస్థితిలోకి వెళ్లిపోతారు.
మీరు మీ అమ్మాయి విషయంలో చాలా సున్నితంగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఏమాత్రం తేడా వచ్చినా, వ్యవహారం పూర్తిగా తారుమారయే ప్రమాదం ఉంది. ముందు మీరు ఆశ్రమ సిబ్బందికి విషయాన్నంతటినీ వివరించి, వారితో సామరస్యపూర్వకంగా మాట్లాడండి. తొలుత కొంతకాలంపాటు స్వామివారు ఇప్పుడు ఎవరినీ కలవాలని అనుకోవడం లేదని చెప్పిస్తూ, ఆశ్రమానికి వెళ్లడాన్ని తగ్గించేలా చేయండి.
వారంలో కనీసం ఒకటి రెండు రోజులు తను ఎక్కడికీ వెళ్లకుండా మిమ్మల్నే అంటిపెట్టుకుని ఉండేలా చేయండి లేదా మీరే ఆమెను అంటిపెట్టుకుని ఉండండి. ఎలాగో ఒకలాగా నచ్చజెప్పి, తనను వెంటబెట్టుకుని సైకియాట్రిస్ట్ వద్దకు తీసుకు వెళ్లండి. అంతకుమునుపే మీరు సైకియాట్రిస్ట్‌ను కలిసి విషయమంతా వివరిస్తే, వైద్యులు ఆమెతో ఎలా వ్యవహరించాలో అలా వ్యవహరిస్తారు. సైకియాట్రిస్ట్ ఆమెతో మాట్లాడిన తర్వాత అసలు ఆమె అలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుకగల కారణాలను విశ్లేషించి, అందుకు తగిన కౌన్సెలింగ్ లేదా అవసరమైతే మందులను ఇచ్చి, ఆమె నిర్ణయాన్ని వెనక్కు తీసుకునేలా చేసేందుకు ప్రయత్నించవచ్చు. మీ ప్రయత్నం మీరు చేయండి. విష్ యు ఆల్ ది బెస్ట్.
డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్