అబ్బాయి సమస్యకు ఆ పరీక్షలెందుకు?
మా అబ్బాయికి మూడేళ్లు. వాడికి ఆటిజమ్‌తో పాటు వికాసంలో లోపాలు ఉన్నట్లు తెలిసింది. అయితే వాడికి మాటలింకా రావాల్సి ఉంది. సరిగ్గా కమ్యూనికేట్ చేయలేడు. మాకు తెలిసిన డాక్టర్‌కు చూపిస్తే ఆయన రక్తపరీక్షలు, ఈఈజీ, ఎమ్మారై చేయించమని చెప్పారు. మేం అడగదలచుకున్న అంశం ఏమిటంటే... మా అబ్బాయి విషయంలో వచ్చిన సమస్య ఏమిటి? పైన పేర్కొన్న పరీక్షలన్నీ వాడి విషయంలో ఎలా ఉపయోగపడతాయి?
- ఎస్. ఝాన్సీ, రాజమండ్రి
మీ అబ్బాయి లాంటి కేసుల్లో అతడి పుట్టుక నుంచి మొదలుకొని ఇప్పటివరకూ మెడికల్ హిస్టరీ అవసరమవుతుంది. గర్భధారణ సమయంలోని హిస్టరీ కూడా అవసరం. అతడి పరిస్థితిని అంచనా వేయడానికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో కొన్ని ప్రత్యేకమైన గణన పరీక్షలు కూడా చేయాలి. ఇలా అతడి గురించి అన్ని వివరాలూ సేకరించాకనే అతడికి ఉన్న సమస్య, ఆటిజమ్ ఉందా లేదా అన్న విషయం నిర్ధారణ చేయడం సాధ్యమవుతుంది.
అయితే అన్ని కేసుల్లోనూ అన్ని రకాల పరీక్షలూ అవసరం కాకపోవచ్చు.
కొన్ని కొన్ని విషయాలు బయటపడుతున్న కొద్దీ దాన్ని బట్టి తదుపరి కొన్ని నిర్దిష్టమైన పరీక్షలు అవసరమవుతాయా, లేదా అన్నది తెలుస్తుంది. ఒక్కోసారి ఇది జన్యుపరంగా వచ్చిందా అన్న సందేహం వస్తే అప్పుడు జెనెటిక్ పరీక్షలు అవసరమవుతాయి. అలాగే ఈఈజీ, ఎమ్మారై అన్న పరీక్షలతో పిల్లాడిలో ఏవైనా నరాలకు సంబంధించిన సమస్యలు ఉన్నాయా లేదా ఫిట్స్ /సీజర్స్ ఉన్నాయా అన్నది తెలుస్తుంది. అయితే ఏయే పరీక్షలు ఎవరికి చేయాలన్నది రోగి నుంచి రోగికి మారుతుంది.
ఇక మీరు చెబుతున్న వికాసంలో లోపాలు అంటే నడక పూర్తిగా రాకపోవడం, పాకడం సరిగా రాకపోవడం, మాటలు రాకపోవడం వంటివి మెదడులోని కొన్ని భాగాలు (కేంద్రాలు) సరిగా ఎదగకపోవడాన్ని సూచిస్తాయి. అయితే ఇలాంటి చాలా సందర్భాల్లో కాలం గడచిన కొద్దీ ఆ లోపాలు వాటంతట అవే సరైపోతాయి. కాకపోతే వికాసం కాస్త ఆలస్యంగా జరుగుతుందంతే. ఇలాంటి సందర్భాల్లో ఆ లోపాన్ని అధిగమించడం కోసం సమయానుకూలంగా, తగు మోతాదులు మార్చుకుంటూ... పోషకాలు, విటమిన్లు, ఒమెగా-3-ఫ్యాటీ యాసిడ్స్ లాంటివి ఇవ్వడం ద్వారా చేసే అత్యాధునిక బయో-మెడికల్ చికిత్స అందివ్వడం వల్ల వేగంగా సరిదిద్దడం సాధ్యమవుతుంది. దీనివల్ల మాటలు త్వరగా రావడమేగాక... పిల్లవాడిలో మెదడు సాధారణ ఎదుగుదల కూడా బాగుపడుతుంది. (అయితే ఇందుకు తీవ్రమైన బుద్ధిమాంద్యత ఉన్న పిల్లల విషయం మినహాయింపు).
ఇలా వికాసంలో తేడాలు ఉన్న పిల్లల విషయంలో ఎంత త్వరగా సమస్యను గుర్తించగలిగితే అంత ప్రయోజనం ఉంటుంది. ఎందుకంటే వికాసంలో భాగంగా జరిగే కొన్ని అభ్యాసాలు (ఉదాహరణకు మాటలు నేర్చుకోవడం) వంటివి ఆ వయసులో జరగకపోతే ఆ తర్వాత అంత తేలిగ్గా పట్టుబడవు. అందుకోసమే ఇలాంటి చికిత్సల విషయంలో చికిత్సలు / థెరపీస్ వంటివి ఏ సమయంలో జరగాల్సినవి ఆ సమయంలో జరిగితేనే గరిష్ఠ ప్రయోజనాన్ని ఇస్తాయి. అందుకే ఇలాంటి పిల్లల విషయంలో ముందుగా తల్లి చాలా నిబ్బరంతో, పిల్లవాడిని బాగుపరచే విషయంలో కృతనిశ్చయంతో ఉండాలి. నిజానికి నిబ్బరమైన స్థితే పరిస్థితిని సగం మెరుగుపరుస్తుంది. మీరు ఆందోళన పడకుండా వీలైనంత త్వరగా మీకు దగ్గర్లోని సైకియాట్రిస్ట్‌ను సంప్రదించండి.
డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్,
సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్