![మూడేళ్లొచ్చినా... ఇంకా నడక, మాటలు రాలేదు..?](/styles/webp/s3/article_images/2017/09/2/81385139982_625x300.jpg.webp?itok=4eDw45DJ)
మూడేళ్లొచ్చినా... ఇంకా నడక, మాటలు రాలేదు..?
మా అబ్బాయికి మూడేళ్లు. వాడిలో ఆటిజం లక్షణాలున్నట్లు కనుక్కున్నాము. ఇంకా మాటలు సరిగా రాలేదు. ఏది కావాలన్నా అడగలేడు. ఎవరితోనూ కలవడు. వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే కొన్ని రకాల రక్తపరీక్షలతోబాటు ఈయీజీ, ఎమ్మారై పరీక్షలు చేయించమన్నారు. దాంతో మా ఆవిడ చాలా కంగారుపడుతోంది. అసలు మా అబ్బాయి సమస్య ఏమిటి? ఇంత ఖరీదైన పరీక్షలు వాడికి ఈ వయసులోనే ఎందుకు?
-బి. రాధాకృష్ణ, హైదరాబాద్
మీ సమస్యకు జవాబిచ్చే ముందు మాకు మరికొంత సమాచారం కావాలి. మీ అబ్బాయికి ఆటిజమ్ అని తెలిసిందన్నారు. ఎలా తెలిసింది? గర్భధారణ సమయంలో మీరేమైనా రుగ్మతలతో బాధపడ్డారా? ప్రసవం ఎలా జరిగింది? కాంప్లికేషన్లు ఏమైనా ఎదురైనాయా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మీకు పూర్తి సమాధానం ఇవ్వగలం.
అయితే మాకు అర్థమయినదాన్ని బట్టి... మీ బాబులో ఏవైనా నరాలకు సంబంధించి అసాధారణ రుగ్మతలు లేదా ఫిట్స్, మూర్ఛ వంటి ఏమైనా ఉండి ఉండవచ్చునని మీ బాబుకు చికిత్స చేస్తున్న డాక్టర్ అనుమానించి ఉండవచ్చు. అందుకే ఎమ్మారై, ఈఈజీ పరీక్షలు చేయించమని సలహా ఇచ్చి ఉంటారు. ఒక్కోసారి జన్యుసంబంధిత పరీక్షలు చేయించవలసి రావచ్చు. డాక్టర్లు అయినా చిన్న పిల్లలకు సంబంధించి అన్ని విధాలైన కేస్ స్టడీస్ చేసి, ఆయా పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతగానీ చికిత్స మొదలు పెట్టలేరు కదా!
పెరుగుదలకు సంబంధించిన సమస్యలు అంటే పారాడటం, నడక, మాట్లాడటం, మెదడు అభివృద్ధి చెందటం వంటివి ఆటిజమ్ ఉన్నవారికే ఉండాలని లేదు. ఎవరికైనా రావచ్చు. శిశువులో ఎదుగుదల ఆలస్యం అవుతోందనుకుంటే వైద్యుడి సలహాను బట్టి విటమిన్లు, ధాతువులు, ఇతర పోషకాలు కలిగిన ఆహారాన్ని లేదా నేరుగా విటమిన్ మాత్రలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను తగిన మోతాదులో బిడ్డకు అందించవలసి ఉంటుంది.
మాటకు సంబంధించి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి చికిత్సల ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు.
అన్నింటికన్నా ముఖ్యం... కొందరిలో కొన్ని ఆలస్యంగా కూడా జరగవచ్చు. అంతమాత్రానికే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు భయపడిపోయి, బెంబేలెత్తిపోయి మీ బిడ్డకు ఇక మాటలు రావేమో, నడవలేడేమో అని కుంగిపోవలసిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఇంటిలోని ఇతర పెద్దల సలహా మేరకు సత్ఫలితాలను పొందడానికి చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూ... మరీ ఆలస్యం అవుతోందనుకుంటే డాక్టర్ సలహా తీసుకుని వాటిని ఆచరణలో పెట్టడం అవసరం.
మీ బాబుకు మూడేళ్లే అన్నారు కదా, ఇప్పటికి ఏమీ మించి పోలేదు. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలా ఆలస్యంగా నడక, మాటలు వచ్చిన వారున్నారేమో మీ పెద్దల ద్వారా తెలుసుకుని, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే, చైల్డ్ సైకియాట్రిస్ట్‌ను కూడా సంప్రదించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.
డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్,
సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్