Medina City Hospitals
-
పిల్లలిద్దరితో వేగలేకపోతున్నాను..?
మా పెద్దవాడికి ఆరేళ్లు. రెండోవాడికి రెండేళ్లు. ఇద్దరూ ఎప్పుడూ కొట్టుకుంటూ ఉంటారు. చిన్నవాడికి ఏమి తెస్తే అది తనకూ కావాలని పెద్దవాడు పేచీపెడుతుంటాడు. ‘తమ్ముడితోనే ఎక్కువసేపు గడుపుతున్నావు, నీకు నేనంటే ఇష్టం లేదు’ అని అలుగుతుంటాడు. నేను జాబ్ చేస్తున్నాను. ఇంటికి వచ్చేసరికి వీళ్లిద్దరి తగవులు తీర్చలేక సతమతమవుతున్నాను. మావారేమో ఇద్దరు పిల్లలను పెంచడం కూడా చేతకాకపోతే ఎలా అంటూ నన్నే ఎగతాళి చేస్తుంటారు. నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. తగిన సలహా చెప్పగలరు. - సుప్రియ, తెనాలి ఇది చాలామంది ఇళ్లలో సాధారణంగా జరిగేదే. దీనిని సిబ్లింగ్ రైవలరీ అంటారు. ఒకవిధంగా ఇది ఇది డెవలపింగ్ మైల్‌స్టోన్‌గా చెప్పవచ్చు. అంటే సమాజంలో ఒకరితో ఒకరు పోటీపడి, నెగ్గుకురావడం ఎలాగో మీ పిల్లలు ఇప్పటినుంచే నేర్చుకుంటున్నారన్నమాట! ఇదే ధోరణి వారికి కనీసం పదహారు పదిహేడేళ్లు వచ్చేవరకు కొనసాగుతూనే ఉంటుంది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరూ స్నేహితులైపోతారు. అయితే ఇది రానురానూ మరీ తీవ్రమై, హింసాత్మక ధోరణులకు దారితీసేలా ఉంటే గనక ఇద్దరినీ చైల్డ్ సైకియాట్రిస్ట్ దగ్గరకు తీసుకెళ్లి కౌన్సెలింగ్ ఇప్పించాల్సి ఉంటుంది. అసలు పిల్లలు అలా చేయడం వెనక ఉన్న ప్రధాన కారణం ఏమిటంటే... తల్లిదండ్రుల ప్రేమను పొందడం గురించి పిల్లలు ఒకరితో ఒకరు పోటీపడటం. మరీ చిన్నపిల్లలైతే గనక వారికి పూర్తిగా తెలియక, తమ అసంతృప్తిని రకరకాలుగా వ్యక్తం చేస్తుంటారు. చిన్నవాళ్లతో పోటీగా మరీ పసిపిల్లల్లా ప్రవర్తిస్తుంటారు. వయసును బట్టి వారి ప్రవర్తనలో కూడా తేడా ఉంటుంది. తమ్ముడిని లేదా చెల్లెలిని తిట్టడం, కొట్టడం, బాధ పెట్టడం...చేస్తుంటారు. ఇది కేవలం పెద్దపిల్లలు చిన్నవాళ్లను చేయడమే కాదు, చిన్నపిల్లలు పెద్దవారిని కూడా చేయవచ్చు. మీరు ఏం చేస్తారంటే... వీలైనంతవరకు ఇద్దరితోనూ సమానంగా సమయాన్ని వెచ్చిస్తుండాలి. మీరు చిన్నవాడితో గడిపేటప్పుడు పెద్దవాడిని వాళ్ల నానమ్మ దగ్గరో, నాన్న దగ్గరో ఉండేలా చేయండి. తర్వాత దగ్గరకు పిలిచి, ఇద్దరితోనూ కలిసి గడపండి. పెద్దవాడిని పొరపాటున కూడా ‘చిన్నవాడితో పోల్చకండి. నిజానికి పెద్దవాడు కూడా వయసులో అంత పెద్ద ఏమీ కాదు కదా! కొంతకాలం ఓపికపట్టడం, బుద్ధిగా ఉంటే బహుమతులు ఇస్తానని పెద్దవాడిని ఊరించడం, చిన్నవాడిని కూడా పెద్దవాడితో ఆడుకునేలా చేయడం ఒక్కటే మార్గం. వీరిద్దరి గొడవలో పడి మీరు రిలాక్స్ కావడం మరచిపోవద్దు. లేదంటే మీరు డిప్రెషన్లో పడతారు. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మూడేళ్లొచ్చినా... ఇంకా నడక, మాటలు రాలేదు..?
మా అబ్బాయికి మూడేళ్లు. వాడిలో ఆటిజం లక్షణాలున్నట్లు కనుక్కున్నాము. ఇంకా మాటలు సరిగా రాలేదు. ఏది కావాలన్నా అడగలేడు. ఎవరితోనూ కలవడు. వాడిని డాక్టర్ దగ్గరకు తీసుకెళితే కొన్ని రకాల రక్తపరీక్షలతోబాటు ఈయీజీ, ఎమ్మారై పరీక్షలు చేయించమన్నారు. దాంతో మా ఆవిడ చాలా కంగారుపడుతోంది. అసలు మా అబ్బాయి సమస్య ఏమిటి? ఇంత ఖరీదైన పరీక్షలు వాడికి ఈ వయసులోనే ఎందుకు? -బి. రాధాకృష్ణ, హైదరాబాద్ మీ సమస్యకు జవాబిచ్చే ముందు మాకు మరికొంత సమాచారం కావాలి. మీ అబ్బాయికి ఆటిజమ్ అని తెలిసిందన్నారు. ఎలా తెలిసింది? గర్భధారణ సమయంలో మీరేమైనా రుగ్మతలతో బాధపడ్డారా? ప్రసవం ఎలా జరిగింది? కాంప్లికేషన్లు ఏమైనా ఎదురైనాయా అనే ప్రశ్నలకు సమాధానాలు తెలిస్తే మీకు పూర్తి సమాధానం ఇవ్వగలం. అయితే మాకు అర్థమయినదాన్ని బట్టి... మీ బాబులో ఏవైనా నరాలకు సంబంధించి అసాధారణ రుగ్మతలు లేదా ఫిట్స్, మూర్ఛ వంటి ఏమైనా ఉండి ఉండవచ్చునని మీ బాబుకు చికిత్స చేస్తున్న డాక్టర్ అనుమానించి ఉండవచ్చు. అందుకే ఎమ్మారై, ఈఈజీ పరీక్షలు చేయించమని సలహా ఇచ్చి ఉంటారు. ఒక్కోసారి జన్యుసంబంధిత పరీక్షలు చేయించవలసి రావచ్చు. డాక్టర్లు అయినా చిన్న పిల్లలకు సంబంధించి అన్ని విధాలైన కేస్ స్టడీస్ చేసి, ఆయా పరీక్షల రిపోర్టులు వచ్చిన తర్వాతగానీ చికిత్స మొదలు పెట్టలేరు కదా! పెరుగుదలకు సంబంధించిన సమస్యలు అంటే పారాడటం, నడక, మాట్లాడటం, మెదడు అభివృద్ధి చెందటం వంటివి ఆటిజమ్ ఉన్నవారికే ఉండాలని లేదు. ఎవరికైనా రావచ్చు. శిశువులో ఎదుగుదల ఆలస్యం అవుతోందనుకుంటే వైద్యుడి సలహాను బట్టి విటమిన్లు, ధాతువులు, ఇతర పోషకాలు కలిగిన ఆహారాన్ని లేదా నేరుగా విటమిన్ మాత్రలు, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ను తగిన మోతాదులో బిడ్డకు అందించవలసి ఉంటుంది. మాటకు సంబంధించి స్పీచ్ థెరపీ, ఆక్యుపేషనల్ థెరపీ వంటి చికిత్సల ద్వారా మెరుగైన ఫలితాలను రాబట్టవచ్చు. అన్నింటికన్నా ముఖ్యం... కొందరిలో కొన్ని ఆలస్యంగా కూడా జరగవచ్చు. అంతమాత్రానికే తల్లిదండ్రులు, ఇతర కుటుంబ సభ్యులు భయపడిపోయి, బెంబేలెత్తిపోయి మీ బిడ్డకు ఇక మాటలు రావేమో, నడవలేడేమో అని కుంగిపోవలసిన అవసరం లేదు. బిడ్డ ఎదుగుదలను జాగ్రత్తగా పరిశీలిస్తూ, ఇంటిలోని ఇతర పెద్దల సలహా మేరకు సత్ఫలితాలను పొందడానికి చేయగలిగిన ప్రయత్నాలు చేస్తూ... మరీ ఆలస్యం అవుతోందనుకుంటే డాక్టర్ సలహా తీసుకుని వాటిని ఆచరణలో పెట్టడం అవసరం. మీ బాబుకు మూడేళ్లే అన్నారు కదా, ఇప్పటికి ఏమీ మించి పోలేదు. మీ ఫ్యామిలీ హిస్టరీలో ఇలా ఆలస్యంగా నడక, మాటలు వచ్చిన వారున్నారేమో మీ పెద్దల ద్వారా తెలుసుకుని, అందుకు అవసరమైన జాగ్రత్తలు తీసుకుంటూనే, చైల్డ్ సైకియాట్రిస్ట్‌ను కూడా సంప్రదించండి. విష్ యు ఆల్ ది బెస్ట్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
పిచ్చి ఆలోచనలు వేధిస్తున్నాయి...
నా వయసు 27. బిజినెస్ చేస్తుంటాను. నాకు ఇటీవలే పెళ్లయింది. నేనొక చిత్రమైన సమస్యతో బాధపడుతున్నాను. కుటుంబ సభ్యులు ఎవరైనా బయటికి వెళ్లారనుకోండి, వారికి ఏదో యాక్సిడెంట్ అయినట్టు... లేదా ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని భయం. ఎప్పుడూ ఆలోచనలే, అన్నీ నెగటివ్‌గానే ఉంటాయి. దీంతో దేనిమీదా దృష్టిపెట్టలేకపోతున్నాను. భార్యతో కూడా హాయిగా గడపలేకపోతున్నాను. అయితే ఆహారం, నిద్ర విషయాలలో ఇబ్బంది ఏమీ లేదు. దయచేసి పరిష్కార మార్గం చెప్పగలరు. -బి.ఆనంద్, విశాఖపట్నం నిజంగానే మీది బాధాకరమైన సమస్య. యాంగ్జైటీ డిజార్డర్, అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్... ఈ రెండింటి మూలంగా తలెత్తే సమస్య ఇది. ఇందులో రకరకాల ఆలోచనలు వస్తుంటాయి. మెదడు క్షణం కూడా విశ్రాంతి లేకుండా ఎప్పుడూ ఏదో ఒక దాని గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. దాంతో మనసు స్థిమితంగా వుండదు. దీనికితోడు భయం, ఆందోళన మనసును కమ్మేస్తుంటాయి. మిమ్మల్ని ప్రశాంతంగా ఉండనివ్వవు. ఇది ఇలాగే కొనసాగితే గుండెదడ, ఒళ్లంతా చెమటలు పట్టడం, గొంతు ఎండిపోవటం వంటి శారీరకసమస్యలు తలెత్తి, దానిప్రభావం మళ్లీ మెదడుపైనే పడుతుంది. దాంతో ఆలోచనలు అదుపు తప్పటం, చిన్న చిన్న నిర్ణయాలు కూడా తీసుకోలేకపోవటం, ఏ పనీ చేయలేక ప్రతిదానికీ ఇతరుల మీద ఆధారపడటం లేదా దేవుడి మీదనే భారం వేస్తూ, అన్నింటికీ చేతులు ఎత్తేయటం వంటి ఇతర ఇబ్బందులు కూడా తలెత్తుతాయి. క్రమేణా దీని ప్రభావం తిండి మీదా, నిద్రమీదా కూడా పడి ఏమీ తినాలనిపించకపోవటం, అతి నిద్ర లేదా అసలు నిద్ర లేకపోవటం, మనశ్శాంతి కరువవటం, వింత వింత పనులు చేయటం కూడా సంభవించవచ్చు. దీనికి మీరు చేయవలసిందల్లా ఏమిటంటే... ఇంకా అంతటి తీవ్రమైన పరిస్థితులు తలెత్తకముందే ఆలస్యం చేయకుండా వెంటనే సైకాలజిస్ట్‌ను కలిసి మీ పరిస్థితినంతటినీ వివరించండి. వారు సమస్య తీవ్రతను అంచనా వేసి, అనవసరమైన ఆలోచనలు అదుపు చేయాలంటే ఏమి చేయాలనే దానిపై మీకు కౌన్సెలింగ్ ఇస్తారు. అవసరాన్ని బట్టి యాంటీ డిప్రెసెంట్స్ వాడవలసి రావచ్చు. మానసిక నిపుణుల సలహా మేరకు మీరు మీ జీవన శైలిలో కూడా చిన్న చిన్న మార్పులు చేయవలసి ఉంటుంది. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మా అబ్బాయికి బై పోలార్ డిజార్డర్... పెళ్లి చేస్తే దారిలోకొస్తాడా?
మా బాబుకు చిన్నప్పటినుంచి మానసిక రుగ్మత. దానికి మందులు ఇప్పిస్తూ వచ్చాము. ఇప్పుడు వాడికి 29 సంవత్సరాలు. సాఫ్ట్వేర్ ఇంజినీర్. వయసుతోపాటే వాడి స్నేహాలు కూడా పెరిగిపోయాయి. వాడికి పెళ్లీడు వచ్చింది కాబట్టి, పెళ్లి చేసేస్తే అన్నీ అదుపులోకి వస్తాయని బంధుమిత్రులు అంటున్నారు. కానీ, చూస్తూ చూస్తూ ఒక ఆడపిల్ల జీవితాన్ని అన్యాయం చేయడం ఇష్టం లేదు. ఏం చేయమంటారు? తగిన సలహా ఇవ్వగలరు. -భూపతి వర్మ, హైదరాబాద్ మీ వాడికి ఉన్న సమస్య దీర్ఘకాలిక మానసిక సమస్య. దీనిని బై పోలార్ డిజార్డర్ అంటారు. దీనికి పెళ్లికి ముందు, తర్వాత కూడా చికిత్స చేయాలి. అయితే మీ బంధుమిత్రులు చెబుతున్నట్లుగా అసలు విషయాన్ని దాచి పెళ్లి చేస్తే అంతా సవ్యంగా అవుతుందనడం మాత్రం చాలా పొరపాటు అభిప్రాయం. చాలామంది తల్లిదండ్రులు చేసే పొరపాటు ఇదే. పెళ్లికి ముందు తమ పిల్లలకు ఉన్న రకరకాల మానసిక, శారీరక రుగ్మతల సంగతి దాచి, పెళ్లి చేసేస్తుంటారు. ఆ తర్వాత ఆయా వ్యాధి లక్షణాలు ఏదో బయట పడటం, ఒకరినొకరు నిందించుకోవటం...ఫలితంగా వారి జీవితాలు దుర్భరంగా మారటం... మీరు మీ అబ్బాయికి పెళ్లి చేయాలనుకోవడం తప్పు కాదు. అయితే పెళ్లికి ముందే అతనికి ప్రీ మేరిటల్ కౌన్సెలింగ్ ఇప్పించాలి. మానసిక రుగ్మతలకు వాడే మందులను ఆపి వెయ్యడం మంచిది కాదు. లైంగిక జీవితంపై ఈ మందుల ప్రభావం ఎలా ఉంటుంది? మందుల డోసేజీ తగ్గించవచ్చా లేదా? వంటి విషయాలపై డాక్టర్ సలహా తీసుకోవాలి. పెళ్లయిన తర్వాత కొంతకాలం పాటు బాగానే ఉన్నట్లు అనిపించవచ్చు. అంతమాత్రాన పూర్తిగా తగ్గినట్లు కాదు. అమ్మాయి తల్లిదండ్రులకు, అమ్మాయికి కూడా అంతా వివరించి, అందుకు వారు పూర్తిగా సమ్మతించిన తర్వాతనే ముందుకు వెళ్లడం అవసరం. అతను ఏయే సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తుంటాడు? అందుకు ఏం చేయాలి? ఏ మందులు వాడాలి వంటి విషయాలన్నింటినీ వారికి వివరంగా చెప్పడం అవసరం. పెళ్లి తర్వాత కూడా మానసిక వైద్యులు, మ్యారేజ్ కౌన్సెలింగ్ నిపుణుల సలహాలు పాటిస్తూ, వారు చెప్పిన విధంగా చేయడం నడుచుకోవటం మంచిది. విష్ యు గుడ్ లక్. డాక్టర్ కల్యాణ్ సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్ -
మా అమ్మాయిని ఎలా అదుపు చేయాలో అర్థం కావట్లేదు!
మాకు ఒక్కగానొక్క కుమార్తె. సంపన్న కుటుంబం కావడం వల్ల చిన్నప్పటినుంచి ఆమె కోరినదల్లా ఇచ్చి గారాబంగా పెంచాం. చిన్నప్పటినుంచి ఆమెకు స్నేహితులు చాలా ఎక్కువ. ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఇంటికి తీసుకువచ్చేది. అపరిచితులతో సైతం ఎంతో సన్నిహితంగా మెలిగేది. ఇంజినీరింగ్ అయ్యాక ఏదో ఉద్యోగం సంపాదించుకుంది. అయితే ఎందులోనూ స్థిరంగా ఉండక అనేకమైన కంపెనీలు మారింది. దేనినీ సీరియస్‌గా తీసుకోదు. ప్రతిదానిలోనూ ఎంతో నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడామెకు పాతికేళ్లు దాటాయి. పెళ్లి చేయాలనుకుంటున్నాము. అంతకన్నా ముందు ఆమె ప్రవర్తనను సరిదిద్దాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు. - ఒక తల్లిదండ్రులు, హైదరాబాద్ మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయడం వల్ల ఆమె మరింత అశాంతికి గురవుతుంది. దానిమూలంగా తన జీవితం మరింత చిక్కుల్లో పడటమేగాక వారి జీవితభాగస్వామి జీవితం కూడా దుర్భరమవుతుంది. మీరు ఉత్తరంలో రాసిన లక్షణాలను బట్టి మీ అమ్మాయి బై పోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని అర్థమవుతోంది. ఇలాగే వదిలిస్తే ఆమె భవిష్యత్తులో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయి, జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకునే ప్రమాదమూ లేకపోలేదు. ఇటువంటి కండిషన్‌తో బాధపడేవారు పుట్టుకతో చాలా తెలివైన వారు. తమ తెలివితేటలను ఒకదాని మీద నిలపలేక చివరికి దేనికీ న్యాయం చేయలేక నిరాశకు గురవడంతో ఆందోళన పడతారు. తమ ప్రవర్తనను తామే సరిగా అర్థం చేసుకోలేక, ఇతరులతో తమ సంబంధాలను సజావుగా నెరపలేక సతమతమవుతుంటారు. బైపోలార్ డిజార్డర్‌లో తిరిగి రెండు దశలున్నాయి. ఒకటి మానియా, రెండవది హైపర్ మానియా. లక్షణాలను బట్టి మీ అమ్మాయి హైపర్ మేనియాతో బాధపడుతోందని తెలుస్తోంది. ఇటువంటి వారిని హాస్పిటల్‌కు తీసుకురావడం చాలా కష్టమైన పని. అయితే మీరు నేర్పు, ఓర్పులతో వ్యవహరించి ఆమెను ఎలాగైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లి, మానసిక వైద్యుని చేత కౌన్సెలింగ్, చికిత్స ఇప్పించడం వల్ల తప్పనిసరిగా ఆమె పరిస్థితిలో మార్పు వస్తుంది. ప్రయత్నించి చూడండి. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్