మా అమ్మాయిని ఎలా అదుపు చేయాలో అర్థం కావట్లేదు!
మాకు ఒక్కగానొక్క కుమార్తె. సంపన్న కుటుంబం కావడం వల్ల చిన్నప్పటినుంచి ఆమె కోరినదల్లా ఇచ్చి గారాబంగా పెంచాం. చిన్నప్పటినుంచి ఆమెకు స్నేహితులు చాలా ఎక్కువ. ఆడ, మగ తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ ఇంటికి తీసుకువచ్చేది. అపరిచితులతో సైతం ఎంతో సన్నిహితంగా మెలిగేది. ఇంజినీరింగ్ అయ్యాక ఏదో ఉద్యోగం సంపాదించుకుంది. అయితే ఎందులోనూ స్థిరంగా ఉండక అనేకమైన కంపెనీలు మారింది. దేనినీ సీరియస్‌గా తీసుకోదు. ప్రతిదానిలోనూ ఎంతో నిర్లక్ష్యంగా ఉంటుంది. ఇప్పుడామెకు పాతికేళ్లు దాటాయి. పెళ్లి చేయాలనుకుంటున్నాము. అంతకన్నా ముందు ఆమె ప్రవర్తనను సరిదిద్దాలంటే ఏం చేయాలో సలహా ఇవ్వగలరు.
- ఒక తల్లిదండ్రులు, హైదరాబాద్
మీరు మీ అమ్మాయికి పెళ్లి చేయడం వల్ల ఆమె మరింత అశాంతికి గురవుతుంది. దానిమూలంగా తన జీవితం మరింత చిక్కుల్లో పడటమేగాక వారి జీవితభాగస్వామి జీవితం కూడా దుర్భరమవుతుంది.
మీరు ఉత్తరంలో రాసిన లక్షణాలను బట్టి మీ అమ్మాయి బై పోలార్ డిజార్డర్ అనే మానసిక వ్యాధితో బాధపడుతోందని అర్థమవుతోంది. ఇలాగే వదిలిస్తే ఆమె భవిష్యత్తులో తీవ్రమైన డిప్రెషన్‌కు గురయి, జీవితాన్ని బలవంతంగా అంతం చేసుకునే ప్రమాదమూ లేకపోలేదు.
ఇటువంటి కండిషన్‌తో బాధపడేవారు పుట్టుకతో చాలా తెలివైన వారు. తమ తెలివితేటలను ఒకదాని మీద నిలపలేక చివరికి దేనికీ న్యాయం చేయలేక నిరాశకు గురవడంతో ఆందోళన పడతారు. తమ ప్రవర్తనను తామే సరిగా అర్థం చేసుకోలేక, ఇతరులతో తమ సంబంధాలను సజావుగా నెరపలేక సతమతమవుతుంటారు.
బైపోలార్ డిజార్డర్‌లో తిరిగి రెండు దశలున్నాయి. ఒకటి మానియా, రెండవది హైపర్ మానియా. లక్షణాలను బట్టి మీ అమ్మాయి హైపర్ మేనియాతో బాధపడుతోందని తెలుస్తోంది. ఇటువంటి వారిని హాస్పిటల్‌కు తీసుకురావడం చాలా కష్టమైన పని.
అయితే మీరు నేర్పు, ఓర్పులతో వ్యవహరించి ఆమెను ఎలాగైనా హాస్పిటల్‌కు తీసుకెళ్లి, మానసిక వైద్యుని చేత కౌన్సెలింగ్, చికిత్స ఇప్పించడం వల్ల తప్పనిసరిగా ఆమె పరిస్థితిలో మార్పు వస్తుంది. ప్రయత్నించి చూడండి.
డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి
సైకియాట్రిస్ట్,
మెడిసిటీ హాస్పిటల్స్, హైదరాబాద్