మానసిక ధైర్యంతో ముందుకు..
మలేసియాటౌన్‌షిప్: నిరాశ, నిస్పృహలతో బాధపడుతూ జీవితంపై విరక్తి చెందిన వారిలో మానసిక ధైర్యం నింపేందుకు కృషి చేస్తున్నామని పలు స్వచ్ఛందసేవా సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. ప్రపంచ ఆత్మహత్య నివారణ దినోత్సవం సందర్భంగాలయన్స్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో బుధవారం 2కే వాక్ అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఈ సందర్భంగా కేపీహెచ్‌బీ కాలనీ రాందేవ్‌రావు ఆస్పత్రి వద్ద ఏర్పాటు చేసిన అవగాహన శిబిరంలో పలువురు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దిగులు, ఒంటరితనం, నిస్సహాయత, నిరాశ, కుటుంబ, వ్యక్తిగత సమస్యలు ఆత్మహత్యకు దారితీస్తున్నాయన్నారు. ఆ సమయంలో ఆప్తులు, స్నేహితులు, తోటి నివాసితులు ఓదార్చి మనోధైర్యాన్ని ఇచ్చి ఆత్మహత్య ప్రయత్నంను నివారించవచ్చన్నారు. వీరికోసం ఆత్మహత్య నివారణ సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, 040-46004600 నంబర్‌కు సంప్రదించి వారిని ఈ కేంద్రంలో చేర్చాలన్నారు.
వారికి మానసిక ధైర్యాన్ని ఇచ్చే విధంగా చికిత్స చేస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి సినీ నటి రేష్మారాథోర్, నటుడు నవీన్‌చంద్ర ముఖ్య అతిథులుగా హాజరై 2కే వాక్‌ను ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు, స్థానికులు ఆత్మహత్యలను నివారించాలని నినాదాలు చేస్తూ జేఎన్టీయూ వరకు ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో రోషిణి ఫౌండేషన్ వ్యవస్థాపకులు టింకి భరద్వాజ్, మాక్రొ ఫౌండేషన్ సంస్థకు చెందిన సుబ్బారావు, మాక్రొ గ్రూపు డెరైక్టర్ మహేష్ మాల్‌నిధి, అరుణాచలం సంస్థ డెరైక్టర్ త్యాగరాజన్, సేవా స్వచ్ఛంద సంస్థ సెక్రటరీ జవహర్‌లాల్ నెహ్రూ, ఐపీడీజీ మల్టిపుల్ కౌన్సిల్ వైస్ చైర్‌పర్సన్ లయన్ దీపక్ భట్టాచార్‌జీ, వైడబ్ల్యూసీఏ ఆఫ్ సికింద్రాబాద్ సంస్థ కోశాధికారి నియోమి ఫ్రాన్సిస్, సీవోవీఏ సంస్థ డెరైక్టర్ మాజర్‌హుస్సేన్, లయన్స్ క్లబ్ జిల్లా గవర్నర్ ఎన్‌ఎన్. మూర్తి, జిల్లా ప్రెసిడెంట్ లయన్ ఈశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.