‘ఆరోగ్య స్పృహ’ మితిమీరితే..! | Orthorexia narvoja 'health-conscious' excess ..! | Sakshi
Sakshi News home page

‘ఆరోగ్య స్పృహ’ మితిమీరితే..!

Published Sun, Dec 1 2013 11:09 PM | Last Updated on Sat, Sep 2 2017 1:10 AM

‘ఆరోగ్య స్పృహ’ మితిమీరితే..!

‘ఆరోగ్య స్పృహ’ మితిమీరితే..!

ఏదైనా సరే అది మితంగానే ఉండాలి.  మంచి కూడా మితిమీరితే చెడు చేస్తుందనడానికి ఈ రుగ్మతే ఒక ఉదాహరణ. ఇటీవల ప్రతివారిలోనూ ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. దాంతో మనం తినేది మంచా, చెడా అని సరిచూసుకోవడమూ పెరిగింది. అది మంచిదే. కానీ కొంతవరకే. ఏది మంచిదో తర్కించుకోవడం ఒక స్థాయికి మించితే అది మనకు మేలు చేయదు సరికదా... మనల్ని సంశయానికి దారితీయిస్తుంది. సంక్షోభంలో పడేస్తుంది. ఇది అన్ని విషయాల్లోనూ కనిపించినా... ప్రధానంగా ఇటీవల మంచి ఆరోగ్యకరమైన ఆహారం అనే స్పృహ విపరీతంగా పెరిగి అది రుగ్మత స్థాయికి దారితీసింది. ఆ జబ్బుపేరే... ‘ఆర్థోరెక్సియా నర్వోజా’. ఇటీవల కొత్తగా పుట్టి, కొత్తగా పేరు పెట్టుకున్న కొత్త రుగ్మత గురించి అవగాహన కోసమే ఈ కథనం.  

 
 ఆర్థోరెక్సియా నర్వోజా గురించి తెలుసుకోడానికి ముందుగా కాస్త మనం దాని తల్లిదండ్రుల్లాంటి రెండు వ్యాధుల గురించి తెలుసుకోవాలి. అవే... అనొరెక్సియా నర్వోజా, బులీమియా.
 
 తాము అందంగా కనిపించాలన్న స్పృహ ఉన్న చాలామందికి ఈ వ్యాధుల గురించి ఇప్పటికే తెలుసు. కొందరిలో తాము లావెక్కితే అందంగా కనిపించమేమోనన్న స్పృహ మరింత పెరిగిపోతుంది, దాంతో తాము ఏ పదార్థాన్నీ ఇష్టపడకుండా పోతారు, అసలు ఒక దశలో ఆహారం అంటేనే అసహ్యించుకునే స్థాయికి చేరుతారు. రుగ్మత దశకు చేరిన ఆ స్థితి పేరే ‘అనొరెక్సియా నర్వోజా’. అంతకుముందు ఆరోగ్యంగా, అందంగా ఉన్నవారు కాస్తా... ఆ స్థితిని పోగొట్టుకోకూడదన్న పట్టుదలతో కొంచెం కొంచెం మాడుతూ క్రమంగా ఎముకలగూడులా మిగిలిపోతారు. ఒకదశలో ఇక వారికి ఆహారం అంటేనే అసహ్యం వేసి అన్నాన్ని ఎంతమాత్రమూ ముట్టుకోరు. ఈ కండిషన్‌ను అనొరెక్సియా నర్వోజా అంటారు.
 
 బులీమియా కూడా ఇంచుమించు ఇంతే. కాకపోతే వీళ్లు అసలు తినకుండా ఉండరు. రుచికోసం ఆహారాన్ని తింటారు. తిన్న వెంటనే కాసేపటికి దాన్ని వమనం చేసుకొని బయటకు పంపుతారు. అందం స్పృహ మితిమీరి, కోరి తెచ్చుకున్న ఇలాంటి కండిషన్‌ను ‘బులీమియా నర్వోజా’ అంటారు. మొదట తాము కోరి చేసుకుంటున్న వమనం కాస్తా... ఒక దశకు చేరాక తాము ఏది తిన్నా అది వాంతి రూపంలో బయటకు వెళ్తుంటుంది.
 
 ఈ రెండు కండిషన్లలాంటి స్థితే ‘ఆర్థోరెక్సియా’. అయితే అనొరెక్సియాలో అందానిది ప్రధాన భూమిక కాగా... ఆర్థోరెక్సియాలో ఆరోగ్యం ప్రధాన పాత్ర పోషిస్తుంది. అనొరెక్సియా, బులీమియా కండిషన్లలో అందం చెడకుండా ఉండటానికి ప్రాధాన్యమిచ్చేవారు ఈ కండిషన్‌కు లోనవుతుంటారు. ప్రధానంగా మోడలింగ్ చేసేవారు, బాలే డాన్సర్లు, యాక్టింగ్ వంటి వృత్తుల్లో ఉన్నవారు దీనికి లోనయ్యే ప్రమాదం ఉండగా... ఆరోగ్యస్పృహ మితిమీరిన ప్రతి ఒక్కరూ ఆర్థోరెక్సియాకు లోనయ్యే ప్రమాదం ఉంది.
 
 ఎలా కనుగొన్నారు ఈ జబ్బును...?


 ఇటీవలే యూనివర్సిటీ ఆఫ్ రోమ్‌కు చెందిన దాదాపు 400కు పైగా విద్యార్థులు ఒక సర్వే నిర్వహించారు. కేవలం అందంగా కనిపించడానికి ఆస్కారం ఉండే కొన్ని వృత్తుల్లో ఉన్నవారికి మాత్రమే గతంలో పరిమితమైన అనొరెక్సియా, బులీమియా రుగ్మతలు ఇప్పుడు తాము సర్వే జరిపిన శాంపిల్‌లో దాదాపు 7 శాతం మందికి పైగా ఉన్నట్లు కనుగొన్నారు. దీనికి తోడు ఈ రెండు వ్యాధులూ కలగలసి ఉన్న ఒక కొత్త రుగ్మతను కలిగి ఉన్న వారు సైతం తాము సర్వే నిర్వహించిన జనాభాలో ఉన్నట్లుగా వారు గ్రహించారు. ఆరోగ్యానికి వారిచ్చే ప్రాధాన్యాన్ని తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ రోమ్ విద్యార్థులు రూపొందించుకున్న ప్రశ్నావళి ఆధారంగా ఈ కొత్త జబ్బు ఉన్నవారి సంఖ్య చాలా ఎక్కువగా ఉందని వారికి తెలిసింది. పైగా ఇదో దీర్ఘకాలిక రుగ్మత అన్న విషయం కూడా వారికి అర్థమైంది. నిజానికి తమ ప్రమేయం లేకుండానే తమకు తెలిసి వచ్చిన సరికొత్త వ్యాధి ఇదని వారు తెలుసుకున్నారు. ఇలాంటి లక్షణాలను డాక్టర్ స్టీవెన్ బ్రాట్‌మేన్ ‘ద ఫుడ్ ఆఫ్ జంకీస్’ అనే పుస్తకంలో ఉటంకించారు.
 
 ఆర్థోరెక్సియా నర్వోజా అంటే ఏమిటి...?


 ఇటీవల టీవీల్లో, వార్తాపత్రికల్లోని హెల్త్ కాలమ్స్‌లో ఆరోగ్యం గురించిన కథనాలు ఎక్కువగా వస్తున్నాయి. ప్రజల ప్రాథమిక అవగాహన కోసం రాసిన విషయాలను... ఆ మేరకే పరిమితం చేసుకోకుండా కొందరు వాటిని చాలా సీరియస్‌గా తీసుకుంటుంటారు. అనారోగ్యకరమైనవిగా తాము భావించే పదార్థాలను అస్సలు ముట్టుకోకపోవడం, ఏది తిన్నా అది ఆరోగ్యకరమైనదో, కాదో అంటూ ఆందోళన పడుతుండటం, ఆ ఆందోళన స్థాయి మితిమీరి మానసిక వ్యాకులతకు దారితీయడం వంటివి జరిగితే అదే... ‘ఆర్థోరెక్సియా నర్వోజా’. మరికొందరైతే తాము తీసుకునే ఆహారంలో ఎలాంటి రంగులు కలిపారో, ఎలాంటి ప్రిజర్వేటివ్ కలిపారో, ఎలాంటి చోట్ల వండారో, వాటి వల్ల మనకు ఎలాంటి జబ్బులు వస్తాయో అంటూ ఆందోళనను అధికం చేసుకుంటుంటారు.
 
 ఎలా ఉంటాయి దీని లక్షణాలు...?

 ఆర్థోరెక్సియా నర్వోజా లక్షణాలు మనలో ఉన్నాయేమో అని పరిశీలించుకోవడం సులభం. సాధారణంగా మనందరికీ ఆరోగ్యసూత్రాలు బాగా తెలిసే ఉంటాయి. ఉదాహరణకు...
 ఉప్పు ఎక్కువగా తినకూడదు  
 నూనెలు ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి  
 పిజ్జాలు, బర్గర్లు అనారోగ్య హేతువులు  
 చక్కెర ఎక్కువ తింటే అనర్థమే  
 జంక్‌ఫుడ్ తింటే జబ్బులే  
 బయటి పదార్థాలు తినడం అంటే జబ్బును కోరితెచ్చుకోవడమే... లాంటివి.
 
 ఇక పైన చెప్పిన కొన్ని సాధారణ సూత్రాలను మితిమీరి పాటిస్తుంటే మనలో ఆర్థోరెక్సియా వృద్ధి చెందుతున్నట్లే. ఉదాహరణకు ఉప్పు ఎక్కువగా తినకూడదనేది మంచి ఆరోగ్యసూత్రం. కానీ ఏదో ఒక సందర్భంలో ఒక అప్పడమో లేదా రుచి కోసం కాస్తంత ఆవకాయో తిన్నారనుకుందాం. అప్పట్నుంచీ మీలో అపరాధ భావన మొదలవుతుంటుంది. మనం తిన్న ఉప్పు కిడ్నీలను దెబ్బతీస్తుందేమో, దీనివల్ల మనలో రక్తపోటు పెరిగిపోతుందేమో అన్న భావన మితిమీరుతుంది. అలాగే నూనె ఎక్కువగా తినకూడదనే స్పృహ పెరిగిపోయాక, తాము తిన్న పదార్థాల్లో నూనె పాళ్లు ఎంత ఉన్నాయో, వాటివల్ల బరువు పెరిగిపోతుందేమో అంటూ ఆందోళన చెందుతారు. ఏదైనా పార్టీకి వెళ్లినప్పుడు... చాక్లెట్, ఐస్‌క్రీమ్ తిన్నా దానివల్లనే తమకు డయాబెటిస్ వస్తుందేమో అనే ఆందోళన. ఇలాంటి ఆందోళనలన్నీ పెచ్చుమీరిపోయి... ఎవరు చాక్లెట్, ఐస్‌క్రీమ్ లాంటి వాటిని ఇచ్చినా లేదా ఎవరైనా ఏదైనా తినే పదార్థాన్ని ఆఫర్ చేసినా దాన్ని తిరస్కరిస్తూ పోతుంటారు. దీన్నే ‘హైపర్ యాక్యురసీ’గా పేర్కొంటారు. ఈ హైపర్ యాక్యురసీ భావనను అధిగమించడానికి తాము రోజూ చేయాల్సిన దానికంటే మరింత ఎక్కువగా వ్యాయామం చేస్తూ ఉండటం, ఈ వ్యాయామం తాము తిన్న ఆహారాన్ని పూర్తిగా కాల్చి వేసిందో లేదో అంటూ దాన్ని కొనసాగిస్తూ తమను తాము బాధపెట్టుకుంటూ ఉంటారు. ఈ బాధపెట్టుకోవడం అన్నది క్రమంగా తమను తాము వ్యాయామంతో  హింసించుకునే స్థాయికి చేరుతుంది.
 
 ఆధ్యాత్మిక ఆర్థోరెక్సియా కూడా ఉంటుందా?


 మన సమాజంలో కొన్ని ఆహారపు అలవాట్లను పవిత్రమైనవిగా పరిగణిస్తారు. ఉదాహరణకు పాలు, నెయ్యి,అరటిపండు, కొబ్బరిముక్కలు లాంటివి మన సమాజంలో పవిత్రమైన ఆహారాలు. మన ఆధ్యాత్మిక సంప్రదాయాల్లో ప్రాధాన్యం ఉంటుంది. ప్రతి శుక్రవారం పూజ నిర్వహించి, అరటిపండు, కొబ్బరిముక్కలను చిన్న ముక్కలుగా చేసి, వాటిపై చక్కెర జల్లి ప్రసాదం రూపంలో ఇవ్వడం పరిపాటి. ఇక కొన్నిప్రసాదాల్లో తియ్యటి బూంది, జీడిపప్పు వంటివి ఉండటం సహజమే. వాటిలోని కొన్నిపోషకాలు హానికరమైనవంటూ ఎక్కడైనా చదవడమో లేదా ఏ టీవీ కార్యక్రమంలోనైనా చూడటమో జరుగవచ్చు. దాంతో అనేక అనుమానాలు కలుగుతుంటాయి. ఉదాహరణకు... ‘‘పాలల్లో ఏదో ఒక మేరకు కొలెస్ట్రాల్ లాంటి కొవ్వుపదార్థాలు ఉంటాయి.

 

అందుకే కొవ్వు లేని పాలు తాగాలి. ఇక నెయ్యిలో పూర్తిగా శాచ్యురేటెడ్ కొవ్వులే ఉంటాయి. అవి ఆరోగ్యానికి మంచిది కాదు. అరటిపండులో కార్బోహైడ్రేట్స్, చక్కెర పాళ్లు ఎక్కువ. అది డయాబెటిస్‌కు దారితీయవచ్చు. పైగా ప్రసాదం పైన చక్కెర జల్లడం వల్ల అది మరింత ప్రమాదకారి కావచ్చు’’ లాంటి భావనలు పెరిగి, కొద్ది ప్రమాణాల్లో తీసుకునే ప్రసాదం కూడా వారికి హానికరంగానే అనిపిస్తుంది. ఈ  భావన ఎంతగా పెరుగుతుందంటే ఒక్కోసారి టీ, కాఫీలలో చక్కెర ఎక్కువైతే అది ఎక్కువైన మేరకు హాని చేస్తుందనీ, ఆ హానిని తొలగించేందుకు ఆ చక్కెరను బర్న్ చేయడానికి, ఏ పనీ లేకపోయినా మరో రెండుమూడుసార్లు  మెట్లు ఎక్కడం దిగడం చేస్తుంటారు.
 
 అయోమయం, అపరాధభావన కలగలిసి...


 ప్రసాదంలోని పాలు, నెయ్యి, అరటి, కొబ్బరిలాంటి పదార్థాలను పవిత్రంగా స్వీకరించాల్సినవన్న ఫీలింగ్ మనలో ఉంటుంది. ప్రసాదం కాబట్టి తిరస్కరించకూడదన్న భావన ఒకవైపు, పాలలోని కొలెస్ట్రాల్, అరటిలోని చక్కెర, నెయ్యి, కొబ్బరిలోని కొవ్వుపదార్థాలు ఆరోగ్యానికి శత్రువులు కాబట్టి వాటిని తీసుకోవడమా, మానడమా అన్న సందిగ్ధత మరోవైపు! ఇక తీసుకోకూడదన్న ఆలోచన వచ్చినందుకు గిల్టీఫీలింగ్ వస్తుంది. దాంతో  తాము భగవంతుడి పట్ల ద్రోహచింతనతో మెలుగుతున్నామనే అపరాధ భావన పెరిగి అది మానసిక క్షోభకు దారితీస్తుంది. క్రమంగా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ (ఓసీడీ) భావనలూ పెంపొందుతాయి. అవి యాంగ్జైటీకి దారితీసి...అన్నీ కలగలసి ఆర్థోరెక్సియా నర్వోజాకు దారితీస్తాయి.  
 
 తమకు తామే సామాజిక బహిష్కరణ చేసుకునే తీరిది...


 ఆర్థోరెక్సియా నర్వోజా భావనలు బలంగా వృద్ధి చెందుతున్న / చెందిన వారు క్రమంగా తమకు తాము సామాజిక బహిష్కరణ శిక్ష వేసుకుంటారు. సాధారణంగా కొనుగోలు చేయాల్సిన ఆహారపదార్థాల కోసం ఆర్గానిక్ పదార్థాలు దొరికే షాపింగ్ మాల్స్ లేదా ప్రదేశాల కోసం వెతుకుతుంటారు. అవి ఆర్గానిక్‌గా పండించినవేనా అని పదే పదే తెలుసుకుంటుంటారు. వాటి  నాణ్యత గురించి షాపుయజమానులతో మితిమీరి వాకబు చేస్తుంటారు.  ఇక బయట ఎక్కడైనా రెస్టారెంట్‌లో తినాల్సి వస్తే వారు ఎలాంటి ఆహారాలను ఎంపిక చేశారో, అవి మంచివో-కావో, బాగా వండారో-లేదో, ఎలాంటి నూనెలు వాడరో, అవి ఆరోగ్యవంతమైనవి కాకపోవచ్చేమో అనే భావనలు క్రమంగా పెరుగుతాయి. దాంతో ఇంటివంటకే పరిమితమై, ఇంట్లోనూ వంట సమయంలో అతి పర్ఫెక్షన్‌కు ప్రాధాన్యమిస్తుంటారు.
 
 నిజానికి ఆరోగ్యస్పృహ ఉండటం మంచిదేగాని మితిమీరిన ఆరోగ్య స్పృహ ఆరోగ్యకరం కాదని గ్రహించాలి. అప్పుడే మనం పూర్తి ఆరోగ్యంగా ఉండగలం.
 
 -నిర్వహణ: యాసీన్
 
 బయట పడటం ఎలా...?

 తమకు తాము కౌన్సెలింగ్ చేసుకోవడం, ఆరోగ్య స్పృహ ఉండటం తప్పు కాదని, అయితే అది మితిమీరేలా చేసుకొని కోరి కోరి తమకు తామే శారీరక, మానసిక అనారోగ్యాలు తెచ్చుకోవడం సరికాదని గ్రిహ స్తే, ఈ ఆర్థోరెక్సియా నుంచి బయటపడటం చాలా తేలిక. అయితే ఒక్కోసారి తమను తాము అధిగమించలేని పరిస్థితుల్లో మాత్రం మానసిక నిపుణుల/ప్రొఫెషనల్స్ సలహా/కౌన్సెలింగ్ తీసుకోవాలి. ఇదెంతో తేలికగా అధిగమించదగిన సమస్యగా భావిస్తుండాలి.
 
 డాక్టర్ కల్యాణ్
 సైకియాట్రిస్ట్, స్టార్ హాస్పిటల్స్,
 బంజారాహిల్స్,  హైదరాబాద్

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement