ఆమెలోని విపరీత ధోరణి మారేదెలా?
నేనొక సాఫ్ట్‌వేర్ కంపెనీకి డెరైక్టర్‌ని. అందమైన భార్య, బుద్ధిమంతులైన పిల్లలు, అంతా సంతోషంగా గడిచిపోతోందనుకుంటున్న తరుణంలో జరిగిన కొన్ని సంఘటనలు మా కుటుంబాన్ని కూల్చేలా పరిణమించాయి. ఏమిటంటే... ఉద్యోగరీత్యా నేను తరచు క్యాంప్‌లకు వెళుతుంటాను. ఒక్కోసారి రోజుల తరబడి ఇంటికి దూరంగా ఉండవలసి వస్తుంటుంది. ఈ తరుణంలో ఒకసారి నా భార్య నా స్నేహితునితో చాలా ‘క్లోజ్’గా ఉండ గా నా తల్లిదండ్రుల కంటబడింది. తనని క్షమించమని, ఇంకెప్పుడూ అలా చెయ్యనని ప్రాధేయపడింది. కొన్నాళ్లకు అంతా సజావుగా ఉందనుకునేంతలోనే మరో‘సారీ...’ మామూలుగా ఆమె చాలా మంచిది. కానీ ఈ ఒక్క విషయంలోనే... ఏదైనా తీవ్రనిర్ణయం తీసుకుంటే నా పిల్లలు బాధపడతారని ఆలోచిస్తున్నాను. ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో పాలుపోవడం లేదు. దయచేసి తగిన సలహా ఇవ్వగలరు.
- అజిత్, హైదరాబాద్
మీ శాంతం, సహనం ప్రశంసనీయం. పిల్లల భవిష్యత్తు కోసం మీరు తీసుకున్న నిర్ణయం మెచ్చదగ్గది. మీది చాలా నిశితంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవలసిన తీవ్రమైన సమస్య. మీరు చెప్పిన లక్షణాలను బట్టి మీ భార్య సైక్లోథైమిక్ డిజార్డర్ అనే సమస్యతో బాధపడుతోందని అర్థమవుతోంది. ఇది బైపోలార్ డిజార్డర్‌కు తీవ్రరూపం. ఈ స్థితిలో పేషెంట్లు రకరకాలైన భావోద్వేగాలు కలగలసిన మైండ్‌తో ఉంటారు.
మంచి మూడ్‌లో ఉన్నప్పుడు చాలా ఉల్లాసంగా ఉంటూ, మంచి పనులు చేయాలని కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు దూసుకుపోతారు. ఈ ప్రపంచాన్నే జయించగలమన్నంత ఉత్సాహంతో, ఆత్మవిశ్వాసంతో ఉంటారు. ఆ సమయంలోనే కొత్త కొత్త స్నేహితులను, సంబంధాలను పెంచుకుందామనుకుంటారు. ఒకదశలో అది శృతిమించి, వారితో రకరకాలైన రిలేషన్స్‌ను పెంచుకునే స్థాయికి వెళతారు. ఒకవేళ వారు ఇంటర్‌నెట్‌ను,
సోషల్ నెట్‌వర్కింగ్ వెబ్‌సైట్లను వాడేవారైతే గనుక ఈ ధోరణి వెర్రితలలు వేస్తుంది. అపరిచితులను కూడా ఇంటికి ఆహ్వానించేంత తీవ్రస్థాయిలో వీరి భావోద్వేగాలుంటాయి. ఆ స్నేహితులు వీరి మూడ్‌ను అదనుగా చేసుకుని క్యాష్ చేసుకుంటే మనం చేయగలిగిందేమీ ఉండదు. అదే వీరి మూడ్ బాగోకపోతే మాత్రం నిరుత్సాహం, నిరాశానిస్పృహలతో కుంగిపోతారు. తమవల్ల ఏదైనా చిన్న తప్పు జరిగినా, అందుకు పదే పదే క్షమాపణలు కోరతారు. ఒకోసారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లి, నిస్సహాయ ధోరణికి మారిపోతారు. ఆత్మన్యూనతతో బాధపడుతుంటారు. ఒక తరుణంలో ఆత్మహత్యకు కూడా పాల్పడతారు.
కుటుంబసభ్యులు ఇటువంటి పేషెంట్లలోని మూడ్స్‌ను గమనించి, అందుకు అనుగుణంగా నడుచుకోవడం అవసరం. వారిని తీవ్రంగా మందలించడం, కోప్పడటం వల్ల ఏమాత్రం ప్రయోజనం ఉండకపోగా, మరింత కుంగిపోతారు. మీ శ్రీమతి స్వతహాగా మంచిదేనంటున్నారు, స్వభావం కూడా చెడ్డది కాదంటున్నారు కాబట్టి, ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుంటే ఆమె ఎందుకిలా ప్రవర్తిస్తోందో అర్థమవుతుంది. ఇదే సమయంలో మీ శ్రీమతి విషయంలో మీరు సానుభూతి చూపడం, క్షమాగుణంతో వ్యవహరించడాన్ని కొనసాగించడం అవసరం. ఆమెను వెంటనే సైకియాట్రిస్ట్‌కు చూపించి, వారి సలహా మేరకు మెడికల్ ట్రీట్‌మెంట్, కౌన్సెలింగ్ ఇప్పించండి. విష్ యు ఆల్ ది బెస్ట్.
డాక్టర్ కల్యాణ్
సైకియాట్రిస్ట్, మెడిసిటీ హాస్పిటల్స్, సెక్రటేరియట్ రోడ్, హైదరాబాద్