మా అమ్మాయి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో అర్థం కావట్లేదు..?
మా అమ్మాయి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో అర్థం కావట్లేదు..?
Published Fri, Aug 9 2013 10:52 PM | Last Updated on Fri, Sep 1 2017 9:45 PM
మాకు ఒక్కగానొక్క కూతురు. ఇటీవలే ఆమెకు పెళ్లి చేశాం. మా అల్లుడు అందగాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, దురలవాట్లేమీ లేవని నిర్థారించుకున్న తర్వాతనే సంబంధం కుదుర్చుకున్నాం. అయితే మా అమ్మాయి ఒక భయంకరమైన విషయం చెప్పింది. భర్త తనతో ఇంతవరకు శారీరకంగా కలవలేదట. ఎప్పుడూ ఫోన్‌లో మెసేజెస్ చూసుకుంటూ తన ఫోన్‌ని చాలా జాగ్రత్తగా దాచిపెడతాడట. నిలదీస్తే తనకు స్వలింగసంపర్కం అలవాటుందని (గే), ఆ అలవాటు నుంచి బయట పడాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ పెళ్లి చేసుకున్నాడని, అయితే ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతున్నానని, తనని క్షమించమని అడిగాడని చెప్పింది. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి తగిన సలహా చెప్పగలరు.
- ఒక తండ్రి, హైదరాబాద్
ఈ విషయంలో మీరేమీ ఆందోళన పడవద్దు. ఇటీవల కాలంలో పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల ఇటువంటి అలవాట్లు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఇటువంటి వారికి బాల్యంలో జరిగే కొన్ని సంఘటనలు, అనుభవాల వల్ల వారు ఈ విధంగా తయారవుతున్నారు.
కొందరి విషయంలో కొన్ని జన్యు సమస్యల వల్ల ఇలా జరుగుతుంటుంది. నా దగ్గరకు ఇలాంటి కేసులు చాలా వ స్తున్నాయి. అయితే మీ విషయంలో కొంతలో కొంత మెరుగు ఏమిటంటే... మీ అల్లుడికి తను చేసేది తప్పని తెలుసు, పైగా చేస్తున్న పనికి పశ్చాత్తాపపడటం, దాని నుంచి బయటకు రావాలని ప్రయత్నించటం. ఇటువంటి అలవాట్లు ఉన్నవారు చాలామంది ముందు అసలు బయటపడరు.ఒకవేళ బయటపడినా తమ జీవితభాగస్వామి మీదనే ఏవో ఒక నిందలు మోపి, అటు తమ జీవితాన్ని, ఇటు భాగస్వామి జీవితాన్ని కూడా దుర్భరం చేస్తారు.
మీరు ఈ విషయాన్ని అందరికీ చెప్పి, పదిమంది చేత అతనికి హితబోధలు, నీతులు చెప్పించి, సమస్యను మరింత జటిలం చేసుకోవద్దు. మీ అమ్మాయికి కూడా ఇదే విషయం చెప్పండి. ముందు అతనికి ఆపోజిట్ సెక్స్ అంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోండి. ఏదోవిధంగా అతని ఫోన్ కాంటాక్ట్స్ కట్ చేయండి. మీ అమ్మాయి భర్తతో బాగా ప్రేమగా ఉంటూ, మంచిగా దారిలోకి తెచ్చుకోవాలి. మీ అల్లుడికి బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఆందోళన పడకుండా, సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి.
డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి
సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్
Advertisement
Advertisement