Spouse
-
'గారం' భారంగా.. మన మధ్య పిల్లలెందుకు?!
భార్యాభర్తలకు పిల్లలు భారమవుతున్నారు. అందుకే పలు జంటలు పిల్లల్ని వద్దనుకుంటున్నాయి. ఇద్దరూ కష్టపడి సంపాదించినా బతకడమే కష్టమవుతున్న ఈ రోజుల్లో పిల్లలను కనీ పెంచి.. వారిని ప్రయోజకుల్ని చేయడం పెనుభారంగా మారుతోంది. లక్షలకు లక్షలు పోసి వారిని చదివించాలంటేనే వెన్నులో వణుకుపుడుతోంది. ఇక వారి ఆలనా పాలనా చూడటంతోనే తమ జీవితమంతా కరిగిపోతోందని జంటలు భయపడుతున్నాయి. అందుకే పలువురు భార్యాభర్తలు అసలు పిల్లలే వద్దనుకుంటున్నారు.పూర్వకాలంలో పిల్లల్ని కనడానికి ఎలాంటి నిబంధనలూ ఉండేవి కావు. భార్యాభర్తలు ఎంతమందినైనా కనొచ్చు. పది, పదిహేను మంది పిల్లల్ని కనేవారు. ముగ్గురు, నలుగురు పిల్లలుండటం అనేది సర్వసాధారణం ఆ రోజుల్లో. అంతెందుకు షాజహాన్ ప్రేమతో తాజ్‌మహల్ కట్టేలా చేసిన ముంతాజ్‌కు పద్నాలుగు మంది పిల్లలు. భారతంలో కుంతీదేవికి ఆరుగురు కుమారులు, రామాయణంలో దశరధుడికి నలుగురు సంతానం. ఇక ఎన్టీ రామారావుకి 12 మంది పిల్లలు. ఇక ఇద్దరు ముగ్గురు పిల్లల్ని కన్న వారి సంఖ్య లెక్కే లేదు. అలాంటి మన కుటుంబ వ్యవస్థలోకి ఇప్పుడు డ్యుయల్ ఇన్‌కం నో కిడ్స్(డింక్) సంస్కృతి చొచ్చుకొచి్చంది. భార్యాభర్తలు ఉద్యోగం చేసి వచి్చన డబ్బుతో జీవితంలో స్థిరపడాలనుకుంటున్నారు. పిల్లలు వద్దనుకుంటున్నారు. దీనినే డింక్ విధానంగా పిలుస్తున్నారు. ఇప్పుడిది దేశంలోనూ వేగంగా విస్తరిస్తోందని ఇటీవల విడుదలైన ‘లాన్సెట్ నివేదిక’ స్పష్టం చేసింది. పాశ్చాత్య దేశాల్లో ఇప్పటికే బాగా ఇది విస్తరించింది. ఇక మన దేశంలో నగరాలు, పట్టణాలు దాటి గ్రామాల్లోనూ వేగంగా చొచ్చుకొస్తోంది. ఈ డింక్స్ కల్చర్ వలన 2050 నాటికి 90 దేశాల్లో జనాభా తగ్గిపోయే అవకాశాలున్నాయని ఐక్యరాజ్య సమితి పాపులేషన్ డేటా విశ్లేషణ ఆధారంగా ప్యూ రీసెర్చ్ సెంటర్ ప్రకటించింది.కోరికలను చంపుకొని..పిల్లల్ని పెంచడం కోసం రుణాలు తీసుకోవడం, ఈఎంఐలు కట్టడమే భార్యభర్తలకు సరిపోతుంది. దీంతో చాలా మంది తమ వ్యక్తిగత స్వేచ్ఛకు దూరం కావాల్సి వస్తోంది. ఫలితంగా ఒత్తిడికి లోనై, మానసిక ఆందోళనలు, కోరికలు చంపుకొని నిరాశ నిస్పృహలకు లోనవుతున్నారు. బ్రూకింగ్స్ అనే సంస్థ చేసిన అధ్యయనం ప్రకారం.. ఒక బిడ్డను 17 ఏళ్ల వయసు వచ్చే వరకు పెంచాలంటే దాదాపు 3 లక్షల డాలర్లకు పైగా ఖర్చవుతుంది. పిల్లల చదువులు, వైద్య ఖర్చులకే డబ్బంతా ఖర్చయితే తమ పరిస్థితేంటని నేటి తరంలో దాదాపు 61 శాతం మంది భార్యాభర్తలు ఆలోచిస్తున్నట్లు అధ్యయనంలో వెల్లడైంది. ప్యూ రీసెర్చ్ సెంటర్ చేసిన సర్వే ప్రకారం.. 18 నుంచి 49 ఏళ్ల వయస్సు ఉన్న డింక్ జంటల్లో 44 శాతం మంది పెరుగుతున్న జనాభా వాతావరణ సమస్యగా మారకూడదనే ఉద్దేశంతో పిల్లలను కనడం లేదని వెల్లడించారు.మనదేశంలోనూ వేగంగా..మన దేశంలోనూ డింక్ కల్చర్ వేగంగా పెరుగుతోంది. ఉత్తరాదితో పోలి్చతే దక్షిణాదిలోనే ఇది ఎక్కువగా ఉంది. లాన్సెట్ నివేదిక ప్రకారం..1950లో భారత్‌లో సంతానోత్పత్తి రేటు 6.18 శాతంగా ఉండగా, ఇది 1980 నాటికి 4.60కు చేరింది. 2021లో 1.91 శాతానికి పడిపోయింది. మన దేశంలో 30 శాతం మంది డింక్ సంస్కృతిని అవలంబిస్తున్నారు. ఇందులో మరో ఆశ్చర్యమేంటంటే.. పట్టణాల్లో 22 శాతం మంది డింక్‌లుగా మారితే, గ్రామాల్లో 42 శాతం మంది ఉన్నారు. యుక్త వయసులో బానే ఉంటుంది గానీ.. సామాజిక మాధ్యమాల ద్వారా ఎక్కువగా ప్రాచుర్యంలోకి వచ్చి విస్తరిస్తున్న డింక్ సంస్కృతి వల్ల పిల్లలు లేకుండా జీవించడం యుక్త వయసులో బానే ఉంటుంది.. కానీ కొన్నేళ్ల తర్వాత అందరూ ముసలివాళ్లే మిగులుతారు. వారి ఆలనా పాలనా చూసేందుకు ఎవరూ ఉండరు. దంపతుల్లో ఒకరు మరణిస్తే మరొకరు ఒంటరిగానే బతకాలి. అది వారికి నరకంగా మారుతుంది. అలాగే కుటుంబం, సమాజంలోనూ సహజత్వంలో మార్పు వస్తుంది. ఇది సమాజంలోని విలువలు, సంప్రదాయాలను కూడా ప్రభావితం చేస్తుంది. -
మాకు ఎన్నాళ్లీ శిక్ష?
సాక్షి, హైదరాబాద్: వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న తమను ఒకేచోటుకు బదిలీ చేయాలంటూ 13 జిల్లాల స్పౌజ్ ఉపాధ్యాయులు పిల్లలతో కలసి సోమవారం హైదరాబాద్‌లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయం ముందు చేపట్టిన మౌనదీక్ష ఉద్రిక్తతకు దారి తీసింది. దీక్ష చేస్తున్న ఉపాధ్యాయ దంపతులను పోలీసులు అదుపులోకి తీసుకొని వివిధ పోలీసు స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా పోలీసులు, ఉపాధ్యాయులకు మధ్య పెనుగులాట చోటుచేసుకుంది. మహిళలని కూడా చూడకుండా బలవంతంగా లాక్కెళ్లి పోలీసు వ్యాన్లు ఎక్కించడాన్ని ఉపాధ్యాయ దంపతులు తీవ్రంగా ప్రతి ఘటించారు. గాంధీ జయంతి సాక్షిగా ఈ తరహా పోలీసు దౌర్జన్యం సరికాదంటూ నినదించారు. 317 జీవో అమల్లో భాగంగా గతేడాది ఉపాధ్యాయ భార్యాభర్తలను వేర్వేరు జిల్లాలకు బదిలీ చేశారు. దీనిపై తీవ్ర నిరసన వ్యక్తమవడంతో కొన్ని జిల్లాల స్పౌజ్ కేసులను పరిష్కరించారు. కానీ ఇప్పటికీ 13 జిల్లాల స్పౌజ్‌ల బదిలీలు పెండింగ్‌లోనే ఉన్నాయి. దీనిపై ప్రభుత్వానికి వారు అనేకసార్లు విజ్ఞప్తి చేశారు. తాము తీవ్ర మనోవేదనతో ఉన్నామని, కిలోమీటర్ల దూరంలో భార్య ఒకచోట, భర్త ఒకచోటపనిచేయడం సమస్యగా మారిందని, పిల్లల ఆలనాపాలన చూసే దిక్కులేకుండా పోయిందని ప్రభుత్వానికి విన్నవించారు. అయినప్పటికీ దీనిపై ప్రభుత్వం స్పందించకపోవడంతో పాఠశాల విద్యాశాఖ కార్యాలయం ఎదుట మౌనదీక్షకు దిగారు. మాకెందుకీ అన్యాయం గత జనవరిలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలు మాత్రమే చేపట్టారు. ఇంకా 1500 మంది బదిలీలకు నోచుకోక అనేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రజాస్వామ్య పద్దతిలో దీక్ష చేస్తుంటే అరెస్టులు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం మా సమస్యను సానుభూతిలో పరిష్కరించాలి. – నరేశ్, స్పౌజ్ ఫోరంకో–కన్వీనర్ మానసిక క్షోభకు పరిష్కారం లేదా? గత 22 నెలలుగా ఉపాధ్యాయ దంపతులు బదిలీల్లేక మానసిక క్షోభకు గురవుతున్నారు. ఈ పరిస్థితికి పరిష్కారం లేదా అనే అనుమానం కలుగుతోంది. పెద్ద మనసుతో వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించాలి. – వివేక్, స్పౌజ్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు -
నామినీ నమోదు చేశారా?
ప్రతి ఒక్కరి జీవితంలో పెట్టుబడులకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది. తమ సంపదను వృద్ధి చేసుకునేందుకు ఎన్నో రూపాల్లో ఇన్వెస్ట్ చేస్తుంటారు. సొంతిల్లు సమకూర్చుకోవాలని, వారసులకు బంగారు భవిష్యత్తును ఇవ్వాలని.. ఇలాంటి ముఖ్యమైన ఎన్నో జీవిత లక్ష్యాల కోసం పలు రకాల సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంటారు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, డిపాజిట్లు, బాండ్లు, జీవిత బీమా ప్లాన్లు, పీపీఎఫ్ ఇలా ఎన్నో ఆర్థిక సాధనాలు వ్యక్తుల ఆర్థిక ప్రణాళికల్లో భాగంగా ఉంటాయి. అయితే, జీవితం ఎప్పుడు ఎలాంటి మలుపు తీసుకుంటుందో చెప్పలేం. దురదృష్టం కొద్దీ ఈ సాధనాల్లో ఇన్వెస్ట్ చేసిన వారికి ఏదైనా ప్రమాదం జరిగితే ఏంటి పరిస్థితి? ఆ పెట్టుబడులనేవి జీవిత భాగస్వామి లేదా వారసులకు సాఫీగా, సులభంగా, వేగంగా బదిలీ అవ్వాలి. అందుకు ఓ చిన్న పని చేయాల్సి ఉంటుంది. అదే నామినేషన్ నమోదు చేయడం. తమకు అత్యంత ఆప్తులైన వారిలో ఒకరి పేరును నామినీగా ప్రతి పెట్టుబడి సాధనంలోనూ నమోదు చేయాలి. నామినేషన్ లేని సందర్భాల్లో క్లెయిమ్ కోసం పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. కనుక నామినేషన్ ప్రాధాన్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. నామినీ అంటే ఎవరు..? పెట్టుబడిదారు మరణించిన సందర్భాల్లో వారి పేరిట ఉన్న పెట్టుబడులను క్లెయిమ్ చేసుకుని, వాటిని పొందే హక్కును కలిగిన వ్యక్తి నామినీ అవుతారు. ఎక్కువ మంది నామినీగా కుటుంబ సభ్యులనే ముందుగా నియమించుకుంటారు. జీవిత భాగస్వామి లేదా పిల్లలు లేదా తల్లిదండ్రులు నామినేషన్ విషయంలో ప్రథమ ఎంపికగా ఉంటారు. అవివాహితులై, తల్లిదండ్రులు, తోడబుట్టిన వారు కూడా లేని సందర్భాల్లో అత్యంత సన్నిహితులు, నమ్మకస్తులైన వారిని, స్నేహితులను నామినీగా నియమించుకోవచ్చు. నామినీకి ఎవరు అయినా అర్హులే. కాకపోతే అంతిమంగా దీని ప్రయోజనం నెరవేరేలా నామినేషన్ ఉండాలన్న అంశాన్ని మర్చిపోవద్దు. ఒకవేళ నామినీగా మైనర్‌ను పేర్కొంటే, సంబంధిత నామినీ సంరక్షకుడి పేరు, చిరునామా, కాంటాక్ట్ వివరాలు ఇవ్వాలి. ఎంతో ప్రాధాన్యం.. 3నామినేషన్ నమోదు చేసిన వ్యక్తి మరణించిన సందర్భంలో.. అతని పేరిట ఉన్న పెట్టుబడులు నామినీకి చాలా సులభంగా బదిలీ అవుతాయి. నామినీని నమోదు చేయకపోతే.. అప్పుడు ఆ పెట్టుబడులను వారసులే క్లెయిమ్ చేయగలరు. చట్ట ప్రకారం తామే వారసులమని ధ్రువీకరణ పత్రం ఇవ్వాలి. వీటిని స్థానిక తహసీల్దార్ లేదా కోర్టు నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సమయంతోపాటు, శ్రమ కూడా పడాలి. ముఖ్యంగా కోర్టు నుంచి లీగల్ హేర్ సర్టిఫికెట్ తీసుకుని సమర్పించాల్సి ఉంటుంది. నామినేషన్ రిజిస్టర్ చేస్తే ఇలాంటి ఇబ్బందులేమీ ఉండవు. పెట్టుబడిదారు డెత్ సర్టిఫికెట్ ఒక్కటి సరిపోతుంది. ఒక అప్లికేషన్, దానికితోడు కేవైసీ వివరాలు సమర్పిస్తే చాలు. ప్రక్రియ సులభంగా ముగుస్తుంది. వేటికి?..: బీమా పాలసీ తీసుకోవడం వెనుక ఉద్దేశం తమకు ఏదైనా జరిగితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బంది పడకూడదనే. అంత ముఖ్యమైన బీమా ప్లాన్ దరఖాస్తులో నామినేషన్ నమోదు చేయకపోతే? అర్థమే ఉండదు. అలాంటప్పుడు పరిహారం దక్కించుకునేందుకు కుటుంబ సభ్యులు శ్రమ పడాల్సి వస్తుంది. అలాగే బ్యాంకు ఖాతాకు సైతం నామినేషన్ ఉండాలి. అప్పుడు ఖాతాలో బ్యాలన్స్ మొత్తాన్ని నామినీ సులభంగా పొందడానికి వీలవుతుంది. అకౌంట్ హోల్డర్ మరణ ధ్రువీకరణ పత్రంతోపాటు, నామినీ కేవైసీ వివరాలను బ్యాంకు శాఖలో సమర్పించడం ద్వారా వాటిని సొంతం చేసుకోవచ్చు. అలాగే, బ్యాంకు ఫిక్స్డ్ డిపాజిట్లలోనూ నామినేషన్ ఉండాలి. ఇంకా పీపీఎఫ్, మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ ట్రేడింగ్, డీమ్యాట్ అకౌంట్, అన్ని పోస్టాఫీసు పథకాలకు నామినేషన్ నమోదు చేసుకోవచ్చు. ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సింది ఏమిటంటే నామినేషన్ నమోదు చేయడం తప్పనిసరి కాదు. అయినా కానీ, నమోదు చేయడం బాధ్యతగా భావించాలి. ప్రతి పెట్టుబడి దరఖాస్తులో నామినేషన్ కాలమ్‌ను తప్పకుండా పూరించాలి. ఎంత మంది? నామినీలు ఎంత మంది అనే విషయం ఆయా పెట్టుబడి సాధనాల్లో వేర్వేరుగా ఉంటుంది. ఉదాహరణకు జీవిత బీమా పాలసీ అయితే ఎంత మందిని అయినా నామినీలుగా నమోదు చేసుకోవచ్చు. ఒకరికి మించి నామినీగా పేర్లు ఇచ్చినప్పుడు, విడిగా ఒక్కొక్కరికీ ఎంత శాతం చొప్పున క్లెయిమ్‌కు అర్హత అనేది కూడా పేర్కొనాలి. ఉదాహరణకు ముగ్గురిని నామినీలుగా నమోదు చేశారనుకుందాం. అప్పుడు ఏకి 50 శాతం, బీకి 30 శాతం, సీకి 20 శాతం లేదా తమకు నచ్చిన విధంగా ఈ శాతాన్ని నిర్ణయించుకోవచ్చు. బ్యాంకు ఖాతాలకు అయితే సాధారణంగా ఒక్కటే నామినేషన్ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాకు కూడా ఒకటికి మించి నామినేషన్లు ఇవ్వొచ్చు. మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులకు నామినేషన్ కింద ముగ్గురి పేర్లను నమోదు చేసుకోవచ్చు. కొందరు తమపై ఆధారపడిన ఒంటరి తల్లి లేదా తండ్రికీ కొంత పెట్టుబడుల మొత్తం వెళ్లాలని కోరుకుంటారు. అలాంటప్పుడు విల్లు రాసి అందులో ఎవరికి ఏమి చెందాలో పేర్కొనాలి. లేదంటే నామినేషన్లో తల్లిదండ్రులకూ ఇంత శాతం చొప్పున వాటా ఇవ్వాలి. సవరణ..: నామినేషన్ ఇవ్వడంతో పని ముగిసిపోయిందని అనుకోవద్దు. ఏడాదికోసారి సంబంధిత నామినేషన్‌ను సమీక్షించుకోవాలి. అప్పటికే నామినీగా పేర్కొన్న వ్యక్తులతో తమకున్న అనుబంధాన్ని విశ్లేషించుకోవాలి. తమకు ఏదైనా జరిగితే వారు ఆస్తులను క్లెయిమ్ చేసుకునేందుకు సరైన వారేనా అని ప్రశ్నించుకోవాలి. ఎందుకంటే కొందరు వైవాహిక బంధం నుంచి వేరు పడుతుంటారు. మరొకరిని వివాహం చేసుకుంటారు. అవివాహితులు వైవాహిక జీవితంలోకి ప్రవేశించొచ్చు. లేదా నామినీగా పేర్కొన్న వ్యక్తి మరణించి ఉండొచ్చు. మరేదైనా కారణం ఉండొచ్చు. నామినీగా నమోదు చేసిన వ్యక్తి ఆచూకీ లేకుండా పోతే, అప్పుడు అసలు ఉద్దేశమే నెరవేరదు. అందుకే నామినేషన్‌ను ఏడాదికోసారి సమీక్షించి, సవరించుకోవాలి. ఊహించని అనుభవం 2021లో మద్రాస్ హైకోర్టు ఓ సంచలనాత్మక తీర్పునిచ్చింది. తన భర్త మరణంతో జీవిత బీమా పాలసీ ప్రయోజనాలను క్లెయిమ్ చేసుకునే విషయమై ఒక మహిళకు తన మామతో విభేదాలు ఏర్పడ్డాయి. కోర్టును ఆశ్రయించగా, ఆమెకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. కారణం ఆమె భర్త తీసుకున్న జీవిత బీమా పాలసీ ప్రీమియంలను తండ్రి (బాధితురాలి మామ) చెల్లించడమే. పైగా మరణించిన వ్యక్తి తన జీవిత బీమా పాలసీలో నామినీని నమోదు చేయలేదు. విల్లు కూడా రాయలేదు. ప్రీమియంలను పాలసీదారు సొంతంగా చెల్లించనప్పుడు, ఆ పాలసీ ప్రయోజనాలకు జీవిత భాగస్వామి వారసురాలని తేల్చడం కుదరదని కోర్టు స్పష్టం చేసింది. నామినీని నమోదు చేయకపోవడంతో, ప్రీమియం చెల్లించిన తండ్రికి ఆ పాలసీ ప్రయోజనాలపై అధికారాలు ఉంటాయని ఈ ఘటన స్పష్టం చేసింది. సరైన నిర్ణయం మనలో కొందరు తమ పిల్లల పేరిట జీవిత బీమా పాలసీలను తీసుకుని తొలుత వారే ప్రీమియం చెల్లిస్తుంటారు. కనుక పెళ్లయిన వ్యక్తులు వెంటనే జీవిత బీమా పాలసీల్లో తమ జీవిత భాగస్వామిని నామినీగా నమోదు చేయాలి. లేదంటే ఆశించిన ప్రయోజనం నెరవేరదు. అందుకే సరైన వ్యక్తిని నామినీగా నమోదు చేసుకోవాలి. లేదంటే విల్లు రాసి రిజిస్టర్ చేసుకోవాలి. ముఖ్యంగా జీవిత బీమా పాలసీల ఉద్దేశం నెరవేరాలంటే అందుకు నామినేషన్ మెరుగైన మార్గం. చాలా కేసుల్లో వ్యక్తి మరణంతో జీవిత భాగస్వామిపైనే ఆర్థిక బాధ్యతల భారం పడుతుంది. కనుక జీవిత భాగస్వామినే నామినీగా నమోదు చేసుకోవాలి. కుటుంబం కోసం ఒక పాలసీ, ఒంటరి తల్లి లేదా తండ్రి లేదా తనపై ఆధారపడిన తల్లిదండ్రుల కోసం విడిగా మరో పాలసీ తీసుకునే వారు.. ఆయా పాలసీల్లో తప్పనిసరిగా నామినీని పేర్కొనాలి. నామినేషన్ గడువు మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు కలిగిన వారు, ట్రేడింగ్, డీమ్యాట్ ఖాతా కలిగిన వారు తప్పనిసరిగా నామినీ విషయంలో ఆప్షన్ ఇవ్వాలని సెబీ ఆదేశాలు తీసుకొచ్చింది. 2023 మార్చి 31 వరకే ఉన్న గడువును, సెస్టెంబర్ 30 వరకు పొడిగించింది. కనుక ఇన్వెస్టర్లు వచ్చే సెప్టెంబర్ 30 నాటికి నామినేషన్ ఇవ్వాలి. నామినేషన్ ఇవ్వడం ఇష్టం లేకపోతే ‘ఆప్ట్ అవుట్ ఆఫ్ నామినేషన్’ను ఎంపిక చేసుకోవాలన్నది నిబంధన. అంటే నామినేషన్ నుంచి వైదొలగడం. కానీ, సెబీ ఆదేశాల ఉద్దేశం అది కాదు. నామినేషన్ విలువ తెలియజేసి, ప్రతి ఒక్కరూ నమోదు చేసుకునేలా చేయడమే. ఇక జీవిత బీమా ప్లాన్లు, బ్యాంకు ఖాతాలకు సంబంధించి నామినేషన్ నమోదు తప్పనిసరి కాదు. అయినా కానీ, నామినేషన్ ఇవ్వడం తన బాధ్యతగా ఇన్వెస్టర్ గుర్తించాలి. -
వారి జీవిత భాగస్వాములు అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చు
వాషింగ్టన్: ఆర్థిక సంక్షోభ భయాలతో అమెరికాలో టెక్ కంపెనీలు హెచ్–1బీ వీసాదారులను ఉద్యోగాల నుంచి తొలగిస్తున్న తరుణంలో వారి జీవితభాగస్వామి అమెరికాలో ఉద్యోగం చేసుకోవచ్చని అమెరికా న్యాయమూర్తి ఒకరు తీర్పు చెప్పారు. దీంతో అమెరికాలో టెక్నాలజీ రంగంలో ఉద్యోగాలు పోయి ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేలాది మంది భారతీయ టెకీలకు పెద్ద ఊరట లభించినట్లయింది. అమెరికాలో ప్రత్యేక ఉపాధి, నైపుణ్య వృత్తుల్లోకి తీసుకునేందుకు అక్కడి కంపెనీలు నాన్ ఇమిగ్రెంట్ హెచ్–1బీ వీసాలతో భారత్‌వంటి దేశాలకు చెందిన విదేశీ నిపుణులకు కొలువులు కల్పిస్తున్న విషయం విదితమే. అయితే ఇలా ఏటా వేలాదిగా తరలివస్తున్న హెచ్–1బీ వీసాదారులు, వారి భాగస్వాముల కారణంగా స్థానిక అమెరికన్లు ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని సేవ్ జాబ్స్ యూఎస్ఏ అనే సంస్థ వాషింగ్టన్‌లోని జిల్లా కోర్టులో దావా వేసింది. హెచ్–1బీ వీసాదారుల జీవితభాగస్వాములూ జాబ్ కార్డ్ సాధించి ఉద్యోగాలు చేసేందుకు వీలు కల్పిస్తున్న ఒబామా కాలంనాటి నిబంధనలను కొట్టేయాలని సంస్థ కోరింది. ఈ దావాను అమెజాన్, ఆపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి బడా కంపెనీలు తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇప్పటికే అమెరికా ప్రభుత్వం హెచ్–1బీ వీసాదారుల దాదాపు లక్ష మంది జీవితభాగస్వాములకు పని చేసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ కేసును మార్చి 28వ తేదీన జిల్లా మహిళా జడ్జి తాన్య చుత్కాన్ విచారించారు. ‘అమెరికా ప్రభుత్వం పూర్తి బాధ్యతతోనే వారికి వర్క్ పర్మిట్ ఇచ్చింది. వీరితోపాటే వేర్వేరు కేటగిరీల వారికీ తగు అనుమతులు ఇచ్చింది. విద్య కోసం వచ్చే వారికి, వారి జీవిత భాగస్వామికి, వారిపై ఆధారపడిన వారికి హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం ఉపాధి అనుమతులు కల్పించింది. విదేశీ ప్రభుత్వాధికారులు, అంతర్జాతీయ సంస్థల అధికారులు, ఉద్యోగుల జీవితభాగస్వాములకూ అనుమతులు ఉన్నాయి’ అంటూ సేవ్ జాబ్స్ యూఎస్ఏ పిటిషన్‌ను జడ్జి కొట్టేశారు. అయితే తీర్పును ఎగువ కోర్టులో సవాల్ చేస్తామని సంస్థ తెలిపింది. అభినందనీయం ‘ఉద్యోగాలు పోయి కష్టాల్లో ఉన్న హెచ్–1బీ హోల్డర్ల కుటుంబాలకు ఈ తీర్పు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. వలసదారుల హక్కుల సమానత్వ వ్యవస్థ సాధనకు ఇది ముందడుగు’ అని వలసదారుల హక్కులపై పోరాడే భారతీయ మూలాలున్న అమెరికా న్యాయవాది అజయ్ భుటోరియా వ్యాఖ్యానించారు. గత ఏడాది నవంబర్ నుంచి చూస్తే గూగుల్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్, అమెజాన్‌సహా అమెరికాలోని చాలా ఐటీ కంపెనీలు దాదాపు 2,00,000 మంది ఉద్యోగులను తొలగించాయని ‘ది వాషింగ్టన్ పోస్ట్’ తన కథనంలో పేర్కొనడం తెల్సిందే. ఇలా ఉద్యోగాలు పోయిన వారిలో 30–40 శాతం మంది భారతీయ ఐటీ నిపుణులే కావడం విషాదం. -
స్పౌజ్ బదిలీలు చేపట్టాలి
సాక్షి, హైదరాబాద్: ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితులతో పాటు ఇంకా మిగిలిపోయిన స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ బదిలీలను తక్షణమే చేపట్టాలని తెలంగాణ స్టేట్ స్పౌజ్ ఫోరం మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్‌ను కోరింది. సంఘం ప్రతినిధులు వివేక్, ఖాదర్ నేతృత్వంలో పలువురు ఉపాధ్యాయులు ఆదివారం మంత్రులను కలిసి, ఈమేరకు వినతి పత్రం సమర్పించారు. ఇటీవల 615 మంది స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్‌లను బదిలీ చేశారని, ఇంకా కొన్ని బదిలీలు మిగిలే ఉన్నాయని తెలిపారు. ఎస్జీటీ, పీఈటీ, భాషా పండితుల బదిలీలను నిలిపి వేశారని వివరించారు. ఉపాధ్యాయి నులు 200 కిలోమీటర్లు వెళ్లి విధులు నిర్వర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
మమ్మల్ని కలపండి సారూ
సాక్షి, హైదరాబాద్, ఖైరతాబాద్: తమ పిల్లలతో సహా ఉపాధ్యాయ దంపతుల ఆందోళన, దీక్ష,.. ప్రతిగా పోలీసుల అరెస్టులు.. తల్లిదండ్రులను ఎక్కడికి తీసుకువెళ్తున్నారో.. ఏం జరుగుతోందో తెలియక చిన్నారుల రోదనలు.. వెరసి శనివారం హైదరాబాద్‌లో స్పౌజ్ ఫోరం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దంపతులు నిర్వహించిన ధర్నాలో ఉద్విగ్న వాతావరణం చోటుచేసుకుంది. 13 జిల్లాలకు చెందిన వందలాది మంది ఉపాధ్యాయ దంపతులు తమ పిల్లలతో కలిసి వచ్చి బదిలీలకు సంబంధించిన జీవో 317కి వ్యతిరేకంగా పాఠశాల డైరెక్టర్(డీఎస్సీ) కార్యాలయం ముందు మౌనదీక్ష నిర్వహించారు. ‘ఉద్యోగ దంపతుల్ని కలపండి... ముఖ్యమంత్రి మాటను నిలపండి’... ‘భార్యా భర్తలను, పిల్లలను విడదీయకండి’... ‘అమ్మ అటు ... నాన్న ఇటు.. మరి నేను ఎవరివైపు???’అంటూ ధర్నాలో ప్లకార్డులు ప్రదర్శించారు. భార్య ఒకచోట, భర్త ఒక చోట ఉద్యోగం చేసే పరిస్థితికి స్వస్తి చెప్పి, ఒకే దగ్గర కలిసి ఉండేలా స్పౌస్ బదిలీలు నిర్వహించాలని ఆందోళన వ్యక్తం చేశారు. గడిచిన సంవత్సరంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యను వెంటనే పరిష్కరించాలని, ప్రతి స్పౌస్ బాధితుడికి న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 2100 మంది బాధితులు... 615 మందికే స్పౌస్ బదిలీ! దంపతుల బదిలీలను బ్లాక్ చేసిన 13 జిల్లాల్లో 2100 మంది బాధితులు ఉండగా, అందులో 615 మందికి మాత్రమే స్పౌజ్ బదిలీలు జరుగుతున్నాయని నిరసన దీక్ష సందర్భంగా ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేశారు. 30 శాతం మందికే దంపతుల బదిలీలు చేపట్టి, పూర్తిగా అవకాశం ఉన్న క్యాడర్లను పక్కకు పెట్టడంతో స్పౌజ్ బదిలీల కోసం ఎదురుచూస్తున్న కుటుంబాలలో ఆవేదన మిగిలిందని వాపోయారు. రసాభాసగా మౌనదీక్ష ఉపాధ్యాయులను పోలీసులు అరెస్టు చేసే క్రమంలో పరిస్థితి రసాభాసగా మారింది. తల్లిదండ్రులను పోలీసులు బలవంతంగా అరెస్టు చేస్తుండటంతో పిల్లలకు అక్కడ ఏం జరుగుతోందో తెలియక విలపిస్తూ ఉండిపోయారు. దీంతో తల్లులు ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టడంతో అక్కడ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. తల్లుల, పిల్లల రోదనలతో కొద్దిసేపు ఉద్విగ్న వాతావరణం నెలకొంది. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన 513మంది ఉపాధ్యాయులను అరెస్టు చేసి నాంపల్లి, చిక్కడపల్లి, గాంధీనగర్, ముషీరాబాద్, బేగం బజార్, నారాయణగూడ పోలీస్ స్టేషన్లకు తరలించారు. కాగా, నిరసన కార్యక్రమాలు తీవ్రతరం చేస్తామని నేతలు వివేక్, కాదర్, కృష్ణ, నరేష్, మమత, త్రివేణి, సుజాత స్పష్టం చేశారు. పోలీసుల అరెస్టులను తెలంగాణ ప్రాథమిక ఉపాధ్యాయుల సంఘం అధ్యక్షుడు సయ్యద్ షౌకత్ ఆలీ ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అందరికీ ఇచ్చే అవకాశం ఉన్నా ... సంగారెడ్డి జిల్లాలో ఎస్జీటీ కేడర్ లో ముగ్గురు ఉపాధ్యాయులు మాత్రమే స్పౌజ్ బదిలీ కోసం దర ఖాస్తు చేసుకున్నారు. ఆ జిల్లాలో 362 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అలాగే సూర్యాపేటలో 252 ఎస్జీటీ పోస్టులు ఖాళీగా ఉంటే... 28 మంది ఎస్జీటీలు మాత్రమే బదిలీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఖమ్మం జిల్లాలో కూడా 40 మంది ఎస్జీటీ దంపతులు బదిలీల కోసం అర్జీ పెట్టుకోగా, 341 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రభుత్వం నిర్వహించనున్న ప్రమోషన్ల ప్రక్రియ ద్వారా కూడా వందల సంఖ్యలో ఖాళీలు ఏర్పడనున్నాయి. ఒకటి రెండు క్యాడర్ల మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ స్పౌజ్ అప్పీళ్ళు అన్నిటినీ క్లియర్ చేసే అవకాశం ఉందని ఉపాధ్యాయుల వాదన. సీఎం కేసీఆర్ వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని వేడుకున్నారు. -
భార్యా భర్తలకు ఒకే చోట పనిచేసే అవకాశమేది?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కొత్త జిల్లాలు, జోన్లకు అనుగుణంగా పోలీసు శాఖలో జరిగిన బదిలీలు భార్యాభర్తలైన కానిస్టేబుళ్లకు కొత్త చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. వేర్వేరు జిల్లాల్లో నెలల తరబడి కుటుంబాలకు దూరంగా పనిచేయాల్సి రావడం వారిలో తీవ్ర మనోవేదన కలిగిస్తున్నాయి. ఆత్మహత్యకు వెనుకాడలేం... రాష్ట్ర పోలీసు శాఖలో కానిస్టేబుళ్లుగా పనిచేస్తున్న జంటలు దాదాపు 200 వరకు ఉంటాయని అంచనా. ఇటీవల జరిగిన నూతన జిల్లాల బదిలీల్లో భార్యాభర్తలంతా వేర్వేరు ప్రాంతాలకు బదిలీ అయ్యారు. అయితే భార్యాభర్తలకు ఒకేచోట పనిచేసే వెసులుబాటు కలి్పంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకు అనుగుణంగా ఆయా జంటలు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆదేశాలు వెలువడలేదు. దీంతో రామగుండం, కరీంనగర్, ఆదిలాబాద్, వరంగల్, నల్లగొండ, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్‌నగర్, రాచకొండ తదితర యూనిట్లలో పనిచేస్తున్న భార్యభర్తలైన కానిస్టేబుళ్లు ఒంటరితనంతో బతకలేక సతమతమవుతున్నారు. నిత్యం ఎవరో ఒకరు తమ ఆవేదనను ఆడియో సందేశాల రూపంలో బయటపెడుతున్నారు. కుటుంబాలకు దూరంగా పనిచేస్తూ నరకయాతన అనుభవిస్తున్నామని, ఎప్పుడు ఆత్మహత్య చేసుకుంటామో తెలియని పరిస్థితుల్లో బతకాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరీంనగర్లో ఓ మహిళా కానిస్టేబుల్ పడుతున్న బాధ అంతాఇంతా కాదు. తన భర్త మరో జిల్లాలో పనిచేస్తుండటంతో మూడేళ్ల పిల్లాడిని ఎవరూ చూసే వారు లేక చంటి పిల్లాడిని చంకన వేసుకొని బందోబస్తు డ్యూటీలు కూడా చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేసింది. పిల్లల భవిష్యత్‌పై ప్రభావం... కొన్ని సంఘటనల్లో తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు. ఎదుగుతున్న పిల్లలపై శ్రద్ధ తీసుకోకపోతే వారి భవిష్యత్ ప్రశ్నార్ధకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానికత సమస్య కూడా కానిస్టేబుళ్ల దంపతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇన్నాళ్లూ సొంత జిల్లాల్లో పనిచేసిన వారు వేరే జిల్లాకు బదిలీ కావడం వల్ల తమ పిల్లల స్థానికత విషయంలో సమస్య ఏర్పడుతుందని కలవరానికి గురవుతున్నారు. కాగా, బదిలీల సమస్య ఎప్పుడు పరిష్కారమవుతుందో తెలియట్లేదని ఉన్నతాధికారులు అంటున్నారు. -
కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో.. పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో..
‘భార్యాపిల్లలకు దూరంగా ఉండలేకపోతున్నా.. స్పౌజ్ ట్రాన్స్ఫర్ కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నా.. కానీ, ఎంతకూ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. ఇక ఎదురుచూసే ఓపిక నాకు లేదు. అందుకే, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అంటూ పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో సందేశం పెట్టాడు ఓ కానిస్టేబుల్. తన భర్త కూడా తనలాగే కానిస్టేబుల్ అని, తన మూడేళ్ల కుమారుడిని చూసుకునే వారెవరూ లేరని బందోబస్తుకు పిల్లాడిని చంకనెత్తుకు వెళ్లాల్సి వస్తోందని, దయచేసి తమ స్పౌజ్ దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని విలపిస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో సోషల్‌మీడియాతోపాటు, డిపార్ట్మెంటులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, కరీంనగర్: ‘కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో.. పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో’.. అంటూ లేత మనసులు సినిమాలో హృదయాన్ని కరిగించే పాట ఉంది. ఇప్పుడు పోలీసు దంపతుల పిల్లల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. తల్లి జిల్లా కేంద్రంలో సివిల్ (లా అండర్ ఆర్డర్), తండ్రి గ్రేహౌండ్స్ ఎక్కడో చత్తీస్ఘడ్ సరిహద్దులో విధులు నిర్వహించాలి. పిల్లలు కాస్త పెద్దవారైతే హాస్టల్లో ఉంటున్నారు. ఇపుడు ఎటొచ్చీ.. ఏడెనిమిదేళ్లలోపు పిల్లలు కావడంతో పోలీసు దంపతులకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఉరుకులు పరుగుల జీవితాలు.. కుటుంబానికి, చివరికీ చిన్నపిల్లలకు సైతం దూరంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. మగవారికి కాస్త ఫర్వాలేదు కానీ, పాలిచ్చే తల్లులు, తమ పని తాము చేసుకోని పిల్లలున్న మహిళా పోలీసుల ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 30 జంటలు.. పోలీసు కొలువంటేనే విరామం లేని విధి. అందుకే, ఈ డిపార్ట్మెంటు సిబ్బంది ఒకే డిపార్ట్మెంటు వ్యక్తులను వివాహం చేసుకోవడం చాలా అరుదు. ఇద్దరి స్వప్నం పోలీసుశాఖే అయిన అరుదైన జంటలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. 317 జీవో అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు నెలలో దాదాపు 350 స్పౌజ్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దాదాపు 45కిపైగా పరిష్కారమయ్యాయి. కానీ, 300లకుపైగా దరఖాస్తులకు ఇంతవరకూ మోక్షం లభించలేదు. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 30కిపైగా దరఖాస్తులు ఉన్నాయి. అందులోనూ రామగుండం కమిషనరేట్ (సుమారు 10), కరీంనగర్ కమిషరేట్ (11), జగిత్యాల (5), సిరిసిల్ల (4) వరకు దరఖాస్తులు అలాగే ఉన్నాయి. జేఎస్పీ, బ్యాంకు, కేంద్ర ఉద్యోగులకు నో చాన్స్! ఈ క్రమంలో డిపార్ట్మెంటులో కొన్ని రకాల దరఖాస్తులపై రకరకాలుగా జరుగుతున్న ప్రచారంతో నీలినీడలు కమ్ముకున్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జూనియర్ పంచాయతీ సెక్రటరీ, బ్యాంకు సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటే వారి దరఖాస్తులు పరిశీలించడం లేదన్న ప్రచారం ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. అదే సమయంలో కరీంనగర్, రామగుండం, ఖమ్మం కమిషరేట్లను బ్లాక్‌లిస్టులో పెట్టారని, ఈ జిల్లాల దరఖాస్తులను ఇక పరిష్కరించరని జరుగుతున్న ప్రచారం వీరి ఆందోళనలను రెట్టింపు చేస్తోంది. ఇక పోలీసు దంపతుల విషయానికి వస్తే.. వీరి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భార్య, భర్తలు చెరొక జిల్లాలో ఉండటం, 24 గంటల విధులు నిర్వహించాల్సి రావడంతో చంటిపిల్లలను చూసుకోవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి పోలీసుకావాలని కలలుగని సాధించుకున్న ఉద్యోగాన్ని వదులుకోలేక, చిన్నారులను డేకేర్ సెంటర్లలో వదిలి రాలేక ఆ తల్లులంతా తల్లడిల్లుతున్నారు. మరోవైపు ఎక్కడో విధులు నిర్వహిస్తు్తన్న తండ్రులు, భార్యాబిడ్డలు ఎలా ఉన్నారో అని కలత చెందుతున్నారు. త్వరలోనే పరిష్కారం పోలీసుదంపతులు ట్రాన్స్ఫర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. స్పౌజ్ దరఖాస్తుల విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. త్వరలోనే సానుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. – గోపీరెడ్డి, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు -
నీ వెంటే నేనూ..!
మంగళగిరి: మృత్యువులోనూ ఆ దంపతులు తమ బంధాన్ని వీడలేదు. గంట వ్యవధిలోనే భార్యాభర్తలు మృతి చెందిన దుర్ఘటన గుంటూరు జిల్లా మంగళగిరి–తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి యర్రబాలెంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... విజయవాడకు చెందిన అక్కిరెడ్డి వీర్రాజు (85), రాఘవమ్మ (69) ముప్పై ఏళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం యర్రబాలెంకి వలస వచ్చారు. కూలీ పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుని ఇద్దరి కుమార్తెల వివాహాలు చేశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న రాఘవమ్మ తన నివాసంలో అకస్మాత్తుగా కుప్పకూలి బుధవారం మృతి చెందింది. తన భార్య మృతిని తట్టుకోలేక వృద్ధుడు వీర్రాజు కూడా కుప్పకూలి పడిపోయాడు. స్థానికులు చికిత్స నిమిత్తం ఆయనను ఆసుపత్రికి తరలించగా మధ్యలోనే మృతి చెందాడు. వీర్రాజు, రాఘవమ్మ ఆఖరి నిమిషం వరకూ కూడా ఎవరి పనులు వారే చేసుకునే వారని స్థానికులు తెలిపారు. -
అమెరికాలో మనోళ్లపై ‘ట్రంప్’ దెబ్బ
సాక్షి, హైదరాబాద్: అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి! అమెరికాలో హెచ్1 బీ వీసా కలిగిన వృత్తినిపుణుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ ను (హెచ్4 వీసా) ట్రంప్ సర్కార్ రద్దు చేస్తే దాదాపుగా లక్ష మంది ఉద్యోగాలు కోల్పోతారని ఒక తాజా అధ్యయనం అంచనా వేసింది. అమెరికా ప్రభుత్వ ప్రణాళికలతో వేలాది ప్రవాస భారతీయుల కుటుంబాలపైనా, వారు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యాలపైన ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడించింది. ట్రంప్ సర్కార్ వీసా విధానాన్ని కఠినతరం చేస్తే సామాజికంగా, ఆర్థికంగా చూపించే ప్రభావాలపై టెన్నసీ యూనివర్సిటీకి చెందిన క్రిస్టోఫర్ జే.ఎల్. కన్నింగమ్,యూనివర్సిటీ ఆఫ్ లైమ్రిక్లో కెమ్మి బిజినెస్ స్కూలుకి చెందిన పూజ బి విజయ్‌కుమార్‌లు ఒక అధ్యయనం నిర్వహించారు. 1800 మంది ప్రవాస భారతీయ కుటుంబాలతో వారు మాట్లాడారు. తుది నివేదిక రూపకల్పనకు 416 మంది అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్నారు. అధ్యయనంలో వెల్లడైన అంశాలు లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోతారు. జీవితభాగస్వామ్యులందరూ సామాజికంగా ఏకాకిగా మారతారు. ఇళ్లల్లో ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఏర్పడుతుంది మెరుగైన జీవనం కోసం వచ్చిన కుటుంబాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనే ప్రవాస కుటుంబాలకు 2,50,000 డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల నష్టం వస్తుంది అత్యంత నిపుణులైన ప్రవాసులు ఉద్యోగాలు వదులుకుని అమెరికా విడిచిపెట్టే ప్రమాదం ఉంది 93 శాతం భారతీయులే హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారి భాగస్వామ్యులకు 2015కి ముందు పని చేసే అవకాశం లేదు. 2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్4 వీసా కలిగిన జీవిత భాగస్వామ్యులకు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతులు ( ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ –ఈఏడీ) ఇవ్వడం మొదలు పెట్టడంతో అమెరికాలో స్థిరపడాలనుకునే ఎన్నో భారతీయ కుటుంబాలకు అది వరంలా మారింది. 2015 నుంచి 2017 డిసెంబర్ నాటికి లక్షా 26 వేలకు పైగా హెచ్4 ఈఏడీనిమంజూరు చేస్తే, వారిలో 93 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇక అయిదు శాతం వీసాలతో తర్వాత స్థానంలో చైనా ఉంటే, మిగిలిన దేశాలన్నింటికీ కలిపి మిగిలిన 2 శాతం వీసాలున్నాయి. ఈఏడీ పొందిన వారిలో అయిదింట ఒక వంతు మంది కాలిఫోర్నియాలో నివసిస్తూ ఉంటే, టెక్ హబ్‌లుగా పేరు పొందిన సిలికాన్ వ్యాలీ, న్యూజెర్సీ, సియాటిల్, డల్లాస్, హస్టన్, వాషింగ్టన్ల నుంచి అత్యధికులు ఉన్నారు. వర్క్ పర్మిట్ పొందినవారిలో 93 శాతం మంది మహిళలైతే ఏడు శాతం పురుషులు ఉన్నారు. అత్యంత నిపుణులైన వారి భాగస్వామ్యులకూ పని చేసే సౌకర్యం ఉంటే వారు అమెరికా వీడి వెళ్లకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా సర్కార్ దీనిని అమల్లోకి తెచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని అందిపుచ్చుకొని అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొట్టేస్తున్నారని ఆరోపిస్తూవీసా నిబంధనలు కఠినతరం చేయడంలో భాగంగా హెచ్4 వీసాను రద్దు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న అభద్రతా భావంలో భారతీయ కుటుంబాలు ఉన్నాయి. రద్దు చేస్తే ఇంటిదారే... హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాముల వర్క్ పర్మిట్‌ను రద్దు చేస్తే తిరిగి భారత్‌కు వెళ్లిపోవడానికి చాలా మంది సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ‘నా భార్య తీవ్రమైన నిరాశనిస్పౄహలకు లోనవుతోంది. అంత చదువు చదివి కెరీర్ ముందుకు వెళ్లకపోతే ఇంక అమెరికాలో ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తోంది. భార్యలు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఒక్కరి జీతంతోనే బతకడం అంటే చాలా కష్టం, ట్రంప్ నిర్ణయాలు సరైనవి కావు. అందుకే ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని అనుకుంటున్నామ’ని అధ్యయనంలో పాల్గొన్న పలువురు స్పష్టం చేశారు. వ్యతిరేకిస్తున్న దిగ్గజ సంస్థలు వీసా నిబంధనలు కఠినతరం చేయాలన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికలను గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్బుక్ వంటి సంస్థలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల వీసా హోల్డర్లు, వారి భాగ్యస్వామ్యులు ముఖ్యంగా మహిళల మనోభావాలను దెబ్బ తింటాయని, అది సరైన పనికాదని వారంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం పూర్తి సమాచారం లేకుండా, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో అంచనా వేయకుండా విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటోందని అధ్యయనకారులు తప్పుబడుతున్నారు. -
వరుడి కోసం ఫేస్బుక్లో ప్రకటన.. వైరల్!
న్యూఢిల్లీ : ఇన్ని రోజులు ఫేస్బుక్ అంటే ఫోటోలు, వీడియోలు షేర్ చేయడానికి మాత్రమే అన్నట్లు ఉండేది. కానీ ఇక మీదట ‘మ్యాట్రిమొనియల్’గా కూడా మారనుందా? కేరళకు చేందిన ఓ యువతి ఫేస్బుక్లో చేసిన పోస్టు చూస్తే నిజమే అనిపిస్తుంది ఎవరికైనా. తనకు వరడు కావాలంటూ ఫేస్బుక్లో ప్రకటన చేసింది ఈ యువతి. వివారాల్లోకి వెళ్తే కేరళ మలప్పురంకు చెందిన జ్యోతి కేజీ(28) తనకు వరుడు కావాలంటు పోయిన వారం ఫేస్బుక్ మ్యాట్రిమొని హాష్‌టాగ్‌ను ఉపయోగించి చేసిన ఒక ప్రకటన ప్రస్తుతం వైరల్ అయ్యింది. జ్యోతి చేసిన ప్రకటనలో ఉన్న వివరాలు...‘నా పేరు జ్యోతి. నా వయసు 28 సంవత్సరాలు. నా తల్లిదండ్రులు మరణించారు. నాకు ఒక సోదరుడు ఉన్నాడు. అతను ముంబైలో సీనియర్ యాడ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నాడు. నేను బీఎస్సీ ఫ్యాషన్ డిజైనింగ్ పూర్తిచేసాను. ప్రస్తుతం నేను ఒంటరిగా ఉంటున్నాను. మీకు తెలిసిన వారిలో ఎవరైనా మంచి వ్యక్తి ఉంటే నాకు తెలియజేయండి. నేను కులం, జాతకాల గురించి పట్టించుకోను’ అని మలాయాళంలో పోస్టు చేసింది. అంతేకాక ఫేస్బుక్ నెట్వర్కలో ఫేస్బుక్ మ్యాట్రిమొనియల్ ఫీచర్‌ను ప్రారంభించమని ఫేస్బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌కు విన్నపం చేసింది. తనలానే చాలామంది సరైన జీవిత భాగస్వామి వెతుకుతున్నారని, ఒకవేళ ఫేస్బుక్ మెయిన్ నెట్‌వర్క్‌లో ఎఫ్బీ మ్యాట్రిమొనిని ప్రారంభిస్తే తనలాంటి అనేకమంది అవివాహితులకు చాలా మేలు చేసిన వారవుతారని తెలిపింది. చాలామంది సరైన జీవిత భాగస్వామిని పొందడం కోసం మ్యాట్రిమొనిలు, మధ్యవర్తుల బారినపడి మోసపోతున్నారని అందువల్ల ఎఫ్బీ మ్యాట్రీమొనీని ప్రారంభిస్తే వారందరికీ తగిన జీవితభాగస్వామిని ఎన్నుకునేందుకు మార్గం సులువవుతుందని విన్నవించింది. జ్యోతి ఏప్రిల్ 26న చేసిన ఈ పోస్టు వైరల్ అయ్యింది. పోస్టు చేసిన కొన్ని గంటల్లోనే 6 వేల మంది దీన్ని షేర్ చేశారు. జీవిత భాగస్వామి కోసం ఇలా ఫేస్బుక్ ప్రకటన చేయడం ఇదే ప్రథమం కాదు. గతంలో కేరళకు చెందిన రంజిష్ మంజేరి అనే ఫోటోగ్రాఫర్ తనకు వధువు కావాలంటూ ఫేస్బుక్ ద్వారా ప్రకటన చేశాడు. -
నాకు కాబోయే భర్త ఎలా ఉండాలంటే..
తమిళసినిమా: జీవిత భాగస్వామిగా వచ్చే వ్యక్తి గురించి ప్రతి యువతి కలలు కంటుంది. తను ఎలా ఉండాలనేది కూడా ముందుగానే ఊహించుకుంటుంది. ఇక సినీ కథానాయికలైతే మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. నటి రకుల్‌ప్రీత్‌సింగ్ అలాంటి ముందు జాగ్రత్తలే తీసుకుంటానంటోంది. ఈ జాణ కోలీవుడ్‌లో రంగప్రవేశం చేసి నిలదొక్కుకోలేకపోయినా, టాలీవుడ్లో క్రేజీ హీరోయిన్ పట్టం దక్కించుకుంది. ఇక కోలీవుడ్‌లో జయించడానికి తహతహలాడుతోంది. ఇప్పుడా ప్రయత్నంలోనే ఉంది. ప్రస్తుతం రెండు చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది. మహేశ్‌బాబుతో జత కట్టిన ద్విభాషా చిత్రం స్పైడర్‌తో పాటు, తమిళంలో కార్తీకి జంటగా ధీరన్ అధికారం ఒండ్రు చిత్రాల్లో నటిస్తోంది. వాటిలో ఏఆర్.మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న స్పైడర్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంపై రకుల్‌ప్రీత్‌సింగ్ చాలా ఆశలే పెట్టుకుంది. ఇక త్వరలో సెల్వరాఘవన్ దర్శకత్వంలో సూర్యతో డ్యూయెట్లు పాడడానికి రెడీ అవుతున్న ఈ అందగత్తే తనకు కాబోయే భర్త ఎలా ఉండాలన్న విషయమై ఒక భేటీలో పేర్కొంది. మంచి అందగాడై ఉండాలని అంతేకాకుండా మంచి పొడవైన వాడై ఉండాలని చెప్పింది. అంతకంటే ముఖ్యంగా మంచి వాడై ఉండాలని ఈ భామ పేర్కొంది. ఒక వ్యక్తి మంచి వాడా? చెడ్డవాడా అని చూసిన వెంటనే చెప్పలేమని, అందుకనే చూసి, కలిసి మెలిగి ఆ తరువాత తన ప్రవర్తన మంచి అనిపిస్తే ఆ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది. అందుకే తాను పెళ్లికి తొందర పడడం లేదనీ రకుల్‌ప్రీత్‌సింగ్ చెప్పుకొచ్చింది. -
ఈ ఏడాదిలో వినూత్న పెళ్లిళ్లు
న్యూఢిల్లీ: పెళ్లంటే నూరేళ్ల పంట అన్నది నాటి తరం నినాదం. పెళ్లంటే పది మందికి ఉపయోగపడాలన్నది నేటితరం నినాదం. మనం వీడ్కోలు పలుకనున్న ఈ 2016 సంవత్సరంలో ఈ నినాదంతోనే ఎన్నో జంటలు వినూత్నంగా పెళ్లి చేసుకొని ఇతరులకు ఆదర్శంగా నిలిచాయి. వాటిలో కొన్ని..... 1. బ్యాండ్ బాజాలు, పూలు, స్వీట్లు లేకుండా..... అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని, గ్రాండ్‌గా రిసెప్షన్ జరుపుకోవాలని ఎన్నో జంటలు ఆశిస్తాయి. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాకు చెందిన అభయ్ దేవరే, ముంబైలోని ఐడీబీఐ బ్యాంక్‌లో అసిస్టెంట్ మేనేజర్‌గా పనిచేస్తున్న ప్రీతి కుంభారే ఇందుకు భిన్నమైన వారు. పెళ్లి పేరిట అనవసరంగా ఖర్చు చేసే బదులు, ఆ సొమ్మును ఆత్మహత్య చేసుకున్న రైతుల పిల్లల చదువు కోసం వెచ్చించాలనుకున్నారు. వారు నిరాడంబరంగా పెళ్లి చేసుకొని రైతులు ఆత్మహత్య చేసుకున్న పది కుటుంబాలకు 20వేల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేశారు. అమరావతిలోని ఐదు గ్రంధాలయాలకు 52 వేల రూపాయల పుస్తకాలను కొనిచ్చారు. బీటెక్‌చేసి, 2015లో యూపీఎస్‌యూ పాసైన అభయ్ ఇప్పుడు ఇండియన్ రెవెన్యూ సర్వీస్‌లో పనిచేస్తున్నారు. 2. నగలకు బదులు చెట్ల మొక్కలు.... మధ్యప్రదేశ్‌లోని కిసీపురాకు చెందిన పెళ్లి కూతురు ప్రియాంక భడోరియా పెళ్లి రోజున తన అత్తవారింటి నుంచి ఎలాంటి బంగారు నగలు కోరుకోలేదు. వారి కుటుంబం అచారం ప్రకారం పెళ్లి రోజున ధరించేందుకు ఎలాంటి నగలు కావాలో కోడలును అడగడం, వారు వాటిని తెచ్చివ్వాలి. పెళ్లి రోజున ప్రియాంకను తన అత్తారింటివారు ఎలాంటి నగలు కావాలని కోరగా, తనకు నగలు వద్దని, వాటికి బదులుగా చెట్ల మొక్కలు కావాలని కోరారు. అందుకు అమితానంద పడిన అత్తింటివారు ఆమెకు ఏకంగా పదివేల మొక్కలను తీసుకొచ్చి బహూకరించారు. పెళ్లి తర్వాత ఆమె తన భర్తతో కలసి ఆ మొక్కలను ఇరువురి ఇళ్లల్లో, వీధుల్లో నాటారు. 3. పేదలకు 90 ఇళ్లు..... మహారాష్ట్రకు చెందిన మనోజ్ మునాట్ అనే వ్యాపారవేత్త అందరి తండ్రుల్లాగే తన కూతురు శ్రేయ పెళ్లిని అంగరంగ వైభవంగా చేయాలనుకున్నారు. అందుకు పెద్ద మొత్తంలో డబ్బును కూడా వెనకేశారు. చివరకు కూతురు పెళ్లి కుదిరేనాటికి కూతురు కోరికను తీర్చాల్సి వచ్చింది. ‘ఇంత డబ్బును పెళ్లి పేరిట అనవసరంగా ఖర్చు చేయడం ఎందుకు నాన్నా! పేదలకు, బడుగువర్గాల ప్రజలకు ఉపయోగపడే ఏదైనా పనిచేయవచ్చుగదా!’ అన్న కూతురు మాటలు మనోజ్‌కు నచ్చాయి. కూతురు పెళ్లి నాటికి 90 ఇళ్లను పేద కుటుంబాలకు కట్టి ఇచ్చారు. 4. పెళ్లి రోజున టీచర్లకు సన్మానం..... గుజరాత్‌లోని హల్దారు గ్రామానికి చెందిన నిషాద్‌బాను వాజిఫ్‌దార్ అనే 22 ఏళ్ల పెళ్లి కూతురు నర్సరీ నుంచి పీజీ వరకు తనకు విద్యా బోధన చేసిన టీచర్లను పేరు పేరున పెళ్లికి ఆహ్వానించి, పెళ్లి పందిట్లోని వారందరికి శాలువాలు కప్పి సన్మానించారు. తాను చదువుకున్న ప్రాథమిక,మాధ్యమిక పాఠశాలలకు పది లక్షల రూపాయలను విరాళంగా కూడా అందజే శారు. ఆమె నిరాడంబరంగా పెళ్లి చేసుకోవడమే కాకుండా అతిథులకు అతి సాధారణ భోజనం పెట్టారు. 5. ఎకో ఫ్రెండ్లీ మ్యారేజ్..... శాశ్వతి శివ, కార్తిక్ కష్ణన్...ఆరు నెలల క్రితమే పెళ్లి చేసుకున్నారు. ఇద్దరూ పర్యావరణ పరిరక్షణను కోరుకునే వారు. పెళ్లిలో ఎక్కడా ప్లాస్టిక్‌ను వాడలేదు. పాలకు, కూల్ డ్రింకులకు బదులుగా అతిధుల కోసం కొబ్బరి బోండాలను ఏర్పాటు చేశారు. మాంసహారం జోలికి వెళ్లకుండా సేంద్రీయ ఎరువులతో పండించిన కూరగాయల భోజనాన్ని ఏర్పాటు చేశారు. వారి పెళ్లికి మరో విశేషం కూడా ఉంది. అతిథులను వారి పెంపుడు కుక్కలతో రావాల్సిందితా ఆహ్వానించారు. వారు అలాగే వచ్చారు. 6. హిజ్రానే పెళ్లికి ముఖ్య సాక్షి.... కేరళ శస్త్ర సాహిత్య పరిషత్‌లో కార్యకర్తలుగా పనిచేస్తున్న రామ్‌నాథ్, శతిలు రిజిస్టార్ ఆఫీసుకెళ్లి నిరాడంబరంగ పెళ్లి చేసుకోవడమే కాకుండా పెళ్లికి ముఖ్య సాక్షిగా ఓ హిజ్రాను పిలిపించి సంతకం చేయించారు. అంతేకాకుండా పెళ్లి కూతురు బంగారు నగలకు బదులు జౌలితో చేసిన నగలను ధరించారు. ఇలా ఎన్నో వినూత్న పెళ్లిళ్లు ఈ ఏడాదిలోనే జరగడం విశేషం. ఓ తండ్రి కన్నకూతురు పెళ్లి కోసం దాచుకున్న డబ్బును పేద పిల్లల పెళ్లి కోసం ఖర్చు పెట్టి. కూతురు పెళ్లిని నిరాడంబరంగా జరిపించారు. మరో తండ్రి తన కూతరు పెళ్లికి నగరంలోని వితంతువులందరిని పిలిపించారు. పెద్ద నోట్ల కష్టాల నేపథ్యంలో ఓ ఐఏఎస్ అధికారుల జంట కేవలం 500 రూపాయల ఖర్చుతోనే పెళ్లి తంతును ముగించారు. -
ఆ ఆరోపణలపై ఘాటుగా స్పందించిన హైకోర్టు
న్యూఢిల్లీ: మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని భర్త లేక భర్య తమ సహచరులపై చేసే తప్పుడు ఆరోపణలు అత్యంత బాధాకరమైనవని ఢిల్లీ హైకోర్టు పేర్కొంది. ఓ భర్త పెట్టుకున్న వివాహరద్దు పిటిషన్‌ను విచారించిన కోర్టు గురువారం డైవర్స్ మంజూరు చేసింది. నిరాధారమైన వివాహేతర సంబంధం ఆరోపణలు క్రూరత్వాన్ని తెలియజేస్తాయని జస్టిస్ ప్రదీప్ నంద్రాజోగ్, జస్టిస్ యోగేష్ కన్నాలతో కూడిన ధర్మాసనం స్పష్టం చేసింది. వివాహేతర సంబంధం, వరకట్న వేధింపులు వంటి తప్పుడు ఆరోపణలతో సదరు మహిళ తన భర్తను ఇబ్బందిపెట్టినట్టు కోర్టు భావించింది. దంపతుల మధ్య వివాహేతర సంబంధం ఆరోపణలకు మించి బాధాకరమైన విషయం మరోకటి ఉండదని ధర్మాసనం తెలిపింది. డైవర్స్ కోసం ట్రయల్ కోర్టులో పెట్టుకున్న తన పిటిషన్‌ను తోసిపుచ్చడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించాడు. భార్యా, భర్తలు ఇద్దరు 1995 నుంచి విడివిడిగా ఉండటం, భార్య ప్రవర్తించిన తీరువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని హైకోర్టు సదరు వ్యక్తికి డైవర్స్ మంజూరు చేసింది. 1995 ఫిబ్రవరిలో ఇరువరి పెళ్లి జరిగింది. అయితే భార్య తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో 1996లో ట్రయల్ కోర్టులో డైవర్స్ కోసం అప్పీల్ చేసుకున్నాడు. 2001లో ఆమె తనతో స్నేహపూర్వకంగా ఉంటానని హామీ ఇవ్వడంతో తన డైవర్స్ పిటిషన్‌ను ఉపసంహరించుకున్నాడు. 1995లో ఆమె తన కుటుంబసభ్యుల దగ్గరకు వెళ్లినప్పటి నుంచి తన వద్దకు తిరిగి రాకపోవడంతో తిరిగి 2009లో మళ్లీ డైవర్స్ పిటిషన్ వేశానని హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చాడు. ట్రయల్ కోర్టులో విచారణ సమయంలో తన భర్త మరో యువతితో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడని లిఖిత పూర్వకంగా ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొంది. అంతే కాకుండా కట్నం కోసం తనను వేధించేవాడని తెలిపింది. అయితే వరకట్న వేధింపుల కేసులో కోర్టు అతన్ని నిర్దోషిగా తేల్చింది. కానీ, అతను డైవర్స్ పిటిషన్‌ను తిరస్కరించింది. దీంతో కింది కోర్టు తీర్పును సవాలు చేస్తూ సదరు వ్యక్తి హైకోర్టు ఆశ్రయించడంతో డైవర్స్ మంజూరు చేసింది. -
5వ రోజు అలంకారం శ్రీ కాత్యాయనీ దేవి
ఈ రోజు అమ్మవారిని శ్రీ కాత్యాయనీదేవి రూపంలో అలంకరిస్తారు. మార్కండేయ పురాణంలో చెప్పినట్లు పూర్వం కాత్యాయనుడనే మహర్షి గొప్ప తపఃఫలంతో అమ్మవారిని తన పుత్రికగా పొందగలిగాడు. అందువల్ల ఈమెను కాత్యాయని అని పిలుస్తారు. యువతీ యువకులు గనక ఇంద్రకీలాద్రి పర్వతంపై వెలసిన కనక దుర్గాదేవిని కాత్యాయనీ రూపంలో దర్శించినా, వారి శక్త్యానుసారం పూజించినా, సద్గుణవంతులైన అందమైన జీవితభాగస్వామిని పొందుతారని ప్రతీతి. దంపతులుగా కాత్యాయనీదేవి రూపాన్ని దర్శిస్తే సుఖజీవనం సాగించగలరని భక్తుల విశ్వాసం. శ్లోకం: చంద్రహాసోజ్జ్వల కరా శార్దూల వర వాహనా కాత్యాయనీ శుభం దద్యాద్దేవీ దానవ ఘాతిని భావం: పులి వాహనంపై పున్నమినాటి చంద్రుడివలె ప్రకాశిస్తూ రాక్షస సంహారం చేసిన ఓ కాత్యాయనీ మాకు శుభాలను ప్రసాదించుము తల్లీ! నివేదన: అరటిపండ్లు, పాలు, చక్కెరతో పాయసం ఫలమ్: వివాహ సంబంధమైన చిక్కులు తొలగి మంచి జీవిత భాగస్వామి లభిస్తాడు. - దేశపతి అనంత శర్మ -
మా అమ్మాయి జీవితాన్ని ఎలా చక్కదిద్దాలో అర్థం కావట్లేదు..?
మాకు ఒక్కగానొక్క కూతురు. ఇటీవలే ఆమెకు పెళ్లి చేశాం. మా అల్లుడు అందగాడు. మంచి ఉద్యోగం చేస్తున్నాడు, దురలవాట్లేమీ లేవని నిర్థారించుకున్న తర్వాతనే సంబంధం కుదుర్చుకున్నాం. అయితే మా అమ్మాయి ఒక భయంకరమైన విషయం చెప్పింది. భర్త తనతో ఇంతవరకు శారీరకంగా కలవలేదట. ఎప్పుడూ ఫోన్లో మెసేజెస్ చూసుకుంటూ తన ఫోన్‌ని చాలా జాగ్రత్తగా దాచిపెడతాడట. నిలదీస్తే తనకు స్వలింగసంపర్కం అలవాటుందని (గే), ఆ అలవాటు నుంచి బయట పడాలని నిర్ణయించుకున్న తర్వాతనే ఈ పెళ్లి చేసుకున్నాడని, అయితే ఎంత ప్రయత్నించినా బయటకు రాలేకపోతున్నానని, తనని క్షమించమని అడిగాడని చెప్పింది. ఏం చెయ్యాలో పాలుపోవట్లేదు. దయచేసి తగిన సలహా చెప్పగలరు. - ఒక తండ్రి, హైదరాబాద్ ఈ విషయంలో మీరేమీ ఆందోళన పడవద్దు. ఇటీవల కాలంలో పాశ్చాత్య నాగరికత ప్రభావం వల్ల ఇటువంటి అలవాట్లు పెరిగిపోతున్నాయి. సాధారణంగా ఇటువంటి వారికి బాల్యంలో జరిగే కొన్ని సంఘటనలు, అనుభవాల వల్ల వారు ఈ విధంగా తయారవుతున్నారు. కొందరి విషయంలో కొన్ని జన్యు సమస్యల వల్ల ఇలా జరుగుతుంటుంది. నా దగ్గరకు ఇలాంటి కేసులు చాలా వ స్తున్నాయి. అయితే మీ విషయంలో కొంతలో కొంత మెరుగు ఏమిటంటే... మీ అల్లుడికి తను చేసేది తప్పని తెలుసు, పైగా చేస్తున్న పనికి పశ్చాత్తాపపడటం, దాని నుంచి బయటకు రావాలని ప్రయత్నించటం. ఇటువంటి అలవాట్లు ఉన్నవారు చాలామంది ముందు అసలు బయటపడరు.ఒకవేళ బయటపడినా తమ జీవితభాగస్వామి మీదనే ఏవో ఒక నిందలు మోపి, అటు తమ జీవితాన్ని, ఇటు భాగస్వామి జీవితాన్ని కూడా దుర్భరం చేస్తారు. మీరు ఈ విషయాన్ని అందరికీ చెప్పి, పదిమంది చేత అతనికి హితబోధలు, నీతులు చెప్పించి, సమస్యను మరింత జటిలం చేసుకోవద్దు. మీ అమ్మాయికి కూడా ఇదే విషయం చెప్పండి. ముందు అతనికి ఆపోజిట్ సెక్స్ అంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకోండి. ఏదోవిధంగా అతని ఫోన్ కాంటాక్ట్స్ కట్ చేయండి. మీ అమ్మాయి భర్తతో బాగా ప్రేమగా ఉంటూ, మంచిగా దారిలోకి తెచ్చుకోవాలి. మీ అల్లుడికి బిహేవియర్ థెరపీ, కౌన్సెలింగ్ ఇప్పించడం ద్వారా చాలావరకు ప్రయోజనం ఉంటుంది. ఆందోళన పడకుండా, సంయమనం కోల్పోకుండా జాగ్రత్తగా వ్యవహరించండి. డాక్టర్ కల్యాణ్‌చక్రవర్తి సైకియాట్రిస్ట్, మెడిసిటీహాస్పిటల్స్, హైదరాబాద్