‘భార్యాపిల్లలకు దూరంగా ఉండలేకపోతున్నా.. స్పౌజ్ ట్రాన్స్‌ఫర్ కోసం ఎంతోకాలంగా వేచి చూస్తున్నా.. కానీ, ఎంతకూ ప్రభుత్వం నుంచి స్పందన రావడం లేదు. ఇక ఎదురుచూసే ఓపిక నాకు లేదు. అందుకే, ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నా’ అంటూ పోలీసు వాట్సాప్ గ్రూపుల్లో సందేశం పెట్టాడు ఓ కానిస్టేబుల్.
తన భర్త కూడా తనలాగే కానిస్టేబుల్ అని, తన మూడేళ్ల కుమారుడిని చూసుకునే వారెవరూ లేరని బందోబస్తుకు పిల్లాడిని చంకనెత్తుకు వెళ్లాల్సి వస్తోందని, దయచేసి తమ స్పౌజ్ దరఖాస్తును త్వరగా పరిష్కరించాలని విలపిస్తూ ఓ మహిళా కానిస్టేబుల్ ఆడియో సోషల్‌మీడియాతోపాటు, డిపార్ట్‌మెంటులో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
సాక్షి, కరీంనగర్: ‘కోడి ఒక కోనలో.. పుంజు ఒక కోనలో.. పిల్లలేమో తల్లడిల్లే ప్రేమలేని కానలో’.. అంటూ లేత మనసులు సినిమాలో హృదయాన్ని కరిగించే పాట ఉంది. ఇప్పుడు పోలీసు దంపతుల పిల్లల పరిస్థితి కూడా సరిగ్గా ఇలాగే ఉంది. తల్లి జిల్లా కేంద్రంలో సివిల్ (లా అండర్ ఆర్డర్), తండ్రి గ్రేహౌండ్స్ ఎక్కడో చత్తీస్‌ఘడ్ సరిహద్దులో విధులు నిర్వహించాలి. పిల్లలు కాస్త పెద్దవారైతే హాస్టల్‌లో ఉంటున్నారు. ఇపుడు ఎటొచ్చీ.. ఏడెనిమిదేళ్లలోపు పిల్లలు కావడంతో పోలీసు దంపతులకు కష్టాలు రెట్టింపయ్యాయి. ఉరుకులు పరుగుల జీవితాలు.. కుటుంబానికి, చివరికీ చిన్నపిల్లలకు సైతం దూరంగా ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి. మగవారికి కాస్త ఫర్వాలేదు కానీ, పాలిచ్చే తల్లులు, తమ పని తాము చేసుకోని పిల్లలున్న మహిళా పోలీసుల ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా మారింది. ఇలాంటి దంపతులు తీవ్ర మానసిక ఒత్తిడిలో కూరుకుపోతున్నారు.
ఉమ్మడి జిల్లా నుంచి దాదాపు 30 జంటలు..
పోలీసు కొలువంటేనే విరామం లేని విధి. అందుకే, ఈ డిపార్ట్‌మెంటు సిబ్బంది ఒకే డిపార్ట్‌మెంటు వ్యక్తులను వివాహం చేసుకోవడం చాలా అరుదు. ఇద్దరి స్వప్నం పోలీసుశాఖే అయిన అరుదైన జంటలు మాత్రమే ఇక్కడ ఉంటాయి. 317 జీవో అమలులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా డిసెంబరు నెలలో దాదాపు 350 స్పౌజ్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో దాదాపు 45కిపైగా పరిష్కారమయ్యాయి. కానీ, 300లకుపైగా దరఖాస్తులకు ఇంతవరకూ మోక్షం లభించలేదు. అందులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి దాదాపు 30కిపైగా దరఖాస్తులు ఉన్నాయి. అందులోనూ రామగుండం కమిషనరేట్ (సుమారు 10), కరీంనగర్ కమిషరేట్ (11), జగిత్యాల (5), సిరిసిల్ల (4) వరకు దరఖాస్తులు అలాగే ఉన్నాయి.
జేఎస్పీ, బ్యాంకు, కేంద్ర ఉద్యోగులకు నో చాన్స్!
ఈ క్రమంలో డిపార్ట్‌మెంటులో కొన్ని రకాల దరఖాస్తులపై రకరకాలుగా జరుగుతున్న ప్రచారంతో నీలినీడలు కమ్ముకున్నాయి. దంపతుల్లో ఎవరో ఒకరు జూనియర్ పంచాయతీ సెక్రటరీ, బ్యాంకు సిబ్బంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులై ఉంటే వారి దరఖాస్తులు పరిశీలించడం లేదన్న ప్రచారం ఉద్యోగులను తీవ్ర మనోవేదనకు గురిచేస్తోంది. అదే సమయంలో కరీంనగర్, రామగుండం, ఖమ్మం కమిషరేట్లను బ్లాక్‌లిస్టులో పెట్టారని, ఈ జిల్లాల దరఖాస్తులను ఇక పరిష్కరించరని జరుగుతున్న ప్రచారం వీరి ఆందోళనలను రెట్టింపు చేస్తోంది.
ఇక పోలీసు దంపతుల విషయానికి వస్తే.. వీరి పరిస్థితి మరింత దయనీయంగా మారింది. భార్య, భర్తలు చెరొక జిల్లాలో ఉండటం, 24 గంటల విధులు నిర్వహించాల్సి రావడంతో చంటిపిల్లలను చూసుకోవడం కష్టమవుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చిన్ననాటి నుంచి పోలీసుకావాలని కలలుగని సాధించుకున్న ఉద్యోగాన్ని వదులుకోలేక, చిన్నారులను డేకేర్ సెంటర్లలో వదిలి రాలేక ఆ తల్లులంతా తల్లడిల్లుతున్నారు. మరోవైపు ఎక్కడో విధులు నిర్వహిస్తు్తన్న తండ్రులు, భార్యాబిడ్డలు ఎలా ఉన్నారో అని కలత చెందుతున్నారు.
త్వరలోనే పరిష్కారం
పోలీసుదంపతులు ట్రాన్స్‌ఫర్ విషయంలో ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. స్పౌజ్ దరఖాస్తుల విషయాన్ని ఇప్పటికే ఉన్నతాధికారులు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. వారు కూడా సానుకూలంగానే స్పందించారు. త్వరలోనే సానుకూలంగా వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం.
– గోపీరెడ్డి, రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు
Comments
Please login to add a commentAdd a comment