సాక్షి, హైదరాబాద్: అమెరికా ఫస్ట్ అంటూ ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న వివాదాస్పద నిర్ణయాలు ప్రవాస భారతీయుల గుండెల్లో గుబులు రేపుతున్నాయి! అమెరికాలో హెచ్1 బీ వీసా కలిగిన వృత్తినిపుణుల జీవిత భాగస్వామ్యులకు వర్క్ పర్మిట్ ను (హెచ్4 వీసా) ట్రంప్ సర్కార్ రద్దు చేస్తే దాదాపుగా లక్ష మంది ఉద్యోగాలు కోల్పోతారని ఒక తాజా అధ్యయనం అంచనా వేసింది. అమెరికా ప్రభుత్వ ప్రణాళికలతో వేలాది ప్రవాస భారతీయుల కుటుంబాలపైనా, వారు పనిచేస్తున్న కంపెనీ యాజమాన్యాలపైన ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడించింది. ట్రంప్ సర్కార్ వీసా విధానాన్ని కఠినతరం చేస్తే సామాజికంగా, ఆర్థికంగా చూపించే ప్రభావాలపై టెన్నసీ యూనివర్సిటీకి చెందిన క్రిస్టోఫర్ జే.ఎల్. కన్నింగమ్,యూనివర్సిటీ ఆఫ్ లైమ్‌రిక్‌లో కెమ్మి బిజినెస్ స్కూలుకి చెందిన పూజ బి విజయ్‌కుమార్‌లు ఒక అధ్యయనం నిర్వహించారు. 1800 మంది ప్రవాస భారతీయ కుటుంబాలతో వారు మాట్లాడారు. తుది నివేదిక రూపకల్పనకు 416 మంది అభిప్రాయాలను పరిగణలోనికి తీసుకున్నారు.
అధ్యయనంలో వెల్లడైన అంశాలు
- లక్ష మంది వరకు ఉద్యోగాలు కోల్పోతారు.
- జీవితభాగస్వామ్యులందరూ సామాజికంగా ఏకాకిగా మారతారు.
- ఇళ్లల్లో ఒత్తిడితో కూడుకున్న వాతావరణం ఏర్పడుతుంది
- మెరుగైన జీవనం కోసం వచ్చిన కుటుంబాల ఆదాయం భారీగా తగ్గిపోతుంది
- స్థిరనివాసం ఏర్పాటు చేసుకోవాలని కలలు కనే ప్రవాస కుటుంబాలకు 2,50,000 డాలర్ల నుంచి 10 లక్షల డాలర్ల నష్టం వస్తుంది
- అత్యంత నిపుణులైన ప్రవాసులు ఉద్యోగాలు వదులుకుని అమెరికా విడిచిపెట్టే ప్రమాదం ఉంది
93 శాతం భారతీయులే
హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగాలు చేస్తున్న వారి భాగస్వామ్యులకు 2015కి ముందు పని చేసే అవకాశం లేదు. 2015లో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో హెచ్4 వీసా కలిగిన జీవిత భాగస్వామ్యులకు అమెరికాలో చట్టబద్ధంగా పనిచేయడానికి అనుమతులు ( ఎంప్లాయిమెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ –ఈఏడీ) ఇవ్వడం మొదలు పెట్టడంతో అమెరికాలో స్థిరపడాలనుకునే ఎన్నో భారతీయ కుటుంబాలకు అది వరంలా మారింది. 2015 నుంచి 2017 డిసెంబర్ నాటికి లక్షా 26 వేలకు పైగా హెచ్4 ఈఏడీనిమంజూరు చేస్తే, వారిలో 93 శాతం మంది భారతీయులే ఉన్నారు. ఇక అయిదు శాతం వీసాలతో తర్వాత స్థానంలో చైనా ఉంటే, మిగిలిన దేశాలన్నింటికీ కలిపి మిగిలిన 2 శాతం వీసాలున్నాయి. ఈఏడీ పొందిన వారిలో అయిదింట ఒక వంతు మంది కాలిఫోర్నియాలో నివసిస్తూ ఉంటే, టెక్ హబ్‌లుగా పేరు పొందిన సిలికాన్ వ్యాలీ, న్యూజెర్సీ, సియాటిల్, డల్లాస్, హస్టన్, వాషింగ్టన్‌ల నుంచి అత్యధికులు ఉన్నారు.
వర్క్ పర్మిట్ పొందినవారిలో 93 శాతం మంది మహిళలైతే ఏడు శాతం పురుషులు ఉన్నారు. అత్యంత నిపుణులైన వారి భాగస్వామ్యులకూ పని చేసే సౌకర్యం ఉంటే వారు అమెరికా వీడి వెళ్లకుండా ఉంటారన్న ఉద్దేశంతో ఒబామా సర్కార్ దీనిని అమల్లోకి తెచ్చింది. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత అమెరికా ఫస్ట్ అన్న నినాదాన్ని అందిపుచ్చుకొని అమెరికన్ల ఉద్యోగాలు విదేశీయులు కొల్లగొట్టేస్తున్నారని ఆరోపిస్తూవీసా నిబంధనలు కఠినతరం చేయడంలో భాగంగా హెచ్4 వీసాను రద్దు చేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. దీంతో ఎప్పుడేం జరుగుతుందోనన్న అభద్రతా భావంలో భారతీయ కుటుంబాలు ఉన్నాయి.
రద్దు చేస్తే ఇంటిదారే...
హెచ్1బీ వీసాదారుల జీవితభాగస్వాముల వర్క్ పర్మిట్‌ను రద్దు చేస్తే తిరిగి భారత్‌కు వెళ్లిపోవడానికి చాలా మంది సన్నాహాలు చేసుకుంటున్నట్టు ఈ అధ్యయనంలో వెల్లడైంది. ‘నా భార్య తీవ్రమైన నిరాశనిస్పౄహలకు లోనవుతోంది. అంత చదువు చదివి కెరీర్ ముందుకు వెళ్లకపోతే ఇంక అమెరికాలో ఎందుకు ఉండాలని ప్రశ్నిస్తోంది. భార్యలు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే ఒక్కరి జీతంతోనే బతకడం అంటే చాలా కష్టం, ట్రంప్ నిర్ణయాలు సరైనవి కావు. అందుకే ఇండియాకు తిరిగి వెళ్లిపోవాలని అనుకుంటున్నామ’ని అధ్యయనంలో పాల్గొన్న పలువురు స్పష్టం చేశారు.
వ్యతిరేకిస్తున్న దిగ్గజ సంస్థలు
వీసా నిబంధనలు కఠినతరం చేయాలన్న ట్రంప్ సర్కార్ ప్రణాళికలను గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఫేస్‌బుక్ వంటి సంస్థలు బహిరంగంగానే వ్యతిరేకిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల వీసా హోల్డర్లు, వారి భాగ్యస్వామ్యులు ముఖ్యంగా మహిళల మనోభావాలను దెబ్బ తింటాయని, అది సరైన పనికాదని వారంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం పూర్తి సమాచారం లేకుండా, ఎలాంటి ప్రతికూల ప్రభావాలు పడతాయో అంచనా వేయకుండా విధాన పరమైన నిర్ణయాలు తీసుకుంటోందని అధ్యయనకారులు తప్పుబడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment