3ఓపీటీ రద్దు చేయాలని అమెరికన్ల డిమాండ్
దొడ్డి దారి ప్రవేశమంటూ విమర్శలు
భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం
హెచ్–1బీ వివాదంతో సతమతమవుతున్న భారత విద్యార్థుల డాలర్ కలలపై మరో పిడుగు పడబోతుందా? విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతుండటం ఈ అనుమానానికి తావిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది.
గతేడాది లక్ష మంది విద్యార్థులు
అంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా ఎఫ్ –1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంటున్నారు. తొలుత తాత్కాలిక నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం ఎఫ్–1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది.
అమెరికా లో అత్యధి కంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు, చివరికి హెచ్–1బీ వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో సుమారు 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు.
కోర్టు చెప్పినా...
విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్‌ను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతోందని అమెరికన్లు వాదిస్తున్నారు. అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ (వాష్టెక్) కోర్టుకెళ్లింది. అయితే, కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది.
మరోసారి చర్చలు..
జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలపై ఈ చర్చలు తీవ్రమయ్యాయి. ‘‘ఓపీటీ ప్రోగ్రామ్ విదేశీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తరహాలో గెస్ట్ వర్కర్ స్కీమ్. విశ్వవిద్యా లయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తు న్నాయి. డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) తరహాలో చట్టవి రుద్ధం. ఈ పోటీ నుంచి అమెరికన్ కాలేజీ గ్రాడ్యు యేట్లను రక్షించడానికి ఈ ఓపీటీని రద్దు చేయాలి’’ అని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్.. ఎక్స్‌లో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాగుతున్న ఈ కార్యక్రమం.. యూఎస్ జాబ్ మార్కెట్లలోకి దొడ్డిదారి ప్రవేశమని విమర్శించింది.
ప్రశ్నార్థకంగా భవిష్యత్...
అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతు దారులు సైతం.. హెచ్–1బీ వీసాలపై మండిపడుతున్నారు. హెచ్–1బీ వీసా హోల్డర్లు, ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభా వంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్‌తోపాటు.. ఎలన్ మస్క్, వివేక్ రామ స్వామి వంటి ప్రముఖులు చెబుతు న్నారు. ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమ ర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ కార్య క్రమం భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నా ర్థకంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment