dollar dreams
-
వలసదార్లకు దిన దిన గండం
అమెరికా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల్లాగే భారతీయులకూ ఓ కలల ప్రపంచం. ఆ డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి, కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్ ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనుకడుగువేయట్లేరు. ఇలా ఎలాగోలా చట్టవిరుద్ధంగా వెళ్లి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి అవమానాలు పడుతున్నారు?డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వలసదారులు అమెరికాలో అనధికారిక పనులు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలేవీ రికార్డుల్లో ఉండవు. రికార్డులో ఉండాలంటే.. వీసాలు, వర్క్ పర్మిట్లు కావాలి. ఉదాహరణకు అమెరికన్లు చేయడానికి ఇష్టపడని ఉద్యోగాలన్నమాట. దక్షిణ కాలిఫోర్నియాలోని పొలాల్లో పని ఇందులో ఒకటి. ఎక్కువ సమయం, శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ వేరే పని దొరక్క దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఇలాంటి పనులు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా వెళ్లిన మన భారతీయులు ఎక్కువగా గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో కార్మికులుగా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు. అనుక్షణం భయం.. భయం ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌కు అక్రమంగా వలస వచ్చిన ఒక భారతీయుడు ఉదయం 6 గంటలకే గ్యాస్‌స్టేషన్‌లో పనిలో నిమగ్నమవుతాడు. రాత్రిదాకా ఒళ్లు హూనమయ్యేలా పనిచేసి బయటి తిండి తిని తన బంధువుల ఇంట్లో బేస్మెంట్లో నిద్రపోతాడు. ఇందులో కష్టమేముందని దూరం నుంచి చూసిన వాళ్లకు అనిపించొచ్చు. కానీ పని చేసినంత సేపు ఇలాంటి వారి జీవితాల్లో అంతకుమించిన నరకయాతన ఉంటుంది. రిజిస్టర్డ్ వర్క్‌ప్లేస్‌లో పనిచేయలేరు. ఎలాంటి అధికారిక శిక్షణ పొందే అర్హత ఉండదు. డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటికీ రాదు. డ్రైవింగ్ చేయలేరు. సైకిల్ తొక్కుతూ వెళ్లాల్సిందే. అది కూడా అక్కడి అధికారులకు అనుమానం వస్తే పట్టుబడతానేమోనని భయం వెంటాడుతుంది. నిరంతరం మనసులో ఏదో భయం. ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందోనన్న ఆందోళన. వస్తువులు పోయినా, ఎవరితోనైనా గొడవ జరిగినా, తననెవరైనా కొట్టినా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ వెళ్లలేరు. పట్టుబడితే వారికే రిస్క్. అందుకే ఏం జరిగినా భరించాల్సిందే. ఇంత శ్రమ ఎందుకూ అంటే.. స్వదేశంలో మధ్య తరగతి జీవితం గడుపుతున్న తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే తపన. కుటుంబాన్ని అమెరికాకు తీసుకురావాలి. అందుకు సరిపడా సంపాదించాలి. లీగల్ రెసిడెంట్‌గా అనుమతి పొందేందుకు లాయర్‌కు పెట్టుకునేంత సంపాదించాలి. ఇలా ఎన్నో ఆశలు. అమెరికన్ అధికారుల నుంచి తప్పించుకోవడం కత్తిమీద సాము. అలాంటిది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ నుంచి రోజూ ఏదో ఒక విధంగా తప్పించుకోవడం వారికి సర్వసాధారణమైపోతుంది. తోటి భారతీయుల సాయంతో.. అక్రమ వలసదారుల జీవితాల్లో అక్కడి తమలాంటి వాళ్ల సమూహం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అక్రమ వలసదారులు కనీసం సిమ్ కార్డు పొందలేరు. బంధువులు ఇచ్చిన సిమ్ కార్డులను ఉపయోగించి స్వదేశంలోని కుటుంబంతో మాట్లాడతారు. బ్యాంకు ఖాతా పొందే అవకాశమే లేదు. సెప్టెంబర్ 11న 9/11 వైమానిక దాడుల తర్వాత అమెరికాలో అన్ని నిబంధనలు కఠినం చేశారు. అందులోభాగంగా బ్యాంకింగ్ నియమాలూ మారాయి. అందుకే స్థానిక యజమానులు అక్రమ వలసదారులకు పనికి వేతనాన్ని కేవలం నగదు రూపంలోనే చెల్లిస్తారు. అదనపు ఆదాయం కోసం, తెలిసినవారి తోటల్లో పనిచేయడం, ఇళ్ల గోడలకు పెయింటింగ్ వేయడం, ఇతర పనులలో సహాయం చేస్తూ ఇంకాస్త డబ్బు సంపాదిస్తారు. అక్రమవలసదారులు అనారోగ్య సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సాధారణంగా అమెరికా ఆసుపత్రులు చట్టవిరుద్ధమైన నివాసితులకు చికిత్సను నిరాకరించవు. కానీ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల ఆస్పత్రుల వద్ద వైద్యం కాస్త కష్టంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా అక్కడి చట్టబద్ధ భారతీయ వైద్యులను వీళ్లంతా ఆశ్రయిస్తారు. చవకగా వైద్య చికిత్సలు పొందుతారు. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డు సంపాదించిన భారతీయుల సహాయంతో ఆన్లైన్ ద్వారా స్వదేశానికి డబ్బులు పంపుతున్నారు. జీవితాలనే పణంగా పెట్టి... చాలా మంది డాక్టర్లు, నర్సులు, లాయర్లు ఇక్కడికి వచ్చి కూలీలుగా పనిచేసి డాక్యుమెంట్లు తయారు చేయించుకున్నారు. ఇలా రకరకాల పనులు చేసి.. డబ్బు సంపాదించి అనుమతి పొందిన వారు చాలా మంది తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకొచ్చారు. అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు డాక్యుమెంటేషన్ అడగవు. దీంతో ఇప్పటివరకు వారి పిల్లలను తీసుకురావడం సులభమైంది. కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకంచేయడం తెల్సిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలను ఆపడం లేదు. కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు. డాక్యుమెంట్లు లేకుండా ఎట్లా వెళ్తున్నారు? కొందరు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వెళ్లడానికి కొన్ని అక్రమ విధానాలను అవలంభిస్తున్నారు. పర్యాటక లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాకు వస్తారు. ఆ వీసా గడువు ముగిసినా భారత్‌కు తిరిగిరారు. తప్పించుకు తిరుగుతారు. ఇక భూమార్గంలో వేర్వేరు దేశాలు దాటి వస్తూ చిట్టచివరకు అమెరికా గడ్డపై కాలుమోపుతారు. ‘డంకీ’రూట్‌గా దీనికి పేరు. సరిహద్దులు దాటించేసే ఏజెన్సీలకు దాదాపు 1 లక్ష డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన విద్యార్హతలు, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా వీసా పొందలేని భారతీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. ఇంకొందరు తొలుత అమెరికా పొరుగున్న ఉన్న కెనడాకు వచ్చి అక్కడ 76 రోజుల విజిటర్ వీసా సంపాదించి అలా అమెరికాకు వచ్చి ఇక అక్కడే తిష్టవేస్తారు. వలసదారులు సాల్వడార్, నికరాగ్వాల గుండా కూడా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా వేర్వేరు అక్రమ విధానాలను అవలంభించి ఇప్పటిదాకా 7,25,000 మంది అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 2024 ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా వచ్చిన అక్రమ వలసదారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
డాలర్ డ్రీమ్స్‌పై మరో పిడుగు!
హెచ్–1బీ వివాదంతో సతమతమవుతున్న భారత విద్యార్థుల డాలర్ కలలపై మరో పిడుగు పడబోతుందా? విద్యార్థుల వర్క్ పర్మిట్లను రద్దు చేయాలని అమెరికాలో స్థానిక విద్యార్థులు గొంతెత్తుతుండటం ఈ అనుమానానికి తావిస్తోంది. గ్రాడ్యుయేషన్ తర్వాత అంతర్జాతీయ విద్యార్థులు అమెరికాలో పనిచేయడానికి అనుమతించే ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ) ప్రోగ్రామ్‌ను రద్దు చేయాలని అమెరికా టెక్ వర్కర్లు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఇది అమెరికాలో అత్యధికంగా ఉండే భారతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపనుంది. గతేడాది లక్ష మంది విద్యార్థులుఅంతర్జాతీయ విద్యార్థులు, ముఖ్యంగా ఎఫ్ –1 వీసాలపై ఉన్నవారు ఓపీటీ ప్రోగ్రామ్‌ను ఎంచుకుంటున్నారు. తొలుత తాత్కాలిక నైపుణ్యాభివృద్ధి కోసం ఈ ఓపీటీ ప్రోగ్రామ్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమం ఎఫ్–1 వీసాలపై ఉన్న విదేశీ విద్యార్థులు స్టెమ్ డిగ్రీ కలిగి ఉంటే మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసేందుకు అనుమతిస్తుంది. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం (స్టెమ్) రంగాల్లోని గ్రాడ్యుయేట్లకు 36 నెలల వరకు ఈ పొడిగింపు ఉంటుంది. అమెరికా లో అత్యధి కంగా అంతర్జాతీయ విద్యార్థులైన భారతీయ విద్యార్థులు వృత్తిపరమైన అవకాశాలు, చివరికి హెచ్–1బీ వీసాల కోసం ఈ కార్యక్రమంపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. చాలా మంది విద్యార్థులు స్టెమ్ ఓపీటీ ఎక్స్‌టెన్షన్‌ను ఉపయోగిస్తున్నారు. 2023–24 విద్యా సంవత్సరంలో సుమారు 97,556 మంది భారతీయ విద్యార్థులు ఓపీటీలో చేరారు. కోర్టు చెప్పినా... విదేశీ ఉద్యోగులను పెంచే ఓపీటీ ప్రోగ్రామ్‌ను అమెరికన్లు వ్యతిరేకిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వలసకు ఉపయోగపడుతోందని అమెరికన్లు వాదిస్తున్నారు. అమెరికన్ల నుంచి ఉద్యోగాలను దూరం చేయడమేనని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్స్ విమర్శిస్తున్నాయి. ఈ కార్యక్రమాన్ని సవాలు చేస్తూ 2023లో వాషింగ్టన్ అలయన్స్ ఆఫ్ టెక్నాలజీ వర్కర్స్ (వాష్టెక్) కోర్టుకెళ్లింది. అయితే, కేసును సమీక్షించడానికి అమెరికా సుప్రీంకోర్టు నిరాకరించింది. కార్యక్రమానికి ఆమోదం తెలిపే దిగువ కోర్టు తీర్పును సమర్థించింది. మరోసారి చర్చలు.. జనవరి 20న ట్రంప్ ప్రమాణ స్వీకారానికి సిద్ధమవుతున్న తరుణంలో నైపుణ్యం కలిగిన కార్మికుల వలసలపై ఈ చర్చలు తీవ్రమయ్యాయి. ‘‘ఓపీటీ ప్రోగ్రామ్ విదేశీ విద్యార్థులకు ఇంటర్న్‌షిప్ తరహాలో గెస్ట్ వర్కర్ స్కీమ్. విశ్వవిద్యా లయాలు విద్యకు బదులుగా వర్క్ పర్మిట్లను విక్రయిస్తు న్నాయి. డీఏసీఏ (డిఫర్డ్ యాక్షన్ ఫర్ చైల్డ్‌హుడ్ అరైవల్స్) తరహాలో చట్టవి రుద్ధం. ఈ పోటీ నుంచి అమెరికన్ కాలేజీ గ్రాడ్యు యేట్లను రక్షించడానికి ఈ ఓపీటీని రద్దు చేయాలి’’ అని యూఎస్ టెక్ వర్కర్స్ గ్రూప్.. ఎక్స్‌లో పేర్కొంది. కాంగ్రెస్ ఆమోదం లేకుండా సాగుతున్న ఈ కార్యక్రమం.. యూఎస్ జాబ్ మార్కెట్లలోకి దొడ్డిదారి ప్రవేశమని విమర్శించింది. ప్రశ్నార్థకంగా భవిష్యత్...అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్ మద్దతు దారులు సైతం.. హెచ్–1బీ వీసాలపై మండిపడుతున్నారు. హెచ్–1బీ వీసా హోల్డర్లు, ప్రధానంగా భారతీయులు అమెరికన్ కార్మికుల స్థానాన్ని భర్తీ చేస్తున్నారని, పాశ్చాత్య నాగరికతకు ముప్పుగా పరిణమిస్తున్నారని వారు వాదిస్తున్నారు. అమెరికాలో ఇంజనీర్ల కొరత నేపథ్యంలో నైపుణ్యం కలిగిన విదేశీ ప్రతిభా వంతులను ఆకర్షించాల్సిన అవసరం ఉందని ట్రంప్‌తోపాటు.. ఎలన్ మస్క్, వివేక్ రామ స్వామి వంటి ప్రముఖులు చెబుతు న్నారు. ఈ ఓపీటీ కార్యక్రమాలను వారు సమ ర్థిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓపీటీ కార్య క్రమం భవిష్యత్ ఏమిటనేది ప్రశ్నా ర్థకంగా మారింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
కరిగిపోతున్న డాలర్ కలలు!
ట్రంప్ ఎఫెక్ట్ వాషింగ్టన్: కఠినతరమైన వీసా నిబంధనలు, పెచ్చురిల్లుతున్న జాతి విద్వేషపూర్వక దాడులు అమెరికా చదువులపై మోజును తగ్గిస్తున్నాయి. భారత్, చైనా విద్యార్థులు అమెరికన్ వర్సిటీల్లో చదివేందుకు జంకుతున్నారని, అందుకే అడ్మిషన్లకు దరఖాస్తులు తగ్గుతున్నాయని విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. అగ్రరాజ్యం అమెరికా నూతన అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు భారతీయుల డాలర్ కలలపై నీళ్లు జల్లుతున్నాయి. కఠినతరమైన వీసా నిబంధనలు, జాతి విద్వేషపూర్వక దాడుల కారణంగా అమెరికన్ వర్సిటీల్లో విదేశీ విద్యార్థుల అడ్మిషన్లు తగ్గిపోతున్నాయి. ఈ విద్యాసంవత్సరం 250కి పైగా అమెరికన్ కాలేజీల్లో, ఆరు అగ్రశ్రేణి విద్యాసంస్థల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల అడ్మిషన్లకు దరఖాస్తులు 26 శాతం పడిపోయినట్టు తాజా సర్వే వెల్లడించింది. గ్రాడ్యుయేట్ దరఖాస్తులు కూడా 15 శాతం తగ్గాయి. మొత్తంగా అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తుల సంఖ్య సగటున 40 శాతం పడిపోయిన్నట్టు తేలింది. అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ రిజిస్ట్రార్స్ అండ్ అడ్మిషన్ ఆఫీసర్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్, అసోసియేషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేటర్స్ సంయుక్తంగా చేపట్టిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. సగం మంది భారత్, చైనా నుంచే.. ఇవి విడుదల చేసిన నివేదికలోని వివరాలు ఇలా ఉన్నాయి. అమెరికా వర్సిటీల అడ్మిషన్లలో చైనా, భారత్ నుంచే 47 శాతం ఉంటాయి. అంటే అమెరికాలో చదివే అంతర్జాతీయ విద్యార్థుల్లో సగం మంది ఈ దేశాల విద్యార్థులే ! ఇటీవలి పరిణామాలు అమెరికా యూనివర్సిటీల్లో అంతర్జాతీయ విద్యార్థుల దరఖాస్తులను తగ్గించేస్తున్నాయి. చైనా నుంచి కూడా యూజీ కోర్సుల దరఖాస్తులు 25 శాతం, గ్రాడ్యుయేట్ కోర్సుల దరఖాస్తులు 32 శాతం పడిపోయాయి. ట్రంప్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు అంతర్జాతీయ విద్యార్థులపై తీవ్ర ప్రభావం చూపాయి. భవిష్యత్తులోనూ అడ్మిషన్లు పెద్దగా పెరగకపోవచ్చని పోర్ట్లాండ్ స్టేట్స్ వర్సిటీకి చెందిన విమ్ వివెల్ చెప్పారు. ఈ ఏడాది తమ యూనివర్సిటీలో భారతీయ విద్యార్థుల అడ్మిషన్లు 26 శాతం తగ్గిపోయాయని ఆయన వివరించారు. కొంపముంచుతున్న ట్రంప్ నిర్ణయాలు అమెరికాలో ఇటీవల పలువురు భారతీయులపై జాతివిద్వేష దాడులు జరగడం, వీసాల జారీని కఠినతరం చేయడం వంటి పరిణామాలు భారత విద్యార్థులపై ప్రభావం చూపుతున్న మాట నిజమేనని న్యూయార్క్ స్టేట్ యూనివర్సిటీ అధికారి జాన్ జే వుడ్ తెలిపారు. పీజీ కోర్సు చేసిన భారతీయ విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ తరువాత ఇక్కడే మూడేళ్లు పని చేసుకునే సదుపాయం ఉండేది. అయితే వీసా నిబంధనల్లో తాజాగా తీసుకొస్తున్న మార్పులు విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తున్నాయని వుడ్ చెప్పారు. అంతేకాక కొన్ని ముస్లిం దేశాల జాతీయులు అమెరికాలోకి ప్రవేశించకుండా విధించిన నిషేధమూ చెడు సంకేతాలను పంపిందని అమెరికా విద్యారంగ నిపుణులు చెబుతున్నారు. -
భారతీయులకు డొనాల్డ్ ట్రంప్ షాక్
-
భారతీయులకు ట్రంప్ షాక్
- అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాదారులను అనుమతించబోమని ప్రకటన వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డాలర్ డ్రీమ్స్‌లో తేలియాడే భారతీయులకు షాక్ ఇచ్చారు. అమెరికన్లను కాదని విదేశీ కార్మికులతో ఉద్యోగాల భర్తీని అంగీకరించబోమని ప్రకటించారు. ఇందుకోసం భారతీయులు ఎక్కువగా వినియోగించే హెచ్1బీ వీసాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించడం గమనార్హం. డిస్నీ వరల్డ్ మొదలైన అమెరికా కంపెనీలు అమెరికా కార్మికులను కాదని భారత్ తదితర దేశాల నుంచి వచ్చే హెచ్1బీ వీసా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని అనుమతించేది లేదని చెప్పారు. గురువారం అయోవాలో తన మద్దతుదారులతో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ప్రతి అమెరికన్ జీవితానికీ రక్షణ కల్పించేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హెచ్1బీ వీసాల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా తాను ఎక్కువగా అమెరికా కార్మికులతో గడిపానని, శిక్షణ కోసం తప్పించి.. వారి స్థానంలో విదేశీ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగనీయబోమని చెప్పారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించి తీరుతామని చెప్పారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇది తప్పదన్నారు. ట్రంప్ గెలుపు వెనుక రష్యా హస్తం! అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ నిర్ధారించినట్లు మీడియా వెల్లడించింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలుపుకోసం రష్యా ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనాన్ని ప్రచురించింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం హిల్లరీ ప్రతిష్టను మసకబార్చి ట్రంప్ అవకాశాల్ని మెరుగుపరచేందుకు రష్యా ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు పనిచేశారని, వీరు హిల్లరీ ప్రచారకమిటీ చైర్మన్‌తో సహా డెమోక్రటిక్ పార్టీకి చెందిన అనేకమంది మెయిల్ ఎకౌంట్లను హ్యాక్ చేసి వీకీలిక్స్కు అందజేసినట్లు నిఘావర్గాలు గుర్తించాయంది. -
డాలర్డ్రీమ్స్కు ‘భాగ్య’రేఖ!
సాక్షి, హైదరాబాద్: 2008 జూన్‌లో అమెరికాలోని ఇల్లినాయిస్లో కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు వీసా తీసుకుని అమెరికాకు చేరుకోవడానికి 11 రోజులు పట్టింది. చెన్నై కాన్సులేట్‌లో వీసా అపాయింట్మెంట్ తీసుకోవడం, అక్కడ రెండు రోజులు ఉండాల్సి రావడం, ఆ వెంటనే విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల బాగా జాప్యం జరిగింది. 2011 నవంబర్‌లో ఓ కారు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మరణించారు, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈసారి వారి బంధువులు కేవలం ఐదు రోజుల్లో అమెరికాకు చేరుకోగలిగారు. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు కావడం, అత్యవసర పరిస్థితుల్లో అమెరికా వెళ్లేందుకు వీసా ఇచ్చే ఏర్పాటు ఉండడంతో ఇది సాధ్యమైంది. వాస్తవానికి బెంగళూరులో ఏర్పాటుకావాల్సిన ఈ అమెరికా కాన్సులేట్... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు తరలివచ్చింది. అమెరికాకు వెళ్లే లక్షలాది మంది తెలుగు ప్రజలకు ఇబ్బందులను తొలగించిన ఈ కాన్సులేట్ ఏర్పాటు, పనితీరుపై ఈ వారం ‘ఫోకస్’... 2009కి ముందు చెన్నై కాన్సులేట్‌తో ఇబ్బందులు ప్రయాణం దగ్గరి నుంచి భాషదాకా ఎన్నో సమస్యలు అప్పట్లో ఏటా అమెరికా వెళ్లిన విద్యార్థులు 5 నుంచి 6 వేలలోపే హైదరాబాద్‌లో కాన్సులేట్‌తో భారీగా పెరిగిన విద్యార్థుల సంఖ్య గత ఏడేళ్లలో ఉన్నత చదువు కోసం వీసాలు పొందినవారు 1.64 లక్షలు 2015లో దేశంలోనే అత్యధికంగా 42 వేల మంది విద్యార్థులకు వీసాలు గత ఏడేళ్లలో 10.51 లక్షల సందర్శక (బీ1/బీ2) వీసాలు జారీ * హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్‌తో సులభమైన అమెరికా వీసా * వైఎస్సార్ చొరవతో ఏర్పాటు.. దేశంలోనే అత్యధికంగా వీసాల జారీ 2009కి ముందు ఎన్నో సమస్యలు అమెరికాలో తమ పిల్లలు, దగ్గరి బంధువులు ఉన్నవారు.. చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు.. సరదాగా సందర్శించి వద్దామనుకునే పర్యాటకులు.. ఇలా ఎవరికైనా అమెరికా వీసా కావాలి. వీసా పొందాలంటే ఎంతో తతంగం ఉంటుంది. ఎన్నో రకాల ధ్రువపత్రాలు కావాలి, కాన్సులేట్‌లో అపాయింట్మెంట్ తీసుకోవాలి, ఒకరోజు వెళ్లి వేలిముద్రలు ఇవ్వాలి, మరుసటిరోజున ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అవసరమైన వివరాలన్నీ వెల్లడించగలగాలి. ఇన్ని చేసినా కాన్సులేట్ ఉన్న చోటికి వెళ్లి రావడం, ఖర్చులు, భాషా సమస్య వెంటాడుతాయి. ఇప్పుడు హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఉండడంతో ఇవన్నీ పెద్ద సమస్యలుగా కనిపించడం లేదు. కానీ 2009కి ముందు అమెరికా వీసా కోసం తమిళనాడులోని చెన్నైకి వెళ్లాల్సి రావడంతో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అమెరికా వీసా పొందేందుకు అన్ని అర్హతలున్నా చెన్నైకి వెళ్లాల్సి రావడం, భాషాపరమైన సమస్య వంటివాటితో వెనుకాడేవారు. ఇప్పుడు ఎంతో సులువు.. ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాన్సులేట్ వీసాలు మంజూరు చేయడం, తెలుగులో మాట్లాడే అవకాశమివ్వడంతో ఏటా అమెరికా వీసాలు పొందుతున్న తెలుగువారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 1.5 లక్షల మంది అమెరికా వీసాలు పొందుతున్నారు. వెంటనే వెళ్లే అవసరం లేకపోయినా... అమెరికాలో చదువుకుంటున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారి తల్లిదండ్రులు పదేళ్ల సమయానికి ‘బీ1/బీ2 (సందర్శకుల)’ వీసాలు తేలిగ్గా పొందుతున్నారు. హైదరాబాద్‌లో 2009 మార్చి 5న అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు చెన్నై వెళ్లే తెలుగువారి సంఖ్య సగటున నెలకు 3,500 దాకా ఉండేది. ఇక్కడ వీసాల మంజూరు మొదలుపెట్టిన ఆరునెలలకే అంటే 2009 సెప్టెంబర్‌లో హైదరాబాద్ కాన్సులేట్ నుంచి 17 వేల మందికి పైగా వీసాలు పొందారు. అమెరికా వెళ్లి వచ్చే ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగింది. 2008లో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 76 వేల మంది అమెరికాకు వెళితే... 2010లో అది సుమారు 2.5 లక్షలు దాటింది. ఏదైనా పని మీద అమెరికా వెళ్లాల్సి వస్తే వెంటనే వీసా పొందే సౌకర్యం ఉండటమే దీనికి కారణమని ట్రావెల్ అండ్ టూరిజం వర్గాలు చెప్పాయి. భారీగా పెరిగిన విద్యార్థులు హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే ఇక్కడి విద్యార్థుల సంఖ్య 6వేల లోపే. 2007-08లో 6,800 మంది విద్యార్థి వీసాలు పొందగా... ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన 2009లో అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య సుమారు 13 వేలు. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ కాన్సులేట్‌లో వీసాలు పొందిన విద్యార్థుల సంఖ్య 42 వేల వరకు ఉంటుంది. ఇందులో ఏటా తొలిస్థానంలో ఉండే ముంబైని 2015లో హైదరాబాద్ దాటేసింది. ఖర్చులూ తగ్గాయి హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుకు ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారెవరైనా తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. వీసా ఇంటర్వ్యూకు ఒక రోజు ముందే వేలిముద్రలు ఇవ్వడానికి ఉదయాన్నే వెళ్లాలి. దాని కోసం అంతకు ముందు రోజే చెన్నై వచ్చి బస చేయాల్సిన పరిస్థితి. మొత్తంగా మూడు రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇలా వీసా కోసం చెన్నై వెళ్లి, రావడానికి ప్రయాణ ఖర్చులతో పాటు మూడు రోజుల బస వ్యయమూ భరించాల్సి వచ్చేది. మొత్తంగా కనీసం రూ.7,500 నుంచి రూ.10 వేల దాకా ఖర్చయ్యేది. ఇప్పుడా ఖర్చు తగ్గింది. భాషతో తంటాలు.. చెన్నై కాన్సులేట్‌లో ఇంగ్లిష్-తమిళ భాషలు తెలిసిన ఆఫీసర్లు మాత్రమే ఉండేవారు. ఏపీ, తెలంగాణల నుంచి తెలుగు భాష ఎంపిక చేసుకున్న వారికి మధ్యలో అనువాదకుడు అవసరమయ్యేది. తమిళనాడులో తెలుగు తెలిసిన వారిని మాత్రమే అనువాదకులుగా పెట్టుకునేవారు. దీంతో తెలుగు-తమిళం అనువాదం ఇబ్బందిగా ఉండేది. అసలే తమిళం అంతంతగా వచ్చే అమెరికా కాన్సులేట్ అధికారులు పలుమార్లు భాషా సమస్య కారణంగా వీసాలు తిరస్కరించేవారు. 2003-2004లో వీసాల కోసం వెళ్లినవారిలో ఏకంగా 67 శాతం మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్‌లో తెలుగు తెలిసిన అధికారులు ఉండడంతో ఈ సమస్య తప్పింది. అపాయింట్మెంట్ కూడా కష్టమే చెన్నైలో ఉండగా వీసా అపాయింట్మెంట్ అతి కష్టంగా దొరికేది. హైదరాబాద్ లేదా చెన్నైలో ఉన్న దళారులపై ఆధారపడాల్సి వచ్చేది. ఆన్లైన్ సౌకర్యం లేకపోవడం కూడా దానికి కారణం. ఇప్పుడు అమెరికా వెళ్లాలనుకునేవారు అన్ని పత్రాలు ఉంటే ఒక్క రోజులోనే అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. వేలిముద్రలు ఇవ్వడం, ఇంటర్వ్యూకు హాజరుకావడం అంతా ఒకటిన్నర రోజుల్లో పూర్తవుతుంది. ఏపీకి చెందిన వారు లేదా తెలంగాణకు చెందిన ఇతర ప్రాంతాల వారు వీసా కోసం వస్తే ఒకటిన్నర రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు. ఒక్క రాత్రి హైదరాబాద్‌లో ఉంటే సరిపోతుంది. వైఎస్ చొరవతోనే.. ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా తరువాత అమెరికా కాన్సులేట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేయాలని 2003 నుంచి ప్రతిపాదనలున్నాయి. మెట్రో నగరాల సరసన బెంగళూరు ఉండడంతో అక్కడే ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. అయితే హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేయించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పర్యటనను మంచి అవకాశంగా తీసుకున్నారు. అమెరికా కాన్సులేట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని, సకల సౌకర్యాలూ కల్పిస్తామని హామీ ఇస్తూ బుష్‌కు లేఖ ఇచ్చారు. దానికి తోడు పర్యటనలో తన వెంటే ఉన్న వైఎస్ఆర్ ఆహార్యానికి బుష్ ముగ్ధుడయ్యారు. ఇక మరోవైపు హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుపై వైఎస్సార్ అంతకు ముందే పలుమార్లు అప్పటి ప్రధాని మన్మోహన్సింగ్ దృష్టికి తీసుకువచ్చారు. అమెరికా కాన్సులేట్ ఏర్పాటు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వైఎస్సార్ వదిలిపెట్టలేదు. ఆయన చొరవ కారణంగానే 2009 మార్చి 5న హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించింది. గతేడాది 1.83 లక్షల సందర్శక వీసాలు హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుతో వీసాలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికాను సందర్శించాలనుకునే పర్యాటకులు టూర్ ఆపరేటర్లను సంప్రదించి ముందే ప్రయాణానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని.. సులభంగా బీ1/బీ2 (సందర్శకుల) వీసా పొందగలుగుతున్నారు. 2015లో దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఈ వీసాలు పొందితే... అందులో 1.83 లక్షల వీసాలు హైదరాబాద్ కాన్సులేట్ జారీ చేసినవే. సందర్శక వీసాల జారీలో ముంబై, ఢిల్లీ తరువాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది. -
సంపాదిస్తూ... పోస్ట్ ప్రొడక్షన్ చేశా!
‘‘నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ లాంటి తరహాలో ఉండే స్వతంత్ర తరహా, చిన్న బడ్జెట్ చిత్రం - నేను తీసిన ‘ది అనుశ్రీ ఎక్స్పరిమెంట్స్’. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో పెళ్ళిని వాయిదా వేయడానికి ఒక యువతి చేసే ప్రయత్నాలు వినోదాత్మ కంగా సాగుతాయి’’ అన్నారు దర్శకురాలు అపర్ణా మల్లాది. అమెరికాలో స్థిరపడ్డ ఈ తెలుగు వనిత రూపొందించిన సినిమా ‘ది అనుశ్రీ ఎక్స్పరి మెంట్స్’ ఏప్రిల్ 1న ‘లాంఛనప్రాయంగా రిలీజ్’ కానుంది. హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో రోజుకు ఒక ఆట చొప్పున ప్రదర్శిస్తూ, ‘టోకెన్ రిలీజ్’ చేస్తున్నట్లు ఈ ప్రవాస భారతీయ దర్శకురాలు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్లో జరిగిన విలేఖరుల సమావేశంలో అపర్ణతో పాటు ప్రముఖ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, ‘బాహుబలి’ - ‘బజ్రంగీ భాయీజాన్’ చిత్రాల ఫేమ్ వి. విజయేంద్రప్రసాద్ పాల్గొని, అపర్ణ ప్రయత్నాన్ని అభినందించారు. అమెరికాలో సినీ రచనలో శిక్షణ పొంది, ఇక్కడకు వచ్చి పరుచూరి, విజయేంద్రప్రసాద్ సహా పలువురు సినీ రచయితలకూ, విద్యార్థులకూ స్క్రీన్‌ప్లే రచనలో మెళకువలను బోధించిన ఘనత ఆమెది. హాలీవుడ్‌కీ, మన భారతీయ పరిశ్రమకూ ఉన్న తేడాలు, స్వీయ అనుభవం గురించి ఈ అచ్చ తెలుగు మహిళ ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు... మహిళా దర్శక, రచయితగా సహ జంగానే ఆడవాళ్ళ దృష్టి కోణం నుంచి, వారి కష్టనష్టాలు, సమస్య లతో కూడిన అంశాలనే కథలుగా అల్లుతుంటా. అందుకే, గతంలో తీసిన ‘నూపర్’ షార్ట్‌ఫిల్మ్ కానీ, తొలి సిన్మా ‘మిట్సెన్’ (సాహచర్య మని అర్థం) కానీ, ఇప్పుడీ రెండో సినిమా ‘అనుశ్రీ...’ కానీ ఆ ఛాయ ల్లోనే ఉంటాయి. ఒక రకంగా ఆ కథలన్నీ నావే! ఆ నాయిక నేనే! కుటుంబంలోని అన్ని వర్గాలవారూ, అన్ని వయసులవారూ చూసి ఆనందించే వినోదాత్మక రీతిలో ‘ది అనుశ్రీ ఎక్స్పరిమెంట్స్’ చిత్రం తీశా. పబ్లిసిటీకి కూడా పెద్దగా ఖర్చు పెట్టుకోలేని ఇలాంటి చిన్న సినిమా కోసం విద్యార్థులైన నా యూనిట్ సిబ్బందే స్వయంగా వెళ్ళి, ‘ఐ-ప్యాడ్’లో ట్రైలర్ చూపించి, ముందుగా టికెట్లు అమ్ముతున్నారు. అలా మొదటి ఆటకు ఇప్పటికే 300 టికెట్లు అమ్మేశాం. హాలీవుడ్లో పనితీరుకీ, ఇక్కడి పనితీరుకీ చాలా తేడా ఉంది. కథ రాసుకోవడానికి ఏడాది పడితే, ఇక్కడి పద్ధతులు అర్థం చేసుకొని, సినిమా తీసి, రిలీజ్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. అక్కడ సినిమాలకూ, లొకేషన్లకూ పర్మిషన్ దగ్గర నుంచి ప్రతీదీ సులభం. కానీ, ఇక్కడ అలా కాదు. ‘అనుశ్రీ...’ తీయడం కోసం ఇక్కడకొచ్చిన కొత్తల్లో కష్టపడ్డాను. మహిళా ప్రధాన సినిమాలు తీయాలంటే, ఇక్కడ సాధారణంగా ఎవరూ ముందుకు రారు. డబ్బు కోసం చాలా కష్టపడ్డాం. 70 శాతం ఇంగ్లీష్, 30 శాతం తెలుగు డైలాగ్లుండే ఈ చిత్ర షూటింగ్ 17 రోజుల్లో ఇక్కడే పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్‌కి డబ్బుల్లేక, అమెరికా వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చేశా. హాలీవుడ్ టెక్నిక్, క్రాఫ్ట్ మనకన్నా ముందంజలో ఉంటాయి. వాటిని వాడుకొంటూనే, మనం మన కథలు చెప్పాలి. కానీ, మనం వాళ్ళ సినిమాలు చూసి, అలాంటి కథలు చెబుతున్నాం. దురదృష్టవశాత్తూ, మన ఇండస్ట్రీలో రచయితకి తగిన స్థానమివ్వట్లేదు. హాలీ వుడ్లో కనీసం 5 శాతం బడ్జెట్‌ను రచ నకు కేటాయిస్తారు. అలాగే స్క్రిప్ట్ బాగా వచ్చేదాకా ఎంత టైమైనా వెచ్చిస్తారు. అమెరికాలో ఉంటున్నా, బాగుందన్న తెలుగు, తమిళ చిత్రాలు ఖాళీ దొరికితే చూస్తా. త్వరలో ‘పెళ్ళికూతురి పార్టీ’ పేరిట సిన్మా చేయాలని ప్లాన్ చేస్తున్నా.