డాలర్‌డ్రీమ్స్‌కు ‘భాగ్య’రేఖ!
సాక్షి, హైదరాబాద్: 2008 జూన్‌లో అమెరికాలోని ఇల్లినాయిస్‌లో కరీంనగర్‌కు చెందిన ఓ విద్యార్థి ప్రమాదానికి గురై ఆస్పత్రిలో చేరారు. ఆ విద్యార్థి తల్లిదండ్రులు వీసా తీసుకుని అమెరికాకు చేరుకోవడానికి 11 రోజులు పట్టింది. చెన్నై కాన్సులేట్‌లో వీసా అపాయింట్‌మెంట్ తీసుకోవడం, అక్కడ రెండు రోజులు ఉండాల్సి రావడం, ఆ వెంటనే విమాన టికెట్లు అందుబాటులో లేకపోవడం వల్ల బాగా జాప్యం జరిగింది.
2011 నవంబర్‌లో ఓ కారు ప్రమాదంలో గుంటూరు జిల్లాకు చెందిన ఇద్దరు మరణించారు, మరో ఇద్దరు తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చేరారు. ఈసారి వారి బంధువులు కేవలం ఐదు రోజుల్లో అమెరికాకు చేరుకోగలిగారు. హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు కావడం, అత్యవసర పరిస్థితుల్లో అమెరికా వెళ్లేందుకు వీసా ఇచ్చే ఏర్పాటు ఉండడంతో ఇది సాధ్యమైంది. వాస్తవానికి బెంగళూరులో ఏర్పాటుకావాల్సిన ఈ అమెరికా కాన్సులేట్... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి చొరవతో హైదరాబాద్‌కు తరలివచ్చింది. అమెరికాకు వెళ్లే లక్షలాది మంది తెలుగు ప్రజలకు ఇబ్బందులను తొలగించిన ఈ కాన్సులేట్ ఏర్పాటు, పనితీరుపై ఈ వారం ‘ఫోకస్’...
2009కి ముందు చెన్నై కాన్సులేట్‌తో ఇబ్బందులు ప్రయాణం దగ్గరి నుంచి భాషదాకా ఎన్నో సమస్యలు అప్పట్లో ఏటా అమెరికా వెళ్లిన విద్యార్థులు 5 నుంచి 6 వేలలోపే హైదరాబాద్‌లో కాన్సులేట్‌తో భారీగా పెరిగిన విద్యార్థుల సంఖ్య గత ఏడేళ్లలో ఉన్నత చదువు కోసం వీసాలు పొందినవారు 1.64 లక్షలు 2015లో దేశంలోనే అత్యధికంగా 42 వేల మంది విద్యార్థులకు వీసాలు గత ఏడేళ్లలో 10.51 లక్షల సందర్శక (బీ1/బీ2) వీసాలు జారీ
* హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులేట్‌తో సులభమైన అమెరికా వీసా
* వైఎస్సార్ చొరవతో ఏర్పాటు.. దేశంలోనే అత్యధికంగా వీసాల జారీ
2009కి ముందు ఎన్నో సమస్యలు
అమెరికాలో తమ పిల్లలు, దగ్గరి బంధువులు ఉన్నవారు.. చదువుకోవడానికి వెళ్లే విద్యార్థులు.. సరదాగా సందర్శించి వద్దామనుకునే పర్యాటకులు.. ఇలా ఎవరికైనా అమెరికా వీసా కావాలి. వీసా పొందాలంటే ఎంతో తతంగం ఉంటుంది. ఎన్నో రకాల ధ్రువపత్రాలు కావాలి, కాన్సులేట్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోవాలి, ఒకరోజు వెళ్లి వేలిముద్రలు ఇవ్వాలి, మరుసటిరోజున ఇంటర్వ్యూకు హాజరుకావాలి. అవసరమైన వివరాలన్నీ వెల్లడించగలగాలి. ఇన్ని చేసినా కాన్సులేట్ ఉన్న చోటికి వెళ్లి రావడం, ఖర్చులు, భాషా సమస్య వెంటాడుతాయి.
ఇప్పుడు హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఉండడంతో ఇవన్నీ పెద్ద సమస్యలుగా కనిపించడం లేదు. కానీ 2009కి ముందు అమెరికా వీసా కోసం తమిళనాడులోని చెన్నైకి వెళ్లాల్సి రావడంతో... తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడేవారు. అమెరికా వీసా పొందేందుకు అన్ని అర్హతలున్నా చెన్నైకి వెళ్లాల్సి రావడం, భాషాపరమైన సమస్య వంటివాటితో వెనుకాడేవారు.
ఇప్పుడు ఎంతో సులువు..
ఇప్పుడు హైదరాబాద్‌లోనే కాన్సులేట్ వీసాలు మంజూరు చేయడం, తెలుగులో మాట్లాడే అవకాశమివ్వడంతో ఏటా అమెరికా వీసాలు పొందుతున్న తెలుగువారి సంఖ్య భారీగా పెరుగుతోంది. ప్రస్తుతం ఏటా సగటున 1.5 లక్షల మంది అమెరికా వీసాలు పొందుతున్నారు. వెంటనే వెళ్లే అవసరం లేకపోయినా... అమెరికాలో చదువుకుంటున్న లేదా ఉద్యోగం చేస్తున్న వారి తల్లిదండ్రులు పదేళ్ల సమయానికి ‘బీ1/బీ2 (సందర్శకుల)’ వీసాలు తేలిగ్గా పొందుతున్నారు.
హైదరాబాద్‌లో 2009 మార్చి 5న అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు చెన్నై వెళ్లే తెలుగువారి సంఖ్య సగటున నెలకు 3,500 దాకా ఉండేది. ఇక్కడ వీసాల మంజూరు మొదలుపెట్టిన ఆరునెలలకే అంటే 2009 సెప్టెంబర్‌లో హైదరాబాద్ కాన్సులేట్ నుంచి 17 వేల మందికి పైగా వీసాలు పొందారు. అమెరికా వెళ్లి వచ్చే ప్రయాణీకుల సంఖ్య భారీగా పెరిగింది. 2008లో హైదరాబాద్ విమానాశ్రయం నుంచి 76 వేల మంది అమెరికాకు వెళితే... 2010లో అది సుమారు 2.5 లక్షలు దాటింది. ఏదైనా పని మీద అమెరికా వెళ్లాల్సి వస్తే వెంటనే వీసా పొందే సౌకర్యం ఉండటమే దీనికి కారణమని ట్రావెల్ అండ్ టూరిజం వర్గాలు చెప్పాయి.
భారీగా పెరిగిన విద్యార్థులు
హైదరాబాద్‌లో కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించడానికి ముందు అమెరికాలో ఉన్నత విద్య కోసం వెళ్లే ఇక్కడి విద్యార్థుల సంఖ్య 6వేల లోపే. 2007-08లో 6,800 మంది విద్యార్థి వీసాలు పొందగా... ఇక్కడ కార్యకలాపాలు ప్రారంభించిన 2009లో అమెరికా వెళ్లిన విద్యార్థుల సంఖ్య సుమారు 13 వేలు. తాజా లెక్కల ప్రకారం హైదరాబాద్ కాన్సులేట్‌లో వీసాలు పొందిన విద్యార్థుల సంఖ్య 42 వేల వరకు ఉంటుంది. ఇందులో ఏటా తొలిస్థానంలో ఉండే ముంబైని 2015లో హైదరాబాద్ దాటేసింది.
ఖర్చులూ తగ్గాయి
హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుకు ముందు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారెవరైనా తమిళనాడు రాజధాని చెన్నైకి వెళ్లాల్సి వచ్చేది. వీసా ఇంటర్వ్యూకు ఒక రోజు ముందే వేలిముద్రలు ఇవ్వడానికి ఉదయాన్నే వెళ్లాలి. దాని కోసం అంతకు ముందు రోజే చెన్నై వచ్చి బస చేయాల్సిన పరిస్థితి. మొత్తంగా మూడు రోజుల పాటు అక్కడే ఉండాల్సి వచ్చేది. ఇలా వీసా కోసం చెన్నై వెళ్లి, రావడానికి ప్రయాణ ఖర్చులతో పాటు మూడు రోజుల బస వ్యయమూ భరించాల్సి వచ్చేది. మొత్తంగా కనీసం రూ.7,500 నుంచి రూ.10 వేల దాకా ఖర్చయ్యేది. ఇప్పుడా ఖర్చు తగ్గింది.
భాషతో తంటాలు..
చెన్నై కాన్సులేట్‌లో ఇంగ్లిష్-తమిళ భాషలు తెలిసిన ఆఫీసర్లు మాత్రమే ఉండేవారు. ఏపీ, తెలంగాణల నుంచి తెలుగు భాష ఎంపిక చేసుకున్న వారికి మధ్యలో అనువాదకుడు అవసరమయ్యేది. తమిళనాడులో తెలుగు తెలిసిన వారిని మాత్రమే అనువాదకులుగా పెట్టుకునేవారు. దీంతో తెలుగు-తమిళం అనువాదం ఇబ్బందిగా ఉండేది. అసలే తమిళం అంతంతగా వచ్చే అమెరికా కాన్సులేట్ అధికారులు పలుమార్లు భాషా సమస్య కారణంగా వీసాలు తిరస్కరించేవారు. 2003-2004లో వీసాల కోసం వెళ్లినవారిలో ఏకంగా 67 శాతం మంది దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. హైదరాబాద్‌లో తెలుగు తెలిసిన అధికారులు ఉండడంతో ఈ సమస్య తప్పింది.
అపాయింట్‌మెంట్ కూడా కష్టమే
చెన్నైలో ఉండగా వీసా అపాయింట్‌మెంట్ అతి కష్టంగా దొరికేది. హైదరాబాద్ లేదా చెన్నైలో ఉన్న దళారులపై ఆధారపడాల్సి వచ్చేది. ఆన్‌లైన్ సౌకర్యం లేకపోవడం కూడా దానికి కారణం. ఇప్పుడు అమెరికా వెళ్లాలనుకునేవారు అన్ని పత్రాలు ఉంటే ఒక్క రోజులోనే అపాయింట్‌మెంట్ తీసుకోవచ్చు. వేలిముద్రలు ఇవ్వడం, ఇంటర్వ్యూకు హాజరుకావడం అంతా ఒకటిన్నర రోజుల్లో పూర్తవుతుంది. ఏపీకి చెందిన వారు లేదా తెలంగాణకు చెందిన ఇతర ప్రాంతాల వారు వీసా కోసం వస్తే ఒకటిన్నర రోజుల్లో తిరిగి వెళ్లిపోవచ్చు. ఒక్క రాత్రి హైదరాబాద్‌లో ఉంటే సరిపోతుంది.
వైఎస్ చొరవతోనే..
ఢిల్లీ, ముంబై, చెన్నై, కోల్‌కతా తరువాత అమెరికా కాన్సులేట్‌ను బెంగళూరులో ఏర్పాటు చేయాలని 2003 నుంచి ప్రతిపాదనలున్నాయి. మెట్రో నగరాల సరసన బెంగళూరు ఉండడంతో అక్కడే ఏర్పాటు చేస్తారని అందరూ భావించారు. అయితే హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ ఏర్పాటు చేయించేందుకు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ప్రయత్నాలు ప్రారంభించారు. 2006లో అప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్ పర్యటనను మంచి అవకాశంగా తీసుకున్నారు.
అమెరికా కాన్సులేట్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేయాలని, సకల సౌకర్యాలూ కల్పిస్తామని హామీ ఇస్తూ బుష్‌కు లేఖ ఇచ్చారు. దానికి తోడు పర్యటనలో తన వెంటే ఉన్న వైఎస్‌ఆర్ ఆహార్యానికి బుష్ ముగ్ధుడయ్యారు. ఇక మరోవైపు హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుపై వైఎస్సార్ అంతకు ముందే పలుమార్లు అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ దృష్టికి తీసుకువచ్చారు. అమెరికా కాన్సులేట్ ఏర్పాటు కోసం ఏ చిన్న అవకాశాన్నీ వైఎస్సార్ వదిలిపెట్టలేదు. ఆయన చొరవ కారణంగానే 2009 మార్చి 5న హైదరాబాద్‌లో అమెరికా కాన్సులేట్ కార్యకలాపాలు ప్రారంభించింది.
గతేడాది 1.83 లక్షల సందర్శక వీసాలు
హైదరాబాద్‌లో కాన్సులేట్ ఏర్పాటుతో వీసాలు తీసుకునే వారి సంఖ్య భారీగా పెరిగింది. అమెరికాను సందర్శించాలనుకునే పర్యాటకులు టూర్ ఆపరేటర్లను సంప్రదించి ముందే ప్రయాణానికి అవసరమైన అన్ని డాక్యుమెంట్లు తీసుకుని.. సులభంగా బీ1/బీ2 (సందర్శకుల) వీసా పొందగలుగుతున్నారు. 2015లో దేశవ్యాప్తంగా 10 లక్షల మందికిపైగా ఈ వీసాలు పొందితే... అందులో 1.83 లక్షల వీసాలు హైదరాబాద్ కాన్సులేట్ జారీ చేసినవే. సందర్శక వీసాల జారీలో ముంబై, ఢిల్లీ తరువాత హైదరాబాద్ మూడో స్థానంలో ఉంది.