డాలర్‌డ్రీమ్స్ వేటలో అక్రమ వలసదారులకు అవమానాలు
తక్కువ వేతనంతో అనధికారిక పనులు
పోలీసులకు చిక్కకుండా ఉండేందుకు అష్టకష్టాలు
అమెరికా.. ప్రపంచంలోని చాలా దేశాల ప్రజల్లాగే భారతీయులకూ ఓ కలల ప్రపంచం. ఆ డాలర్ డ్రీమ్స్‌ను సాకారం చేసుకోవడానికి, కుటుంబం, పిల్లలకు అందమైన భవిష్యత్ ఇవ్వడానికి ఎంతటి రిస్క్ అయినా తీసుకుంటున్నారు. ఒక్కోసారి ప్రాణాలు పోయే పరిస్థితి ఉన్నా అమెరికాకు వెళ్లే విషయంలో మాత్రం వెనుకడుగువేయట్లేరు. ఇలా ఎలాగోలా చట్టవిరుద్ధంగా వెళ్లి అక్కడ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు? ఎలాంటి అవమానాలు పడుతున్నారు?
డాక్యుమెంట్లు లేకుండా అక్రమంగా అమెరికా గడ్డపై అడుగుపెట్టిన వలసదారులు అమెరికాలో అనధికారిక పనులు చేసేందుకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ ఉద్యోగాలేవీ రికార్డుల్లో ఉండవు. రికార్డులో ఉండాలంటే.. వీసాలు, వర్క్ పర్మిట్లు కావాలి. ఉదాహరణకు అమెరికన్లు చేయడానికి ఇష్టపడని ఉద్యోగాలన్నమాట.
దక్షిణ కాలిఫోర్నియాలోని పొలాల్లో పని ఇందులో ఒకటి. ఎక్కువ సమయం, శ్రమతో కూడుకున్న పని అయినప్పటికీ వేరే పని దొరక్క దక్షిణ అమెరికా దేశాల నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఇలాంటి పనులు చేస్తున్నారు. చట్టవిరుద్ధంగా వెళ్లిన మన భారతీయులు ఎక్కువగా గ్యాస్ స్టేషన్లు, రెస్టారెంట్లు, కిరాణా దుకాణాల్లో పనిచేస్తున్నారు. నిర్మాణ రంగంలో కార్మికులుగా, ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులుగా ఉద్యోగాలు చేస్తున్నారు.
అనుక్షణం భయం.. భయం
ఒహాయోలోని క్లీవ్‌ల్యాండ్‌కు అక్రమంగా వలస వచ్చిన ఒక భారతీయుడు ఉదయం 6 గంటలకే గ్యాస్‌స్టేషన్‌లో పనిలో నిమగ్నమవుతాడు. రాత్రిదాకా ఒళ్లు హూనమయ్యేలా పనిచేసి బయటి తిండి తిని తన బంధువుల ఇంట్లో బేస్‌మెంట్‌లో నిద్రపోతాడు. ఇందులో కష్టమేముందని దూరం నుంచి చూసిన వాళ్లకు అనిపించొచ్చు. కానీ పని చేసినంత సేపు ఇలాంటి వారి జీవితాల్లో అంతకుమించిన నరకయాతన ఉంటుంది. రిజిస్టర్డ్ వర్క్‌ప్లేస్‌లో పనిచేయలేరు. ఎలాంటి అధికారిక శిక్షణ పొందే అర్హత ఉండదు.
డ్రైవింగ్ లైసెన్స్ ఎప్పటికీ రాదు. డ్రైవింగ్ చేయలేరు. సైకిల్ తొక్కుతూ వెళ్లాల్సిందే. అది కూడా అక్కడి అధికారులకు అనుమానం వస్తే పట్టుబడతానేమోనని భయం వెంటాడుతుంది. నిరంతరం మనసులో ఏదో భయం. ఏ క్షణంలోనైనా ఏం జరుగుతుందోనన్న ఆందోళన. వస్తువులు పోయినా, ఎవరితోనైనా గొడవ జరిగినా, తననెవరైనా కొట్టినా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకూ వెళ్లలేరు. పట్టుబడితే వారికే రిస్క్. అందుకే ఏం జరిగినా భరించాల్సిందే.
ఇంత శ్రమ ఎందుకూ అంటే.. స్వదేశంలో మధ్య తరగతి జీవితం గడుపుతున్న తన కుటుంబానికి మంచి జీవితం ఇవ్వాలనే తపన. కుటుంబాన్ని అమెరికాకు తీసుకురావాలి. అందుకు సరిపడా సంపాదించాలి. లీగల్ రెసిడెంట్‌గా అనుమతి పొందేందుకు లాయర్‌కు పెట్టుకునేంత సంపాదించాలి. ఇలా ఎన్నో ఆశలు. అమెరికన్ అధికారుల నుంచి తప్పించుకోవడం కత్తిమీద సాము. అలాంటిది ఇమ్మిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ నుంచి రోజూ ఏదో ఒక విధంగా తప్పించుకోవడం వారికి సర్వసాధారణమైపోతుంది.
తోటి భారతీయుల సాయంతో..
అక్రమ వలసదారుల జీవితాల్లో అక్కడి తమలాంటి వాళ్ల సమూహం పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. అక్రమ వలసదారులు కనీసం సిమ్ కార్డు పొందలేరు. బంధువులు ఇచ్చిన సిమ్ కార్డులను ఉపయోగించి స్వదేశంలోని కుటుంబంతో మాట్లాడతారు. బ్యాంకు ఖాతా పొందే అవకాశమే లేదు. సెప్టెంబర్ 11న 9/11 వైమానిక దాడుల తర్వాత అమెరికాలో అన్ని నిబంధనలు కఠినం చేశారు. అందులోభాగంగా బ్యాంకింగ్ నియమాలూ మారాయి. అందుకే స్థానిక యజమానులు అక్రమ వలసదారులకు పనికి వేతనాన్ని కేవలం నగదు రూపంలోనే చెల్లిస్తారు.
అదనపు ఆదాయం కోసం, తెలిసినవారి తోటల్లో పనిచేయడం, ఇళ్ల గోడలకు పెయింటింగ్ వేయడం, ఇతర పనులలో సహాయం చేస్తూ ఇంకాస్త డబ్బు సంపాదిస్తారు. అక్రమవలసదారులు అనారోగ్య సమయాల్లో ఒకరికొకరు సహాయం చేసుకుంటారు. సాధారణంగా అమెరికా ఆసుపత్రులు చట్టవిరుద్ధమైన నివాసితులకు చికిత్సను నిరాకరించవు. కానీ డాక్యుమెంట్లు లేకపోవడం వల్ల ఆస్పత్రుల వద్ద వైద్యం కాస్త కష్టంగా ఉంటుంది. ఇందుకు ప్రత్యామ్నాయంగా అక్కడి చట్టబద్ధ భారతీయ వైద్యులను వీళ్లంతా ఆశ్రయిస్తారు. చవకగా వైద్య చికిత్సలు పొందుతారు. హెచ్–1బీ వీసాలు, గ్రీన్‌కార్డు సంపాదించిన భారతీయుల సహాయంతో ఆన్‌లైన్ ద్వారా స్వదేశానికి డబ్బులు పంపుతున్నారు.
జీవితాలనే
పణంగా పెట్టి... చాలా మంది డాక్టర్లు, నర్సులు, లాయర్లు ఇక్కడికి వచ్చి కూలీలుగా పనిచేసి డాక్యుమెంట్లు తయారు చేయించుకున్నారు. ఇలా రకరకాల పనులు చేసి.. డబ్బు సంపాదించి అనుమతి పొందిన వారు చాలా మంది తమ కుటుంబాలను కూడా అమెరికాకు తీసుకొచ్చారు. అమెరికాలోని ప్రభుత్వ పాఠశాలలు డాక్యుమెంటేషన్ అడగవు. దీంతో ఇప్పటివరకు వారి పిల్లలను తీసుకురావడం సులభమైంది.
కొందరు అమెరికా వచ్చాక పిల్లలకు జన్మనివ్వడంతో వారు అమెరికా పౌరులుగా మారిపోయారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. ట్రంప్ రెండోసారి అధికార పగ్గాలు చేపట్టిన తొలిరోజే జన్మతః పౌరసత్వాన్ని రద్దుచేస్తూ కార్యనిర్వాహక ఉత్తర్వుపై సంతకంచేయడం తెల్సిందే. ఈ ఉత్తర్వులపై సియాటెల్ ఫెడరల్ కోర్టు స్టే విధించింది. ట్రంప్ ప్రభుత్వ బెదిరింపులు డాక్యుమెంట్లు లేని వలసదారులను అమెరికా చేరుకోకుండా ఆపలేకపోతున్నాయి. ఎన్ని భయాలున్నప్పటికీ అమెరికన్ డ్రీమ్ ప్రయత్నాలను ఆపడం లేదు. కలను నిజం చేసుకోవడానికి జీవితాలనే పణంగా పెడుతున్నారు.
డాక్యుమెంట్లు లేకుండా ఎట్లా వెళ్తున్నారు?
కొందరు భారతీయులు చట్టవిరుద్ధంగా అమెరికాకు వలస వెళ్లడానికి కొన్ని అక్రమ విధానాలను అవలంభిస్తున్నారు. పర్యాటక లేదా తాత్కాలిక వీసాలపై అమెరికాకు వస్తారు. ఆ వీసా గడువు ముగిసినా భారత్‌కు తిరిగిరారు. తప్పించుకు తిరుగుతారు. ఇక భూమార్గంలో వేర్వేరు దేశాలు దాటి వస్తూ చిట్టచివరకు అమెరికా గడ్డపై కాలుమోపుతారు. ‘డంకీ’రూట్‌గా దీనికి పేరు. సరిహద్దులు దాటించేసే ఏజెన్సీలకు దాదాపు 1 లక్ష డాలర్లకు పైగా చెల్లించాల్సి ఉంటుంది. సరైన విద్యార్హతలు, ఇంగ్లిష్ ప్రావీణ్యం లేని కారణంగా అమెరికా వీసా పొందలేని భారతీయులు ఈ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.
ఇంకొందరు తొలుత అమెరికా పొరుగున్న ఉన్న కెనడాకు వచ్చి అక్కడ 76 రోజుల విజిటర్ వీసా సంపాదించి అలా అమెరికాకు వచ్చి ఇక అక్కడే తిష్టవేస్తారు. వలసదారులు సాల్వడార్, నికరాగ్వాల గుండా కూడా అమెరికాలోకి ప్రవేశిస్తున్నారు. ఇలా వేర్వేరు అక్రమ విధానాలను అవలంభించి ఇప్పటిదాకా 7,25,000 మంది అమెరికాకు చేరుకున్నట్లు తెలుస్తోంది. 2024 ప్యూ రీసెర్చ్ నివేదిక ప్రకారం అమెరికాలో డాక్యుమెంట్లు లేకుండా వచ్చిన అక్రమ వలసదారుల్లో భారతీయులు మూడో స్థానంలో ఉన్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment