సంపాదిస్తూ... పోస్ట్ ప్రొడక్షన్ చేశా! | The anusri ekspari Enhancements | Sakshi
Sakshi News home page

సంపాదిస్తూ... పోస్ట్ ప్రొడక్షన్ చేశా!

Published Tue, Mar 29 2016 11:16 PM | Last Updated on Sun, Sep 3 2017 8:49 PM

సంపాదిస్తూ... పోస్ట్ ప్రొడక్షన్ చేశా!

సంపాదిస్తూ... పోస్ట్ ప్రొడక్షన్ చేశా!

‘‘నాగేశ్ కుకునూర్ ‘హైదరాబాద్ బ్లూస్’, శేఖర్ కమ్ముల ‘డాలర్ డ్రీమ్స్’ లాంటి తరహాలో ఉండే స్వతంత్ర తరహా, చిన్న బడ్జెట్ చిత్రం - నేను తీసిన ‘ది అనుశ్రీ ఎక్స్‌పరిమెంట్స్’. హైదరాబాద్ నేపథ్యంలో సాగే ఈ కథలో పెళ్ళిని వాయిదా వేయడానికి ఒక యువతి చేసే ప్రయత్నాలు వినోదాత్మ కంగా సాగుతాయి’’ అన్నారు దర్శకురాలు అపర్ణా మల్లాది. అమెరికాలో స్థిరపడ్డ ఈ తెలుగు వనిత రూపొందించిన సినిమా ‘ది అనుశ్రీ ఎక్స్‌పరి మెంట్స్’ ఏప్రిల్ 1న ‘లాంఛనప్రాయంగా రిలీజ్’ కానుంది.
 
  హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం లాంటి నగరాల్లో రోజుకు ఒక ఆట చొప్పున ప్రదర్శిస్తూ, ‘టోకెన్ రిలీజ్’ చేస్తున్నట్లు ఈ ప్రవాస భారతీయ దర్శకురాలు తెలిపారు. ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన విలేఖరుల సమావేశంలో అపర్ణతో పాటు ప్రముఖ రచయితలు పరుచూరి గోపాలకృష్ణ, ‘బాహుబలి’ - ‘బజ్‌రంగీ భాయీజాన్’ చిత్రాల ఫేమ్ వి. విజయేంద్రప్రసాద్ పాల్గొని, అపర్ణ ప్రయత్నాన్ని అభినందించారు.
 
 అమెరికాలో సినీ రచనలో శిక్షణ పొంది, ఇక్కడకు వచ్చి పరుచూరి, విజయేంద్రప్రసాద్ సహా పలువురు సినీ రచయితలకూ, విద్యార్థులకూ స్క్రీన్‌ప్లే రచనలో మెళకువలను బోధించిన ఘనత ఆమెది. హాలీవుడ్‌కీ, మన భారతీయ పరిశ్రమకూ ఉన్న తేడాలు, స్వీయ అనుభవం గురించి ఈ అచ్చ తెలుగు మహిళ ‘సాక్షి’తో పంచుకున్న అభిప్రాయాల్లో ముఖ్యాంశాలు...
 
 మహిళా దర్శక, రచయితగా సహ జంగానే ఆడవాళ్ళ దృష్టి కోణం నుంచి, వారి కష్టనష్టాలు, సమస్య లతో కూడిన అంశాలనే కథలుగా అల్లుతుంటా. అందుకే, గతంలో తీసిన ‘నూపర్’ షార్ట్‌ఫిల్మ్ కానీ, తొలి సిన్మా ‘మిట్‌సెన్’ (సాహచర్య మని అర్థం) కానీ, ఇప్పుడీ రెండో సినిమా ‘అనుశ్రీ...’ కానీ ఆ ఛాయ ల్లోనే ఉంటాయి. ఒక రకంగా ఆ కథలన్నీ నావే! ఆ నాయిక నేనే!    
 
 కుటుంబంలోని అన్ని వర్గాలవారూ, అన్ని వయసులవారూ చూసి ఆనందించే వినోదాత్మక రీతిలో ‘ది అనుశ్రీ ఎక్స్‌పరిమెంట్స్’ చిత్రం తీశా. పబ్లిసిటీకి కూడా పెద్దగా ఖర్చు పెట్టుకోలేని ఇలాంటి చిన్న సినిమా కోసం విద్యార్థులైన నా యూనిట్ సిబ్బందే స్వయంగా వెళ్ళి, ‘ఐ-ప్యాడ్’లో ట్రైలర్ చూపించి, ముందుగా టికెట్లు అమ్ముతున్నారు. అలా మొదటి ఆటకు ఇప్పటికే 300 టికెట్లు అమ్మేశాం.
 
 హాలీవుడ్‌లో పనితీరుకీ, ఇక్కడి పనితీరుకీ చాలా తేడా ఉంది. కథ రాసుకోవడానికి ఏడాది పడితే, ఇక్కడి పద్ధతులు అర్థం చేసుకొని, సినిమా తీసి, రిలీజ్ చేయడానికి 4 ఏళ్ళు పట్టింది. అక్కడ సినిమాలకూ, లొకేషన్లకూ పర్మిషన్ దగ్గర నుంచి ప్రతీదీ సులభం. కానీ, ఇక్కడ అలా కాదు. ‘అనుశ్రీ...’ తీయడం కోసం ఇక్కడకొచ్చిన కొత్తల్లో కష్టపడ్డాను.  
 
 మహిళా ప్రధాన సినిమాలు తీయాలంటే, ఇక్కడ సాధారణంగా ఎవరూ ముందుకు రారు. డబ్బు కోసం చాలా కష్టపడ్డాం. 70 శాతం ఇంగ్లీష్, 30 శాతం తెలుగు డైలాగ్‌లుండే ఈ చిత్ర షూటింగ్ 17 రోజుల్లో ఇక్కడే పూర్తి చేశాం. పోస్ట్ ప్రొడక్షన్‌కి డబ్బుల్లేక, అమెరికా వెళ్ళిపోయి అక్కడ పనిచేస్తూ సంపాదించిన డబ్బుతో ఎప్పటికప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ చేశా.
 
 హాలీవుడ్ టెక్నిక్, క్రాఫ్ట్ మనకన్నా ముందంజలో ఉంటాయి. వాటిని వాడుకొంటూనే, మనం మన కథలు చెప్పాలి. కానీ, మనం వాళ్ళ సినిమాలు చూసి, అలాంటి కథలు చెబుతున్నాం.
 
  దురదృష్టవశాత్తూ, మన ఇండస్ట్రీలో రచయితకి తగిన స్థానమివ్వట్లేదు. హాలీ వుడ్‌లో కనీసం 5 శాతం బడ్జెట్‌ను రచ నకు కేటాయిస్తారు. అలాగే స్క్రిప్ట్ బాగా వచ్చేదాకా ఎంత టైమైనా వెచ్చిస్తారు.
 
 అమెరికాలో ఉంటున్నా, బాగుందన్న తెలుగు, తమిళ చిత్రాలు ఖాళీ దొరికితే చూస్తా. త్వరలో ‘పెళ్ళికూతురి పార్టీ’ పేరిట సిన్మా చేయాలని ప్లాన్ చేస్తున్నా.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement