భారతీయులకు ట్రంప్ షాక్
- అమెరికన్ల స్థానంలో హెచ్1బీ వీసాదారులను అనుమతించబోమని ప్రకటన
వాషింగ్టన్: అమెరికా తదుపరి అధ్యక్షునిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ డాలర్ డ్రీమ్స్‌లో తేలియాడే భారతీయులకు షాక్ ఇచ్చారు. అమెరికన్లను కాదని విదేశీ కార్మికులతో ఉద్యోగాల భర్తీని అంగీకరించబోమని ప్రకటించారు. ఇందుకోసం భారతీయులు ఎక్కువగా వినియోగించే హెచ్1బీ వీసాల అంశాన్ని ట్రంప్ ప్రస్తావించడం గమనార్హం. డిస్నీ వరల్డ్ మొదలైన అమెరికా కంపెనీలు అమెరికా కార్మికులను కాదని భారత్ తదితర దేశాల నుంచి వచ్చే హెచ్1బీ వీసా అభ్యర్థులకు ఉద్యోగాలు ఇస్తున్నాయని, ఇకపై అలాంటి వాటిని అనుమతించేది లేదని చెప్పారు.
గురువారం అయోవాలో తన మద్దతుదారులతో జరిగిన సభలో ట్రంప్ ప్రసంగిస్తూ.. ప్రతి అమెరికన్ జీవితానికీ రక్షణ కల్పించేందుకు పోరాటం చేస్తున్నామన్నారు. ఈ సందర్భంగా హెచ్1బీ వీసాల అంశాన్ని ప్రస్తావించారు. ఎన్నికల ప్రచార సమయంలో కూడా తాను ఎక్కువగా అమెరికా కార్మికులతో గడిపానని, శిక్షణ కోసం తప్పించి.. వారి స్థానంలో విదేశీ కార్మికులను ఉద్యోగాల్లోకి తీసుకున్నారని చెప్పారు. ఇకపై ఇలాంటి ఘటనలు జరగనీయబోమని చెప్పారు. మెక్సికో సరిహద్దులో గోడ నిర్మించి తీరుతామని చెప్పారు. అక్రమ వలసలు, మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలంటే ఇది తప్పదన్నారు.
ట్రంప్ గెలుపు వెనుక రష్యా హస్తం!
అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నిక వెనుక రష్యా హస్తం ఉందని అమెరికా గూఢచార సంస్థ సీఐఏ నిర్ధారించినట్లు మీడియా వెల్లడించింది. అధ్యక్ష పదవికి పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థుల్లో తమకు అనుకూలమైన వ్యక్తి గెలుపుకోసం రష్యా ప్రయత్నించిందని ఇంటెలిజెన్స్ వర్గాలు ధ్రువీకరించినట్లు వాషింగ్టన్ పోస్టు పత్రిక కథనాన్ని ప్రచురించింది. వాషింగ్టన్ పోస్ట్ కథనం ప్రకారం హిల్లరీ ప్రతిష్టను మసకబార్చి ట్రంప్ అవకాశాల్ని మెరుగుపరచేందుకు రష్యా ప్రభుత్వంతో సంబంధం ఉన్న కొందరు పనిచేశారని, వీరు హిల్లరీ ప్రచారకమిటీ చైర్మన్‌తో సహా డెమోక్రటిక్ పార్టీకి చెందిన అనేకమంది మెయిల్ ఎకౌంట్లను హ్యాక్ చేసి వీకీలిక్స్‌కు అందజేసినట్లు నిఘావర్గాలు గుర్తించాయంది.