సాక్షి, హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్‌పై అమెరికా డేగకన్ను వేసింది. పలు ఉగ్రవాద దేశాలు, ఉగ్రవాద సంస్థల నుంచి ఆమెకు ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో కట్టుదిట్టమైన రక్షణ వలయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఈ నెల 28 నుంచి మూడు రోజుల పాటు జరిగే ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొనే అమెరికా బృందానికి ఇవాంకా సారథ్యం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె పర్యటనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అసాధారణ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నా.. ప్రత్యేక భద్రతా విధులన్నీ అమెరికా సీక్రెట్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీయే పర్యవేక్షిస్తోంది. అయితే అమెరికాను టార్గెట్ చేసిన ఉగ్రవాద సంస్థల నుంచి ఇవాంకాకు ముప్పు పొంచి ఉంది. ఐసిస్ ఉగ్రవాదులతో పాటు విద్వేషాగ్నితో రగులుతున్న ఉత్తర కొరియా నుంచి కూడా ప్రమాదం ఉంటుందని అమెరికా ప్రభుత్వం భావిస్తోంది. దీంతో ఎక్కడా చిన్న పొరపాటుకు కూడా తావు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తమ అధికారులను హెచ్చరించింది. ఇవాంకా హైదరాబాద్‌లో ఉన్నంత సేపూ అమెరికా అధ్యక్ష కార్యాలయం నుంచి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించేలా ఏర్పాట్లు జరిగాయి.
హాజ్మత్ వాహనాల మోహరింపు
రసాయనిక దాడులు జరిగినా ఎదుర్కొనేందుకు, తక్షణ రక్షణ చర్యలు చేపట్టేందుకు వీలు కల్పించే వాహనాలే హాజ్మత్ వాహనాలుగా చెబుతారు. హాజ్మత్ అంటే హాజర్డస్ మెటీరియల్ అని అర్థం. అత్యంత హానికరమైన రసాయన దాడుల సందర్భాల్లో ఈ వాహనాలను వినియోగిస్తుంటారు. ఇలాంటి వాహనాలు మన దేశంలో అరుదు. హైదరాబాద్‌లో అందుబాటులోనే లేవు. ప్రధాని మోదీ, ఇవాంకాల పర్యటన నేపథ్యంలో హాజ్మత్ వాహనాలను తెప్పించి మోహరించాలని నిర్ణయించారు. ఇక ఇవాంకా హైదరాబాద్‌లో వివిధ ప్రాంతాలకు ప్రయాణించేందుకు అమెరికా నుంచి ప్రత్యేకంగా మూడు వాహనాలను తెప్పిస్తున్నారు. మందు పాతరలతో పాటు రాకెట్ లాంచర్లు, జీవ, రసాయన దాడుల నుంచీ రక్షించగలిగేలా వాటిల్లో ఏర్పాట్లు ఉంటాయి.
2 కిలోమీటర్ల దూరం ఆంక్షలు
ఇవాంకా బస చేసే రెండు రోజుల పాటు మాదాపూర్ వెస్టిన్ హోటల్, విందుకు హాజరయ్యే పాతబస్తీ ఫలక్‌నుమా ప్యాలెస్ పరిసర ప్రాంతాల్లో ప్రత్యేక ఆంక్షలు అమల్లో ఉంటాయి. వీటికి రెండు కిలోమీటర్ల పరిధిలోని జనావాసాలు, ఆఫీసులు, ప్రజల కదలికలపై నిఘా పెట్టారు. ఆయా ప్రాంతాల్లోని ఇళ్లలో ఉన్న వారి పూర్తి సమాచారం సేకరిస్తున్నారు.
విదేశీయుల వివరాలపై ఆరా..
కొంతకాలంగా అమెరికా, ఉత్తర కొరియా మధ్య పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇవాంకాకు ఆ దేశం నుంచి ముప్పు ఉందని అమెరికా భావిస్తోంది. దీంతో ఇటీవల భారత్‌లోకి వచ్చిన విదేశీయుల వివరాలను ఆరా తీస్తోంది. ముఖ్యంగా గత 45 రోజుల్లో ప్రధానంగా ఉత్తర కొరియా, సిరియా, అఫ్గానిస్తాన్, పాకిస్తాన్ తదితర దేశాల నుంచి వచ్చినవారి సమాచారం సేకరిస్తోంది. మన దేశంలో విదేశీ రాకపోకల రద్దీ ఉండే 12 ప్రధాన అంతర్జాతీయ విమానాశ్రయాల నుంచి ఈ వివరాలను సేకరించింది. వారంతా ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏ పనిపై వచ్చారు,వారి కదలికలేమిటనే సమాచారం రాబడుతోంది. మరోవైపు దేశంలో వివిధ ప్రాంతాల నుంచి ఐసిస్ ఉగ్రవాద సంస్థకు సహకరిస్తున్న అనుమానితులపై నిఘా వేసింది.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత
ఇవాంకా పర్యటించే ప్రాంతాల్లో అత్యంత కట్టుదిట్టంగా భద్రతా ఏర్పాట్లు ఉండాలని అమెరికా తమ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇవాంకా ఉండే పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ఆయుధాలతో ప్రవేశించకుండా ఆంక్షలు విధించాలని.. రసాయనిక దాడులు సైతం జరిగే ఆస్కారం లేకుండా భద్రత ఉండాలని స్పష్టం చేసింది. అసలు ఇవాంకా ఆసియాలో తొలిసారి అడుగు పెడుతుండటంతో సీఐఏ గట్టి జాగ్రత్తలే తీసుకుంటోంది. ఆయా ప్రాంతాల్లో ప్రత్యేక డ్రోన్లు, నిఘా కెమెరాలను వినియోగించనుంది. దాదాపు 60 మందికిపైగా సీఐఏ ఆఫీసర్లు, దేశంలోని అమెరికా రాయబార కార్యాలయాలకు చెందిన వంద మందికిపైగా ఉద్యోగులు ఇవాంకా రక్షణ ఏర్పాట్లలో తలమునకలై ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment