ఇక ఈబీ - 5 వీసాల వంతు..? | Trump Look Forward About Reform Or Eliminate EB 5 visa Programme | Sakshi
Sakshi News home page

ఇక ఈబీ - 5 వీసాల వంతు..?

Published Sat, Jun 23 2018 1:48 PM | Last Updated on Sun, Mar 10 2019 8:23 PM

Trump Look Forward About Reform Or Eliminate EB 5 visa Programme - Sakshi

డోనాల్ట్‌ ట్రంప్‌ (ఫైల్‌ ఫోటో)

వాషింగ్టన్‌ : ట్రంప్‌ అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అమెరికా కలలు కనే జనాలకు ఒకటే ఆందోళన. ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో తెలియని పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఇన్నాళ్లు హెచ్‌ - 1బీ​ వీసా మార్పుల గురించి మాట్లాడిన ట్రంప్‌ తాజాగా మరో బాంబ్‌ పేల్చారు. అమెరికాలో వ్యాపారం ప్రారంభించాలనే విదేశీ పెట్టుబడిదారులకు జారీ చేసే ఈబీ-5 వీసాలపై ట్రంప్‌ దృష్టి సారించనున్నట్లు సమాచారం.

ఈ వీసా ద్వారా విదేశీయులు అమెరికాలో కనీసం ఒక మిలియన్‌ డాలర్లు పెట్టుబడి పెట్టాలి. అంతేకాక ఓ పదిమందికి తప్పకుండా పర్మినెంట్‌ జాబ్‌ కల్పించాలి. ఇలా పెట్టుబడి పెట్టిన విదేశీయులకు గ్రీన్‌ కార్డు లభిస్తుంది. అయితే ఈ వీసాల దుర్వనియోగం జరుగుతోందని, వీటి వల్ల అక్రమాలు, మోసాలు పెరిగిపోతున్నాయని ట్రంప్‌ యంత్రాంగానికి అందుతున్న ఫిర్యాదుల నేపథ్యంలో యూఎస్‌ కాంగ్రెస్‌ ఈ వీసా విధానంపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈబీ-5 వీసా విధానాన్ని రద్దు చేయడం లేదా సంస్కరణలు చేపట్టడం చేయాలని ట్రంప్‌ యంత్రాంగం యూఎస్‌ కాంగ్రెస్‌ను కోరింది.

ఈ సందర్భంగా అమెరికా పెట్టుబడిదారులకు ఉత్తమమైన రక్షణ కల్పించాలని, మోసాలకు గురికాకుండా కావాడాల్సిన అవసరం ఉందని అమెరికా‌ పౌరసత్వ, వలసదారుల సేవల విభాగం డైరెక్టర్‌ ఎల్‌ ఫ్రాన్సిస్‌ సిస్సానా పేర్కొన్నారు. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈబీ-5 వీసాల్లో సంస్కరణలు చేపట్టాల్సిన అవసరముందన్నారు ఫ్రాన్సిస్‌. విదేశీయులు మనీలాండరింగ్‌కు పాల్పడడానికి, గూఢచర్యం చేయడానికి దేశంలో పెట్టుబడులు పెడుతున్నారని ఆరోపించారు. ఈ ఏడాది, సెప్టెంబర్‌ 30 నాటికి ఈబీ - 5 వీసా కార్యక్రమం ముగియనుంది.

ఈబీ - 5 వీసా విధానం ద్వారా ఏటా పది వేల మంది విదేశీ పెట్టుబడిదారులకు ఈ వీసాలు మంజూరు చేస్తారు. ఇది కూడా దేశాల వారీ కోటా ఆధారంగా ఉంటుంది. కాగా అమెరికాలో ఈబీ-5 వీసా కోసం దరఖాస్తులు చేసుకునే దేశాల్లో చైనా మొదటి స్థానంలో, వియత్నాం రెండో స్థానంలో, భారత్‌ మూడో స్థానంలో ఉన్నాయి. గత ఏడాది భారత్‌ నుంచి ఈబీ-5 వీసా కోసం 500 మంది దరఖాస్తులు చేసుకున్నారు. ఈ ఏడాది 700 మంది దాకా దరఖాస్తు చేసే అవకాశం ఉందని అంచనా. ఈబీ - 5 వీసా కోసం మన దేశం నుంచి ఎక్కువగా చండిఘర్‌, పంజాబ్‌, ఢిల్లీ, ముంబై, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఎక్కువ పోటి ఉంటుందని తెలిపారు.

అయితే దుర్వినియోగం, మోసాలకు పాల్పడుతున్నట్లు వస్తోన్న ఫిర్యాదులు ఎక్కువగా చైనాకు సంబంధించినవని తెలుస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement